కరోనావైరస్ - మానసిక ఆరోగ్యం: ఏకాగ్రతపై లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఓ పనిచేయాలని వేగంగా గదిలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు ఏం చేయాలో.. ఎలా మొదలు పెట్టాలో.. తెలియక ఆగిపోవడం. గందరగోళానికి గురవ్వడం. అసలు అంతా మరచిపోయినట్లు అనిపించడం.. ఇలా అప్పుడప్పుడు చాలా మందికి జరుగుతుంటుంది.
దీని వెనుక కారణాలను అన్వేషిస్తూ 2011లో అమెరికాలోని నోట్రె డామ్ యూనివర్సిటీ నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. ఒక్కసారిగా జ్ఞాపకశక్తి కోల్పోవడమే ఇలా జరగడానికి కారణమని కారణమని వారు తేల్చారు.
"ఒక నిర్దేశిత సమయంలో మెదడు చాలా సమాచారాన్ని గుర్తుపెట్టుకోగలదు. అయితే మనం వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు కొత్త విషయాలను గుర్తు పెట్టుకొనే క్రమంలో పాత విషయాలు కొన్ని తుడిచి పెట్టుకుపోతాయి."అని ఆ అధ్యయనంలో తేలింది.
నేను వంట గదిలో ఎందుకు ఉన్నానో మరచిపోయినట్లు రోజూ పదేపదే అనిపిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ దీన్ని నేను గమనిస్తున్నాను.
చెప్పాలంటే.. దేనిపైనా అసలు ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను.
పేపర్ పైనుండే ఫోన్ నంబరు కనీసం డయల్‌చేసే వరకు కూడా గుర్తుంచుకోలేపోతున్నా. ఒక మెయిల్ రాయడానికి చాలా సమయం పడుతోంది.
పని మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. నా పని సామర్థ్యం బాగా దెబ్బతింటోంది.
నేను మాత్రమే కాదు. నా సమస్య ఎవరెవరికి చెప్పానో.. ఇలాంటి పరిస్థితి తమకూ ఎదురవుతోందని వారూ చెబుతున్నారు. ఏదైనా చేయాలంటే ఇప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
నేను చాలా బిజీగా ఉన్నా అని రచయితగా పనిచేస్తున్న స్నేహితురాలు చెప్పారు. అయితే ఆమె ఏం పనిచేస్తున్నారని అడిగితే.. గిన్నెలు తోమడం.. వాకింగ్‌కు వెళ్లడం.. అంతే..

ఫొటో సోర్స్, Getty Images
పనిచేయడానికి అవసరమైన జ్ఞాపకశక్తి(వర్కింగ్ మెమరీ)లో తేడాల వల్లే ఒక్కోసారి అంతా మరచిపోతుంటాం. చుట్టు పక్కల సమాచారాన్ని గ్రహించుకొని ఓ ఆలోచనగా మలచడంతోపాటు... ఆలోచనను మనకు కావాల్సిన పని పూర్తయ్యేవరకూ గుర్తుపెట్టుకోవడానికి ఈ జ్ఞాపకశక్తి అవసరం.
"మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో లాంటి పనులకు ఇదొక మానసిక వేదిక లాంటిది" అని ఫిన్లాండ్‌లోని అబోం అకాడమీ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ మ్యాటీ లేయ్న్ వ్యాఖ్యానించారు.
వర్కింగ్ మెమరీకి ఏకాగ్రతతో దగ్గర సంబంధాలుంటాయి. ఏదైనా పని పూర్తిచేయాలన్నా.. లేదా లక్ష్యాన్ని సాధించాలన్నా.. మొదట ఏకాగ్రత అవసరం.
ఇంకో విధంగా చెప్పాలంటే.. ఒక నిర్దేశిత సమయంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే శక్తికి వర్కింగ్ మెమరీనే మూలం. మెదడు శక్తివంతమైన అవయవంగా చెప్పుకొనేందుకు ఇదే కారణం.
వేగంగా మారే పరిస్థితులు, ఆందోళన లాంటి పరిణామాలు వర్కింగ్ మెమరీపై ప్రభావం చూపుతాయని, ఫలితంగా ఏకాగ్రత కోల్పోతామని పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి.
"కరోనావైరస్.. మహమ్మారిగా మారడానికి ముందే.. అమెరికావాసులపై ఓ ఆన్‌లైన్ అధ్యయనం చేపట్టాం. వరుస ప్రశ్నలతో కూడిన ఓ పత్రాన్ని పూరించమని వారికి చెప్పాం" అని లేయ్న్ వివరించారు.
