ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ‘ఎన్‌కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా? నేరాలు పెరుగుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
- హోదా, బీబీసీ హిందీ కోసం
కాన్పూర్‌లోని బికరూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసుల హత్య అనంతరం ఐదుగురు అనుచరులతోపాటు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్‌కౌంటర్ చేసిన తీరు, దాని వెనుక కారణాలపై ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి.
బికరూ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలతోపాటు ఎన్‌కౌంటర్లపైనా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మరోవైపు ఎన్‌కౌంటర్ విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్లు మళ్లీ పెరుగుతున్నాయి.
బికరూ గ్రామంలో వికాస్ దుబేను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై కొందరు దాడి చేశారు. దీంతో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన వికాస్ దుబే కోసం పోలీసులు దాదాపు వారం రోజులపాటు ఉత్తర్ ప్రదేశ్‌తోపాటు పక్క రాష్ట్రాలనూ జల్లెడపట్టారు.
ఈ సమయంలోనే కొందరు వికాస్ దుబే అనుచరులను పోలీసులు అరెస్టుచేశారు. అయితే వీరు తమపై దాడిచేసి తప్పించుకొనే క్రమంలో కాల్పులు జరిపామని, వీటిలో ఐదుగురు నిందితులూ మరణించారని పోలీసులు చెబుతున్నారు.
ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయ పరిసరాల్లో వికాస్ దుబేను మధ్య ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా తమపై దాడి చేసి తప్పించుకోబోతుంటే కాల్పులు జరపాల్సి వచ్చిందని, వీటిలో వికాస్ దుబే చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఎన్‌కౌంటర్లకు చెబుతున్న కారణాలతోపాటు, ఇవి జరిగిన తీరు కూడా దాదాపు ఒకేలా అనిపిస్తోంది. దీంతో ఎన్‌కౌంటర్లు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా రెండు రోజుల తర్వాత వీటిపై విచారణకు ప్రభుత్వం ఓ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.

ఫొటో సోర్స్, SAMEERAMAJ MISHRA
"నేరాలను సహించేది లేదు"
నేరాలను ఎట్టి పరిస్థితిలోనూ సహించబోమని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉంది. అయినప్పటికీ అన్ని రకాల నేరాల సంఖ్యా పెరుగుతోంది.
అనుచరులతో కలిసి వికాస్ దుబే.. ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన రోజే ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగుర్ని దారుణంగా ఊచకోత కోశారు. ఇలాంటి ఘటనలు గతంలో కంటే ఇక్కడ ఆరు రెట్లు ఎక్కువయ్యాయి.
మిగతా ప్రాంతాల్లోనూ కేసులకు తక్కువేమీ లేదు. నేరస్థులు తీరు మార్చుకోవాలి లేదా వదిలిపెట్టబోమని రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అయినప్పటికీ నేరాలు పెరుగుతున్నాయి.
గత మూడేళ్లలో రాష్ట్రంలో దాదాపు 3,000 నేరాలు జరిగాయి. వీటిలో 119 మంది మరణించారు.
ఈ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్‌కౌంటర్లలో తమ తప్పేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
సత్వర న్యాయమా?
ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు పెరుగుతుండటంతో సుప్రీం కోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘంతోపాటు న్యాయ నిపుణులు, ఇతర పౌర హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వికాస్ దుబే కేసును విచారించాలని ఇప్పటికే సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు కోర్టులో విచారణ లేకుండా ఎన్‌కౌంటర్ చేసే విధానాలను అనుసరించడాన్ని ఇకనైనా ఆపాలని డిమాండ్లూ వినిపిస్తున్నాయి.
ఎలాంటి విచారణ జరగకుండానే కాల్చి చంపే హక్కు పోలీసులకు ఉందా? ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో ఓ సారి ఊహించుకోండి అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రషాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.
"రేపు ఎవరో ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకు విరోధులు అందరిపై ఏవో కేసులు పెడతారు. వారినీ ఎన్‌కౌంటర్లలో చంపేస్తారా? వికాస్ దుబే కరడుగట్టిన నేరస్థుడే. అతడు మరణించాలి.. కానీ అతడు నోరు విప్పకముందే పోలీసులు కాల్చి చంపేశారు."
