ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: కరోనా వైరస్ గ్రామాల్లో విజృంభణ.. సామాజిక వ్యాప్తికి ఇది సంకేతమా

గ్రామాల్లో డిస్‌ఇన్ఫెక్టెంట్ల పిచికారీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో క‌రోనావైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు పట్టణాలకే పరిమితమైన కోవిడ్‌-19 ఇప్పుడు పల్లెలకు వ్యాప్తిచెందింది.

తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇది క‌నిపిస్తోంది. ప‌ట్ట‌ణాల‌కు స‌మీపంలోని ప‌ల్లెల్లో వైర‌స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

అస‌లు ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల్లోకి వైర‌స్ ఎలా వెళ్తోంది? సామాజిక వ్యాప్తి జ‌రుగుతోందా?

ఉదాహరణకు ఆదివారం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో 23 కేసులు పాజిటివ్ రాగా.. అందులో 17 కేసులు గ్రామాలకు చెందినవిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనావైర‌స్‌ కేసుల సంఖ్య 166. అందులో 126 యాక్టివ్‌ కేసులున్నాయి. వీటిలో 56 కామారెడ్డి, 19 బాన్సువాడ, ఒకటి ఎల్లారెడ్డి పట్టణ ప్రాంతాలలో నమోదైన కేసులైతే.. మిగతా 50 కేసులు చుట్టుప‌క్క‌ల‌ గ్రామాలలో నమోదైనవేనని కామారెడ్డి డీఎంహెచ్‌‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ రావు ‘బీబీసీ తెలుగు’కు తెలిపారు.

కరీంనగర్‌ జిల్లాలో 23 కేసులు పాజిటివ్ రాగా.. అందులో 17 గ్రామాలకు చెందినవిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరీంనగర్‌ జిల్లాలో 23 కేసులు పాజిటివ్ రాగా.. అందులో 17 గ్రామాలకు చెందినవిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 105 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత జిల్లాకు హైదరాబాద్ నుంచి వచ్చిన వారి నుంచి వైర‌స్‌ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

జిల్లాలోని వెల్గటూరు మండలం చెర్లపల్లిలో ఆదివారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతడు 10 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చినట్లు స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా జిల్లాలో ఆదివారం నాటికి యాక్టివ్ కేసులు 24. అందులో ఏడు పట్టణ‌ ప్రాంతాల్లో ఉంటే.. మిగిలిన 17 కేసులు గ్రామీణ‌ ప్రాంతాల్లో ఉన్నాయని జగిత్యాల డీఎంహెచ్‌‌ఓ డాక్టర్ పి.శ్రీధ‌ర్ బీబీసీ తెలుగుకు తెలిపారు.

“మేం గమనించిన మేరకు వస్తున్న కేసుల్లో ఎక్కువ శాతం వలస కూలీలవే ఉన్నాయి. మొద‌ట‌ ముంబయి నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల ద్వారా కేసులు వచ్చాయి.

లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత హైదరాబాద్ నుంచి వస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. మ‌రోవైపు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాల్లో వైద్యం కోసం వెళ్లి వస్తున్న వారిలో కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి”అని డీఎంహెచ్‌‌ఓ డాక్టర్ శ్రీధ‌ర్ అన్నారు

"ప‌ట్ట‌ణాల‌కు సరిహద్దు ప్రాంతాల్లో కరోనావైర‌స్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది"

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "ప‌ట్ట‌ణాల‌కు సరిహద్దు ప్రాంతాల్లో కరోనావైర‌స్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది"

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌ల‌లో..

ఖమ్మం జిల్లాలో ఆదివారం వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 151. అందులో 87 యాక్టివ్‌ కేసులని ఆ జిల్లా డిఎంహెచ్‌ఓ డాక్టర్ మాలతి బీబీసీ తెలుగుకు తెలిపారు.