"దీంతో వర్కింగ్ మెమరీ, ఆందోళన మధ్య ప్రతికూల సంబంధం బయటపడింది. ఆందోళన పెరిగేకొద్దీ.. వర్కింగ్ మెమరీ పడిపోతోందని తేలింది."
ఆందోళన తీవ్రమైనప్పుడు.. ఉదాహరణకు చీకట్లో మిమ్మల్ని భయపెట్టే వ్యక్తులు ఎవరైనా మీ వెనక వస్తున్నప్పుడు, ఒక్కోసారి వారి మొహం ఎలా ఉంటుందో కూడా గుర్తుతెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది.
ఒక్కోసారి ఒత్తిడి కలిగించే పరిస్థితులూ వర్కింగ్ మెమరీపై ప్రభావం చూపిస్తాయి. ఆ సమయంలో సాధారణమైన పనులు చేయడమూ చాలా కష్టంగా మారిపోతుంది.
"ప్రస్తుతం సాధారణ ఆందోళన, ఒత్తిడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తీవ్రమైన వాటి గురించి కాదు" అని లేయ్న్ అన్నారు.
"భవిష్యత్తు ఎలా ఉండబోతుందో? వర్షాకాలంలోనూ పరిస్థితి ఇలానే ఉంటుందా? మరి ఆ తర్వాత శీతాకాలంలో? ఎవరికీ తెలీదు. ఇలాంటి ఆలోచనలు ఆందోళనలను పెంచుతున్నాయి."
"మా అధ్యయనం వర్కింగ్ మెమరీ శిక్షణపై సాగింది. బ్రిటన్, ఉత్తర అమెరికాలకు చెందిన 200 మంది దీనిలో పాల్గొన్నారు. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి వారిని కొన్ని ప్రశ్నలు అడిగాం." అని లేయ్న్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"వార్తలన్నీ కరోనావైరస్ చుట్టూ తిరగడంతో దానికి సంబంధించిన ప్రశ్నలనూ మేం అడిగాం"
"ఆందోళన స్థాయిలను 0 నుంచి 10 వరకూ రేటింగ్ ఇవ్వమన్నాం. పది అంటే రోజువారీ పనులు కూడా చేయలేని స్థితిలో ఆందోళన పడటం. అధ్యయనంలో పాల్గొన్నవారి ఆందోళన సగటు కొంచెం ఎక్కువగా 5.6 వచ్చింది."
"ఈ ఫలితాలను గమనిస్తే.. వర్కింగ్ మెమరీని కరోనావైరస్ సంబంధిత ఆందోళన దెబ్బ తీస్తోందని బయటపడింది. మెదడుకు సంబంధించి ఇంకా చాలా విధులపై ఈ ఆందోళన ప్రభావం చూపుతూ ఉండొచ్చు కూడా."
"పనిచేయడానికి అవసరమైన జ్ఞాపకశక్తిని కరోనావైరస్ సంబంధిత ఆందోళన హరించేస్తున్నట్లు మేం భావిస్తున్నాం." అని లేయ్న్ అన్నారు.
ఆందోళనలో ఉన్నప్పుడు.. బుర్ర మొత్తం ఆ ఆలోచనలతోనే నిండిపోతాయి. ప్రతికూల ఆలోచనలపై మనం మరింత ఎక్కువ శ్రద్ధ పెడతాం.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన మరి ఎక్కువసేపు ఉంటే నిద్రలేమి కూడా చుట్టుముడుతుందని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌కు చెందిన ఆలివర్ రోబిన్‌సన్ వివరించారు.
"వర్కింగ్ మెమరీ కోల్పోవడానికి నిద్రలేమీ కూడా ఓ ప్రధాన కారంణం" అని ఆయన వివరించారు. "మీరు సరిగా నిద్రపోకపోతే.. మీ మేధో సామర్థ్యాన్ని మీరే తగ్గించుకుంటున్నట్లు."
ఈ ముప్పు పెరుగుతున్నట్లు మీరు గుర్తించలేక పోయినప్పటికీ.. జరగాల్సింది జరుగుతూనే ఉంటుందని రాబిన్‌సన్ వ్యాఖ్యానించారు.
మెదడు సామర్థ్యానికి మించి పనిచేస్తున్నప్పుడూ వర్కింగ్ మెమరీ సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి.
అలాంటి సమయాల్లో షాపింగ్ చేసేందుకు కావాల్సిన వస్తువుల జాబితా రూపొందించడమూ కష్టమవుతుందని రాబిన్‌సన్ వివరించారు.
