నాటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి... రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టంతో సమస్యేంటి?

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
- రచయిత, హన్నా ప్రైస్
- హోదా, బీబీసీ త్రీ
హెచ్చరిక: ఈ వ్యాసంలో గృహహింస, లైంగిక హింస గురించి చర్చించారు.
తమపై జరిగినది లైంగిక దాడి కాదని, రఫ్ సెక్స్ అని చట్టం కొట్టిపారేసింది అంటూ కొందరు యువతులు ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక దాడి లేదా రేప్ జరిగిన అనేక సందర్భాల్లో నేరస్థులు తప్పించుకోడానికి వీలు కల్పించే రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టాన్ని ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో రద్దు చేశారు.
రఫ్ సెక్స్ డిఫెన్స్ అంటే ఏమిటి?
లైంగిక దాడి జరిగి ఒక వ్యక్తి చనిపోయినా లేదా గాయపడినా శృంగారం సమయంలో అనుకోకుండా జరిగిందని వాదించి తప్పించుకునే వీలు కలిపించే ఒక చట్టం.
ఈ చట్టం ఇన్నాళ్లూ బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకుందని, దీనివలన నష్టపోయిన వారందరి కేసులను మళ్ళీ విచారించాలని అక్కడి పార్లమెంట్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, బాధితులు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
లూసీ కథ
23 యేళ్ల లూసీ (గోప్యత కోసం పేరు మార్చాం) తన మాజీ ప్రియుడు తనపై చేసిన లైంగికదాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు. ఫిర్యాదు చేసే పద్ధతేమిటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా ఈ రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టం గురించి ఆమెకు తెలిసింది.
రఫ్ సెక్స్ డిఫెన్స్.. దీన్నే 50 షేడ్స్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా అంటారు. ఇది ఆమెను మరింత కలవరపెట్టింది.
పరస్పర అంగీకారంతోనే సెక్స్ జరిగిందని, శృంగార సమయంలో అనుకోకుండా భాగస్వామికి దెబ్బలు తగిలాయనో, చనిపోయిందనో చెప్పి తప్పించుకునే వీలు కల్పించే ఈ చట్టం గురించి తెలుసుకున్నాక లూసీ మరింత ఆవేదన చెందారు. తనపై జరిగిన లైంగికదాడి గురించి తను ఫిర్యాదు చేసినా కూడా ఈ చట్టం కింద తన కేసు నిలవదని భావించి నిరాశ చెందారు.
అయినప్పటికీ లూసీ ఫిర్యాదు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. పోలీసులను కలిసి తన భయాలను తెలియజేశారు. భయపడొద్దని, న్యాయం జరిగేట్టు చూస్తామని పోలీసులు ఎంతో నమ్మకంగా చెప్పారు. ధైర్యంగా లూసీ తన మాజీ ప్రియుడిపై కేసు పెట్టారు.
కేసు వివరాలు
పోలీసులకు లూసీ తన ఫోన్ చూపించారు. తన ప్రియుడికి శృంగార సమయంలో వీడియోలు తీసే అలవాటుందని, తన ఫోన్‌లో దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయంటూ, వాటిని చూపించారు.
"నాపై రేప్ జరిగినరోజు...నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పోస్టుకు కామెంట్ చేసాను. అది నా బాయ్‌ఫ్రెండ్ చూసాడు. నువ్వు వేరే అబ్బాయిల గురించి ఆలోచిస్తున్నావన్నమాట. అలాంటప్పుడు నన్నెందుకు ప్రేమిస్తున్నావు అంటూ గొడవపడ్డాడు."
"అలాంటిదేం లేదని, సారీ కూడా చెప్పాను. తరువాత చాలాసేపు మా మధ్య మౌనం ఆవరించింది."
"కొంతసేపటి తరువాత నేను అక్కడినుంచీ బయలు దేరాను. కానీ, అతను నన్ను వెళ్లనివ్వలేదు. అతనితో 4-5 గంటలు సెక్స్ చెయ్యాలని పట్టుబటాడు. అంటే, అది నేను చేసిన పనికి శిక్షన్నమాట."
"నేను చేయలేను, నన్ను వదిలేయ్, నేను చెయ్యాలనుకోవట్లేదు అని ఎంతో నచ్చజెప్పాను."
