కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి?

- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనురాధ బనివాల్ చెస్ కోచ్‌గా పని చేస్తున్నారు. భారత్-బ్రిటన్ దేశాల్లో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అనువుగా ఆమె రెండు దేశాల కాలమానాల ప్రకారం పాఠాలు చెప్పే సమయాన్ని మార్చుకున్నారు. లండన్‌లోని అత్యుత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి భారత్‌లోని మారు మూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా చెస్ పాఠాలు చెప్పిన అనుభవం ఆమెకు ఉంది. కానీ కోవిడ్-19 తర్వాత పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
కరనావైరస్ సంక్షోభం తర్వాత దేశ వ్యాప్తంగా డిజిటల్ గాడ్జెట్స్ వినియోగంలో ఉన్న తేడా భారతదేశంలోని విద్యావ్యవస్థలో పెను సవాలుగా మారింది.
లండన్‌లో ఉంటున్న బనివాల్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు ఇప్పటికే ఉన్న విద్యావిధానాల విషయంలో పునరాలోచించాల్సిన పరిస్థితుల్ని, కొత్తగా విధానాలను రూపొందించాల్సిన స్థితిని కరోనావైరస్ ఎలా తీసుకొచ్చిందో వివరించారు.
“నేను లండన్‌లో అత్యధికంగా 8 మందికి జూమ్ ద్వారా క్లాస్ చెప్పగలను. ఇక్కడ చాలా మంది పిల్లలకు ప్రత్యేకమైన గది, వేగవంతమైన ఇంటర్నెట్, ల్యాప్ ట్యాప్‌లు, ట్యాబ్‌లు ఉంటాయి. దాదాపు అందరూ టెక్నాలజీ ఫ్రెండ్లీగా ఉంటారు” అని బనివాల్ చెప్పారు.
మారు మూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు
ఇక దిల్లీ విషయానికి వస్తే ఇక్కడ చాలా పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు ఆన్ లైన్లో పాఠాలు చెబుతున్నాయి. అయితే ఈ విధానంపై అటు విద్యావేత్తలు, ఇటు విద్యార్థుల అభిప్రాయం చూస్తే కాస్త మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.
“చాలా వరకు అంతా బాగానే ఉంది. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో లాక్ డౌన్ మొదలయ్యింది. సెలవులు పూర్తికాగానే అన్ని తరగతుల్ని గూగుల్ మీట్, జూమ్ అప్లికేషన్ల ద్వారా ఆన్ లైన్లో నిర్వహించాం. అయితే అదే సమయంలో కొంత మంది విద్యార్థులు ముఖ్యంగా కశ్మీర్ సహా ఇతర మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇంటర్నెట్ సమస్యలు ఎదురయ్యాయి” అని దిల్లీలోని అశోకా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సైకత్ ముజుందార్ తెలిపారు.
దేశంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలల్లో చాలా వరకు జూమ్ తరగతుల్ని ప్రారంభించాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇదో తాత్కాలిక ఏర్పాటే తప్ప ఇంకేం కాదని అంటున్నారు. “నా ఇద్దరు పిల్లలు జూమ్ ద్వారా క్లాసులు వింటున్నారు. బోధనలో నాణ్యత విషయానికి వస్తే.. ఫరవాలేదని చెప్పవచ్చు. అయితే ఒకరితో ఒకరికి ప్రత్యక్ష సంబంధం లేకపోవడమే ఇందులోని ప్రధాన సమస్య” అని పేరు చెప్పడానికి ఇష్టబడని ఓ వ్యక్తి బీబీసీకి వివరించారు.
“క్యాంపస్ అనుభవం” అన్న ఆలోచనను కరోనా మహమ్మారి పూర్తిగా మార్చేసిందని నేను మాట్లాడిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ చెప్పుకొచ్చారు.
“బహుశా వచ్చే సెమిస్టర్ కూడా ఆన్‌లైన్లోనే జరగవచ్చు. మేం కోర్సు మెటీరియల్ కూడా ఆన్‌లైన్లోనే ఇస్తున్నాం. హార్డ్ కోర్ సైన్స్ విద్యార్థులకు ముఖ్యంగా ల్యాబ్ అవసరాలు ఉన్న వారికి ఇది కాస్త సవాలుతో కూడుకున్నదే” అని సైకత్ చెప్పారు.
మరోవైపు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఎలా తిరిగి తరగతుల్ని ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాయి.
విద్యా సంస్థల్లో భౌతిక దూరం అన్నది చాలా ముఖ్యం. బహుశా ఈ విషయంలో యూరోప్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లో అమలు చేస్తున్న పద్ధతుల్ని చూసి మన దేశంలో విద్యా సంస్థలు ప్రేరణ పొందవచ్చు.
