భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ తాజా శాటిలైట్ ఫొటోలు ఏం చెబుతున్నాయి?

లేహ్ సమీపంలోని ఈ చిత్రంలో కనిపిస్తున్నది భారత సైనికులు

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA

ఫొటో క్యాప్షన్, లేహ్ సమీపంలోని ఈ చిత్రంలో కనిపిస్తున్నది భారత సైనికులు

భారత్‌లోని అన్ని ప్రముఖ వార్తాపత్రికలు ఈరోజు ఒక వార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి. అది భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు సంబంధించిన వార్త.

ఆ వార్తల్లో లద్దాఖ్ సరిహద్దుల్లో గల్వాన్ లోయలో 2020 జూన్ 22న తీసిన శాటిలైట్ ఫొటోల గురించి అవి ప్రస్తావించాయి. జూన్ 15-16న రాత్రి గల్వాన్ లోయలో రెండు సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ సైన్యం కనిపిస్తోందని ఈ ఫొటోల ఆధారంగా అవి చెబుతున్నాయి.

ఇంగ్లిష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా “శాటిలైట్ ఇమేజ్‌లు ఘర్షణ జరిగిన ప్రాంతంలో పీఎల్ఏ క్యాంపులు వేసినట్లు చెబుతున్నాయి” అని శీర్షిక పెట్టింది. అయితే పత్రిక ఆ వార్తతోపాటూ ఎలాంటి శాటిలైట్ ఫొటోలు పెట్టలేదు.

హిందుస్తాన్ టైమ్స్ “ఎవరూ వెనక్కు తగ్గలేదనడానికి శాటిలైట్ ఫొటోలే సంకేతం” అని చెప్పింది. ఈ పత్రిక ఈ వార్తను బాక్స్ వేసి ప్రింట్ చేసింది.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక “శాటిలైట్ ఫొటోల్లో గల్వాన్‌లో చైనా సైన్యం కనిపిస్తోంది” అని శీర్షిక పెట్టింది. చిన్నాపెద్ద హిందీ పత్రికలు, టీవీ చానళ్లు కూడా దాదాపు అలాంటి వార్తలనే చెప్పాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కూడా ఆ శాటిలైట్ ఫొటోలను ట్వీట్ చేసింది.

ఈ శాటిలైట్ ఫొటోలను మాక్సర్ టెక్నాలజీతో తీశారు. ఈ ఫొటోలు నిజమైనవే అని బీబీసీ ధ్రువీకరించడం లేదు.

లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సంజయ్ కులకర్ణి
ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సంజయ్ కులకర్ణి

కానీ, భారత్, చైనా మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదాన్ని బట్టి చూస్తే, ఇవి చాలా కీలకమైనవి. అందుకే, మేం ఈ ఫొటోల నిజానిజాల గురించి తెలుసుకోడానికి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణితో మాట్లాడాం.

లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సంజయ్ కులకర్ణి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దగ్గర 1982 నుంచి 1984 వరకూ విధుల్లో ఉన్నారు. తర్వాత 2013 నుంచి 2014 వరకూ ఆయన ఇండియన్ ఆర్మీ 14 కోర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేసారు. 2014 నుంచి 2016 వరకూ ఆర్మీ పదాతిదళంలో డీజీ పదవిలో కూడా ఉన్నారు.

రెండు దేశాల సరిహద్దుల్లో ఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయో, అదే ప్రాంతంలో ఆయన చాలా కాలం ఉన్నారు. దాని గురించి ఆయనకు బాగా తెలుసు.

ఈ ఫొటోలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల గురించి బీబీసీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానాలు ఇచ్చారో, ఆయన మాటల్లోనే...

తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గల్వాన్ లోయ - మాక్సర్ చిత్రం

ఫొటో సోర్స్, MAXAR TECHNOLOGIES/REUTERS

ఫొటో క్యాప్షన్, తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గల్వాన్ లోయ - మాక్సర్ చిత్రం

1.ఇలాంటి శాటిలైట్ ఫొటోల్లో ఎంతవరకూ నిజం ఉంటుంది?

ఇలాంటి శాటిలైట్ ఫొటోల గురించి సరిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే మొదట ఆ ఫొటోలు ఎంత ఎత్తు నుంచి తీశారు. ఎంత దూరం నుంచి తీశారు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఫొటోలు మీకు అక్కడ ఎంత భయంకరంగా కనిపిస్తోందో, సరిహద్దుల దగ్గర అలా లేదు. ఇది ఆందోళనకరమైన విషయం. కానీ, సరిహద్దుల్లో రెండు వైపులా భారత్ వైపు, చైనా వైపు ఉంటారు.