"అతను వినలేదు. నువ్వు చెయ్యాల్సిందే! తప్పదు. నాకు కోపం వచ్చేలోపు మర్యాదగా నీ అంతట నువ్వే లొంగిపో" అని బెదిరించాడు.
"నేను బిగ్గరాగా ఏడ్చాను, వదిలెయ్యమని అరిచాను, పారిపోవడానికి ప్రయత్నించాను. ఇంక అప్పుడు అతను నన్ను చావచితకబాదాడు."
"నా అరుపులు, ఏడుపు అన్నీ వీడియోలో రికార్డయ్యాయి. మీరంతా వినొచ్చు" అంటూ లూసీ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టం కింద లూసీ కేసు కొట్టేసారు
ఫిర్యాదు చేసిన ఆరు నెలల తరువాత పోలీసులు లూసీ కేసుని కొట్టేశారు. రఫ్ సెక్స్ చట్టం కింద ఈ కేసుని ముందుకు తీసుకెళ్లలేమని, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) పరిధిలోకి రాదని తేల్చి చెప్పారు.
ఎందుకు? ఎలా? అని అడిగితే లూసీ ఫోన్‌లో రికార్డయిన మిగతా వీడియోలలో కూడా వారిద్దరి మధ్య మొరటుగానే సెక్స్ జరిగిందని, అవన్నీ పరస్పర అంగీకారంతో జరిగినవేనని, ఈసారి తాను వద్దనుకుంటోందన్న విషయం అతనికి స్పష్టంగా తెలిసి ఉండకపోవచ్చునని పోలీసులు లూసీకి చెప్పారు.
రఫ్ సెక్స్‌కి డిఫెన్స్ రద్దు
రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టం కింది కొట్టిపారేసిన లూసీలాంటి బాధితుల కేసులన్నీ ఇప్పుడు మళ్లీ తిరగదోడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని పార్లమెంట్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, బాధితులు పిలుపునిస్తున్నారు.
రఫ్ సెక్స్ డిఫెన్స్‌ను రద్దు చేస్తూ తీసుకొచ్చిన సవరణను గృహహింస చట్టం (డొమెస్టిక్ అబ్యూస్ బిల్)లో కలిపారు.
ఈ చట్ట సవరణ కోసం పోరాడిన లేబర్ పార్టీ సభ్యులు హారియెట్ హార్మన్ "రఫ్ సెక్స్ చట్టం వలన ఎన్నో సీరియస్ కేసులలో బాధితులకు అన్యాయం జరిగింది. దీన్ని రద్దు చెయ్యడం చాలా ముఖ్యం. న్యాయ వ్యవస్థను పటిష్ఠపరచడంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది" అని బీబీసీతో అన్నారు.
"అత్యాచారం అత్యంత తీవ్రమైన నేరం. ఒక స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా తనను శారీరకంగా, మానసికంగా హింసించడం హేయమైన విషయం. అలాంటి హింసను కొట్టి పారేస్తే బాధితులకు తీరని అన్యాయం జరుగుతుంది. నేరస్థులను కఠినంగా శిక్షించాల్సిందే. వారు తప్పించుకునే లొసుగులు చట్టాల్లో ఉండకూడదు" అని హార్మన్ అన్నారు.
‘వి కాంట్ కన్సెంట్ టు దిస్’ పేరుతో రఫ్ సెక్స్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న బృందాలు వెలికి తీసిన లెక్కల ప్రకారం యూకేలో దశాబ్ద కాలంలో 60 మంది స్త్రీలు శృంగార సమయంలో హత్యకు గురయ్యారు. అన్ని కేసుల్లోనూ పరస్పర అంగీకారంతోనే సెక్స్ జరిగిందని నేరస్థులు కోర్టులో వాదించారు. వీటిల్లో 45% నేరస్థులకు నేరానికి తగ్గ శిక్ష పడలేదు. కొన్ని కేసుల్లో అసలు అది నేరమే కాదని రుజువయ్యింది కూడా.
2020లోనే రఫ్ సెక్స్ చట్టం కింద కొట్టివేసిన నాలుగు కేసులను బీబిసీ త్రీ వెలికితీసింది. ఇలాంటివి గత ఐదు సంవత్సరాలలో 17 కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
లూసీ కథ ఎలా బయటికొచ్చింది?
తన ప్రియుడు చాలారోజులనుంచీ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని లూసీ చెప్పారు.
