భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి

ఫొటో సోర్స్, AFP
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధాని దిల్లీలో ప్రజారోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. పాఠశాలలు మూసివేశారు. ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు ఆస్పత్రిపాలవుతున్నారు.
దీనికంతటికి కారణం తీవ్రమైన వాతావరణ కాలుష్యం.
దిల్లీని ''గ్యాస్ చాంబర్"గా అభివర్ణిస్తున్నారు. కానీ, ఈ పరిస్థితి కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై లేదు.
ప్రపంచంలోని అత్యంత కలుషితమైన ఆరు నగరాలు- గురుగ్రామ్, ఘాజియాబాద్, ఫరీదాబాద్, భివాడి, నోయిడాలు దిల్లీకి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం గాలి నాణ్యత విషయంలో ప్రపంచంలో అత్యంత కలుషితమైనవిగా ఉన్నాయి.
2018లో గ్రీన్‌పీస్ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 30 అత్యంత కలుషితమైన నగరాల్లో 22 భారత్‌లో ఉన్నాయి, ఈ నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సురక్షితంగా భావించే దానికంటే అత్యంత ఎక్కువ విషపూరితమైన మూలకాలతో కూడిన పీఎం 2.5 అని పిలిచే ప్రమాదకరమైన కణాలు గాలిలో ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షలమంది అకాల మరణం పొందుతున్నారని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం దిల్లీని కప్పేసిన ఒక రకమైన పొగమంచు వల్ల గుండెపోటు, డయాబెటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
దిల్లీ దాని చుట్టుపక్కల నివసిస్తున్న మూడు కోట్ల మంది ప్రజలు వారానికి పైగా ప్రమాదకర పొగమంచుతో పోరాడారు. ఉత్తర భారతంలో విస్తరించి ఉన్న గంగా నది మైదాన ప్రాంతం కూడా ఈ కాలుష్యానికి బాగా ప్రభావితమైంది.
భారత్ పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్ కూడా ప్రమాదానికి గురవుతున్నాయి. ఎందుకంటే ఈ కాలుష్య గాలులు, ధూళి హిమాలయాల వరకు పయనిస్తాయి.

ఫొటో సోర్స్, AFP
పంట వ్యర్థాలను కాల్చివేయడంతో...
దిల్లీతో పాటు ఉత్తర భారత్‌లో వాయు కాలుష్యానికి పంట వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణమని భావిస్తున్నారు.
ఈ కాలంలో ఉత్తరాది రైతులు మిగిలిపోయిన పంటలను కాల్చేస్తుంటారు. తరువాత పంట వేయడం కోసం వారు పొలాలను ఈ విధంగా సిద్ధం చేస్తారు.
ఈ పంట దహనం వల్ల ఏర్పడే పొగ, ధూళిని గాలులు దిల్లీ వైపు తీసుకువెళ్తాయి. దీనివల్ల ఏటా రాజధాని ప్రాంతం తీవ్ర కాలుష్యానికి గురవుతోంది.
ఈ వారం ప్రారంభంలో పంటను కాల్చే పద్ధతిని ప్రభుత్వం నిషేధించినప్పటికీ కాలుష్య స్థాయులను ఎదుర్కోవటానికి ఇదొక్కటే సరిపోవడం లేదు.
అయితే, ఈ విషయంలో పాలనాయంత్రాంగం కచ్చితమైన చర్యలు తీసుకోవడం కంటే ''జిమ్మిక్కులు" పైనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
వాహన కాలుష్యం
ఈ పొగమంచు కారణంగా దిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. వాహన ఉద్గారాలపై పోరాడటం ఇప్పుడు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.
దిల్లీలో ప్రతిరోజూ 30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని, ఉద్గారాల తగ్గింపునకు సరి-బేసి విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇలా చేయడం వల్ల రోడ్డు మీదకు వచ్చే వాహనాల సంఖ్యను 15లక్షలకు తగ్గించామని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.
అయితే, 2016 నుంచి గమనిస్తే దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2016లో దేశం మొత్తంలో రోడ్లపైకి 20 కోట్ల వాహనాలు వస్తే, ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది.
మరోవైపు కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు విఫలమయ్యాయి.
2015లో దేశంలో దాదాపు కోటిన్నర రిజిస్టర్డ్ భారీ వాహనాలు- ట్రక్కులు, డీజిల్ ఉపయోగించే బస్సులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. డీజిల్‌తో నడిచే లక్షలాది టాక్సీలు, ప్రైవేట్ కార్లు దీనికి అదనం.
సైన్స్ జర్నల్ 'నేచర్' చేసిన ఒక అధ్యయనం ప్రకారం, రోడ్డుపైకి వచ్చే డీజిల్ వాహనాలు సుమారు 20 శాతం నైట్రోజన్ ఆక్సైడ్‌లను వెలువరుస్తున్నాయి. ఇవి పీఎం 2.5 కాలుష్యానికి అత్యంత కీలకమైనవి.

ఫొటో సోర్స్, Getty Images
భవన నిర్మాణాలతో...
ఈ కాలుష్య గాలులు దిల్లీని చుట్టుముట్టినప్పుడు ఇక్కడున్న నిర్మాణ పనులు ఆపివేయాలని ప్రభుత్వం, కోర్టులు ఆదేశాలిస్తున్నాయి.
నిర్మాణాల వల్ల వెలువడే దుమ్ము, ధూళిలో రసాయన స్వభావం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. పొరుగున ఉన్న చైనాతో పోటీపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వృద్ధిని పెంచడంలో నిర్మాణాలు ప్రధానపాత్ర పోషిస్తాయి.
2022నాటికి నిర్మాణ పరిశ్రమ విలువ 738.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భారత ప్రభుత్వం తెలిపింది. ఉక్కు, సిమెంట్, పెయింట్, గాజు పరిశ్రమలు దేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ప్రస్తుతం దేశమంతటా నిర్మాణ కార్యకలాపాలు ఎంత జరుగుతున్నాయనే దానిపై స్పష్టమైన అంచనాలు లేవు. కానీ, దేశంలోని వివిధ నగరాలు కలుషితమవడానికి పంట కాలుష్యం, వాహన కాలుష్యం తర్వాత ఈ నిర్మాణాలు మూడో ప్రధాన కారణమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్
- భారత మహిళా హాకీ జట్టు: బిడియపడే దశ నుంచి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఎలా ఎదిగింది?
- ‘ప్రేమలో పడ్డందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- తిరువళ్లువర్ విభూతిపై తమిళనాడులో వివాదం ఎందుకు రేగింది?
- వాయు కాలుష్యంతో ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- యోగా శిక్షకులు తమ ఆసనాలతో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








