కరోనావైరస్‌ను ‘హెర్డ్ ఇమ్యూనిటీ’తో అదుపు చేయడం సాధ్యమేనా? స్పెయిన్ తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) ఒక మార్గంగా పరిగణిస్తూ వచ్చారు. అయితే.. ఈ అవకాశం సందేహాస్పదమని స్పెయిన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.
ఈ అధ్యయనం కోసం దాదాపు 60,000 మందిని పరిశీలించారు. స్పెయిన్ జనాభాలో సుమారు 5 శాతం మందిలో మాత్రమే కరోనావైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారయ్యాయని వెల్లడైనట్లు వైద్య పత్రిక లాన్సెట్ నివేదించింది.
ఒక వైరస్ మహమ్మారిగా వ్యాపించకుండా నిరోధించటానికి హెర్డ్ ఇమ్యూనిటీ ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. ఇది సాధించాలంటే తగినంత మందికి ఆ వైరస్ సోకాల్సి ఉంటుంది.
ఈ విధానంలో జనాభాలో దాదాపు 70 నుంచి 90 శాతం మంది రోగనిరోధక శక్తి సంతరించుకున్నట్లయితే వైరస్ సోకనివారికి రక్షణ లభిస్తుంది.
స్పెయిన్‌లోని తీర ప్రాంత జనాభాలో కోవిడ్-19 యాంటీబాడీలు ఉన్న వారు మూడు శాతం లోపే ఉన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో యాంటీబాడీలు ఉన్నవారి శాతం ఎక్కువగా ఉందని లాన్సెట్ రిపోర్ట్ చెప్తోంది.

ఫొటో సోర్స్, AFP
''స్పెయిన్‌లో కోవిడ్-19 ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నాకూడా.. యాంటీబాడీల విస్తృతి తక్కువగానే ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ అందించటానికి ఇది ఏమాత్రం సరిపోదు'' అని అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు పేర్కొన్నారు.
''జనాభాలో వైరస్ సోకిన వారిలో చాలా మంది మరణాలు, వైద్య వ్యవస్థ మీద మోయలేని భారం లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యంకాదు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మహమ్మారిని నియంత్రించటానికి.. సామాజిక దూరం అమలు చేయటం, కొత్త కేసులను, వారి కాంటాక్టులను గుర్తించి ఐసొలేట్ చేయటం ముఖ్యం'' అని స్పష్టంచేశారు.
యూరప్‌లో కరోనావైరస్ మీద నిర్వహించిన అతి పెద్ద అధ్యయనంగా ఈ పరిశోధనను పరిగణిస్తున్నారు.
చైనా, అమెరికాల్లో కూడా ఇటువంటి అధ్యయనాలు నిర్వహించారు. ''ఆ అధ్యయానల్లో గుర్తించిన కీలక అంశం.. వైరస్ వ్యాప్తి అత్యంత విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా జనాభాలో అధిక శాతం మంది కరోనావైరస్ బారిన పడలేదు'' అని లాన్సెట్ కథనం వివరించింది.
''అత్యల్పకాలం మాత్రమే ఉండే రోగనిరోధకశక్తిని అందించే ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సంక్షోభం ఎదురైనపుడు.. దీనిని ఎదుర్కొనటానికి ఉత్తమమైన వ్యాక్సిన్‌ను గుర్తించటం, భారీ ఎత్తున స్థిరమైన పూర్తిస్థాయి రోగనిరోధకశక్తిని పెంపొందించటమే అసలు సవాలు అనే అంశాన్ని ఈ అధ్యయనం పునరుద్ఘాటిస్తోంది'' అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఇమ్యునాలజీ ప్రొఫెసర్ డానీ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.

స్పెయిన్‌లో తాజా పరిస్థితి ఏమిటి?
స్పెయిన్‌లో ఇప్పటివరకూ 2.5 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల 28,385 మంది చనిపోయారు. అయితే.. గత మూడు వారాలుగా రోజు వారీ మరణాల సంఖ్య పది లోపే ఉంటోంది.
అయితే.. గాలీసియా ప్రాంతంలో మహమ్మారి తిరిగి విజృంభించటంతో అధికారులు 70,000 మంది నివసించే ప్రాంతం మీద మళ్లీ ఆంక్షలు విధించారు.
ఈ ప్రాంతంలోని బార్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో బార్లు, రెస్టారెంట్లలోకి అనుమతించే వారి సంఖ్యను వాటి సామర్థ్యాన్ని సగానికి పరిమితం చేశారు.
గాలీసియాలో ప్రస్తుతం 258 కేసులు ఉన్నట్లు అధికార యంత్రాంగం చెప్తోంది.
మరోవైపు కాటలోనియాలోని స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం.. అక్కడ ఇన్ఫెక్షన్ల సంఖ్య తీవ్రంగా పెరగటంతో 2.10 లక్షల మంది నివసించే సెగ్రియా జిల్లా మీద మళ్లీ ఆంక్షలు విధించింది.
ఆ ప్రాంతం నుంచి ఎవరినీ బయటకు అనుమతించబోమని, ఆ ప్రాంతంలోకి ఎవరినీ ప్రవేశించనీయబోమని కాటలోనియా అధ్యక్షుడు క్విమ్ టోరా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Alamy
సమర్థవంతమైన పరిష్కారం కోసం అన్వేషణ
విశ్లేషణ: మిషెల్ రాబర్ట్స్, హెల్త్ ఎడిటర్
విస్తృతంగా వ్యాక్సిన్లు అందించటం ద్వారా కానీ, జనాభాలో తగినంత మందికి వైరస్ సోకి కోలుకోవటం ద్వారా కానీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. ఒక వ్యాధికి తగినంత మందిలో రోగనిరోధక శక్తి ఉన్నట్లయితే.. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం కొనసాగే అవకాశం తక్కువగా ఉంటుంది.
అయితే.. కరోనావైరస్‌ను విస్తృతంగా వ్యాపించేలా వదిలేసి.. ఎక్కువ మంది జనం తీవ్రంగా జబ్బుపడేలా చేయటం ఆప్షన్ కాదు. దానివల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
ఇక కరోనావైరస్‌కి వందలాది వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నా.. ప్రస్తుతానికైతే ఎటువంటి వ్యాక్సిన్ లేదు.
ఈ వైరస్ నుంచి తగినంత రక్షణనిచ్చే ఆయుధాన్ని తయారుచేయటం మన ముందున్న సవాలు. ఇందుకోసం కరోనావైరస్‌తో పోరాడి తరిమికొట్టగల యాంటీబాడీలను తయారుచేయటాన్ని గుర్తుంచుకునేలా శరీరంలోని రోగనిరోధక శక్తికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. వైరస్ స్వభావాన్ని చూస్తుంటే.. రోగనిరోధక వ్యవస్థకు శిక్షణనిచ్చినా.. అది గుర్తుపెట్టుకునే కాలం అతి తక్కువగా ఉండొచ్చునన్నది శాస్త్రవేత్తల ఆందోళన.
కరోనావైరస్ సోకిన కొందరిలో దాని నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు తయారైనప్పటికీ.. అవి ఎంత కాలం కొనసాగుతాయన్నది నిపుణులకు ఇంకా తెలియదు.
సాధారణ జలుబులు ఇదే తరహా వైరస్‌ల వల్ల వస్తాయి. వీటికి ప్రతిస్పందనగా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలు వేగంగా అదృశ్యమైపోతాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