"నేనోసారి అతనితో సరాదాగా ఏదో అబద్దం చెప్పాను. ఆరోజు శృంగార సమయంలో నా పీక పట్టుకుని గట్టిగా నులిమాడు. నాకు స్పృహ కోల్పోయినంత పనైంది. ఇంకోసారి నాతో అబద్దం చెప్పావంటే ఇంతకన్నా ఎక్కువ హింసిస్తానన్నాడు."
"తరువాత కూడా అతను అడపాదడపా నాపై శారీరకంగా దాడి చేస్తూనే ఉన్నాడు. సెక్స్ చేసే టైంలో తన వికృతరూపాన్ని ప్రదర్శించేవాడు."
అతని ప్రవర్తన రోజురోజుకీ దిగజారిపోతుండడంతో ఆమె స్నాప్ చాట్‌లో అతనితో జరిగిన సంభాషణ అంతా సేవ్ చేసి పెట్టారు.
"నాకు ఎదురు తిరిగావంటే నిన్ను రేప్ చేస్తాను."
"నీ శరీరంతో ఏం కావాలంటే అది చేస్తాను" అంటూ మెసేజ్‌లు పంపాడు. అవన్నీ పోలీసులు చూశారు.
ఆరోజు ఆమెపై అత్యాచారం చేసిన తరువాత రెండు రోజులకు "రేప్ చేసేసాను. ఇంక నువ్వేం చెయ్యలేవు" అనే మెసేజ్ పంపించాడు.
రేప్ జరిగిందని చెప్పడానికి సిగ్గుపడి, అవమానకరమైన చాటింగ్ చేస్తున్నాడని, బెదిరిస్తూ సందేశాలు పంపుతున్నాడని లూసీ మొదట ఫిర్యాదు చేశారు.
అతను తప్పును ఒప్పుకుంటూ సారీ చెప్పాడు. దాంతో ఆమెకు ధైర్యం వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని రెండోసారి ఫిర్యాదు చేశారు.
కానీ దాన్ని రేప్‌గా భావించలేమని పోలీసులు కేసుని కొట్టిపారేయడం లూసీని బాగా కుంగదీసింది. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగంగా భావిస్తున్నాను. నా వ్యక్తిగత సమాచారం అంతా తెలుసుకున్న తరువాత, కేసు కొట్టి పడేయడం అన్యాయం అని ఆమె వాపోయారు.
"నాకు న్యాయం జరగలేదు" అని లూసీ ఆవేదన వ్యక్తం చేసారు.
ది సెంటర్ ఫర్ విమెన్స్ జస్టిస్ బృందం రఫ్ సెక్స్ డిఫెన్స్ కింద తోసిపుచ్చిన కేసులన్నీ తిరగదోడుతూ బాధితులు మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు సహాయం చేస్తున్నది.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
ఎల్లా కథ
మూడేళ్ల క్రితం రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టం కింద ఎల్లా (పేరు మార్చాం) మీద జరిగిన అత్యాచారాన్ని పోలీసులు తోసిపుచ్చారు.
"ఇది అత్యాచారంలాగ కనిపించడం లేదు, మీ ఇద్దరి మధ్య శృంగారం పరస్పరంగీకరంతో జరిగినది కాదు అని నమ్మలేము అని లాయర్ చెప్పారు. ఆ ఒక్క ముక్క నన్ను పూర్తిగా కిందకు నెట్టేసింది" అని ఎల్లా అన్నారు.
ఎల్లా అతన్ని అంతకుముందెన్నడూ కలవలేదు. ఒక డేటింగ్ సైట్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరోజు సాయంత్రం డిన్నర్‌కి కలుద్దామనుకున్నారు.
వాళ్లు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంటికి వెళిపోదామనుకునేలోపు లండన్ బ్రిడ్జ్ మీద టెర్రర్ అటాక్ జరిగిందని మెట్రో రైళ్లన్నీ రద్దయ్యాయని సమాచారం వచ్చింది. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఎల్లా అతనితో కలిసివెళ్లారు.
మొదట కొంతసేపు వారి మధ్య సానుకూలంగానే శృంగారం జరిగింది. మెల్లిగా అతను తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు.
"నా గొంతు నులిమాడు, నా ఒళ్లంతా గాయాలతో నిండిపోయింది" అని ఎల్లా చెప్పారు.
తరువాత ఆమె తన ఇంటికి వెళ్లాక, జరిగినదంతా స్నేహితులతో చెప్పారు. మొదట పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలని ఆమె అనుకోలేదు.
