క‌రోనావైర‌స్‌ - ఏపీ, తెలంగాణ రంగస్థల కళాకారులు: "నాట‌కాలు వేయ‌క‌పోతే మేం శ‌వాల‌తో స‌మానం"

నాటక ప్రదర్శనలు
    • రచయిత, సంగీతం ప్ర‌భాక‌ర్‌
    • హోదా, బీబీసీ ప్ర‌తినిధి

"నేను నాటక రంగంలోనే పుట్టి పెరిగాను. అయితే, ఇప్పుడు వైన్ షాప్‌లో పనిచేస్తున్నాను. కళాకారుడిగా బతికిన నేను కుటుంబాన్ని పోషించుకోవడానికి వైన్ షాప్‌లో పని చేయాల్సి వస్తోంది."

"మా ఇంట్లో నేను, నా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మా అమ్మానాన్న కూడా ఉంటారు. నాటకాలు ఉండేట‌ప్పుడు కుటుంబాన్ని న‌డిపించ‌డం ఎప్పుడూ కష్టంకాలేదు. కానీ, ఈ లాక్‌డౌన్ వ‌ల్ల‌ నాటకాలు ఆగిపోయాయి. కుటుంబ పోషణ భారమైపోయింది. వైన్ షాపులో పని ఉందని తెలిసిన వాళ్ళు చెప్పారు. వెళ్లొద్దని ఇంట్లో అన్నారు. కానీ తప్పదు కదా. అక్కడ రెండు నెలల నుండి పనిచేస్తున్నాను" అని చెప్పారు 39ఏళ్ల‌ సురభి నాటక కళాకారుడు వినోద్ కుమార్.

సురభి నాటక కళాకారుడు వినోద్ కుమార్
ఫొటో క్యాప్షన్, సురభి నాటక కళాకారుడు వినోద్ కుమార్

"నేను పెరిగిందంతా నాటక రంగంలోనే. నాటకాలతో వచ్చే డబ్బు తక్కువైనా అందులో ఉండే సంతోషం వేరు. క‌రోనావైరస్ వ్యాప్తితో మా జీవితాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఇప్పుడు నా వయసు 42ఏళ్లు. నాకు నాటకం త‌ప్ప వేరే పని ఏ రాదు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడే ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న‌ చూసి అమెజాన్ డెలివరీ బాయ్‌గా చేరాను. ఒక్కో డెలివరీకి 15 రూపాయలు వస్తాయి. మొదట్లో చాలా బాధపడేవాణ్ని అన్నారు మరో సురభి కళాకారుడు చెన్నకేశవరావు.

కేవలం సురభి కళాకారులే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేల మంది ఆధునిక, జానపద కళాకారులదీ ఇదే పరిస్థితి.

పద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌ సురభి నాగేశ్వరరావు
ఫొటో క్యాప్షన్, పద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌ సురభి నాగేశ్వరరావు

"మా 130ఏళ్ల‌ సురభి నాటక చరిత్రలో ఎన్నో కష్టనష్టాలను చూశాం. మేం దాదాపు 3,000 మంది ఉన్నాం. 200 మంది అయితే, కేవ‌లం నాటక రంగం పైనే ఆధారపడి బతుకుతున్నాం. మూడు నెలలుగా ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. మామూలుగానే కళాకారుల పరిస్థితి అంతంత మాత్రం. అందులో నాటక రంగమంటే మరీ త‌క్కువ‌గా చూస్తారు"అని అన్నారు సురభి బాబ్జిగా సుప‌రిచితులైన‌, పద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌ సురభి నాగేశ్వరరావు.

నాటక రంగంలో నృత్య క‌ళాకారులు, రచయితలు, జానపద క‌ళాకారులు, మేకప్ ఆర్టిస్ట్‌లు కూడా ఉంటారు. డ్రెస్సులు అద్దెకి ఇచ్చేవారు కూడా ఉన్నారు. వీరంతా నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.

నాటక ప్రదర్శనలు

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు లలిత కళా తోరణంలో 16 ఏళ్ల నుంచీ కొన‌సాగుతున్న‌ సురభి శ్రీ వెంకటేశ్వర నాట్య మండలిని ఇటీవ‌ల‌ పూర్తిగా తొలగించారు.

ఎంతో ఆద‌రణ పొందిన ఈ నాట్య మండలి తొలగించమని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే, నిర్వహణ ఖర్చు కూడా భరించడం కష్టం కావ‌డంతో నాట్యమండలి తొలగించామని సురభి నాగేశ్వర రావు వివ‌రించారు.

"రమణాచారి సహకారంతో ఇక్కడ నాటకాలు వేయడం మొదలుపెట్టాం. వీటి వ‌ల్ల‌ ఎంతో మంది ఉపాధి పొందాం. దేశ విదేశాలలో ప్రదర్శన‌లు ఇచ్చాం. కానీ, కొంత కాలం నుంచి నా ఆరోగ్యం బాగా లేకపోవడంతోపాటు లాక్‌డౌన్ వ‌ల్ల నాట్య మండ‌లికి ఆద‌ర‌ణ త‌గ్గింది. అంత బాగయ్యాక ఏదో ఒక చోట మ‌ళ్లీ దీన్ని ప్రారంభించ‌డానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటాం" అని ఆయ‌న వివ‌రించారు.

