భారత మహిళా హాకీ జట్టు: మాట్లాడటానికే భయపడే ఈ అమ్మాయిలు ఒలింపిక్స్‌కు ఎలా ఎంపికయ్యారంటే..

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, HOCKEY INDIA

    • రచయిత, హర్‌ప్రీత్ కౌర్ లాంబా
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ - బీబీసీ హిందీ కోసం

''డరో మత్, బాత్ కరో...''

కెప్టెన్ రాణి రాంపాల్ తన జట్టు సభ్యులకు చెప్పిన మాట ఇది. ఇప్పుడు కాదు.. దాదాపు రెండేళ్ల కిందట - 2017 ఫిబ్రవరిలో జరిగిన జట్టు సమావేశంలో.

అప్పుడు భారత మహిళా జట్టు కోచ్‌గా కొత్తగా నియమితుడయ్యాడు నెదర్లాండ్స్ క్రీడాకారుడు జోర్ద్ మారీజ్న్. హాలండ్ మహిళా జట్టుకు కోచ్‌గా పనిచేసి వచ్చాడు. కానీ, భారత జట్టు సమావేశాల్లో ఈ యువతులు నోరు మెదపకుండా మౌనంగా ఉండేవారు. ఎందుకో ఆయనకు అర్థమయ్యేది కాదు.

రెండు రోజుల కిందట భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో సడలని ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా ఆడి ఒలింపిక్‌లో వరుసగా రెండోసారి బెర్త్ ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు ఇదే.

భారత మహిళా హాకీ జట్టు మొట్టమొదటిసారి 1980లో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. మళ్లీ ఒలింపిక్స్‌ మైదానంలో అడుగుపెట్టటానికి 36 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరి స్థానంలో నిలిచింది.

కానీ, ఈ నాలుగేళ్లలో చాలా పురోగమించింది. 2017లో ఆసియా కప్ పోటీల్లో గెలిచింది. 2018 వరల్డ్ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. అదే ఏడాది ఇంచియాన్ ఏసియన్ గేమ్స్‌లో రజత పతకంతో పాటు ఎన్నో హృదయాలను గెలుచుకుంది.

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

అక్కడి నుంచీ అంతకంతకూ బలపడుతూ అడ్డుగోడలను బద్దలుకొడుతూ వస్తోంది. శనివారం నాడు హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో తమ ఐకమత్యాన్ని, కఠోర శ్రమను, ఆత్మ విశ్వాసాన్ని చాటుతూ... అమెరికా జట్టును ఓడించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జట్టుకు స్థానం సంపాదించారు.

భారత మహిళా హాకీ జట్టు వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌ పోటీలకు అర్హత సాధించటం చరిత్రలో ఇదే మొదటిసారి.

ఒకప్పుడు బిడియపడుతూ అంతగా ఆత్మవిశ్వాసం లేని ఇదే జట్టు... ఇప్పుడు ఇంతగా విజృంభించటానికి కారణమేమిటి? అంటే.. జట్టు కెప్టెన్ రాణి, కోచ్ మరీజ్న్ కృషి. 2017లో జరిగిన ఒక సంఘటన మలుపు తిప్పిందని వారు చెప్తారు.

''దీనంతటికీ స్వీయ నమ్మకమే మూలం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రోజులోనో, ఒక నెలలోనో సాధించిన ప్రగతి కాదు. ఏళ్ల తరబడి జరిగిన కృషి. ఈ విజయం వెనుక ఎంతో శ్రమ ఉంది. ఇప్పుడు మేం ఎటువంటి ప్రత్యర్థిని చూసీ భయపడం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా మేం గెలవగమని మాకు తెలుసు.. మామీద మాకు నమ్మకం ఉంది'' అంటుంది రాణి.

ఈ మార్పు మొదలవటానికి మూలాలు 2017 ఫిబ్రవరిలో ఉన్నాయి. కొత్త కోచ్ మారీజ్న్ జట్టుతో పలుసార్లు సమావేశమయ్యాడు. ఆ యువతులు ప్రతిభావంతులు. క్రమశిక్షణ ఉంది. సూచనలు తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ.. తమ అభిప్రాయాలు చెప్పాలని అడిగితే అందరిదీ మౌనమే సమాధానం.

అందుకు భాష ఒక అవాంతరం. అంతకుమించి సంశయాలు, తప్పు మాట్లాడతామేననే భయం ఉన్నాయి. సాంస్కృతిక, సామాజిక నేపథ్యాల ప్రభావాలు కూడా వీరిని నిలువరిస్తున్నాయి. వీరికి తెలిసిందంతా.. చెప్పినట్లు చేయటం.. మైదానంలో పాటించటం. ప్రశ్నించటం లేదు.. అభిప్రాయాలు చెప్పటం లేదు.

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఏం చేయాలో తెలియని మరీజ్న్.. టీం లీడర్ రాణిని ఆశ్రయించాడు. ఆమె అపార అనుభవమున్న క్రీడాకారిణి. తిరుగులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. రాణి వయసు ఇప్పుడు 24 ఏళ్లు. కానీ 14 ఏళ్ల వయసు నుంచే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆధునిక హాకీకి అవసరమైన అన్ని అంశాల్లో మంచి పట్టుంది.

