అయోధ్య తీర్పు: ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు ఏమవుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్థల యాజమాన్య హక్కులపై భారత న్యాయ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన కేసును సుప్రీంకోర్టు శనివారం పరిష్కరించింది.
బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు హిందువుల పక్షాన తీర్పు ఇస్తూ వివాదిత భూమిని మందిరం కోసం ఇచ్చింది. మసీదు కోసం వేరుగా 5 ఎకరాల భూమి ఏర్పాటు చేయాలని చెప్పింది.
అంటే బాబ్రీ మసీదు ఎక్కడ ఉండేదో, అక్కడ ఇప్పుడు రామ మందిరం నిర్మించడానికి మార్గ సుగమం అయ్యింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై కూడా పడవచ్చు అని ఆ కేసులు దర్యాప్తు చేస్తున్న జస్టిస్ మన్‌మోహన్ లిబ్రహాన్ అన్నారు.
బీబీసీతో మాట్లాడిన జస్టిస్ లిబ్రహాన్ "సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాగుంది. సుప్రీంకోర్టులో సరైన నిర్ణయాలే తీసుకుంటారు" అన్నారు.
ఈ తీర్పు ప్రబావం బాబ్రీ మసీదు ధ్వంసం, దానికి సంబంధించిన నేరపూరిత కుట్ర కేసులపై కూడా పడవచ్చా అనే ప్రశ్నకు ఆయన "నాకు తెలిసి ఈ తీర్పు ప్రభావం ఆ కేసులపై కూడా పడవచ్చు. అందులో రెండో మాట లేదు" అన్నారు.
సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు ఆధారంగా బాబ్రీ మసీదు ధ్వంసం చేసిన కారణాన్ని సమర్థించుకుంటూ వాదించవచ్చా అని అడిగితే.. జస్టిస్ లిబ్రహాన్ "కోర్టులో ఈ వాదన కూడా వినిపించవచ్చు" అన్నారు.
"యాజమాన్య హక్కుల కేసులో సుప్రీంకోర్టులో ఎంత వేగంగా విచారణలు జరిగాయో, బాబ్రీ మసీదు కూల్చడానికి జరిగిన నేరపూరిత కుట్ర కేసుల్లో కూడా అంతే వేగంగా విచారణ జరగాలి" అని జస్టిస్ లిబ్రహాన్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
కోర్టులో న్యాయం జరుగుతుందా?
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుల్లో కూడా కోర్టులో న్యాయం జరుగుతుందని జస్టిస్ లిబ్రహాన్ భావిస్తున్నారు.
"న్యాయం జరుగుతుందా, లేదా అనేది తీర్పు వచ్చినపుడు తెలుస్తుంది. కానీ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుందని, న్యాయం చేస్తుందని మాత్రమే మనకు తెలుసు. ఈ కేసుల్లో కూడా కోర్టు తీర్పు ఇస్తుందని, న్యాయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది".
వివాదిత భూమి యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ బాబ్రీ మసీదును కూల్చివేతకు సంబంధించిన క్రిమినల్ కేసులు 27 ఏళ్లుగా కోర్టులో ఉన్నాయి.
1992, డిసెంబర్ 6న సంప్రదాయవాదుల గుంపు అయోధ్యలో 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదును కూల్చి వేసింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో దాదాపు 2 వేల మంది మరణించారు.
బాబ్రీ మసీదు విధ్వంసంపై దర్యాప్తు చేసిన జస్టిస్ లిబ్రహాన్ కమిషన్ 17 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత 2009లో తమ రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఒక లోతైన కుట్ర ప్రకారం మసీదును కూల్చివేశారని చెప్పారు.
ఈ కుట్రలో ప్రమేయం ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని కూడా ఆయన సిఫారసు చేశారు.

ఫొటో సోర్స్, Praveen Jain
బాబ్రీ కూల్చివేతపై రెండు కేసులు
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒకటి గుర్తుతెలియని కరసేవకులపై, రెండోది అడ్వానీ సహా 8 మంది అగ్ర నేతలపై నమోదైన నామినేటెడ్ కేసు.
రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చారనే ఆరోపణలతో అడ్వాణీ, మిగతా నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ రెండింటితోపాటు జర్నలిస్టులతో గొడవ, దోపిడీ లాంటి మరో మరో 47 కేసులు ఉన్నాయి. తర్వాత వీటన్నిటి విచారణను సీబీఐకి అప్పగించారు. సీబీఐ రెండు కేసుల్లో ఉమ్మడి చార్జిషీటు దాఖలు చేసింది.
హైకోర్టు సలహాతో అయోధ్య కేసుల విచారణ కోసం లఖ్‌నవూలో ఒక కొత్త ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కానీ దాని నోటిఫికేషన్‌లో రెండో కేసును ప్రస్తావించలేదు. దాంతో, రెండో కేసు రాయ్‌బరేలీలోనే నడుస్తూ వచ్చింది.