నాటక ప్రదర్శనలు

ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ట్లేదు

"గత 36 ఏళ్లుగా నాటకం, రచనలే నా జీవితం. వీటిని పక్కనపెడితే నాలో ప్రాణం పోయినట్టే. అప్పుడు నేను శవంతో సమానం" అని ఆధునిక నాటక కళాకారుడు దెంచనాల శ్రీనివాస్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

"నాటకం మీద ప్రేమతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాను. దేశం అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చాను. కొత్త నాట‌కాలూ నేర్చుకున్నాను. 1996లో కూకట్‌పల్లిలో నాటకాలు ప్రదర్శించడానికి, న‌టుల‌ శిక్షణ, వ‌స‌తుల కోసం పావు ఎకరంలో షెడ్ వేశాం. నాలుగు నెలల నుంచి ఈ థియేటర్ స్థలం యజమానికి నేను కిరాయి ఇవ్వలేదు. మ‌రోవైపు నేను ఉంటున్న ఇంటికి కూడా కిరాయి ఇవ్వలేకపోతున్నా. కొన్ని రోజులు గ‌డిస్తే.. నేను తి్నడానికి కూడా కష్టమౌతుంది. తర్వాత ఏం చేయాలి? ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాలి. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం ఆదుకోవాలి"అని ఆయ‌న వివ‌రించారు.

దెంచనాల శ్రీనివాస్
ఫొటో క్యాప్షన్, జనపదం థియేటర్ రిపర్టరీ నిర్వాహకులు శ్రీనివాస్ దెంచనాల

"ఈ మనోవ్యధతో నేను మరణిస్తే.. ఆర్థిక ఇబ్బందులతో కళాకారుడు మరణించాడు అని వార్తల్లో ఒకసారి వస్తుందంతే. నేను చావను. నాకు ధైర్యం ఎక్కువ. కానీ, ఇప్పుడు ఏం చేయాలి? నాకు నటన, రచన, దర్శకత్వం తప్ప... మ‌రేదీ రాదు. నాకు తెలిసిన వాళ్లు మీడియాలో ఉన్నారు. నేను సబ్ఎడిటర్ లేదా జూనియర్ సబ్ ఏడిటర్‌గా అయినా చేరుతా అంటే ఉద్యోగం ఎవ‌రిస్తారు? నాకు ఇప్పుడు 50 ఏళ్లు" అన్నారు శ్రీనివాస్.

"ఇప్ప‌టివరకు నెలకు కనీసం 5 నాటకాలు వేసేవాళ్లం. వీటిపై వ‌చ్చే డ‌బ్బుల‌తోనే కళాకారులకు నెల జీతం ఇచ్చేవాళ్లం. వారు ఉండటానికి వ‌స‌తి ఏర్పాటుచేసేవాళ్లం. నేడు ఎలాంటి ప‌ని దొర‌క్క‌.. పరిస్థితి దిగ‌జారిపోయింది. కొంతమంది కళాకారులకు తెల్లరేషన్ కార్డు కూడా లేదు. వారు చాలా కష్టాలు పడుతున్నారు"అని ఆయ‌న వివ‌రించారు.

నాటక ప్రదర్శనలు

ఇప్పుడు పరిస్థితి వేరు

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల‌లోని ఇత‌ర‌ కళాకారులతోనూ బీబీసీ మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంలో త‌మ‌ పాట, ప్రదర్శనల‌కు చాలా విలువ ఇచ్చేవార‌ని, ఇప్పుడు పలకరించే వారు కూడా లేరని వారు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. కొంద‌రైతే పూట గ‌డిచేందుకు కూలి ప‌నులు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

"లాక్‌ డౌన్ ముందు వరకు నెలకు దాదాపు పది నుంచి 15 ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం. నాతో క‌లిపి ప‌ది మంది కళాకారులు ఉండేవాళ్లం. ఇప్పుడు ప‌రిస్థితి దారుణంగా ఉంది" అని ఒగ్గుకథ నాట‌కాల‌తో సుప‌రిచితుడైన‌ తీగల రాజేశం గౌడ్ చెప్పారు.

ఒగ్గుక‌థ‌ కళాకారులదే కాదు.. యక్షగాన కళాకారుల‌దీ అదే ప‌రిస్థితి. య‌క్ష‌గాన క‌ళాకారుడైన‌ 75 ఏళ్ల చిందుల శ్యామ్ మోహ‌న్ పింఛ‌ను పైనే ఆధార‌ప‌డుతున్నారు. ఆయ‌న‌కు వ‌చ్చే రూ.1,500 పింఛ‌ను క‌నీసం మందుల‌కు కూడా స‌రిపోవ‌డం లేద‌ని ఆయ‌న కుమారుడు కృష్ణ చిందుల చెప్పారు.

