అమెరికా వీసా: హె‌చ్1బి సహా ఉద్యోగ వీసాలన్నీ 2020 చివరివరకూ బంద్ - ట్రంప్ ఆదేశం

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో గ్రీన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేయటంతో పాటు.. ఈ ఏడాది చివరి వరకూ విదేశీ ఉద్యోగులకు వీసాలను నిలిపివేస్తూ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు.

ఈ నిర్ణయం.. ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, నైపుణ్యాలు గల టెక్నాలజీ ఉద్యోగులు, వ్యవసాయేతర సీజనల్ సహాయకులు, ఇంట్లో ఉండి సంరక్షణ సేవలు అందించే వారి మీద ప్రభావం చూపుతుంది.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్లకు.. ఈ చర్య ద్వారా ఉద్యోగాలు లభిస్తాయని అధ్యక్ష భవనం శ్వేతసౌధం పేర్కొంది.

కానీ.. వలస చట్టాలను మరింత కఠినం చేయటానికి అధ్యక్ష భవనం కరోనావైరస్ మహమ్మారిని సాకుగా వాడుకుంటోందని విమర్శకులు అంటున్నారు.

అమెరికా వీసాలు

ఎవరిపై ప్రభావం చూపుతుంది?

ఈ ఏడాది చివరి వరకూ వీసాలను నిలిపివేయటం వల్ల 5,25,000 మందిపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ యంత్రాంగం విలేకరులకు వివరించింది.

విదేశీయులకు శాశ్వత నివాసానికి అనుమతినిచ్చే కొత్త గ్రీన్ కార్డులు కొన్నిటిని జారీచేయటం మీద నిషేధాన్ని పొడిగించటం సుమారు 1,70,000 మంది మీద ప్రభావం చూపుతుంది.

ఆ వీసాలను నిలిపివేస్తున్నట్లు అధ్యక్ష భవనం ఏప్రిల్‌లో ప్రకటించింది. ఆ ఉత్తర్వుల గడువు సోమవారంతో ముగిసిపోతుండటంతో ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా ప్రకటించిన ఆంక్షలు.. ఇప్పటికే వీసాలు ఉన్న వారి మీద ప్రభావం చూపబోవని భావిస్తున్నారు.

అమెరికా వీసా

ఫొటో సోర్స్, iStock

భారతీయ టెక్నాలజీ నిపుణులు, వారి కుటుంబాలకు జారీ చేసే హెచ్-1బి వీసాలకు కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. ఈ వీసాల వల్ల.. సిలికాన్ వ్యాలీ కంపెనీలు అమెరికా ఉద్యోగాలను తక్కువ వేతనాలు చెల్లిస్తూ విదేశీయులకు ఇవ్వటానికి వీలు కల్పించాయని విమర్శకులు అంటారు.

హెచ్-1బి వీసాలను ప్రస్తుతం లాటరీ ద్వారా ఇస్తున్నారు. కానీ.. అలా కాకుండా అత్యధిక వేతనాలు ప్రాతిపదికగా ఈ వీసాలు ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

గత ఏడాది హెచ్1-బి వీసా కార్యక్రమం కింద 85,000 వీసాలకు అవకాశం ఉంటే.. 2,25,000 మంది దరఖాస్తుదారులు పోటీపడ్డారు.

తాజా ఉత్తర్వులు.. సీజనల్‌గా పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చే హెచ్-2బి వీసాలను కూడా చాలా వరకూ నిలిపివేస్తుంది. ఇందులో అత్యధికంగా ఆతిథ్య రంగ ఉద్యోగులు ఉంటారు. అయితే.. వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆరోగ్య పరిరక్షణ రంగాలను మినహాయింపు ఉంది.

యూనివర్సిటీ విద్యార్థులు, పిల్లల సంరక్షణ చూసే విదేశీ సహాయకులు వంటి వారికి జారీ చేసే స్వల్పకాలిక ఎక్సేంజ్ వీసాలైన జె-1 వీసాలను కూడా ఈ ఉత్తర్వులు నిలిపివేస్తున్నాయి.

ప్రొఫెసర్లు, స్కాలర్లకు మినహాయింపునిచ్చారు. అలాగే మినహాయింపులు కోరటానికి అవకాశం కూడా ఉంటుంది.

