పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో డిగ్రీ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని కొందరు తాము పోలీసులమంటూ ఆపి, పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు.
నిందితులు తాము పోలీసులమని ఎందుకు చెప్పారు?
ఆలమూరులోని ఓ డిగ్రీ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థిని మార్చి 3న తన స్నేహితులతో వీడ్కోలు పార్టీ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
స్నేహితుడి వాహనంపై మండపేట బైపాస్ రోడ్డులో వస్తున్న ఆమె వాహనాన్ని సంగం కాలనీ జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆపి, తాము పోలీసులమంటూ, వాహనం రికార్డులు చూపమని బెదిరించారు.
తగిన పత్రాలు లేకపోవడంతో బాధితురాలి స్నేహితుడిని నిందితుల్లో ఒకరు దూరంగా తీసుకెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలి దగ్గర ఉన్న వ్యక్తి , తన స్నేహితులు మరో ఇద్దరిని పిలిచి సమీపంలో ఉన్న పొలాల మధ్య అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి స్నేహితుడిపై దాడికి పాల్పడడంతో అతనికి గాయాలయ్యాయి.
సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి, వారి సహాయంతో బాధితురాలు ఇంటికి చేరింది.
బాధితురాలి తండ్రి చనిపోయారు. తల్లి అనారోగ్యంతో మంచాన ఉన్నారు. ఈ విషయం తల్లికి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత రోజు తన సోదరుడికి ఈ విషయం చెప్పడంతో అతడి సహాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

నిందితులను తప్పించేందుకు రాజకీయ నేతల యత్నం
మార్చి 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలు చెప్పిన ఆధారాల సహాయంతో విచారణ ప్రారంభించి నిందితుల వివరాలను కనుగొన్నారు. కానీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే విషయంలో మాత్రం జాప్యం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ స్వయంగా బాధితురాలిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ విషయంలో కేసు లేకుండా రాజీ యత్నాలు జరిగినట్టు ఆయన ఆరోపించారు.
"మండపేటలో దళిత విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ నిందితులను గుర్తించినా, తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యానికి రాజీయత్నాలే కారణం. అధికార, ప్రతిపక్షాలకు చెందిన మండపేట నేతలు కలిసి ఈ ప్రయత్నాలు చేశారు. అది తెలుసుకుని దళిత సంఘాలుగా మేం జోక్యం చేసుకున్నాం. బాధితురాలికి అన్యాయం జరిగితే ఆందోళన తప్పదని హెచ్చరించడంతో చివరకు నిందితులను అరెస్ట్ చేశారు.
నిర్భయ చట్టం, దిశ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలి. దళిత విద్యార్థినికి జరిగిన అన్యాయంలో నిందితులను కాపాడాలని చూసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. అత్యాచారానికి పాల్పడిన వారికి కొందరు రాజకీయ నేతలు అండగా ఉండేందుకు ప్రయత్నించడం సహించకూడదు" అని హర్షకుమార్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు
ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మార్చి 5వ తేదీన మండపేటలో వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు 6వ తేదీన మీడియాకు తెలిపారు. అదే రోజు ఆలమూరు కోర్టులో వారిని హాజరుపరిచి, కోర్ట్ ఆదేశాలతో రిమాండుకి తరలించారు.
ఈ కేసు వివరాలను రామచంద్రాపురం డీఎస్పీ ఎం.రాజగోపాల్ రెడ్డి బీబీసీకి వివరించారు.
"నిందితులపై 376డీ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3/2 కింద కేసులు నమోదు చేశాం. నలుగురు నిందితులు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. నిందితులపై ఉన్న అభియోగాలు నిర్ధరణ కానందున వారి వివరాలు వెల్లడించలేం. బాధితురాలితో పాటు, నిందితుల వివరాలు కూడా ప్రచురించవద్దు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దోషులకు కఠిన శిక్షలు తప్పవు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో పోలీసుల పేరు చెప్పి నేరం జరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసు విషయంలో పోలీసులు ఎటువంటి ఒత్తిడీ లేకుండా వ్యవహరించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.
"పోలీసులం అని చెప్పి వాహనం ఆపి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో దోషులకు కఠిన శిక్షలు పడాలి. సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసి, కోర్ట్ తీర్పు వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తాం. ఈ కేసులో నేను జోక్యం చేసుకున్నానంటూ సాగిన ప్రచారంలో వాస్తవం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశిస్తున్నాం. దిశ యాప్ ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలను అన్వేషించాలి. అందుకు అనుగుణంగా చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం" అని సుభాష్ చంద్రబోస్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు: బాధితురాలు
బాధితురాలిని చికిత్స కోసం కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ సహా కొందరు నేతలు పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలు బీబీసీతో మాట్లాడారు.
"అప్పటి వరకూ సంతోషంగా గడిచింది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులమంతా గ్రూప్ ఫొటో తీసుకోవడం కోసం కాలేజీకి వెళ్లాం. తిరిగి వస్తున్నప్పుడు మమ్మల్ని ఆపితే, పోలీసులే అనుకున్నాం.
కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు చాలా ప్రయత్నించారు. మాపై ఒత్తిడి తెచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. నిందితులకు తగిన శిక్ష పడాలి.
చాలా వేడుకున్నాను. కానీ వాళ్లు రాక్షసుల్లా వ్యవహరించారు. నన్ను వదలకుండా దారుణంగా హింసించారు. వారికి ఉరి శిక్ష వేయాలి. నా భవిష్యత్ నాశనం చేశారు. వాళ్లకి బతికే హక్కు లేదు" అంటూ తన బాధను వ్యక్తం చేశారు.

