అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందూ పక్షానికే చెందుతుందని సుప్రీం కోర్టు 2019 నవంబర్ 9న తీర్పునిచ్చింది.
ఈ తీర్పు వెలువడిన వెంటనే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి.. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ నాయకుడు అశోక్ సింఘల్‌కు భారతరత్న ప్రదానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నాలుగేళ్ల క్రితం అశోక్ సింఘల్ కన్నుమూశారు. రామ మందిర ఉద్యమంలో ఆయనది ప్రధాన పాత్ర.
వీహెచ్‌పీకి 20 ఏళ్ల పాటు ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు.
అయోధ్య వివాదాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా మార్చడంలో అశోక్ సింఘల్‌ది ముఖ్య పాత్ర అని విశ్లేషకులు చెబుతుంటారు.
అయితే, 1990ల్లో రామమందిర ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తి మాత్రం ఎల్‌కే అడ్వాణీనే. అందుకే సుప్రీం తీర్పు వెలువడ్డ అనంతరం.. తాను అడ్వాణీని కలిసి అభినందనలు తెలియజేస్తానని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ''ఇందుకోసం ఆయన రథ యాత్ర చేశారు. ఆయన్ను కచ్చితంగా కలుస్తా. ఆశీస్సులు తీసుకుంటా'' అని ఠాక్రే అన్నారు.
అశోక్ సింఘల్, ఎల్‌కే అడ్వాణీ రామమందిరం విషయంలో చేసిన కృషిని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి ట్విటర్‌లో గుర్తు చేసుకున్నారు. అడ్వాణీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వీహెచ్‌పీ కార్యాలయానికి వెళ్లి, అశోక్ సింఘల్‌కు నివాళులు అర్పించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రామమందిర ఉద్యమంలో ఉమా భారతి పాత్ర కూడా ఉంది. బీజేపీలో చేరి ఆమె మధ్యప్రదేశ్ సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత ఆ పార్టీపై తిరుగుబాటు చేసి సొంతంగా ఓ పార్టీ స్థాపించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తిరిగి బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమవుతుండటానికి ఏ ఒక్కరి కృషో కారణమని చెప్పలేం. దీని వెనుక చాలా మంది పాత్ర ఉంది.
అయోధ్య వివాదం దశలవారీగా సాగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్), బీజేపీ సీనియర్ నాయకులు చాలా మంది వీటిలో ముఖ్యమైన భూమికలను పోషించారు.
వాళ్లలో ప్రధానంగా వినిపించే పేర్లు అశోక్ సింఘల్, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంభర, ప్రవీణ్ తొగాడియా, విష్ణు హరి దాల్మియా.
అశోక్ సింఘల్
రామ మందిర ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగట్టడంలో సింఘల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఉద్యమానికి 'ముఖ్య రూపశిల్పి' ఆయనే.
2011లో ఆయన వీహెచ్‌పీ అధ్యక్ష పదవికి ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు. 2015 నవంబర్‌లో కన్నుమూశారు.

ఫొటో సోర్స్, Getty Images
అడ్వాణీ
1990లో ఎల్‌కే అడ్వాణీ సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకూ రథ యాత్రను తలపెట్టారు. అయితే మధ్యలోనే బిహార్‌లో ఆయన్ను అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేయించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులో అడ్వాణీ ఇంకా నిందితుడిగా ఉన్నారు. మసీదు కూల్చివేత రోజున ''కరసేవకు ఇది ఆఖరి రోజు' అని అడ్వాణీ వ్యాఖ్యానించినట్లు ఛార్జ్‌షీట్‌లో ఉంది.
మురళీ మనోహర్ జోషి
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీలో అడ్వాణీ తర్వాత ప్రముఖ నాయకుడు మురళీ మనోహర్ జోషినే. మసీదు కూల్చివేత సమయంలో ఆయన అక్కడ ఉన్నారు. గుమ్మటం కిందపడగానే ఉమా భారతి ఆయన్ను కౌగిలించుకున్నారు.
వారణాసి, అలహాబాద్, కాన్పూర్ పార్లమెంటు నియోజకవర్గాలకు గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ మార్గనిర్దేశక కమిటీలో ఆయన సభ్యుడు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
కల్యాణ్ సింగ్
బాబ్రీ కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
కరసేవకులను కావాలనే పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.
మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న 13 మందిలో కల్యాణ్ సింగ్ కూడా ఒకరు.
ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీ నుంచి వేరుపడి, రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.
వినయ్ కతియార్
రామ మందిర ఉద్యమం కోసం 1984లో బజరంగ్ దళ్ ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడిగా వినయ్ కతియార్‌ను ఆర్‌ఎస్‌ఎస్ నియమించింది.
ఉద్యమాన్ని దూకుడుగా మార్చింది భజరంగ్ దళ్ సభ్యులే.
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కతియార్ రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి కూడా చేపట్టారు. ఫైజాబాద్ (అయోధ్య) నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, PRASHANT RAVI
ఉమా భారతి
రామ మందిర ఉద్యమానికి మహిళా నాయకురాలిగా ఉమా భారతి కనిపించేవారు.
బాబ్రీ కూల్చివేతలో లిబర్హన్ కమిషన్ ఆమెపై అభియోగాలు మోపింది. అయితే, జనాలను తాను రెచ్చగొట్టినట్లు వచ్చిన ఆరోపణలను ఉమా భారతి ఖండించారు.
వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా ఆమె పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు.
సాధ్వి రితంభర
అప్పట్లో సాధ్వి రితంభర హిందూత్వ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉండేవారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. రామ మందిర ఉద్యమ సమయంలో ఆమె ప్రసంగాల క్యాసెట్లను పంపిణీ చేసేవారు.
ప్రత్యర్థులను ఆమె 'బాబర్ సంతానం' అని పిలుస్తూ, రెచ్చగొట్టేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవీణ్ తొగాడియా
వీహెచ్‌పీ నాయకుడు ప్రవీణ్ తొగాడియా రామ మందిర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు.
అశోక్ సింఘల్ తర్వాత వీహెచ్‌పీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వచ్చాయి.
అయితే, వీహెచ్‌పీ నుంచి ఆయన ఇటీవల బయటకు వచ్చి, 'అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్' అనే సంస్థను ప్రారంభించారు.
విష్ణు హరి దాల్మియా
వీహెచ్‌పీలో విష్ణు హరి సీనియర్ సభ్యుడు. సంస్థలో ఆయన వివిధ పదవులను చేపట్టారు.
బాబ్రీ కూల్చివేత కేసు నిందితుల్లో ఆయన కూడా ఒకరు.
2019, జనవరి 16న దిల్లీలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.
ఈ జాబితా ఇంకా సాగుతూనే ఉంటుంది. క్రెడిట్ ఎవరికి ఇచ్చినా, రామ మందిర ఉద్యమంతో రాజకీయంగా బీజేపీ భారీగా లాభపడిందన్నది సుస్పష్టం.
గతంలో పొత్తులతో, ఇప్పుడు స్వయంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఆ పార్టీ ఎదిగిందంటే.. దాని వెనుక రామ మందిర ఉద్యమం కూడా ప్రధాన కారణమే.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ స్పందన ఏమిటి?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
- అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్ కన్సార్షియం
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- 'అయోధ్య తీర్పుతో బీజేపీలో మరింత ఉత్తేజం... ప్రతిపక్షం మరింత బలహీనం'
- రాత్రంతా మేలుకునే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారెందుకు
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- మాస్టొడాన్: ట్విటర్‌ను వదిలి చాలా మంది ఈ యాప్‌కు ఎందుకు మారిపోతున్నారు...
- మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









