కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తారేంద్ర కిశోర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 188 దేశాల్లో కరోనావైరస్ వ్యాపించింది. న్యూజీలాండ్, ఫిజీ లాంటి కొన్ని దేశాలు తాము కరోనా వైరస్ నుంచి విముక్తి పొందామని ప్రకటించాయి. కానీ న్యూజీలాండ్‌లో గత బుధవారం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
న్యూజీలాండ్‌లో 24 రోజుల తర్వాత ఈ కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఆ దేశం జూన్ 8న కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించింది. అంటే, అప్పటికి 17 రోజులుగా కొత్త కేసులేవీ బయటపడలేదు. అదే రోజు చివరి రోగి కూడా పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు
న్యూజీలాండ్ ఆరోగ్య శాఖ కొత్తగా రెండు పాజిటివ్ కేసులు ధ్రువీకరించారని చెప్పింది. వారిద్దరూ బ్రిటన్ నుంచి తిరిగి వచ్చారని, ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే అన చెప్పింది.
న్యూజీలాండ్ గత వారం కరోనా నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేసింది. కానీ అంతర్జాతీయ విమాన సేవలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.
ప్రధాని జెసిండా ఆర్డర్న్ కరోనా నుంచి విముక్తి పొందామని ప్రకటిస్తూ, దేశంలో మళ్లీ కేసులు బయటపడవచ్చని హెచ్చరించారు.
ఫిజీ కూడా జూన్ 5న తాము కరోనా నుంచి విముక్తి పొందామని ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ దేశ ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా తన ట్వీట్‌లో “ఫిజీ తన చివరి కరోనా రోగిని డిశ్చార్జ్ చేసింది. మా పరీక్షల సంఖ్య పెరిగింది. చివరి పాజిటివ్ కేసు బయటపడి 45 రోజులు అవుతోంది. ఎవరూ చనిపోలేదు. మా రికవరీ రేట్ 100 శాతం ఉంది. ఆశీస్సులు, శ్రమ, సైన్స్ సాయం వల్లే ఇది సాధించాం” అన్నారు.
న్యూజీలాండ్ , ఫిజీతో పాటూ ఇంకా ఎన్నో దేశాలు తాము కరోనా రహితం అని ప్రకటించాయి. వీటిలో సిషెల్స్, వాటికన్ సిటీ, టాంజానియా, మోంటెనెగ్రో లాంటి చాలా దేశాలు ఉన్నాయి.
ఇవన్నీ తమ దేశాల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదని, అంతకు ముందు నమోదైన కేసుల్లో చివరి రోగి కూడా కోలుకుని డిశ్చార్జ్ అవడంతో కరోనా నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించాయి.
కానీ న్యూజీలాండ్ 17 రోజుల వరకూ కొత్త కేసులు రాకపోవడంతో కరోనా విముక్తి చెందినట్లు ప్రకటిస్తే, ఫిజీ 45 రోజుల వరకూ కొత్త కేసు రాకపోవడంతో అదే ప్రకటన చేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తమకు తామే ఎలా నిర్ణయిస్తాయి?
మిగతా దేశాలు కూడా రకరకాల వ్యవధి తర్వాత కరోనా నుంచి విముక్తి పొందామని ప్రకటించాయి. ఏదైనా ఒక దేశం కరోనా నుంచి విముక్తి పొందినట్లు తమకు తాముగా ఎలా నిర్ణయిస్తాయి.
ఇదే ప్రశ్నను మేం జేఎన్‌యూ సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ చెయిర్ పర్సన్ డాక్టర్ సంఘమిత్ర ఆచార్యను అడిగాం.
ఆమె “ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ మొదట్లో ఎక్కడైనా 45 రోజుల వరకూ కరోనా కొత్త కేసులు ఎవీ నమోదు కాకపోతే, అక్కడ ఎలాంటి సింప్టమాటిక్ రోగి లేకపోతే, ఆ ప్రాంతాన్ని ‘కరోనా ఫ్రీ’గా ప్రకటించవచ్చని చెప్పింది. కానీ, ఇప్పుడు వివిధ దేశాలు ఈ వ్యవధిని తమకు తగినట్లు మార్చుకున్నాయి” అని చెప్పారు.
