అభిషేక్‌ బచ్చన్‌: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...

అభిషేక్‌ బచ్చన్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుధా జి. తిలక్‌
    • హోదా, దిల్లీ

అది 2019 సంవత్సరం. బ్రిటిష్‌ డైరక్టర్‌ అలెక్స్‌ గేల్‌ భారత్‌ సంప్రదాయ క్రీడ కబడ్డీని అప్పటికి ఆరు నెలలుగా పరిశీలిస్తున్నారు. అందులో ఒక జట్టు ఆటను ఆయన నిరంతరం ఫాలో అవుతున్నారు.

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు ఆటను గేల్‌ కవర్‌ చేస్తున్నారు. ఆ జట్టు యజమాని మరెవరో కాదు, బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌. గేల్‌ వీడియో సిరీస్‌ 'సన్స్‌ ఆఫ్‌ ది సాయిల్‌: జైపూర్‌ పాంథర్స్‌' గత వారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రదర్శితమైంది.

ఈ పరిణామం ఒక సంప్రదాయ గ్రామీణ క్రీడ ఒక పాపులర్‌ స్పోర్ట్స్‌ కాంపిటిషన్‌గా మారిన తీరుకు నిదర్శనంగా కనిపిస్తుంది.

“ఈ దేశీ ఆటకు కొత్త అందాన్ని తీసుకువచ్చే ప్రయత్నంచేశాం. ఈ కబడ్డీ క్రీడ ప్రత్యేకతను చాటేలా, ముఖ్యంగా విదేశాలలో ఈ ఆటపట్ల ఆసక్తి పెరిగేలా మేం దీన్ని చిత్రించాం” అని డైరక్టర్‌ గేల్‌ బీబీసీతో అన్నారు.

నిజంగానే ఈ క్రీడకు ఇప్పుడు ఎంతో గ్లామర్‌ వచ్చింది. ఆరేళ్ల కిందట టీవీలో కనిపించే ప్రొఫెషనల్‌ గేమ్‌గా మారిన కబడ్డీ, ఇప్పుడు దేశంలో క్రికెట్‌ తర్వాత అత్యధిక ప్రజాదరణ ఉన్న రెండో గేమ్‌. గ్రామీణ ప్రాంతాలు, చిన్నపట్టణాలలోని ఆటగాళ్ల జీవితాలను ఈ కబడ్డీ క్రీడ మార్చేసింది.

ఒకప్పటి గ్రామీణ క్రీడ కబడ్డీ ఇప్పుడు టెలీవిజన్‌ స్పోర్ట్‌గా అవతరించింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒకప్పటి గ్రామీణ క్రీడ కబడ్డీ ఇప్పుడు టెలీవిజన్‌ స్పోర్ట్‌గా అవతరించింది

గ్లామరస్‌ గేమ్‌గా కబడ్డీ

ప్రస్తుతం 12 జట్లున్న ఈ టోర్నమెంటు మొదట 8 జట్లతో 2014లో ప్రారంభమైది. ఈ టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారులను అత్యంత ప్రొఫెషనల్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. వీరికి రంగురంగుల జెర్సీలు ఇస్తారు.

రబ్బరు మ్యాట్‌ల మీదా సాగే ఈ క్రీడకు కళ్లు జిగెల్మనిపించే వెలుగులు, హోరెత్తించే సంగీతంతో పాటు సినీ, క్రికెట్ తారల రాక కూడా ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.

ప్రారంభంలో సుమారు నాలుగు కోట్ల మంది ప్రేక్షకులు ఈ లీగ్‌ను టీవీలో చూశారు. “శ్రామిక జీవితాల నుంచి వచ్చే ఆటగాళ్లు నడిపించే ఈ క్రీడ ఇప్పుడు టీవీలో వచ్చే ఆటగా మారిపోయింది’’ అన్నారు స్పోర్ట్‌ ప్రొడ్యూసర్‌ జోయ్‌ భట్టాచార్య.

2014లో జరిగిన తొలి టోర్నీలో జైపూర్ పాంథర్స్ జట్టు కప్‌ను సాధించింది. అప్పటి నుంచి ఆ జట్టు ఒక్క సిరీస్‌ గెలవకపోయినా అత్యంత ఆకర్షణీయమైన జట్టుగా ఇప్పటికీ నిలుస్తోంది. “నేను నా జట్టుతోనే ఉంటున్నాను’’ అన్నారు అభిషేక్‌ బచ్చన్‌.

బస్సులు, హోటళ్లు, ప్రాక్టీస్‌ సెషన్‌లు ఇలా జైపూర్‌ పాంథర్స్‌ జట్టు, దాని యజమాని అభిషేక్‌ బచ్చన్ ఎక్కడుంటే అక్కడికి కెమెరాతో పరుగులు తీస్తుంటారు గేల్‌.