ఇలాంటి ఫొటోలు తీసేవారు చాలాసార్లు పొరపాట్లు చేస్తారు. వాటి వల్ల సైనికులు గుమిగూడినట్లు కనిపిస్తున్న ప్రాంతంలో ఉన్నది నిజానికి చైనా సైనికులా, భారత సైనికులా అనేది కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.

అది ఎందుకు కష్టం అంటే, ఎల్ఏసీ లైన్ అనేది ఒక పర్సెప్షన్. రెండు వైపులా తమ తమ వాదనలు ఉన్నాయి. అందుకే నాకు తెలిసి శాటిలైట్ ఫొటోలు ఒక పరిమితి వరకూ సరిగానే ఉంటాయి. కానీ పూర్తిగా సరిగా ఉండవు. వాటిని సరిగా పరిశీలించడం రాకపోతే అది సమస్య కావచ్చు.

2.మాక్సర్ టెక్నాలజీతో తీసిన శాటిలైట్ ఫొటోలు నిన్న(బుధవారం) జారీ చేశారు. వాటిని చూసి జూన్ 15న హింసాత్మక ఘర్షణలు జరిగినచోట, చైనా సైన్యం ఇప్పటికీ ఉందని మనం చెప్పవచ్చా?

కచ్చితంగా చెప్పచ్చు. గల్వాన్ లోయ పెట్రోలింగ్ సైట్ 14 దగ్గర కాస్త కన్ఫ్యూజన్ రావచ్చు. కానీ దానికి మరోవైపు ఉన్న హైవే జీ-219 ప్రాంతం, అక్కడ చైనా సైన్యం గుమిగూడి ఉండడం మనం చూడచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇమేజ్ కచ్చితంగా నిజమే అనిపిస్తోంది. 2500 కిలోమీటర్ల ఈ హైవే లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో ఉంది. ఇందులో 180 కిలోమీటర్లు అక్సాయి చీన్ నుంచి వెళ్తుంది. ఎల్ఏసీ నుంచి ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ కూడా ఈ ప్రాంతంలో మనం ఎంత చేయగలమో అంత బిల్డప్ చేసింది.

లేహ్

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA

ఫొటో క్యాప్షన్, లేహ్ ప్రాంతం

3.మిలిటరీ ఆపరేషన్‌లో సైన్యం ఇలాంటి ఫొటోలను ఉపయోగిస్తాయా?

సాధారణంగా ఇలాంటి ఫొటోలు వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న సైన్యం వరకూ చేరవు. కానీ కమాండ్ స్థాయిలో ఇలాంటి సమాచారాన్ని కచ్చితంగా షేర్ చేస్తారు. తరచూ పై అధికారి( మంత్రిత్వ శాఖ నుంచి బ్రిగేడియర్ వరకూ) ఈ సమాచారం జారీ చేస్తారు. ఈ ఫొటోలు వారి వరకే వెళ్తాయి. వాటిని బట్టి ఒక వ్యూహం సిద్ధం చేస్తారు.

తర్వాత సరిహద్దులో ఉన్న సైనికులతో వారు, ఆ ప్లాన్ షేర్ చేసుకుంటారు. గ్రౌండ్ లెవల్లో సైనికులు తమ దగ్గర ఉన్న ఆయుధాలు, బైనాకులర్స్ ద్వారా ఏం చూడగలరో అది మాత్రమే చూస్తారు. ప్రతి ప్రభుత్వం దగ్గర ఇలాంటి ఫొటోలు తీయడానికి తమదైన యంత్రాంగం ఉంటుంది.

4.ఈ ఫొటోల ద్వారా భారత-చైనా గల్వాన్ సరిహద్దులో డీ-ఎక్సలేషన్(ఉద్రిక్తతలు తగ్గినట్లు) ఇంకా జరగలేదని తెలుసుకోవచ్చా?

మనం ముందు డిస్‌ఎంగేజ్‌మెంట్ అయితేనే డి-ఎస్కలేషన్ జరుగుతుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. డిస్‌ఎంగేజ్‌మెంట్ అంటే సైన్యం పరస్పరం ఎదురెదురుగా లేకపోవడం, అప్పుడే ఉద్రిక్తతలు తగ్గుతాయి. ఈ తాజా ఫొటోలను చూస్తుంటే రెండు సైన్యాల మధ్య దూరం ఉన్నట్లు అనిపిస్తోంది.