ఆరోపణలను రూపొందించడానికి ప్రత్యేక కోర్టు తన ఉత్తర్వులలో "అన్ని కేసులూ ఒకే చర్యకు సంబంధించినవి కాబట్టి, అన్ని కేసులలో ఉమ్మడి ప్రాసిక్యూషన్‌కు తగిన ఆధారం ఉందని" చెప్పింది. కానీ అడ్వాణీ సహా చాలా మంది నిందితులు ఆ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు.
2001 ఫిబ్రవరి 12న హైకోర్టు, అన్ని కేసులకు ఉమ్మడి చార్జిషీట్ అంగీకరించింది. అయితే, రెండో కేసు సంఖ్యను దాని ప్రత్యేక కోర్టు నోటిఫికేషన్‌లో చేర్చలేదు కాబట్టి, 8 మంది నిందితులు ఉన్న ఆ కేసును విచారించే హక్కు లఖ్‌నవూ ప్రత్యేక కోర్టుకు లేదని కూడా చెప్పింది.
అడ్వాణీ, మిగతా హిందుత్వ నేతలపై నమోదైన కేసులు చట్టంలోని సాంకేతిక కారణాల్లో చిక్కుకుపోయాయి.
దాని గురించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ రామదత్త త్రిపాఠీ "అడ్వాణీ, మిగతా నేతలు హైకోర్టులో అపీల్ చేశారు. కోర్టు సాంకేతిక కారణాల గురించి చెబుతూ నేరపూరిత కుట్ర కేసును రాయ్‌బరేలీ కోర్టుకు పంపించింది. అయితే తర్వాత సుప్రీంకోర్టు రాయ్‌బరేలీలో నడుస్తున్న కేసును బాబ్రీ విధ్వంసం కేసుతో కలిపేసింది" అన్నారు.
"ఇప్పుడు మళ్లీ అన్ని కేసులనూ కలిపి మళ్లీ లక్నో ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఇటీవల ఈ కేసులో వాదనలు వింటున్న జడ్జి పదవీకాలం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల్లో తీర్పులు ఇచ్చాక రిటైరైపోయే అవకాశం కల్పించింది".

ఫొటో సోర్స్, Getty Images
నేరపూరిత కుట్ర ఆరోపణలు
మొదట్లో అడ్వాణీ, మిగతా నేతలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చారని మాత్రమే రాయ్‌బరేలీలో కేసులు నమోదు అయ్యాయి. కానీ 2017 ఏప్రిల్లో సీబీఐ అపీలుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 8 మందిపై నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేశారు.
2017లోనే బాబ్రీ మసీదు విధ్వంస కేసులో లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 12 మంది నిందితులపై నేరపూరిత కుట్ర కేసు ఆరోపణలను నిర్ధారించారు.
అడ్వాణీ, జోషీ, ఉమాభారతి మిగతా వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను నిర్ధారించడానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని లఖ్‌నవూ ప్రత్యేక సీబీఐ కోర్టు చెప్పింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చడానికి ముందు, అప్పుటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ బాబ్రీ మసీదుకు ఎలాంటి నష్టం జరగనివ్వమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో కల్యాణ్ సింగ్ కూడా నిందితుడు. ప్రస్తుతం ఆయన మిగతా నేతల్లాగే బెయిలుపై బయట ఉన్నారు.
దీనిపై సీనియర్ జర్నలిస్ట్ రామదత్త త్రిపాఠీ "బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నేతలు మసీదు కూల్చిన ఘనత మాదేనని చెప్పుకుటారు. కానీ మసీదును కూల్చిన నైతిక బాధ్యతను ఎవరూ ఎప్పుడూ తీసుకోలేదు. కోర్టులో ఎప్పుడూ మసీదును కూల్చిన కేసులో తాము దోషులం కాదని ఈ నేతలు వాదిస్తుంటారు" అన్నారు.
"ఇప్పుడు ఈ కేసులో కూడా తీర్పు వస్తుందనే ఆశ ఉంది. కానీ ఈ కేసులో చాలా మంది నిందితులు ఇప్పుడు ఈ లోకంలో లేరు. వారిలో విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘల్ కూడా ఉన్నారు" అని త్రిపాఠీ చెప్పారు.
"న్యాయం జరిగేలోపు ఎంతమంది నిందితులు ప్రాణాలతో మిగులుతారో చూడాలి. న్యాయం కూడా సమయానికి జరగాలి. ఫైజాబాద్‌లో రామ జన్మభూమి వివాదం పరిష్కరించిన అదే కోర్టులో ఇది కూడా జరిగుంటే, ఈ కేసు ఇంత సుదీర్ఘంగా కొనసాగేది కాదు. దీనిపై ఇంత రాజకీయం కూడా జరిగుండదు" అంటారు రామదత్త త్రిపాఠీ.
ఇవి కూడా చదవండి:
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- IND Vs BAN: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, రెండో టీ20లో టీమిండియా విజయం
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