వివిధ దేశాలు ఈ ప్రమాణాలను ఎందుకు మార్చాయి
దీనిపై “ఏ దేశాల రికవరీ రేటు మెరుగ్గా ఉందో, అవి తమ దేశాల్లో ఆ 45 రోజుల వ్యవధిని తగ్గించుకున్నాయి. తమ రికవరీ రేట్ మెరుగ్గా ఉందని అవి ప్రపంచానికి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక కారణమే” అని సంఘమిత్ర అన్నారు.
అందుకే కొన్ని దేశాలు 15 రోజుల వ్యవధిని లెక్కించాయి. మరికొన్ని దేశాలు అంతకంటే తక్కువ రోజుల వ్యవధిలోనే తాము కరోనా నుంచి విమక్తి పొందినట్లు ప్రకటించాయి.
భారత్ కూడా ఈ వ్యవధిని తగ్గించింది. ఇప్పుడు దాదాపు రెండు వారాల వరకూ ఏదైనా ఒక ప్రాంతంలో కొత్త కేసులేవీ నమోదు కాకపోతే, ఆ ప్రాంతంలోని రోగులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయితే ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని కరోనా ఫ్రీగా ప్రకటిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా ఫ్రీ అని ప్రకటించడానికి అంత తొందర ఎందుకు?
దేశాలు తాము కరోనా నుంచి విముక్తి పొందామని ప్రకటించుకోవడానికి అంత తొందరెందుకు. దీనికి సంఘమిత్ర “ప్రతి దేశం తాము కరోనాను ఎంత సమర్థంగా నియంత్రించామో, ఓడించామో నిరూపించుకోవాలనే పనిలో ఉన్నాయి.
దానిని ఇమేజ్ బ్రాండింగ్‌తో కలిపి చూస్తున్నారు. ఇక్కడ ఆర్థికవ్యవస్థ కూడా ప్రశ్నార్థకం. ప్రతి దేశం వీలైనంత త్వరగా తమ ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించాలని చూస్తోంది.
అందుకు అది కరోనా నుంచి విముక్తి పొందామని ప్రకటించుకోవడం చాలా అవసరం. కానీ న్యూజీలాండ్ లాంటి దేశాలకు అది సాధ్యమే అయినా, టాంజానియా, లేదా భారత్ లాంటి దేశాలకు అదంత సులభం కాదు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో ఏంటి సమస్య?
“భారత్‌లోని ప్రతి రాష్ట్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. అందుకే ఇక్కడ ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతాన్ని కరోనా విముక్తి చెందిందని ప్రకటించడం కష్టం” అని సంఘమిత్ర చెప్పారు.
కేరళలో మొదట ఏ మూడు-నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు బయటపడ్డాయో, అక్కడ కొన్ని వారాలు, అంటే వలస కూలీలు ప్రయాణాలు మొదలయ్యేవరకూ విజయవంతంగా నియంత్రించగలిగారు. కానీ మహారాష్ట్రలో మొదటి నాలుగు వారాల్లోనే పుణె, ముంబయి, సాంగ్లీలో ఉన్న కరోనా కేసులు మరింత పెరిగి జిల్లాల వరకూ చేరుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో చాలారోజులవరకూ కరోనా కేసులు లేవు. కానీ, తక్కువ సంఖ్యే అయినా తర్వాత అక్కడకు కూడా కరోనా చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
సాంద్రత, జనాభాతో దీనికి సంబంధం ఏంటి?
