కరోనావైరస్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ హోంలో 57 మంది బాలికలకు పాజిటివ్... పరీక్షల్లో ఏడుగురు గర్భవతులని వెల్లడి

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ప్రభుత్వ బాలల సంరక్షణ గృహం (స్టేట్ హోం)లో ఉంటున్న 57 మంది బాలికలకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణైంది.
కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సంరక్షణ గృహంలోని బాలికల్లో ఏడుగురు గర్భంతో ఉన్నట్లు కూడా తేలింది. ఒక బాలికకు హెచ్ఐవీ ఉన్నట్లు వెల్లడైంది. సంరక్షణ గృహ సిబ్బందిలో ఒకరికి కూడా కరోనావైరస్ సోకింది.
కాన్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బ్రహ్మదేవరామ్ తివారీ ఈ విషయంపై స్పందించారు.
‘‘సంరక్షణ గృహంలో 57 మంది బాలికలను కరోనావైరస్ పాజిటివ్ కేసులుగా గుర్తించాం. ఏడుగురు బాలికలు గర్భంతో ఉన్నట్లు తేలింది. వారిలో ఐదుగురు కరోనావైరస్‌తో ఉన్నారు. వీరు ఆగ్రా, ఎటా, కన్నోజ్, ఫిరోజాబాద్, కాన్పూర్ నగర్ బాలల సంక్షేమ కమిటీ సిఫార్సుపై ఇక్కడికి వచ్చారు. ఆ బాలికలంతా ఇక్కడికి రాకముందే గర్భవతులు. దీని గురించి పూర్తి సమాచారం జిల్లా అధికారుల దగ్గర ఉంది’’ అని అన్నారు.
ఒకరికి జ్వరం రావడంతో...
ఈ బాలల సంరక్షణ గృహానికి చెందిన ఓ బాలిక జ్వరంతో గత వారం ఓ ఆసుపత్రిలో చేరికయ్యింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మిగతా బాలికల నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు.
చాలా మంది బాలికలు పాజిటివ్‌గా తేలినా, వారిలో ఎక్కువ మందికి లక్షణాలు లేవు. అలాంటివారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
సంరక్షణ గృహ సిబ్బందిలో ఒకరికి కూడా కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. అయితే, వారికి కరోనావైరస్ ఎలా సోకిందన్నది స్పష్టం కాలేదు.
చాలా మంది బాలికలు కరోనావైరస్ బారినపడటం, వారిలో కొందరు గర్భంతో ఉన్నట్లు తేలడంతో... ఈ విషయం సంచలనమైంది.
అయితే, ఆ బాలికలు ముందే గర్భంతో ఉన్నట్లు కాన్పూర్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ సుధీర్ బాబ్డే, కాన్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బ్రహ్మదేవరామ్ తివారీ వివరణ ఇచ్చారు. కరోనావైరస్ వీరికి ఎలా వ్యాపించనేది మాత్రం తెలియదని చెప్పారు.
‘అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు’
సంరక్షణ గృహంలో కొందరు బాలికలు గర్భంతో ఉన్న విషయానికి కొందరు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని కాన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేశ్ కుమార్ బీబీసీతో అన్నారు.
‘‘సంరక్షణ గృహానికి రాకముందే ఆ బాలికలు గర్భంతో ఉన్నారు. ఆయా వ్యవహారాలకు సంబంధించి, నిందితులపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం సంరక్షణ గృహాన్ని సీల్ చేశారు. బాలికలు ఆ గృహంలోకి ఎప్పుడు వచ్చారనేది అక్కడి పత్రాలు చూస్తేనే తెలుస్తుంది’’ అని చెప్పారు.
ఈ సంరక్షణ గృహంలో మొత్తం 171 మంది బాలికలు ఉంటున్నారు. వారిలో 97 మంది శాంపిల్స్‌ను గత వారం సేకరించారు. ఆ శాంపిల్స్‌లో 57 కరోనావైరస్ పాజిటివ్‌గా తేలాయి.
సంరక్షణ గృహాన్ని పూర్తిగా సీజ్ చేశారు. సిబ్బందికి కూడా క్వారంటీన్ విధించారు.
ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కూడా దృష్టి సారించారని, కాన్పూర్ డీఎమ్‌తో మాట్లాడారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పూనమ్ కపూర్ చెప్పారు.
‘‘ఈ సంరక్షణ గృహానికి పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులుగా ఉన్న చాలా మంది బాలికలు వచ్చారు. వారి వయసు తక్కువే. ఆ బాలికలు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మా కమిషన్ సిబ్బంది కూడా వెంట వెళ్లారు. ఎవరి నుంచైనా కరోనావైరస్ సోకి ఉండొచ్చు. ప్రభుత్వ బాలికల సంరక్షణ కేంద్రంలోకి పురుషులు వెళ్లడం కుదరదు. నేను కూడా అక్కడికి తరచూ పరిశీలించేందుకు వెళ్తుంటా. దీని గురించి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదు’’ అని మీడియాతో ఆమె చెప్పారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- న్యూ నార్మల్ ఎలా ఉంటుంది? ఇకపై మనం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పనిచేస్తామా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- ‘పరిస్థితి సురక్షితం అనుకోగానే స్కూళ్లు తెరవడం అవసరం లేదంటే పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం’
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
- నిర్భయ కేసు దోషుల ఉరితీత మహిళలకు ఇస్తున్న సందేశమేంటి?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
- హైదరాబాద్ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా... గర్భిణులు, జూడాల అవస్థలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








