కరోనావైరస్ వ్యాక్సిన్: మనుషులపై టీకా పరీక్షల్లో భాగమైన భారతీయ వాలంటీర్ అనుభవాలేంటి?

ఫొటో సోర్స్, DEEPAK PALIWAL / BBC
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
“కరోనావైరస్‌తో యుద్ధంలో నేను ఎలా సాయపడగలను? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆలోచిస్తుంటే నా మెదడంతా వేడెక్కిపోయింది. ఒక రోజు అలా కూచున్నప్పుడు, మెదడుకు బదులు నేను నా శరీరంతో సాయం చేస్తే... అనిపించింది. ఆక్స్‌ఫర్డ్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, దానికోసం వాలంటీర్ల అవసరం ఉందని నా స్నేహితులు చెప్పారు. దాంతో, నేను ఆ ట్రయల్ కోసం అప్లై చేశాను.’’
లండన్ నుంచి వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ పాలీవాల్ కరోనా వ్యాక్సిన్ కోసం తను ఎలా వాలంటీరుగా మారాడో, ఆ విషయాలన్నీ బీబీసీతో పంచుకున్నారు.
జైపూర్‌లో పుట్టి, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న దీపక్ పాలీవాల్, తనకు తానుగా వాలంటీర్ కావాలనుకున్న కొద్దిమందిలో ఒకరు..
వీలైనంత త్వరగా కరోనాకు టీకా తయారుచేయాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. అమెరికా, బ్రిటన్, చైనా, భారత్ లాంటి పెద్ద దేశాలన్నీ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఏ దేశం మొదట ఈ టీకా తయారు చేస్తుందో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి టీకా తయారీకి ముందు దానిని ‘హ్యూమన్ ట్రయల్’ అవసరం.
కానీ, “ఈ వ్యాక్సిన్ ట్రయల్ కోసం మీరు ముందుకు వస్తారా?” అని అడిగితే, బహుశా మనలో చాలా మంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుంది.
ఈ ట్రయల్ కోసం ముందుకు వచ్చేవారిని వెతకడం డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సమస్య కూడా. దీపక్ లాంటి వాలంటీర్ల వల్ల వ్యాక్సిన్ కోసం పరిశోధనల ప్రయత్నాలు మరింత వేగం అందుకుంటాయి.

ఫొటో సోర్స్, DEEPAK PALIWAL / BBC
నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టం?
ఒక బలహీనమైన క్షణంలో, చాలా మంది ఇలాంటి నిర్ణయాల నుంచి తరచూ వెనకడుగు వేస్తుంటారు. కానీ, దీపక్ తన నిర్ణయానికి కట్టుబడి ఎలా ఉండగలిగారు?
సమాధానంగా “అది ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ 16న నాకు మొదటిసారి కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీరుగా వెళ్లవచ్చని తెలిసింది. నా భార్యకు అది చెప్పగానే ఆమె అసలు ఒప్పుకోలేదు. భారత్‌లో ఉన్న మా కుటుంబ సభ్యులకు కూడా నేనేం చెప్పలేదు. వాళ్లు కూడా దానికి ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే నేను నా క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే ఆ విషయం షేర్ చేసుకున్నా” అన్నారు దీపక్.
“ఆక్స్‌ఫర్డ్ ట్రయల్ సెంటర్ నుంచి నాకు మొదటిసారి ఫోన్ వచ్చినపుడు, మీరు తర్వాత చెకప్స్ కోసం మా సెంటర్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. దానికోసం ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. నేను సెయింట్ జార్జ్ హాస్పిటల్లో ఉన్న సెంటరుకు వెళ్లాను. అక్కడ నా పారామీటర్స్ అన్నీ చెక్ చేశారు. అన్నీ సరిగానే వచ్చాయి” అని ఆయన తెలిపారు.
ఈ వ్యాక్సిన్ ట్రయల్ కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెయ్యి మంది వాలంటీర్లు అవసరమయ్యారు. వారిలో అన్ని మూలాల వారూ అంటే అమెరికా, ఆఫ్రికా, భారత్‌కు చెందిన అందరూ ఉన్నారు.
వ్యాక్సిన్ విజయవంతం అయితే దానిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉపయోగించడానికి, వాలంటీర్లను అలా ఎంపిక చేసుకోవడం అవసరం.
“ట్రయల్ జరుగుతున్నప్పుడు ఒక వాలంటీర్ చనిపోయాడని, నేను వ్యాక్సిన్ మొదటి షాట్ కోసం వెళ్లాల్సిన రోజు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది” అని దీపక్ చెప్పారు.
“తర్వాత నాకు అది పదే పదే గుర్తొచ్చింది. నేనసలు ఏం చేస్తున్నాను అనిపించింది. అది ఫేక్ న్యూసా, నిజమా తెలుసుకోలేకపోయా. చాలా డైలమాలో పడిపోయాను. కానీ, చివరికి ఆస్పత్రికి వెళ్లాలనే నిర్ణయించుకున్నా. అక్కడికి చేరుకోగానే వారు నాకు చాలా వీడియోలు చూపించారు. మొత్తం ఆ ప్రక్రియలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు. వ్యాక్సిన్ అంటే వాస్తవానికి ఒక కెమికల్ కంపౌండ్ అన్నారు” అని ఆయన వివరించారు.
“ఈ వ్యాక్సిన్‌లో 85 శాతం కంపౌండ్ మెనింజైటిస్ వాక్సిన్ లాగే ఉంటుందని నాకు చెప్పారు. నేను కొలాప్స్ కావచ్చని, ఆర్గాన్ ఫెయిల్యూర్ ప్రమాదం ఉండచ్చని, ప్రాణాలు కూడా పోవచ్చని డాక్టర్లు నాకు చెప్పారు. జ్వరం, వణుకు లాంటి సమస్యలు కూడా రావచ్చన్నారు. కానీ ఆ ప్రక్రియలో డాక్టర్లు, చాలా మంది నర్సులు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లు నాలో ధైర్యాన్ని పెంచారు” అని దీపక్ పేర్కొన్నారు.
ఒక సమయంలో తన మనసులో దాని గురించి చిన్న సందేహం కూడా మొదలైందని దీపక్ చెప్పారు. ఆ తర్వాత ఈ మెయిల్లో తన డాక్టర్ ఫ్రెండును సంప్రదించానని.. వాలంటీరుగా సిద్ధం కావడం వెనుక ఆయన చాలా కీలక పాత్ర పోషించాడని తెలిపారు.