"ప్రజల్లో చెలరేగిన ఆగ్రహ జ్వాలలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు అనిపిస్తోంది. హైదరాబాద్‌లో అత్యాచార నిందుతులైనా వికాస్ దుబే అయినా ఈ ఎన్‌కౌంటర్లకు అదే కారణమనిపిస్తోంది" అని సీనియర్ పాత్రికేయుడు సుభాశ్ మిశ్ర వ్యాఖ్యానించారు.
"ప్రజాభిప్రాయం పేరుతో చట్టాలు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టలేరు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేశారు. అలానే రాజీవ్ గాంధీని కూడా.. ఈ కేసులన్నిటిలో విచారణ జరిగిన తర్వాతే శిక్షలు విధించారు. అంతెందుకు అమాయకులను చంపిన కసబ్ విషయంలోనూ చట్టాలను అనుసరించాం. తన వాదన చెప్పుకొనే అవకాశం కల్పించాం. అప్పుడు కూడా నిందితులను వెంటనే చంపేయాలని ప్రజలు పట్టుబడుతూ ఉండొచ్చు.. కానీ చట్టాలను అనుసరించారు."
"ప్రజాభిప్రాయం పేరుతో పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వం.. ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోకూడదు. లేకపోతే పోలీసులే ప్రభుత్వం తరఫున నేరస్థుల ముఠాల్లా మారిపోయే ముప్పుంది. ఒక్కోసారి ఫేక్ ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులనూ వారు లక్ష్యం చేసుకోవచ్చు."
ఎన్‌కౌంటర్లు.. పోలీసు వ్యవస్థకు ఎదురుదెబ్బ లాంటివని, వీటి వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందని యూపీకి చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వీఎన్ రాయ్ వ్యాఖ్యానించారు.
అయితే, కరడుగట్టిన నేరస్థులను హతమారిస్తే.. జనాల్లో భయంతోపాటు నేరాలు తగ్గుతాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏకే జైన్ వ్యాఖ్యానించారు. దీంతో పోలీసుల్లో మనో ధైర్యమూ పెరుగుతుందని ఆయన అన్నారు.
"కరడుగట్టిన నేరస్థులను హతమారిస్తే.. పోలీసుల్లో మనో ధైర్యం పెరుగుతుంది. దీంతో ప్రజల్లో వారికున్న విశ్వాసమూ పెరుగుతుంది. నేరస్థులను ఏరివేసేందుకు.. అందుబాటులోనున్న అన్ని విధానాలనూ అనుసరించాలి. చాలా మంది బందిపోటులను పట్టుకునే ఆపరేషన్లను నేను నేతృత్వం వహించాను. ఆ సమయంలో ప్రజలు చాలా సంతోషం వ్యక్తంచేశారు"అని బీబీసీతో ఆయన చెప్పారు.
"ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అయితే ఫేక్ ఎన్‌కౌంటర్లు చేసేవారు ఎప్పుడూ తప్పించుకోలేరు. కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. మరోవైపు కొందరు అధికారులు ఎన్‌కౌంటర్లకు దూరంగా ఉంటారు" అని జైన్ వ్యాఖ్యానించారు.

అయితే, పోలీసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, లేక భద్రతకే ముప్పున్నప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగితే ఏదో ఒప్పుకోవచ్చని వీన్ రాయ్ అన్నారు. గత రెండు-మూడేళ్లలో యూపీలో ఎన్‌కౌంటర్లు జరిగిన తీరుపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఇవి చట్టాలను ధిక్కరించడమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు దిగకుండా పోలీసులు నియంత్రించుకోవాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు.
ఎన్‌కౌంటర్లలో చనిపోయిన నేరస్థుల జాబితా భారత్‌లో చాలా పెద్దదే ఉంటుంది. అయితే చాలా ఎన్‌కౌంటర్లపై కోర్టుల్లో విచారణ కూడా జరిగింది. కొన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు కూడా విధించారు.
తీవ్రవాదం, వేర్పాటువాదాలపై పోరాటం పేరుతో పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, కశ్మీర్ సహా కొన్ని ప్రాంతాల్లో న్యాయవ్యవస్థలతో సంబంధం లేకుండా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.
అయితే, ఇలాంటి కేసుల్లోనూ దోషులుగా తేలిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ‘కరోనా టీకాను పరీక్షించేటపుడు ప్రాణాలు పోవచ్చు..’ - భారతీయ వాలంటీర్
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- కరోనావైరస్: భవిష్యత్‌లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