దాదాపు పదేళ్ల నుంచి ఆర్కెస్ట్రాలో గాయనిగా ఉంటూనే నాటకాలలోనూ పాత్రలు పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పెద్దాపురానికి చెందిన బళ్లమూడి నాగమణి. అయితే, కొంత కాలంగా అనారోగ్యం వ‌ల్ల ఆమె నాట‌కాల్లో పాల్గొన‌డం లేదు. క‌రోనావైర‌స్‌తో ఆమె ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. త‌మ‌ను ఆదుకోవాలంటూ ఒక‌పాటను రాసి ఆమె యూట్యూబ్‌లో పెట్టారు.

నాటక ప్రదర్శనలు

ప్రభుత్వం సాయం అందుతోందా?

జానపద కళాకారుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అక్క‌డ‌ కళాకారులు తామున్న చోటు నుంచే ఆన్‌లైన్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌గ‌లుగుతున్నారు. వారికి ఇచ్చే పారితోషికం, ఆ ప‌థ‌కానికి సంబంధించిన జీవో కాపీల‌ను ఇప్ప‌టికే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ‌ని శ్రీనివాస్ దెంచనాల వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధ కళాకారులకు ఇచ్చే పింఛ‌ను అందడం లేదని ప్రభుత్వ దృష్టికి రావడంతో 6 నెలల పింఛ‌నును ఒకేసారి తమకు విడుదల చేశారని కళాకారుడు కృష్ణ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వృద్ధ కళాకారులకు నెలకు రూ.3,000 పింఛ‌ను అందిస్తోంది.

తెలంగాణాలో వృద్ధ కళాకారులకు నెల‌కు రూ.1500 పింఛ‌ను అందిస్తున్నారు. ఇది మామూలు వృద్ధులకు అందించే ఆసరా పింఛ‌ను కన్నా తక్కువ. 3,200 మంది కళాకారులు ఈ పింఛ‌ను పొందుతున్నారు.

నాటక ప్రదర్శనలు

"తెలంగాణలో పింఛ‌నుకు అర్హుల‌య్యే కళాకారుల వయసును 57 నుంచి 55 ఏళ్ల‌కు తగ్గించాలని, పింఛ‌ను మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణలో రోజూ ఏదో ఒక చోట మూడు నాటక ప్రదర్శనలు జరిగేవి. నేడు క‌రోనావైర‌స్ వ్యాప్తి న‌డుమ ప్ర‌జ‌లు రావ‌డం లేదు. అందుకే, లాక్‌డౌన్ మొద‌లైన‌ రెండో రోజే మేం ఆన్‌లైన్‌ ప్రదర్శనలు ప్రారంభించాం. 2016 నుంచే మా డిపార్ట్‌మెంట్ యూట్యూబ్‌లో ఉంది. దేశంలో సాంస్కృతిక శాఖ‌కు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తొలి శాఖ మాదే. ఈ ఛానల్ ద్వారానే కరోనావైర‌స్‌పై అవగాహనా కార్యక్రమం (6సీ- కరోనా కెన్ నాట్ కంట్రోల్ కల్చర్ క్రియేటివిటీ అండ్ సినిమా) చేపడుతున్నాం. దీని ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోగ‌లుగుతున్నాం. ఇదివ‌ర‌కు బతుకమ్మ, బోనాల లాంటి పండుగ‌ల సమ‌యంలో వేల మంది కళాకారులకు సాయం చేయ‌గ‌లిగాం. నేడు కొద్దిమందికే సాయం చేయగలుగుతున్నాం"అని తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఆన్‌లైన్‌లో ప్రదర్శన‌లిచ్చే కళాకారులకు ఎలాంటి పారితోషికం ఇవ్వడంలేదు. దీన్ని ఒక ప్ర‌యోగంగా చూడాల‌ని ఆయ‌న అన్నారు.

లాక్‌డౌన్ తరవాత చాలామంది దాతలు ముందుకు వ‌చ్చి క‌ళాకారుల‌కు వచ్చి సాయం చేశారు. సినీ నటుడు రానా అయిదు లక్షల రూపాయల కిరాణ సామగ్రి ఇప్పించారు. మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖులూ సాయం అందించారు.

"కొంద‌రు సాయం చేయ‌డంతో తిన‌డానికి క‌ష్టంకాలేదు. ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు స‌రిపోక కొంత మంది కళాకారులు వైన్ షాప్‌లో ప‌ని చేస్తున్నారు. కొంద‌రు అమెజాన్‌లో డెలివరీ బాయ్స్‌లా చేరుతున్నారు. వీరు మ‌ళ్లీ నాట‌కాల్లోకి వ‌స్తారా? అని భ‌యం వేస్తోంది. ఎవరైనా మాకు ఉపాధి కల్పిస్తే పరిస్థితులు చక్కబడేంత వరకు పని చేసుకుంటాం. మ‌ళ్లీ త్వ‌ర‌గా మునుప‌టి రోజులు రావాల‌ని కోరుకుంటున్నా" అని సురభి కళాకారుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం గ్రహీత సురభి జయచంద్ర వర్మ అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)