కానీ ఈ సంఘటన ఆమెను మానసికంగా చాలా కృంగదీసింది.
"ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. నా జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. నన్ను ఇంత క్షోభ పెట్టిన అతనిపై కేసు పెట్టలని నిర్ణయించుకున్నాను" అని ఎల్లా చెప్పారు.
యూనిఫార్మ్ వేసుకున్న ఒక పోలీసధికారి ఆమెను విచారించారు. రఫ్ సెక్స్ గురించి మాట్లాడారు.
"నాకు మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా తెలీదన్నట్టు మాట్లాడారు. ఇది ఎంతో అవమానకరం. ఆ సంఘటన నన్ను ఎంత మానసిక వేదనకు గురిచేసిందో అర్థం చేసుకోకుండా ఇలాంటి మాటలతో నా భావోద్వేగాలను కించపరిచారు" అని ఎల్లా అన్నారు.
“అతనికి శిక్ష పడితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నా మనసుకి అయిన గాయం చల్లారదు. అతనికి కఠినమైన శిక్ష పడితేనే నాకు న్యాయం జరిగినట్టు" అని అన్నారు.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
మొరటు శృంగారం - లైంగిక దాడి
గత ఏడాది బీబీసీ బయటపెట్టిన రిపోర్ట్‌లో 37% యూకే స్త్రీలు పరస్పర అంగీకారంతో మొదలైన శృంగారంలో దెబ్బలు తినడం, గొంతు నులమడం, ఉమ్మివేయడం లాంటి అవమానాలను ఎదుర్కొన్నారు. వీరంతా 40 యేళ్లలోపు వారే. రఫ్ సెక్స్ డిఫెన్స్‌లాంటి చట్టాల వలన శృంగార సమయంలో ఇలాంటి హింసను సాధారణ విషయంగా పరిగణించే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు అని ఈ చట్టానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.
“కొంతమంది మొరటు శృంగారాన్ని ఇష్టపడతారు. అయితే అది పరస్పర అంగీకారంతో జరగాలి. దానికి కొన్ని పద్ధతులుంటాయి. మోతాదుకి మించి భాగస్వామి గాయపడేలా, ఆమె వారిస్తున్నా వినకుండా మొరటుగా ప్రవర్తిస్తే అది నేరం అవుతుంది” అని సైకోథెరపిస్ట్ సిల్వా నెవెస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER
న్యాయం కోసం పోరాటం
లూసీ, ఎల్లా ఇద్దరూ కూడా ప్రభుత్వం తమ కేసులను మళ్లీ విచారించాలని కోరుకుంటున్నారు. తమకు, తమలాగా నష్టపోయిన బాధితులందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నారు.
"వీడియో చూసి అది రేప్ కాదు, పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారమే అని పోలీసులు ఎలా తేల్చి చెప్పగలరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు" అని లూసీ అన్నారు.
సీపీఎస్ ఇచ్చిన ఒక ప్రకటనలో "విక్టిమ్స్ రైట్ టు రివ్యూ" నియమం ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మూడు నెలల తరువాత కూడా కేసులను తిరిగి విచారించవచ్చనే విషయాన్ని హైలైట్ చేసారు.
"అత్యాచారం భయంకరమైన నేరం. బాధితులను మానసికంగా ఎంతో కృంగదీస్తుంది. బాధితులకు న్యాయం జరిగేట్లు శాయశక్తులా కృషి చేస్తాం" అని డెప్యుటీ చీఫ్ కానిస్టేబుల్ సారా క్రూ అన్నారు.
అయితే, కేసులను పునర్విచారిస్తారా లేదా అనే అంశంపై న్యాయ మంత్రిత్వశాఖ ఇంతవరకూ ఏమీ చెప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- ‘నా గర్ల్‌ఫ్రెండ్‌కు అందమైన ఆడవాళ్లను చూస్తే కోపమొచ్చేస్తుంది’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘సిక్స్ ప్యాక్ హీరోల చేతిలో మా నాన్న ఓడిపోయాడు’ - ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్
- ‘విదేశీ రాయబారుల ద్వారా బంగారం స్మగ్లింగ్’ కేసుపై కేరళలో రాజకీయ కలకలం
- ‘అత్యాచారానికి గురయ్యాక నిద్రపోయాననటం.. భారత మహిళ తీరులా లేదు’: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. ఉపసంహరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