ఇక్క‌డ‌ పట్టణ‌, గ్రామీణ‌ ప్రాంతాలు రెండు చోట్లా కేసులు ఒకేలా ఉన్నాయన్నారు.

“దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నావారు ఎక్కువ మంది హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంటారు.

ఇలా లాక్‌డౌన్‌కు ముందు వెళ్లినవారు చాలామంది అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపు తర్వాత వీరు జిల్లాలకు తిరిగి వస్తున్నారు. అలా వచ్చిన వారిలో కొంద‌రికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది.

వ్యాపారం కోసం విజయవాడకు తర‌చూ వెళ్లి వచ్చే వారు కూడా ఎక్కువే. విజయవాడ రెడ్ జోన్.. అక్కడ నుంచి వచ్చిన వారిలో కూడా కొంద‌రికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది”అని డాక్టర్ మాలతి అన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నాటికి 375 యాక్టివ్‌ కేసులున్నాయి. హన్మకొండలో ఓ మహిళ పెళ్లికి వెళ్లి నాలుగు రోజుల‌ త‌ర్వాత తిరిగి వ‌చ్చింది. ఆమె పాజిటివ్ అని తేలింది. ఆమె ద్వారా మరో నలుగురుకి కరోనా వచ్చిందని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

“లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత తీసుకోవాల్సిన‌ జాగ్రత్తల గురించి ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు వినిపించుకోవ‌డం లేదు. సామూహిక వేడుక‌లు చేసుకోవడం, సామాజిక దూరం పాటించకపోవడం.. లాంటి చ‌ర్య‌ల‌తో కరోనావైర‌స్ వ్యాప్తి చెందుతోంది”అని కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్ర శేఖర్ రావు అన్నారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎక్కువ ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేర్చింది ఏపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎక్కువ ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేర్చింది ఏపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇలానే..

ఆంధ్ర‌ప్రదేశ్‌లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారితో కరోనావైర‌స్‌ కేసుల సంఖ్య పెరిగాయని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తెలంగాణ, కర్నాటకక రాష్ట్రాలను తీవ్ర ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేర్చింది ఏపీ. ఈ రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది రాష్ట్ర‌ ప్రభుత్వం.

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 1954 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. అందులో 1,375 యాక్టివ్ కేసులు. వీటిలో 300 వ‌ర‌కు పట్టణ‌ ప్రాంతాల్లో నమోదైన కేసులు.. మిగతా 1,000కిపైగా కేసులు గ్రామీణ‌ ప్రాంతాల్లోనే ఉన్నాయని డీపీఆర్ఓ ‘బీబీసీ తెలుగు’కు తెలిపారు.

“ఇక్కడ కోవిడ్‌-19 వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది వలస కూలీలే. చెన్నై స‌హా ఇత‌ర‌ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు, హైదరాబాద్, గుజరాత్, ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు” అని శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లు

స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. కరోనా నియంత్రణకు పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

మ‌రోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన‌ నిబంధనలపై ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ వారు కూడా సూచనలు చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో కరోనావైర‌స్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.

“తెలంగాణలోని గద్వాల్, వనపర్తిల‌లో ఒక్క సారిగా కేసులు పెరిగాయి. దీనికి కారణం పక్కనే ఉన్న కర్నూలుకు వ్యాపారం కోసం ఇక్కడ ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే నెల్లూరులో కేసులు ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలోని కోయంబేడు నుంచి వ్యాప్తి చెందిన కేసులు అవి”అని ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ సంతోష్ అంటున్నారు.

“విజయనగరం, శ్రీకాకుళంలో చూసుకున్నా అదే కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపార అవ‌స‌రాల కోసం విశాఖ‌ప‌ట్నానికి వచ్చి వెళ్లే వారు ఎక్కువ. దీంతో వైర‌స్‌ వ్వాప్తి కూడా జరిగింది. పట్టణ‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. సామాజిక వ్యాప్తి జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం.”

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)