భారత్ - చైనా సరిహద్దు వివాదం: చైనా నుంచి మందులు దిగుమతి చేసుకోకుండా భారత్‌ ఉండగలదా?

చైనా మందులు

ఫొటో సోర్స్, EPA / SANJAY BAID

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు లాంటి వ్యాధులకు ఏవైనా మందులు వాడుతున్నారా?

మీకు తెలిసిన ఎవరికైనా కొలెస్ట్రాల్ పెరిగిందని డాక్టర్ కొన్ని వారాల మందుల కోర్స్ ఇచ్చారా? ఎందుకంటే అది పెరిగితే గుండెకు మంచిది కాదు.

మనలో చాలామంది జలుబు, దగ్గు లేదా జ్వరం వస్తే పారాసిటమాల్ కచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు వైరల్ లేదా ఇన్ఫెక్షన్ ఉంటే, డాక్టర్లు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తుంటారు.

ఇంట్లో, బంధువుల్లో, పక్కింట్లో లేదా ఆఫీసులో ఎవరికైనా కాన్సర్ ఉంటే దాని చికిత్స కోసం వారు కీమోథెరపీ సాయం తీసుకుంటూ ఉండచ్చు.

పై వాటిలో దేనికైనా అవును అనే సమాధానం వస్తే, వాటిలో ఎన్నో రకాల మందుల తయారీ కోసం భారత్‌తో పొరుగుదేశం చైనా నుంచి చాలా లోతైన భాగస్వామ్యం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ - చైనా వివాదం

పరస్పరం సన్నిహత వ్యాపార సంబంధాలు ఉన్న రెండు దేశాల్లో ఇటీవల ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడడంతో ఈ విషయాలను పరిశీలించాల్సి వచ్చింది.

గత కొన్ని వారాలుగా లద్దాఖ్ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దు - వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) దగ్గర ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగాయి. చివరికి గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతిచెందగా, మరో 76 మంది గాయపడ్డారు.

చైనా నుంచి మృతులు, గాయపడ్డ జవాన్ల గురించి పూర్తి సమాచారంతో అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఎల్ఏసీ దగ్గర 45 ఏళ్ల తర్వాత మరో దేశానికి చెందిన సైనికుల చేతుల్లో భారత సైనికులు చనిపోవడం కూడా ఈ ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.

భారత్‌లో చైనాను నిందించడంతో పాటూ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్లు కూడా పెరిగాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అలాంటి నిర్ణయం గురించి మాట్లాడలేదు.

భారత రైల్వే, టెలికాం మంత్రిత్వ శాఖలు భవిష్యత్తులో కొన్ని దిగుమతులను నిలిపివేస్తామనే సంకేతాలు ఇచ్చాయి.

ఇటు, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాము బహిష్కరించే 500కు పైగా చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసింది.

భారత్‌లో చాలా నగరాల్లో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ప్రదర్శనలు కూడా జరిగాయి.

ఔషధాలు

ఫొటో సోర్స్, Getty Images

చైనా మందులు భారత్‌లో

గత రెండు దశాబ్దాల్లో భారత్, చైనా మధ్య వాణిజ్యం 30 రెట్లు పెరిగింది. అంటే 2001లో మొత్తం వాణిజ్యం 300 కోట్ల డాలర్లు ఉంటే అది 2019కి 9,000 కోట్ల డాలర్లకు చేరింది.

ఈ వాణిజ్యంలో వేగంగా పెరిగిన చైనా వస్తువుల్లో మందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో మందుల దిగుమతిలో 28 శాతం వృద్ధి నమోదైంది.

భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-20లో భారత్ చైనా నుంచి 1,150 కోట్ల రూపాయల ఫార్మా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఆ సమయంలో చైనా నుంచి భారత్ వచ్చిన దిగుమతుల మొత్తం విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలు.

మందుల విషయానికి వస్తే, జెనెరిక్ మందులు తయారీ, వాటి ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2019లో భారత్ 201 దేశాలకు జెనెరిక్ మందులు విక్రయించి, వందల కోట్లు సంపాదించింది.

కానీ భారత్ ఈ మందులు తయారు చేయాలంటే, ఇప్పటికీ చైనాపై ఆధారపడి ఉంది. భారత్ మందుల ఉత్పత్తికి చైనా నుంచి యాక్టివ్ ఫార్మసూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ (ఏపీఐ) దిగుమతి చేసుకుంటుంది. మందులు తయారీకి ఉపయోగించే ఈ ముడి సరుకులను బల్క్ డ్రగ్స్ అని కూడా అంటారు.

మందులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో మందులు తయారీ కోసం దిగుమతి చేసుకునే మొత్తం బల్క్ డ్రగ్స్ లేదా ముడి సరుకుల్లో 70 శాతం చైనా నుంచే వస్తాయని ఆ పరిశ్రమకు చెందిన నిపుణలు చెబుతున్నారు.

చైనా ఎగుమతుల స్ట్రాటజీపై ‘కాంపిటీటివ్ స్టడీస్: లైసెన్స్ ఫ్రం చైనా’ పేరుతో పుస్తకం రాసిన గుజరాత్ ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జయమన్ వాసా “చైనా నుంచి దిగుమతులు లేకపోతే, మనకు ఇబ్బంది ఉండవచ్చు, అనే వాస్తవాన్ని అంగీకరించాలి” అన్నారు.

“భారత ప్రభుత్వం వీలైనన్ని ఫార్మా పార్కులు లేదా జోన్లు తయారుచేసేవరకూ చైనాతో పోటీపడడం చాలా కష్టం. ఎందుకంటే వారి పరిశోధన చాలా దృఢంగా ఉంటుంది. దానికి సమానం కావడానికి మనకు చాలా ఏళ్లు పడుతుంది” అని ఆయన అన్నారు.

నిజానికి భారత్‌లో ఏపీఐ ఉత్పత్తి చాలా తక్కువ. భారత్‌లో తయారయ్యే ఏపీఐ పైనల్ ప్రొడక్ట్ తయారీకి కూడా కొన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు.

అంటే ఏపీఐ లేదా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి కోసం భారత కంపెనీలు చైనాపై ఆధారపడి ఉన్నాయి.

“చైనా నుంచి బల్క్ డ్రగ్ (ఏపీఐ) దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం, దాని ధర తక్కువ. అక్కడ నుంచి వచ్చే బల్క్ డ్రగ్ ధర మిగతా దేశాలతో (భారత్ సహా) పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువ ఉంటుంది. యాంటీబయాటిక్ లేదా కాన్సర్ చికిత్స మందుల విషయంలో కూడా భారత్ చైనాపై ఆధారపడి ఉంది” అని అంతర్జాతీయ ఫార్మా అలయన్స్ సలహాదారు, జైడస్ కాడిలా డ్రగ్ కంపెనీ మాజీ మానుఫాక్చరింగ్ చీఫ్ ఎస్‌జీ బెలాపూర్ చెప్పారు.

అంటే డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, థైరాయిడ్, ఆర్థరైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్ల మందుల తయారీ ముడి సరుకు, సర్జికల్ పరికరాలు, వైద్య పరికరాలు అన్నీ చూస్తే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తుల జాబితా చాలా పెద్దది.

భారత్‌లో పెన్సిలిన్, అజిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఉత్పత్తిలో ఉపయోగించే 80 శాతం బల్క్ డ్రగ్ లేదా ముడి సరుకులు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

నౌకాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

తయారీలో విద్యుత్ పాత్ర

చైనా మందుల ఎగుమతిదారులను కలిసే డ్రగ్ రీసెర్చ్ మానుఫాక్చరింగ్ నిపుణులు డాక్టర్ అనురాగ్ హితకారీ “ప్రధానంగా మందుల ధరలను పోటీగా ఉంచడం కోసమే, చైనా నుంచి బల్క్ డ్రగ్స్ లేదా ముడి సరుకుల దిగుమతి చేసుకుంటున్నారు” అని చెప్పారు..

“ఏపీఐ లేదా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో విద్యుత్ చాలా కీలకం అవుతుంది. ఇటీవల కొంత కాలం వరకూ చైనాలో విద్యుత్ ధర భారత్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. దానివల్ల మొత్తం వ్యయం తగ్గేది. చైనా ఫార్మా ఇండస్ట్రీ ఆ దేశంలోని యూనివర్సిటీల్లో నిరంతరం జరిగే పరిశోధనలకు అనుసంధానమై ఉంటుంది. మందుల తయారీకి వాటిని వెన్నెములా భావిస్తారు. ఏదైనా కొత్త రీసెర్చ్ జరగ్గానే, దానిని ఉత్పత్తిగా ఉపయోగించుకునే నైపుణ్యం వారి సొంతం” అన్నారు.