ఎవరు వాలంటీర్ కావచ్చు?
ఏ వ్యాక్సిన్ ట్రయల్ అయినా అందులో చాలా రకాల దశలు ఉంటాయి.
అన్నిటికంటే చివర్లో ‘హ్యూమన్ ట్రయల్’ ఉంటుంది. అందులో ఏ వ్యక్తికి వ్యాధి వ్యాక్సిన్ ఇస్తున్నారో, అతడికి ఆ వ్యాధి ఉండకూడదు. అంటే కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వచ్చిన వాలంటీరుకు కరోనా వైరస్ ఉండకూడదు.
వాలంటీర్ల శరీరంలో కోరోనా యాంటీబాడీస్ కూడా ఉండకూడదు. అంటే వారు కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి అయ్యుండకూడదు. అలాంటి వారు వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీర్‌గా పనికిరారు.
టీకా ట్రయల్‌లో పాల్గొనే వాలంటీర్ వయసు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం కూడా చాలా ముఖ్యం.
ట్రయల్ సమయంలో వాలంటీర్లలో ఒకే వయసువారు, ఒకే మూలాల వారు లేకుండా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో మహిళలు, పురుషులు ఇద్దరికీ స్థానం కల్పిస్తారు.
ఆక్స్‌ఫర్డ్ ట్రయల్‌లో పాల్గొనే వాలంటీర్లను ప్రజా రవాణాలో ఎక్కడికైనా ప్రయాణించడాన్ని అనుమతించరు. వారికి డబ్బు కూడా చెల్లించరు. వారికి ఇన్సూరెన్స్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ మొత్తం ట్రయల్ ప్రక్రియలో వాలంటీర్ వేరే ఎవరికీ తన రక్తం ఇవ్వకూడదు.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అతడికి వాలంటీరుగా ఉండడం సులభంగానే అనిపించిందా?
సమాధానంగా “నాకు ట్రయల్ విజయవంతం అవుతుందో , లేదో కూడా తెలీదు. కానీ నేను సమాజం కోసం ఏదైనా చేయాలని అనుకున్నా. అందుకే ఇది చేస్తున్నా అన్నారు” దీపక్.