అప్పుడప్పుడు తండ్రి అమితాబ్‌ బచ్చన్‌, భార్య ఐశ్వర్యారాయ్‌తో కూడా ఆయన స్టేడియం గ్యాలరీలో కనిపిస్తుంటారు. ఒకరకంగా ఓ పాపులర్‌ షో, ఓ సినిమా స్టార్‌ తమ అభివృద్ధికి పరస్పరం దోహదపడుతున్నారు.

ఈ ఆట ఓ పాపులర్‌ స్పోర్ట్‌గా అవతరించడంలో ఈ సిరీస్‌ ఎంతగానో సాయపడుతుందని గేల్‌ వ్యాఖ్యానించారు.

పంజాబ్‌లోని ఓ గ్రామంలో కబడ్డీ ఆడుతున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంజాబ్‌లోని ఓ గ్రామంలో కబడ్డీ ఆడుతున్న చిన్నారులు

గ్రామీణ క్రీడకు పాపులారిటీ

హరియాణాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక కబడ్డీ టోర్నమెంట్‌ను గేల్‌ చిత్రీకరించారు. ఓ కబడ్డీ టీమ్‌లో సభ్యుడైన దీపక్‌ నర్వాల్‌ ఇంటికి వెళ్లిన గేల్‌, ఆటలను ప్రాణంగా ప్రేమించే ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన వెన్నను ఆస్వాదించారు.

కొన్ని వందల మంది సైనికులు భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకుని కబడ్డీ క్రీడను వీక్షించడాన్ని తాను చిత్రీకరించానని, ఇవన్నీ తనకు మరిచిపోలేని జ్జాపకాలుగా నిలిచిపోయాయని గేల్ అన్నారు.

గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న జైపూర్‌ పాంథర్స్‌ టీమ్‌లోని ఓ ఆటగాడి ఇంటికి వెళ్లారు గేల్‌. అక్కడ అతని తల్లి ఆ ప్లేయర్‌ తలకు మసాజ్‌ చేస్తున్నారు. “అభిషేక్‌ నీ గురించి పట్టించుకున్నారా’’ అని ఆమె తన కొడుకును అడిగారు. “ఆయన నన్నొక్కడినే కాదు, మా టీమ్‌ సభ్యులందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు’’ అన్నాడా ఆటగాడు. ఆమెకు ఇక ఏమీ మాట్లాడలేకపోయారు.

కబడ్డీ క్రీడ గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జనాన్ని స్టేడియాల వైపు ఎలా రప్పిస్తుందో గేల్ నిర్మించిన ఈ షో చెబుతుంది. ఈ ఆటలో క్రీడాకారులు ఇప్పుడు తమ ఇళ్లకు కార్లు, ఖరీదైన వస్తువులు తీసుకురాగలుతున్నారు.

కొందరు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. “ఇది భిన్న సంస్కృతుల కలయిక’’ అని వ్యాఖ్యానించారు ఓ విదేశీ కబడ్డీ ప్లేయర్. జైపూర్‌ పాంథర్స్‌ టీమ్‌లోని కొరియన్‌ ఆటగాడొకరు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

కబడ్డీ

ఫొటో సోర్స్, Getty Images

'చరిత్ర'కెక్కిన కబడ్డీ

కబడ్డీ క్రీడకు భారత స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి మంచి చరిత్ర ఉంది. ఈ క్రీడ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మహాత్మాగాంధీ అనేక వ్యాసాలు రాశారు.

స్పోర్ట్స్‌ జర్నలిస్టుగా పని చేస్తున్న వివేక్‌ చౌధరి 'కబడ్డీ బై నేచర్‌' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో మహారాష్ట్ర నుంచి బెర్లిన్‌ ఒలింపిక్స్‌ వరకు వెళ్లిన ఓ స్వాతంత్ర్య ఉద్యమకారుల కబడ్డీ జట్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ క్రీడను ప్రదర్శించి చూపిన ఈ జట్టు సభ్యులతో అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.

“1920లో ఓ కబడ్డీ క్రీడాకారుడు బెర్లిన్‌ వెళ్లారు. భారత క్రీడాకారులు దృఢంగా మారడానికి అవసరమైన టెక్నిక్కులు నేర్చుకుని వచ్చి, ఇక్కడ యువకులకు ఆ విధానాలు నేర్పాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన్ను అక్కడికి పంపారు. అక్కడ ఆయనకు నాజీ ఒలింపిక్‌ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా భారత కబడ్టీ జట్టు అక్కడికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకుంది’’ అని చౌధరి తన పుస్తకంలో రాశారు.

కబడ్డీ కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కమర్షియల్‌ గేమ్‌గా అవతరించింది. “దీంట్లోకి ఎందుకు దిగాను అని ఒక్కోసారి నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఎందుకు దిగానంటే ఇందులో ఎత్తుపల్లాలు, ఆవేదన, ఆనందం, పారవశ్యం అన్నీ ఉన్నాయి’’ అని సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్ అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)