కొన్ని పాఠశాలలు గ్లాస్ షీట్లతో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చేశాయి. మరి కొన్ని చోట్ల విద్యార్థి పాఠశాల భవనంలోకి లేదా తరగతిలోకి ప్రవేశించే ప్రతిసారి శరీర ఉష్ణోగ్రతల్ని పరీక్షించడం తప్పనిసరి చేశారు. కానీ భిన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉన్న భారత దేశంలో భవిష్యత్‌లో విద్య అనేది ఒక్కో విద్యార్థి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఆన్ లైన్ విద్య అన్నది కొత్త విధానం కావచ్చు. కానీ నిరుపేద, వెనుకబడ్డ విద్యార్థులు విషయంలో విద్య నేర్చుకునే విధానంలో మార్పు ఎలా వస్తుంది?
“చాలా మంది ఆడపిల్లలకు ఇంట్లోని దుర్భర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు పాఠశాల ఒక అవసరం. చదువుకోవడంతో పాటు స్కూల్ అంటే స్నేహితులు, మాటలు, మధ్యాహ్న భోజనం ఇవన్నీ ఇప్పుడు దాదాపు లేకుండా పోతాయి” అని అనురాధ అన్నారు.

ఎన్నో సవాళ్లు!
అనురాధ పాఠాలు చెబుతున్న హర్యానా, జార్ఖండ్‌లోని మారుమూల పల్లెలకు కూడా వెళ్లాల్సినవసరం లేదు. దక్షిణ దిల్లీలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు రాణీ రాజ్ పుత్. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తన బిడ్డ ఇంట్లో ఏ పని లేకుండా కూర్చుందని ఆమె తల్లి రాధా రాజ్‌పుత్ బీబీసీతో అన్నారు.
“పనిని వెతుక్కుంటూ మేం యూపీ నుంచి దిల్లీకి వచ్చాం. నా భర్త ఆటో నడుపుతారు. నేను ఓ ఇంట్లో పని చేస్తున్నాను. పెద్ద పెద్ద పాఠశాలల్లో చదువుతున్న వారికి కంప్యూటర్ ద్వారా పాఠాలు చెబుతున్నారని మేం వింటున్నాం. కానీ మా దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి నా బిడ్డ చదువుతున్న స్కూల్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. రోజంతా మేం ఉండే చిన్న గదిలోనే గడపడం వల్ల ఆమె చాలా ఆందోళనకు గురవుతోంది” అని రాధా చెప్పారు.
కరోనావైరస్ మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లకు అనురాధా, రాధాల కథలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆన్ లైన్ తరగతులు పట్టణాల్లోని కొన్ని పాఠశాలలకు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని పక్కనబెడితే, దేశ వ్యాప్తంగా విద్యార్థులను చేరుకోవడంలోనూ, మెజార్టీ విద్యార్థులకు బోధన అందించే విషయంలోనూ విద్యావేత్తలు సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాల్సిన అవసరాన్ని కోవిడ్-19 తీసుకొచ్చింది.
“ఆన్ లైన్ విద్య అందుబాటులోనే ఉంది. కానీ అది పాఠశాల స్థానాన్ని ఎప్పుడూ భర్తీ చేయలేదు” అని సోషల్ లెర్నింగ్ ప్లాట్ ఫాం ఎస్కొవేషన్ సంస్థ వ్యవస్థాపకుడు రితీష్ సింగ్ అన్నారు.
దేశంలోని సుమారు 12 లక్షల మంది ఉపయోగిస్తున్న ఉన్నాయన్ లెర్నింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిన రితీష్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్నొవేషన్ అవార్డు అందుకున్నారు.
“ఆన్ లైన్ విద్యావిధానం మరింత ప్రభావవంతంగా ఉండాలంటే ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా సందర్భోచితమైన, వ్యక్తిగతమైన విద్య అసరం. ఉదాహరణకు దిల్లీ మహానగరంలో నివాసం ఉంటున్న విద్యార్థుల కోసం తయారు చేసిన వీడియో పాఠం ఎక్కడో మారు మూల గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు అంతగా అర్థం కాకపోవచ్చు. అంతేకాదు మీరు లెక్కల్లో త్రికోణమితి పాఠం చెబుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే స్థాయి తక్కువగా ఉన్న విద్యార్థికి ఆ వీడియో ఏ మాత్రం ఉపయోగపడదు” అని రితీష్ అభిప్రాయపడ్డారు.

గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
అందుకే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రితీష్, అతని బృందం మెటీరియల్‌ను తయారు చేస్తున్నారు. “నా మొబైల్ నా విద్యాలయం”ఇది ఉన్నయాన్ యాప్ నినాదం. అందుకు అనుగుణంగానే యాప్‌లో మొదట విద్యార్థి నేర్చుకునే స్థాయిని తెలుసుకుంటారు. అందుకనుగుణంగానే ముందుకెళ్తారు.
అయితే మెజార్టీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అటువంటప్పుడు ఈ కోవిడ్-19 అనంతర పరిణామాల్లో కేవలం ఒక మొబైల్ అప్లికేషన్ సాయంతో విద్యార్థులందర్నీ చేరడం సాధ్యమవుతుందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
అందుకే రితీష్, అతని బృందం టీవీ ఫార్మెట్లను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వాటిని ప్రసారం చేస్తున్నాయి కూడా.
“ఏప్రిల్ 20 నుంచి డీడీ బిహార్, డీడీ జార్ఖండ్ ఛానెళ్లలో 9నుంచి 12వ తరగతి పిల్లలకు తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల నుంచి స్పందన చాలా బాగా వచ్చింది. అందుకే ఇప్పుడు మేం మాధ్యమిక తరగతుల కోసం పాఠాలను సిద్ధం చేస్తున్నాం. రాజస్థాన్ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తున్నాం. అక్కడ 6నుంచి 12వ తరగతి వరకు చదవివే విద్యార్థులకోసం ఇటీవలే తరగతులు ప్రారంభించాం” అని రితీష్ చెప్పారు.
అయితే పిల్లలు టీవీ సెట్ల ముందు కూర్చొని పాఠాలు వినడంలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవం. వారికి టీవీ అందుబాటులో ఉండాలి. వారు చూసి నేర్చుకునేందుకు అనువైన వాతావరణం ఇంట్లో ఉండాలి. అన్నింటికీ మించి పిల్లలు టీవీల్లో వచ్చే పాఠాన్ని ఏకాగ్రతతో వినాలి.. ఇవన్నీ సమస్యలే.
“మున్ముందు వాట్సాప్ ద్వారా పిల్లలకు స్టడీ మెటీరియల్ పంపాలన్నదే మా తదుపరి వ్యూహం. అయితే ఈ విధానం ద్వారా కేవలం 30శాతం విద్యార్థులను మాత్రమే చేరుకోగలం” అని గుజరాత్‌లోని చికోదర గ్రామంలోని బాలికల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఛాయా బెన్ చెప్పారు.
“మొత్తం 380 అమ్మాయిలు మా పాఠశాలలో చదువుతున్నారు. వాళ్లంతా వెనుకబడ్డ కుటుంబాల నుంచి వచ్చిన వారే. వాళ్ల తల్లిదండ్రుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. అంతేకాదు పిల్లల చదువు గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరు కూడా. వాళ్లంతా సమాజానికి దూరంగా నివసిస్తున్నారు. ఓ రకంగా ఈ మహమ్మారి కారణంగా వారు కేవలం ఈ విద్యా సంవత్సరాన్నే కాదు భవిష్యత్తు అవకాశాలను కూడా కోల్పోయినట్టే” అని ఛాయా చెప్పుకొచ్చారు.

అవసరమైన విద్యే నేర్పాలి
24 ఏళ్ల ఆనంద్ ప్రధాన్ దేశంలోని యువ విద్యావేత్త. తన సొంత రాష్ట్రమైన ఒడిషాలో గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ స్థాపించారు. కోవిడ్19 తరువాత దేశంలోని అన్ని పాఠశాలలు వాటికవి సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఆన్ లైన్ విద్యావిధానం అన్నది వాస్తవం. ఇప్పటికే మొదలయ్యింది కూడా. ఇప్పుడు విద్యార్థుల జీవితాల్లో అదనపు విలువలను ఎలా జోడించాలన్న విషయాన్ని పాఠశాలలు ఆలోచించాల్సి ఉంటుంది” అని అన్నారు.
ఆనంద్ నిర్వహిస్తున్న పాఠశాలలో నైపుణ్యాల వృద్ధి, వినూత్నంగా ఆలోచించడం అన్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం, వ్యాపార నిర్వహణ, డిజైన్ థింకింగ్ వంటి విషయాల్లో విద్యార్థి అనుభవపూర్వక జ్ఞానం సంపాదించాలి. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడటానికి బదులు ఉద్యోగాలు సష్టించే స్థాయికి తీసుకొచ్చేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు అన్నది ఆనంద్ నమ్మకం.
“మేం నైపుణ్యాలు కల్గిన వ్యక్తులుగా తయారు చేయడంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాం. అంటే వాళ్లే సమస్యను గుర్తించి సమస్యతో పాటు ప్రయాణించి వారంతట వారే దానికి పరిష్కారం కనుగొనడం అన్నమాట” అని ఆనంద్ చెప్పారు.