వీరిద్దరూ కలిసి.. జట్టులోని యువతులతో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. జట్టు సభ్యులందరూ తప్పనిసరిగా మాట్లాడి తీరాల్సిన సమావేశాలు, మనోవిజ్ఞాన తరగతులు, జట్టులో ఐక్యత పెంచే కార్యకలాపాలు, జట్టంతా కలిసి బయటకు వెళ్లి భోజనాలు చేయటం వంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి. అందరూ కలిసి డ్యాన్స్ కూడా చేసేవారు. వీటన్నిటి వల్ల జట్టు సభ్యుల్లో ఐకమత్యం పెరిగింది. యువతుల్లో బిడియం పోయింది.

''జట్టు సభ్యులందరినీ కలపటం చాలా ముఖ్యం. మేమందరం కలిసి ఆస్వాదించే పనుల్లో కొరియోగ్రఫీ, డ్యాన్స్ ఉంటాయి. మా కోచ్‌ని, విదేశీ సిబ్బంది అందరినీ బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసేలా చేస్తాం. ఎలా డ్యాన్స్ చేయాలనేది వారికి జట్టు సభ్యులు నేర్పిస్తారు. అలా.. అందరి మధ్యా ఉన్న మంచుతెర కరిగిపోయింది. ఒకప్పుడు బిడియంగా ఉన్న ఈ యువతులే ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారంటే నమ్మరు'' అని వివరించారు రాణి.

ఈ యువతులు మైదానం లోపలా వెలుపలా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేలా చేయటానికి నెలల తరబడి ఒత్తిడి చేస్తూ ప్రోత్సహించాల్సి వచ్చింది.

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

సమష్టి కృషి...

అలాగే, దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఈ క్రీడాకారిణుల మధ్య భాషా సాంస్కృతిక తేడాలను అధిగమించటం కూడా ఒక సవాలే అయింది. లాల్రెమ్సియామి మిజోరం నుంచి వచ్చింది. అద్భుత ప్రతిభగల అమ్మాయి. మైదానంలో తిరుగు లేదు. కానీ, హిందీ, ఇంగ్లీష్ ఒక్క ముక్క తెలియదు.

బెంగళూరులోని హాకీ జాతీయ శిబిరంలో శిక్షణ సమయంలో ఆమె రూమ్ మేట్‌గా మారింది కెప్టెన్ రాణి. పగలు హాకీ ప్రాక్టీస్ చేశాక.. రాత్రిళ్లు ఆమెకు హిందీ నేర్పిస్తుంది. ఈ బృందం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

భారత మహిళా హాకీకి, పురుషుల హాకీకి ఉన్నంత ప్రాచుర్యం, పేరుప్రతిష్ఠలు లేవు. అవసరమైనంత అనుభవం లేదు. అందుకోసం వరల్డ్ కప్, ఒలింపిక్స్ వంటి పెద్ద టోర్నీల్లో ఆడటం అవసరమైంది.

''గెలవటం ఒక అలవాటుగా చేసుకోవాలనుకున్నాం. కఠోర శిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాస ధోరణితో మాత్రమే గెలవగలం. గతంలో ప్రత్యర్థులు చాలా బలవంతులనే అభిప్రాయం మాకు ఎక్కువగా ఉండేది. ఈ రెండేళ్లలో ఆ ఆలోచన మారిపోయింది'' అంటుంది రాణి.

''పెద్ద వేదికల మీద ఆడటం, కొన్ని మ్యాచ్‌లు గెలవటం మాకు విశ్వాసం అందించింది. 2018 వరల్డ్ కప్ టోర్నీలో మేం క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాం. సెమీ ఫైనల్స్‌కు దగ్గరగా వెళ్లాం. జట్టులో ఆత్మవిశ్వాసం పెరగటానికి ఇది తోడ్పడింది. ఇప్పుడు జట్టు సభ్యులందరికీ తెలుసు.. మేం గలవగలమని'' అని వివరించింది.

క్రమంగా ఫలితాలు రావటం మొదలైంది. ఈ యువతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. జపాన్‌లో జరిగిన 2017 ఆసియా కప్ గెలుచుకుంది. ఆ గెలుపుతో లండన్‌లో జరిగిన 2018 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనటానికి చోటు సంపాదించుకుంది.

కెప్టెన్ రాణి ముందుండి నడిపిస్తుంటే, గోల్‌కీపర్ సవితా పునియా చాలా సందర్భాల్లో హీరోగా అవతరించింది. జట్టు సంక్షోభంలో ఉన్నపుడు ఆపద్భాందవిగా డ్రాగ్-ఫ్లికర్ గుర్జిత్‌ కౌర్ నిలిస్తే.. నవజ్యోత్ కౌర్, వందనా కటారియా, నవనీత్ కౌర్, సియామీలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, HOCKEY INDIA

సాధారణ నేపథ్యాలు...