పోలీసులమని చెప్పి ఎవరైనా మీ వాహనాన్ని ఆపితే ఏం చేయాలి?
ఎవరు, ఏ వాహనాన్ని ఆపినా తొలుత పోలీసులో కాదో నిర్ధరించుకునే హక్కు ప్రజలకుందని డీఎస్సీ ఎం.రాజగోపాల్ రెడ్డి బీబీసీకి తెలిపారు.
"గతంలో ఎన్నడూ ఇలా పోలీసులమంటూ వాహనాలు అడ్డుకుంటున్నతీరు మా దృష్టికి రాలేదు. ఇదే మొదటి సారి. పోలీసుల పేరుతో సివిల్ డ్రెస్సుల్లో వాహనాలు ఆపే పరిస్థితి ఉండదు.
ఒకవేళ ఎక్కడైనా ప్రత్యేక పరిస్థితుల్లో తనిఖీల కోసం వాహనాలు ఆపితే ప్రజలు కూడా వారిని ప్రశ్నించాలి. వారు పోలీసులో కాదో నిర్ధరించుకోవాలి. వారి ఐడీ కార్డులు అడగాలి. కానిస్టేబుళ్లకైతే నెంబర్ ఉంటుంది. దానిని కూడా అడగాలి.
అలాంటి వివరాలు అడుగుతున్నప్పుడు చెప్పే సమాధానాన్ని బట్టి చాలామందికి అర్థమైపోతుంది. అప్పుడు వారు అసలు పోలీసులా కాదా అన్నది తెలుస్తుంది" అంటూ ఆయన చెబుతున్నారు.

పోలీసులు తమ వివరాలు చెప్పిన తర్వాతే వాహనదారుడిని అడగాలి
పోలీసులు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుందని, దానికి తగ్గట్టుగా నిబంధనలు పాటించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.
"పోలీసులు విధి నిర్వహణలో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలి. నేమ్ బోర్డ్ కనిపించేలా ఉండాలి. వాహన తనిఖీల సందర్భంగా తమ పేరు, వివరాలు తెలియజేయాలి. ఎందుకు తనిఖీలు చేస్తున్నారన్నది కూడా వాహనదారుడికి తెలపాల్సి ఉంటుంది.
అన్ని వివరాలూ తెలుసుకున్న తర్వాత మాత్రమే వాహనదారులు తమకు సంబంధించిన పత్రాలను అందించవచ్చు. అనుమానితుల నుంచి పేరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. కానీ విచారణ పేరుతో అక్కడి నుంచి తీసుకెళ్లే అధికారం లేదు. అందుకు తగిన ప్రక్రియను అనుసరించాలి. కానీ ఎక్కువ సందర్భాల్లో అలా జరగడం లేదు. ఈ పరిస్థితి కారణంగానే ప్రశాంతంగా ఉండే మండపేటలో కూడా పోలీసుల పేరుతో అత్యాచారానికి ఒడిగట్టేందుకు సాహసించారు. పునరావృతం కాకూడదంటే పోలీసుల పనితీరులోనే మార్పు రావాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- హైదరాబాద్ అత్యాచారం: 'పురుషులను నిందించండి - సురక్షితమైన నగరాన్ని కాదు'
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020: ఫైనల్స్‌కు చేర్చిన భారత బౌలర్ల కథ ఏమిటి?
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