"అప్పుడు ఆలోచించే కంటే నేరుగా షాప్‌లోకి వెళ్లిపోవాలి. ఏం కావాలి? ఇప్పుడు షాప్‌లు తెరిచే ఉంటాయా? ఈ సమయంలో వెళ్లడం సురక్షితమేనా? ఇలాంటి నాలుగు పనులు ఒకేసారి మెదడు చేయగలదు అనుకుందాం. ఇప్పుడు ఒకేసారి పది పనులు వచ్చిపడితే.. దేనిపైనా మెదడు దృష్టిపెట్టలేదు."

ఫొటో సోర్స్, Getty Images
మెదడుకు మేలుచేసే గేమ్‌లు?
గేమ్‌లతో వర్కింగ్ మెమరీని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే, మార్కెట్‌లోని చాలా బ్రెయిన్ గేమ్‌లతో గేమ్ నిపుణులు అవుతాం కానీ.. పెద్దగా ఒరిగేదేమీ ఉండదని వారు వివరిస్తున్నారు.
"నేను షాపింగ్‌చేసే వస్తువులను గుర్తుపెట్టుకోవడంలో మేధోపరమైన గేమ్‌లు ఎలాంటి సాయమూ చేయలేదు." అని రాబిన్‌సన్ చెప్పారు. "ఆ గేమ్స్ ఎలా ఉంటాయంటే రన్నింగ్‌పై శిక్షణ ఇచ్చి టెన్నిస్ ఆడమనటమే"
అయితే, ఎన్-బ్యాక్‌గా పిలిచే ఓ బ్రెయిన్ గేమ్‌తో మంచి ఫలితాలు ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
ఎన్-బ్యాక్.. ఒకేలాంటి కార్డులను గుర్తుపట్టే క్లాసిక్ కాన్సెంట్రేషన్ గేమ్ లాంటిది.
ఇక్కడ కార్డులకు బదులుగా.. చదరంగం లాంటి గళ్లతో నిండిన బోర్డుపై ఓ వస్తువు కదులుతుంటుంది. అది ఎక్కడుందో మనం గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి వెనక్కి కదిలింది, రెండోసారి కూడా వెనక్కి.. అలా గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఈ గేమ్‌తో వర్కింగ్ మెమరీ ప్రభావితం అవుతుందా? లేదా అనేది న్యూరోసైన్స్ వర్గాల్లో ఇప్పటికీ వివాదాస్పదమే. ఈ గేమ్‌ను కొన్ని రౌండ్లు ఆడితే.. కొంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన వల్లే వర్కింగ్ మెమరీ దెబ్బతింటోందని, ఆందోళన తగ్గిస్తే ఏకాగ్రత పెరుగుతుందని అందరూ అంగీకరిస్తున్నారు.
ఆందోళనకు చికిత్స ఏంటంటే.. "నిజానికి వారు భావించేంత దారుణంగా పరిస్థితులు లేవని వారికి అర్థమయ్యేలా మేం చెబుతాం" అని రాబిన్‌సన్ వివరించారు.
"ఈ విధంగా వారు ఆలోచించే, ఆందోళన పడే అంశాలను కొంతవరకూ తగ్గించొచ్చు."
వార్తలు చదవడం తగ్గించుకోవడం, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కొంచెం దూరంగా ఉండటం లాంటి పనుల ద్వారా వర్కింగ్ మెమరీని రీబూట్ చేయొచ్చు.
సరే పోరాడదాం.. అని మనసుకు సర్దిచేప్పుకోవడం అన్నింటికంటే మేలైన మార్గం.
"సరిగాలేని పరిస్థితులనూ సాధారణంగా తీసుకొనేలా మనసును ఒప్పించగలిగితే మీరు మరింత ఆందోళన తగ్గించుకోవచ్చు. అంటే అసాధారణ పరిస్థితులకు మీరు అలవాటు పడుతున్నారు అంతే.. ఇంకేమీ చేయట్లేదు." అని రాబిన్‌సన్ వివరించారు.
"మీరు ఇంతకు ముందులా 100 శాతం సామర్థ్యంతో పనిచేయకపోయినా తప్పేమీ లేదని అంగీకరించాలి. మనం ఇంకా కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతూనే ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి."
ఇవి కూడా చదవండి:
- చనిపోయిన గుండెను బతికించొచ్చా?
- రైతుల పాదయాత్ర: మా రెక్కల కష్టాన్ని గుర్తించండి!
- సోషల్ మీడియా: వైరల్‌గా మారిన మోదీ వీడియో!
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