ఫొటో సోర్స్, DEEPAK PALIWAL / BBC
'హ్యూమన్ ట్రయల్' ప్రక్రియ ఎలా ఉంటుంది?
మొదటి రోజు నా భుజానికి ఇంజెక్షన్ చేశారని. ఆ రోజు కాస్త జ్వరం, వణుకు వచ్చిందని దీపక్ చెప్పారు.
“ఇంజెక్షన్ వేసిన దగ్గర కాస్త వాచింది. అది మామూలే అని డాక్టర్లు చెప్పారు. అంతే కాదు, నేను ప్రతి రోజూ ఆస్పత్రిలో అరగంట పాటు ఉండాల్సి వచ్చేది. రోజూ ఒక ఈ-డైరీ నింపేవాడిని. అందులో రోజువారీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, బరువు, బీపీ వివరాలతో పాటు.. ఇంజెక్షన్ వేసిన దగ్గర పడిన మచ్చను కొలిచి ఆ ఫాంలో రాసేవాడిని. దానికి అవసరమైన అన్ని వస్తువులూ ఆస్పత్రి నుంచే ఇచ్చారు” అని తెలిపారు.
“ఆ ఈ-డైరీలో మనం బయటికెళ్లింది, ఎవరెవరిని కలిసింది, అప్పుడు మాస్కు వేసుకున్నామా లేదా, ఏమేం తింటున్నాం అన్నీ చెప్పాలి. 28 రోజుల వరకూ నేను అదంతా అందులో నింపాను. ఆ మొత్తం ప్రక్రియ జరిగే సమయంలో డాక్టర్లు నాతో ఎప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉండేవారు. రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది. జులై 7న కూడా ఫాలోఅప్ జరిగింది. అంటే, ఏప్రిల్ నుంచి మొదలైన ఆ ప్రక్రియ జులై వరకూ నడుస్తోంది” అని ఆయన వివరించారు.
ఈ మధ్యలో దీపక్‌కు మూడుసార్లు జ్వరం కూడా వచ్చింది. కాస్త భయంగా కూడా అనిపించింది. “ఆ భయం నేను చనిపోతానని కాదు. మా వాళ్లను ఇక చూడలేమోనని” అని దీపక్ చెప్పాడు.
దీపక్ వాళ్ల నాన్న మూడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పుడు విదేశాల్లో ఉండడం వల్ల అతడికి తండ్రి చివరిచూపు కూడా దక్కలేదు. ట్రయల్ సమయంలో కూడా అతడికి అదే భయం వేసింది. తను ఇక తల్లి, అన్న, అక్కలను చూడగలనో, లేదో అనుకున్నారు.
అయితే ఎలాంటి అత్యవసర పరిస్థితిలో అయినా సంప్రదించేందుకు ఆస్పత్రి వారు అతడికి ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. కానీ అతడికి అప్పుడు మొదలైన భయం, ఇప్పటికీ అలాగే ఉంది.
“90 రోజుల వరకూ నేను బయటకు ఎక్కడకూ వెళ్లలేకపోయాను. నాకు వాక్సిన్ డోస్ రెండు సార్లే ఇచ్చారు. కానీ, ఫాలోఅప్ కోసం మాటిమాటికీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది” అని దీపక్ చెప్పారు.

ఫొటో సోర్స్, DEEPAK PALIWAL / BBC
అసలు ఈ దీపక్ ఎవరు?
దీపక్ వయసు 42 ఏళ్లు. ఆయన లండన్‌లో ఒక ఫార్మా కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
భారత్‌లోనే పుట్టి పెరిగిన దీపక్ కుటుంబం ఇప్పటికీ జైపూర్‌లోనే ఉంది. ఆయన, తన భార్యతో లండన్‌లో ఉంటున్నారు. ఆమె కూడా ఫార్మా కంపెనీలోనే పనిచేస్తున్నారు.
కుటుంబంలో దీపక్ అందరికంటే చిన్నవాడు. వాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఆయన భారత్‌లో తనవాళ్లకు ఆ విషయం గురించి చెప్పలేదు. తల్లి, అన్న తన నిర్ణయాన్ని మెచ్చుకున్నా, అక్కయ్యకు దీపక్ మీద చాలా కోపం వచ్చింది.
దీపక్ భార్య పర్ల్ డిసౌజా బీబీసీతో మాట్లాడారు. దీపక్ నిర్ణయం పట్ల తను సంతోషంగా లేనని చెప్పారు. “దీపక్‌కు వచ్చే ‘హీరో’ ట్యాగ్ నాకు అవసరం లేదు. ఒకసారి ఒప్పుకున్నా, ఇంకోసారి అలాంటి వాటికి అంగీకరించేది లేదు” అన్నారు.
దీపక్ ట్రయల్ పార్ట్ పూర్తైంది. కానీ ఆక్స్ ఫర్డ్ ట్రయల్లో ఇప్పుడు కూడా 10 వేల మందిపై ఇంకా ట్రయల్ జరుగుతోంది.
మొత్తం ప్రపంచం లాగే, వ్యాక్సిన్ విజయవంతం అయ్యే రోజు కోసం దీపక్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








