చైనా, భారత్, కరోనావైరస్: భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... అందమైన వారి జీవితం ఎలా మారింది?

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, భార్గవ్ పరేఖ్
- హోదా, బీబీసీ గుజరాతీ ప్రతినిధి
“చైనాలో కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు నేను నా భార్య, కూతురితో కలిసి ఉండటానికి అహ్మదాబాద్ వచ్చేసాను. ఇప్పుడు నేనిక్కడ చిక్కుకుపోయాను. ఎప్పుడు తిరిగి చైనా వెళతానో అర్ధం కావడం లేదు. నేను నా దేశానికి తిరిగి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను" అని చైనా జాతీయుడు హైగువో అన్నారు.
హైగువో చైనాలోని సిచువాన్ ప్రాంతంలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయన భారతీయ యువతి పల్లవిని వివాహం చేసుకున్నారు. ఆమె అహ్మదాబాద్‌లో చైనా భాష అనువాదకురాలిగా పని చేస్తున్నారు. వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ రెండున్నరేళ్ల వయసు ఉన్న కూతురు ఉంది.
“వుహాన్లో కరోనావైరస్ మొదలైనప్పుడు చైనా అంతటా భయం నెలకొంది. అందరం ఒక రకమైన భయంలో గడిపే వాళ్ళం. పల్లవి, ఆమె తల్లి తండ్రులు నన్ను ఇండియాకి రమ్మని పిలిచారు. అప్పుడు ఇండియాలో కోవిడ్ కేసులు లేవు. నాకు భారతీయ వీసా ఉంది. అందుకు నేను నా కుటుంబం దగ్గరకు వచ్చి ఉండాలనుకుని జనవరిలో అహ్మదాబాద్ వచ్చాను” అని హైగువా చెప్పారు.
ఆయనకు అలవాటైన ఆహరం అహ్మదాబాద్‌లో దొరకకపోవడం అన్నిటి కంటే పెద్ద సవాలుగా నిలిచింది.

ఫొటో సోర్స్, Bhargav Parikh
"నేను మరి కొన్ని రోజుల్లో శాకాహారిగా మారేటట్లు ఉన్నాను. ఇక్కడ చైనా మాంసాహార వంటలేవి దొరకవు. కోవిడ్-19 భయంతో మాంసాహారం దొరకడం కూడా కష్టంగా మారింది. నేను చాలా వరకు గుడ్లు తిని సరిపెట్టుకుంటున్నాను” అని హైగువా తెలిపారు.
“ఆయనకు గుజరాతీ ఆహారం తినే అలవాటు లేదు. ఆయనకు రొట్టెలంటే ఇష్టమే కానీ, అదే ప్రధాన ఆహారంగా తినడానికి ఇష్టపడరు. ఆయన అహ్మదాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆయన ఆహారం ఆయనే వండుకుంటారు. నేను చైనా వెళ్ళినప్పుడు ఏవో కొన్ని కాయగూరలు, పళ్లతో సరిపెట్టుకుంటాను” అని హైగువో భార్య పల్లవి చెప్పారు.
ఇటీవల సరిహద్దులో చైనా, భారత్ మధ్యలో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ కుటుంబం మీద కూడా ప్రభావం చూపాయి.
"ఈసారి పల్లవికి, ఆంచికి శాశ్వత వీసా తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియలన్నీపూర్తి చేయాలని అనుకున్నాను. నాకు వాళ్ళని నాతో పాటే చైనాకి తీసుకుని వెళ్లిపోవాలని ఉంది" అని హైగువో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రస్తుతం నెలకొన్న భారత్ - చైనా ఉద్రిక్తతల కారణంగా నా చైనా వీసా పని ఆగిపోయిందని పల్లవి చెప్పారు. “నేను డిపెండెంట్ వీసాకి దరఖాస్తు చేశాను. నేనెప్పుడు చైనాకి వెళ్లగలనో నాకు అర్ధం కావడం లేదు” అని పల్లవి అన్నారు.
"ఆయన ఇంటిలోకి కావల్సిన కొన్ని నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లేవారు. ఆయనకు మాండరిన్ మాత్రమే వచ్చు. ఇంగ్లిష్ కానీ, మరే ఇతర భాష కానీ మాట్లాడలేరు. అయినా సరే, ఇంటిలోకి కావల్సిన కాయగూరలు తెచ్చేవారు. కానీ గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటన తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు’’ అని ఆమె వివరించారు.
తాము ఉండే సొసైటీలో ఆయన చైనా జాతీయుడు అవడం పట్ల ఏమీ అభ్యంతరాలు లేవన్నారు. కానీ, ఈ పరిస్థితుల్లో ఆయన బయటకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదని పల్లవి చెప్పారు.