“చైనాలోని జెజియాంగ్, గ్వాంగ్‌డాంగ్, షాంఘై, జియాంగ్సూ, హెబెయీ, నింగ్షియా, హార్బిన్ లాంటి కొన్ని ప్రాంతాల నుంచి ఈ బల్క్ డ్రగ్స్ భారత్‌కు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి నుంచి ఈ ముడి సరుకులు బీజింగ్, షాంఘై లేదా హాంకాంగ్ రేవుల ద్వారా భారత్ చేరుతుంది” అని డాక్టర్ అనురాగ్ చెప్పారు.

ఇక చైనా నుంచి వచ్చే చౌక బల్క్ డ్రగ్స్, వాటి క్వాలిటీ విషయానికి వస్తే, జైడస్ డిలా డ్రగ్ కంపెనీ మాజీ మానుఫాక్చరింగ్ చీఫ్ ఎస్‌జీ బేలాపూర్ “మొదట్లో ఎలాంటి సమస్యా ఉండేది కాదు, కానీ ఇప్పుడు భారత కొనుగోలుదారులు వెండర్స్ ఎవరు అనేదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది” అన్నారు.

“ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుడప్పుడు ముడి సరుకు నాణ్యత చాలా ఘోరంగా కూడా ఉండచ్చు అని ఆయన చప్పారు.

చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పట్ల భారత్‌లో వ్యతిరేకత రావడం ఇది మొదటిసారి కాదు. 2017లో కూడా ఇరు దేశాల సైనికుల మధ్య డోక్లాంలో పెద్ద గొడవే జరిగింది. తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా చైనాపై ఇలాంటి ఆంక్షలు విధించాలనే వాదన వినిపించింది.

భారత ఫార్మా పరిశ్రమ నుంచి కూడా ఇలాంటి స్వరమే వినిపిస్తోంది. దేశంలో యాక్టివ్ ఫార్మసూటికల్స్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐ) స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అది భావిస్తోంది. కానీ చైనా నుంచి దిగుమతులు ఏమాత్రం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.

చైనా మందులు

ఫొటో సోర్స్, REUTERS / CHINA DAILY

2019లో చైనా వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాపించి, లాక్‌డౌన్ వార్తలు రాగానే, భారత ఫార్మా రంగంలో కూడా కలకలం రేగింది. ఎందుకంటే బల్క్ డ్రగ్స్ లేదా ముడి సరుకు దిగుమతి లేకుండా జెనెరిక్ మందుల ఉత్పత్తి అసాధ్యం.

దీని గురించి గుజరాత్ ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జయమన్ వాసా స్పష్టంగా చెప్పారు.

“కోవిడ్-19 లాంటి కష్ట కాలం భారత ఫార్మా రంగానికి ఒక పెద్ద అవకాశం అనడంలో నేను ఎలాంటి తప్పు లేదంటాను. ఇక మందుల విషయానికి వస్తే మనం చైనాపై ఆధారపడి పనిచేయాలి. దానికి ప్రభుత్వం సాయం కూడా అవసరం” అన్నారు.

భారత్ బల్క్ డ్రగ్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించడానికి సుదీర్ఘ కాలం పడితే, అప్పటివరకూ మనకు చైనా కాకుండా వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది.

“ఒకవేళ భారత్ ఫార్మా రంగంలో చైనా నుంచి దిగుమతులు తగ్గించాలని భావిస్తే, మనం స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, కొన్ని దక్షిణ అమెరికా దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు, వాటి ఖరీదు ఎక్కువ కాబట్టి, మందుల ధరలు కూడా పెరుగుతాయి” అని అంతర్జాతీయ ఫార్మా అలయన్స్ సలహాదారు ఎస్‌జి బేలాపూర్ చెప్పారు.

భారత్‌లో యాక్టివ్ ఫార్మసూటికల్స్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐ) అంటే బల్క్ డ్రగ్స్ గతం, భవిష్యత్తు గురించి మాట్లాడిన డ్రగ్ రీసెర్చ్ మానుఫ్యాక్చరింగ్ నిపుణులు డాక్టర్ అనురాగ్ హితకారీ “భారత్‌లో కాలుష్యానికి సంబంధించి క్లియరెన్సులు చాలా స్థాయిల్లో తీసుకోవాల్సి వచ్చేది. వాటిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పర్యావరణ శాఖ, అన్నిటి దగ్గరకూ వెళ్లాల్సి వచ్చేది”.

“దాంతో, ముడి సరుకు లేదా బల్క్ డ్రగ్ తయారీ గురించి ఆలోచించే చిన్న పరిశ్రమలు ఈ కఠిన ప్రక్రియకు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఎందుకంటే పొల్యూషన్ క్లియరెన్స్ తీసుకునే ప్రక్రియలో తగిన సవరణలు వచ్చాయి” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)