మల్టీనేషనల్ కంపెనీల మేనేజర్లు, ఇతర కీలక ఉద్యోగులకు జారీ చేసే ఎల్ వీసాలను కూడా నిలిపివేస్తున్నారు.

హెచ్ 1 బి వీసా

ప్రతిస్పందన ఏమిటి?

''మన ఆర్థిక వ్యవస్థకు అత్యుత్తమమైన అత్యధిక విలువను పొందటమే'' ఈ చర్యల లక్ష్యం అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

''అమెరికా ఉద్యోగాలను కాపాడటానికి ట్రంప్ చేపట్టిన సాహసోపేతమైన చర్య ఇది'' అని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ క్రికోరియన్ ఏపీ వార్తా సంస్థతో మాట్లాడుతూ అభివర్ణించారు.

కానీ.. ''మహమ్మారి పరిస్థితిని సాకుగా చూపుతూ కాంగ్రెస్‌ను (పార్లమెంటును) పక్కనపెట్టి వలస చట్టాలను పునఃలిఖించటానికి చేస్తున్న ప్రయత్నం'' అని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ విమర్శించింది.

విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడే చాలా వ్యాపార సంస్థలు కూడా ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకించాయి.

''ఆర్థికవ్యవస్థ గాడిలోపడుతున్న సమయంలో అమెరికా వ్యాపార సంస్థలకు తమ శ్రమశక్తి అవసరాలు తీరేలా భరోసా కావాలి. అందుకోసం అమెరికా కంపెనీలకు దేశీయ, విదేశీ ప్రతిభ అందుబాటులో ఉండటం కీలకం'' అంటూ.. కొత్త ఆంక్షలు వద్దని హెచ్చరిస్తూ చాంబర్ ఆఫ్ కామర్స్ కొద్ది రోజుల కిందట ఒక లేఖ రాసింది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ‘అసంతృప్తి’

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఉద్యోగ వీసాలను తాత్కాలికంగా ట్రంప్ ఆదేశాల పట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

''అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయవంతం కావటానికి వలసలు ఎంతగానో తోడ్పడ్డాయి. అమెరికాను టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా నిలిపాయి. గూగుల్ ఈ స్థాయిలో ఉండటంలోనూ వలసలదే కీలక పాత్ర. నేటి (అధ్యక్షుడు ట్రంప్) ఆదేశం నిరుత్సాహం కలిగించింది. వలసలకు మద్దతుగా నిలవటం, అందరికీ అవకాశాలను విస్తరించే కృషిని కొనసాగిస్తాం'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ: ట్విటర్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సైతం.. ట్రంప్ ఆదేశాలను తప్పుపట్టింది.

‘‘అమెరికా పట్ల ఉన్న ఆకర్షణను ఏకపక్షంగా, అనవసరంగా కాలరాస్తున్నారు. ఇది ముందుచూపు లేకపోవటమే. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలంగా దెబ్బతీస్తుంది కూడా’’ అని ట్విటర్ ట్వీట్ చేసింది.

‘‘తెలుగు వారి మీదే ఎక్కువ ప్రభావం’’

గ్రీన్‌కార్డు, వీసాల జారీని నిలిపివేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభావితమయ్యే వారిలో తెలుగు వారు అధికంగా ఉంటారని అమెరికాలోని నార్త్ కరోలినాలో అసోసియేట్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సతీశ్ రేకులపల్లి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

''ఈ తాత్కాలిక నిషేధం వల్ల కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతారు. అదే సమయంలో కొన్ని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలకు అమెరికాలో కొరత ఉంది. ఈ నిర్ణయం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నా'' అని ఆయన పేర్కొన్నారు.

అలాగే.. ‘‘అధిక జీతాల ప్రకారం హెచ్1బి వీసాలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా హేతుబద్ధమైనది కాదు. ఎందుకంటే.. అమెరికాలో ఎంఎస్, పీజీలు పూర్తిచేసిన విద్యార్థులకు మొదటి సారే అత్యధిక వేతనాలు రావటం చాలా కష్టమైన విషయం’’ అని సతీష్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)