భారత ప్రభుత్వం చైనా అప్లికేషన్లను బహిష్కరించిన దగ్గర నుంచి ఆయన తన కుటుంబంతో మాట్లాడటం కష్టంగా మారింది. "హైగువో, నేను ఇప్పుడు అతని తల్లితండ్రులతో వి-చాట్ యాప్ ద్వారా మాట్లాడే వీలు లేదు. అంతకుముందు మేము ఆ యాప్ ద్వారా, వీడియో కాల్ ద్వారా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుకునే వాళ్ళం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
‘నేను జీవిత కాలానికి అనువాదకురాలిగా మారాను’
పల్లవి వారి ప్రేమ కథను బీబీసీ గుజరాతీకి వివరించారు.
"మా కుటుంబంలో మేము బౌద్ధ మతాన్ని అనుసరిస్తాం. నాకు చైనా సంస్కృతి , సంప్రదాయాలు, ప్రజల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అందుకే నేను చైనా భాష నేర్చుకోవాలని అనుకున్నాను. గయలో 2005 లో డిగ్రీ పూర్తి చేసాక చైనా భాష నేర్చుకున్నాను. అక్కడే ఫ్రీలాన్స్ అనువాదకురాలిగా పని చేయడం ప్రారంభించాను. చైనా నుంచి భారతదేశానికి వచ్చే వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు ఇంగ్లిష్ కానీ, మరే భాష గానీ తెలియకపోవడంతో భాషా పరంగా సహాయం చేయడం మొదలు పెట్టాను” అని పల్లవి తెలిపారు.
“2016 ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ఐటీ సంస్థలో అనువాదకురాలిగా ఉద్యోగం మొదలుపెట్టాను. అప్పుడు నేను నెల్లూరులో ఉండేదానిని. ఆ సమయంలో హైగువో అక్కడ క్వాలిటీ ఇంజనీర్‌గా చేరారు. మొదట్లో మా ఇద్దరి సంభాషణలు వ్యాపారం, పని చుట్టూ తిరిగేవి. ఆయనకు ఎక్కువ మంది స్నేహితులు ఉండేవారు కాదు. మేమిద్దరం లంచ్ సమయంలో మా ఇష్టాయిష్టాల గురించి హాబీల గురించి గంటల తరబడి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం” అని చెప్పారు.
“ఒక రోజు ఆయన నేనెలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నానని అడిగారు. నన్ను అర్ధం చేసుకోగలిగే వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను. భారతీయ సంస్కృతి అంటే అతనికి ఇష్టమని, బౌద్ధాన్ని అనుసరించే భారతీయ మహిళను పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నానని హైగువో చెప్పారు” అని పల్లవి వివరించారు.
"మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించాం. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. మా మధ్య ఉన్న తారతమ్యాలు నాకు తెలుసు. నేనేమో శాఖాహారిని. ఆయన మాంసాహారం లేకుండా ఉండలేరు. కానీ మేము ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుంటాం” అన్నారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
ఆయన కుటుంబం వి చాట్ గ్రూప్‌లో తనను కూడా చేర్చారని చెప్పారు. ‘‘ఆయన కుటుంబంలో ఆయన తల్లి తండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా సాదరంగా ప్రేమతో ఆహ్వానించారు. ఆయనను మా బంధువులకు పరిచయం చేశాను. మా ఇంటిలో అందరూ ఆయనను ఇష్టపడ్డారు” అని చెప్పారు.
“నేను హైగువోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారు వెంటనే ఒప్పుకున్నారు. మా తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అభ్యంతరమూ ఎదురు కాలేదు. 2016లో నిశ్చతార్థం జరిగింది. అదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాం” అని తెలిపారు పల్లవి.
"పల్లవి భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. మేం అహ్మదాబాద్‌లో పెళ్లి చేసుకున్నాం. మా కుటుంబం చైనా నుంచి వచ్చి వివాహానికి హాజరైంది. సిచువాన్‌లో రిసెప్షన్ జరిగింది” అని హైగువో పేర్కొన్నారు.
పని నిమిత్తం హైగువో చైనాకి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయన పనిలో భాగంగా వివిధ దేశాలు తిరగాల్సి ఉంటుంది. అందువలన పల్లవి అహ్మదాబాద్ లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు.
“మధ్యమధ్యలో వచ్చి వెళ్లేవాడిని. 2017లో మాకు పాప పుట్టింది. తనకి మేము ఆంచి అని పేరు పెట్టాం. ఆంచి అంటే శాంతి అని అర్ధం’’ అని హైగువో చెప్పారు.
2018లో చైనా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి పల్లవి, ఆంచి చైనా వెళ్లి అక్కడ కుటుంబంతో గడిపారు. ఆంచి భారతీయ సంస్కృతి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని అనుకున్నారు.
‘‘హాయిగా సాగుతున్న మా జీవితంలో కోవిడ్- 19 పెను మార్పులు తెచ్చేసింది’’ అన్నారు హైగువో.
"కానీ, నేను ఆంచితో కలిసి ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి. నేనెప్పుడు చైనాకి తిరిగి వెళతానో తెలియదు. కానీ, నేను ఇంటికి వెళ్ళగానే ముందు చైనా వంటకాలు వండుకుని నా కుటుంబం, స్నేహితులతో కలిసి విందారగిస్తూ వైన్ సేవిస్తాను’’ అంటారాయన.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