కానీ ఈ ఫొటోలను అంతకు ముందు ఫొటోలతో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఒక నెల క్రితం అదే ప్రాంతంలో తీసిన ఫొటోలు ఎలా కనిపిస్తున్నాయి అనేది కూడా చూడాలి. కొన్ని శాటిలైట్లు 15 రోజులకు ఫొటోలు తీస్తే, కొన్ని 21 రోజులకు తీస్తుంటాయి. ఆ రెండు సమయాల్లో గ్రౌండ్‌లో ఎంత తేడా కనిపిస్తోంది అనేది ఆ తర్వాతే తెలుస్తుంది. అంటే, మొదట ఎన్ని టెంట్లు కనిపించాయి. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి. మొదట అక్కడ ఎన్ని వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నున్నాయి. అనేది చూడాలి. అప్పుడే వాస్తవ స్థితి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Yawar Nazir

5.శాటిలైట్ ఇమేజ్ ద్వారా జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన ప్రాంతంలో నిర్మాణ పనులు జరిగాయా, లేదా అనేది తెలుసుకోవచ్చా?

తెలుసుకోవచ్చు. కానీ అందులో రెండు సమస్యలు ఉన్నాయి. మొదట శాటిలైట్ ఇమేజ్‌ను పరిశీలించేవారు నిపుణులై ఉండాలి. లేదంటే పొరపాట్లు జరగచ్చు. ఇంకో విషయం ఏంటంటే చైనా భారత్‌ను మోసం చేస్తూ ఉండచ్చు. అట్టలతో వాహనాలు చేస్తుండచ్చు. ఫొటోల్లో నీడ మాత్రమే కనిపిస్తూ ఉండచ్చు. శాటిలైట్ ఫొటోలను సరిగా పరిశీలించే వారు లేకపోతే, ప్రతి నీడను వాహనాలని, గుడారాలని అనుకోవచ్చు.

లద్దాఖ్ ఎత్తున ఉన్న ఎడారి లాంటి ప్రాంతం. అక్కడ పెద్దగా మొక్కలు, చెట్లు ఉండవు. నది, పర్వతాలు ఉంటాయి. అందుకే అక్కడ నీడలే ఉంటాయి. ఒక దేశం ఆర్మీ ఎలాంటి గుడారాలు వేస్తుంది, వారి బంకర్లు ఎలా ఉంటాయి, వాహనాలను ఎలా మోహరిస్తుంది అనేది ఆ ఫొటోలను సరిగా పరిశీలించేవారికి మాత్రమే బాగా తెలుస్తుంది. వాటన్నిటిని చూసి అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయా, లేదా అనే విషయం మనం సులభంగా తెలుసుకోవచ్చు. దానికి శాటిలైట్ ఫొటోల రిజల్యూషన్ కూడా చాలా కీలకం. ప్రస్తుతం టీవీ చానళ్లు, పత్రికల్లో చూపిస్తున్న ఫొటోలను చూసి మనం స్పష్టంగా ఏదీ చెప్పలేం. ప్రస్తుతానికి వీటి ద్వారా హైవే జీ-219 దగ్గర చైనా సైన్యం ఉందని మాత్రమే తెలుస్తోంది.

6.ఒక వైపు శాటిలైట్ ఫొటోలు చూస్తూనే, రెండు దేశాలు చర్చల టేబుల్ దగ్గర కూర్చుంటున్నాయి. ఇలా రెండూ ఒకేసారి సాధ్యమేనంటారా?

చర్చలు జరుగుతున్నాయి. అవి జరుగుతూనే ఉండాలి. చైనా చర్చలకు సిద్ధంగా ఉన్నా, లేకున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం పూర్తి సన్నాహాలతో ఉండాలి. చర్చలు విఫలమవుతాయనే అనుకుంటూ, అలాంటి సమయంలో ఏ ప్రత్యామ్నాయాలు మిగులుతాయో ఆ అవకాశం కోసం ఏ దేశమైనా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి చైనా ప్రస్తుతం చర్చల టేబుల్ దగ్గర మరింత టైం బై(సమయం కోరే) వ్యూహాన్ని అనుసరిస్తోంది. అంతకు మించి వారు వేరే ఏదైనా చేస్తారని నాకైతే కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)