అయితే పాఠ్యపుస్తకాల చదువులతో పాటు పాఠ్యేతర అంశాలపై కూడా పాఠశాలలు అదే ప్రాధ్యాన్యతను ఇస్తాయా .. అన్నది పెద్ద ప్రశ్న. విద్యార్థులు కళలు, నాట్యం, క్రీడలు వంటి విషయాలను నేర్చుకోవడంలో మనం పెద్ద మార్పును చూడవచ్చు. ఇకపై పాఠశాల మైదానాల్లో చాలా కొద్ది మంది అది కూడా భౌతిక దూరం పాటిస్తూ, ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని సోలో స్పోర్ట్స్ సాధన చేయబోయే దృశ్యాలను మనం చూడవచ్చు.
హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన బిజేంద్ర హుడా వంటి విద్యాశాఖాధికారుల కృషి వల్ల మనం భవిష్యత్ విద్యా విధానంలో మరో దృశ్యాన్ని కూడా చూడబోతున్నాం. రోహ్‌తక్ జిల్లాలోని మెహమ్ బ్లాకులో బ్లాక్ లెవెల్ అధికారిగా పని చేస్తున్న బిజేంద్ర ఈ డిజిటల్ డివైడ్‌ను అరికట్టేందుకు తన ఉపాధ్యాయుల్ని వినియోగించుకుంటున్నారు.
“మేం విద్యార్థుల్నివాట్సాప్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. వాళ్లకు వీడియో, ఆడియో తరగతుల్ని పంపిస్తున్నాం” అని బిజేంద్ర చెప్పారు.
చాలా మంది పిల్లలు పేద కుటూంబాల నుంచి వచ్చారు. వాళ్ల ఇంట్లో ఫోన్‌లు ఉంటున్నాయి కూడా. అయితే చాలా మంది తల్లిదండ్రులు పనికి వెళ్లేసమయంలో ఫోన్ కూడా తీసుకెళ్లిపోతున్నారు. దీంతో వాళ్లు సాయంత్రం వేళల్లో మాత్రమే ఆన్ లైన్ తరగతుల్ని వినగల్గుతున్నారు. చూడగల్గుతున్నారు అని బిజేంద్ర ఈ విధానంలో ఎదురవుతున్న సమస్యల్ని వివరించారు.
“వాళ్ల సందేహాలను తీర్చేందుకు పొద్దుపోయేంత వరకు మేం పని చేస్తునే ఉంటున్నాం. మా ఉపాధ్యాయులు కూడా ఆడియో, వీడియో వ్యవస్థల్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటున్నారు. దీని వల్ల అలసట, విసుగు రెండూ ఎక్కువవుతున్నాయి. కానీ మరో దారి లేదు ఏం చేస్తాం” అని బిజేంద్ర తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాల పౌడరు, వంట సామానులు ఇచ్చే సమయంలో వాళ్లు ఆన్ లైన్ తరగతులకు ఎలా అలవాటు పడుతున్నారో సర్వే చేశారు బిజేంద్ర టీం.
“ఒక వేళ ఎవరైనా విద్యార్థి అనివార్య కారణాల వల్ల డిజిటల్ తరగతులకు హాజరు కాలేకపోతే వారికి మరో విద్యార్థి ద్వారా నోట్సయినా అందేలా చూస్తున్నాం. అయితే ఇప్పటికీ విద్యార్థి వ్యక్తిగత పర్యవేక్షణ అన్నది సవాలుతో కూడుకున్నదే” అని బిజేంద్ర చెప్పారు.
కోవిడ్-19 అనంతర పరిణామాల్లో చిన్న స్కూలైనా , పెద్ద స్కూలైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం పెద్ద సవాలుగానే నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా విద్యా వ్యవస్థలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. అయితే దీర్ఘ కాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.
రేఖా చిత్రాలు- పునీత్ కుమార్

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- అమ్మకానికి చే గువేరా పుట్టిన ప్రదేశం
- ఫెయిర్ అండ్ లవ్లీపై వివాదం.. పేరు మారుస్తామన్న యూనిలీవర్
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.. వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి
- ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్న బెలూన్లు
- పౌరసత్వ చట్టంలో మార్పులు చేసిన నేపాల్.. ‘భారత్‌తో సంబంధాలను దెబ్బతీసేందుకే’
- ఛత్తీస్‌గఢ్: ఆవు పేడ సేకరణకు కొత్త పథకం ప్రవేశపెట్టిన సీఎం
- భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ తాజా శాటిలైట్ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