మహిళా హాకీ జట్టులో చాలా మంది క్రీడాకారిణిలు అతి సాధారణ నేపథ్యాల నుంచే వచ్చారు. వారి కుటుంబాలు రోజువారీ జీవనానికి ఇబ్బందులు పడేవి. చాలా మంది కేవలం కఠిన శ్రమ, అంకితభావంతో కష్టాలను అధిగమించి వచ్చారు.

రాణి తల్లిదండ్రులు.. ఆమె హాకీ ఆడటం కన్నా చదువుకోవటానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు. కారణం, ఆర్థిక పరిమితులు. ఆమెకు హాకీ కిట్ కానీ, షూ కానీ కొనిచ్చే పరిస్థితి ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె అద్భుత నైపుణ్యాలు, క్రీడాభిమానం ఆమెను ముందుకు నడిపించాయి.

రాణికి 2007లో జూనియర్ ఇండియా శిబిరం నుంచి పిలుపు వచ్చినపుడు ఆమె వయసు 13 సంవత్సరాలు. ఏడాది తర్వాత ఆమెను సీనియర్ టీంలోకి తీసుకున్నారు. దేశం తరఫున జట్టులోకి వచ్చిన అతి పిన్నవయసు క్రీడాకారిణిగా - కేవలం 14 సంవత్సరాలు - చరిత్రకెక్కింది. అనతికాలంలోనే ఆమె అంతర్జాతీయ హాకీలో తన ముద్ర వేసింది. ఇప్పుడు భారత జట్టుకు ఆమే వెన్నెముక. ఆమె ప్రతిభకు, కఠోర శ్రమకు తార్కాణం.. 200 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనటమే.

గోల్‌కీపర్ సవితకు.. రాణి లాగా హాకీ ఆడటం మీద అమితమైన ఆసక్తి లేదు. కానీ.. తను హాకీ క్రీడాకారిణి కావాలన్న తన తాత మహీందర్ సింగ్ ఆకాంక్షను ఆమె తిరస్కరించలేకపోయింది. హరియాణాలోని ఒక గ్రామం వీరిది. బరువైన గోల్‌కీపింగ్ కిట్ తీసుకుని బస్సులో ప్రయాణించటం ఆమెకు నచ్చేది కాదు.

''అది మోస్తూ ప్రయాణించటంతో చాలా అలసిపోయేదానిని.. కానీ అవి తొలి రోజులు. నెమ్మదిగా ఈ ఆటతో నేను ప్రేమలో పడ్డాను. ఒలింపిక్స్‌లో, వరల్డ్ కప్‌లో ఆడటం గొప్ప అనుభవం. టోక్యో ఒలింపిక్స్‌లో మా సర్వశక్తులూ ఒడ్డుతాం'' అంటుంది సవిత.

భారత మహిళా హకీ జట్టు

ఫొటో సోర్స్, AFP

క్వాలిఫయర్స్‌లో డిఫెండర్ గుర్జీత్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. ప్రారంభ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసింది. సీరియస్‌గా ఉన్నట్లు కనిపించినా.. చురుకైన హస్యచతురత ఉందని ఆమెకు పేరు.

గుర్జీత్‌ది అమృత్‌సర్ సమీపంలోని ఒక గ్రామం. హాకీ శిక్షణ కోసం రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించేది. కొన్నాళ్లకు ఆమెను స్పోర్ట్స్ హాస్టల్ చేర్పించారు ఆమె తండ్రి.

''సరిహద్దు దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉండేదాన్ని. క్రీడా సదుపాయాలేవీ లేవు. అక్కడ ఎవరికీ హాకీ ఆట అర్థం కాదు. మా ఊరి నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి వ్యక్తిని నేనే కావటం చాలా సంతోషంగా ఉంటుంది'' అని కెప్పింది గుర్జీత్.

భారత మహిళా హాకీ జట్టు ఆత్మను మలచిన ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. సియామీ తండ్రి ఇటీవలే చనిపోయారు. అయినా తన ''బాధ్యతలను నిర్వర్తించటం కోసం'' ఆమె జట్టుతోనే ఉన్నారు. జూన్‌లో జపాన్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్‌లో గెలిచిన భారత జట్టులో ఈ యువతి అంకితభావం ఎన్నో హృదయాలను గెలుచుకుంది.

ఈ జట్టు విశిష్టమైనదని అంటాడు మారీజ్న్. ''ఒలింపిక్స్‌లో ఒక పతకం - బంగారు పతకం సాధించటం.. మా స్వప్నం. ఇది మొదటి అడుగు. అంత సులభం కాదు. కానీ మాకు పెద్ద కలలు ఉన్నాయి. ఈ యువతుల పోరాట స్ఫూర్తికి నేను గర్వపడుతుంటాను'' అని చెప్పాడు.

ఇప్పుడు మరి ఈ జట్టు సభ్యులు మాట్లాడుతున్నారా? అంటే.. ''ఇప్పుడు వీళ్లు మాట్లాడటం ఆపరు'' అంటున్నారు జట్టు సభ్యులు. ''కనీసం కొంచెం సేపు మాట్లాడకండి అని కోచ్ పదే పదే చెప్పాల్సి వస్తోంది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయటం లేదు'' అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)