ఇప్పటివరకూ ఏయే దేశాలు కరోనా నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకున్నాయో, అవన్నీ దాదాపు తక్కువ జనాబా, సాంధ్రత ఉన్న దేశాలు. న్యూజీలాండ్ మొత్తం జనాభా దాదాపు 50 లక్షలు. ఇక ఫీజీలో 9 లక్షలు, టాంజానియాలో ఐదు కోట్ల జనాభా ఉన్నారు.
జనాభా, జన సాంద్రత తక్కువగా ఉన్న దేశాలు, తమను కరోనా రహిత దేశాలుగా ప్రకటించుకోవడం చాలా సులభం.
దీనిపై డాక్టర్ సంఘమిత్ర ఆచార్య “జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో వ్యాప్తి రేటు కూడా ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అలా లేదు. ఉదాహరణకు ఇండోనేషియా, మలేషియా దేశాలను మనం చూడచ్చు. ఈ దేశాల్లో జనసాంద్రత ఎక్కువ, కానీ అక్కడ వ్యాప్తి రేటు, కరోనా మరణాలు చూస్తే, వాటికంటే తక్కువ జనసాందధ్రత ఉన్న కొన్ని దేశాల్లో ఉన్నంత కూడా లేదు” అన్నారు.
“వైరస్ వ్యాప్తి పాటర్న్ వివిధ దేశాల్లో రకరకాలుగా ఉంది. అమెరికాలో ఒక పాటర్న్ లో వైరస్ వ్యాపిస్తే, స్పెయిన్, ఇటలీలో మరో రకంగా వ్యాపించింది” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా విముక్తి దిశగా ఎలా ముందుకు వెళ్లవచ్చు?
కరోనాకు వ్యాక్సిన్, మందులు ఇంకా తయారుచేయలేదు. కానీ ప్రతి దేశం తమ దేశాల్లో వైరస్ వ్యాపించకుండా దానిని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
కరోనా నుంచి విముక్తి పొందే ఈ ప్రయత్నాలు ఎలా విజయవంతం అవుతాయి. దీనికి సంఘమిత్ర రెండు విషయాలు ప్రధానం అని చెప్పారు. ఒకటి టెస్టింగ్, రెండోది ట్రావెలింగ్.
“హాట్‌స్పాట్ చూసి అక్కడ మాత్రమే మొదటి నుంచీ పూర్తిగా లాక్‌డౌన్ పెడితే చాలావరకూ విజయవంతం అయ్యేవాళ్లం. మొదట కేరళలో ఆ పద్ధతి విజయవంతం కావడం మనం చూశాం. చైనా వుహాన్ ప్రాంతాన్ని దానికి ఉదాహరణగా చూడవచ్చు. వుహాన్ బయట అక్కడ ఇప్పటికీ కరోనా కనిపించలేదు. ఇప్పుడు బీజింగ్‌లో కొన్ని కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. కానీ అది చాలావరకూ వుహాన్ వరకే పరిమితమైంది. మొత్తం వుహాన్‌ను దిగ్బంధం చేయడం వల్లే వారు అలా చేయగలిగారు” అన్నారు.
“అందుకే, పూర్తిగా లాక్‌డౌన్ చేయకుండా హాట్‌స్పాట్లు గుర్తించి ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలి. పూర్తిగా లాక్‌డౌన్ చేయయడం వల్ల ఏం సాధించలేం. దాని బదులు ఆ ప్రాంతాల్లోని ప్రవాస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు లాంటి మిగతా సమస్యలు బయటికొచ్చాయి. దాంతోపాటూ సంఘటిత రంగంలో పనిచేసేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కాల్సి వచ్చింది”.
కరోనా రహితంగా ప్రకటించిన తర్వాత కూడా కరోనా కొత్త కేసులు బయటపడడం గురించి మాట్లాడిన సంఘమిత్ర ఆచార్య “పాజిటివ్ కేసులు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వైరస్‌ను ఒక దేశం ఎలా ఎదుర్కుంటోంది అనేది చూడడం చాలా ముఖ్యం. అన్నీ దానిపైనే ఆధాపడి ఉన్నాయి” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








