మేగన్: మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన కెప్టెన్.. వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోనని ఎందుకు అన్నారు? ఆమె మీద అమెరికా ప్రజల ఆగ్రహం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ యువతులు.. రఫ్ అండ్ టఫ్ యువతులు. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
''వీరు సాహసికులు. స్వేచ్ఛగా నవ్వటం వీరికిష్టం. మమ్మల్నెవరూ ఆపలేరు. ఒక్క ముక్కలో చెప్తే.. మా బృందం ఒక అద్భుతం.''
మేగన్ రాపినో మాటలివి. అమెరికా ఫుట్‌బాల్ టీం కెప్టెన్ ఆమె. ఇదే మేగన్.. ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ఒక మాట చెప్పారు.
'ఏది ఏమైనా కానీ.. ఆ **** శ్వేతసౌధం లో నేను అడుగుపెట్టను.''
దానికి అమెరికా అధ్యక్షుడు స్పందించారు. 'ముందు మీరు గెలిచి చూపించండి. మిమ్మల్ని ఆహ్వానించాలో లేదో అప్పుడు నిర్ణయించుకుంటాం' అన్నారు. అక్కడే ఆయన ఆపేశారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
అహంకారపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు ట్రంప్. కానీ ఈసారి ఒకే ఒక్క ప్రకటన చేసి మాటలు ఆపేశారు.
అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే మహిళల నోరు మూయించటం కష్టం. చర్చలో పాల్గొంటున్న ఒక మహిళా రాజకీయ వేత్తను నిండు సభలో 'నీచ మహిళ' అంటూ ట్రంప్ అభివర్ణించగలరు.
కానీ.. తన దారికి అడ్డంవస్తే తాను ఎంతకైనా తెగించగలనని ఒక మహిళ ప్రకటించినపుడు.. ఆమెను నీచ మహిళగా ఎలా అభివర్ణించగలరు?
కాబట్టి.. అబ్బాయిలా క్రాఫ్‌తో గులాబీ రంగు జుట్టు గల ఈ స్వలింగసంపర్కురాలు నిప్పులు చెరుగుతూ ప్రసంగించారు. అది అమెరికాలో చర్చను రేకెత్తించింది.
అమెరికాలోనూ ప్రపంచమంతటా ఆమె ఇప్పుడు ఒక రోల్ మోడల్ అవుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
బహుశా అందుకే.. బాలికలను అదుపులో ఉంచాలని కోరుకునే.. ఆడపిల్లలు ఒక మూసలో 'ఆడపిల్ల'ల్లాగానే జీవించాలని కోరుకునే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు.. దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
మేగన్, ఆమె జట్టు ఫ్రాన్స్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలిచిన రోజు.. అమెరికాలో వారి పోస్టర్‌ను దహనం చేశారు. ఆమె పోస్టర్ల మీద అశ్లీల వ్యాఖ్యలు చేశారు. ఆమెను తిరస్కరిస్తూ స్లోగన్లు రాశారు.
ఒక పురుష కెప్టెన్.. తన జట్టును ప్రపంచ కప్‌లో గెలిపించినట్లయితే.. వీళ్లందరూ ఇలాగే స్పందించి ఉండేవారా? అని నాకు అనిపించింది.
మన ధోనీ, కోహ్లీలు ప్రపంచ కప్‌తో దేశానికి తిరిగి వస్తే.. వారిని ఆకాశానికి ఎత్తేవాళ్లమా? లేక వారి పోస్టర్లను చించేసేవాళ్లమా?

ఫొటో సోర్స్, LIONEL BONAVENTURE/AFP/GETTY IMAGES
మరి.. మేగన్ పట్ల అంతటి దిగ్భ్రాంతికర ప్రతిస్పందనలు ఎందుకు పుట్టాయి? సమాధానం చాలా స్పష్టం. ఈమె మీద కొందరికి కోపం ఉంది. ఎందుకంటే ఈ మహిళను అణచివేయలేరు. ఈమె అందరితో అపరాధభావంతో మాట్లాడరు.
ఈమె తన జట్టును ప్రపంచ కప్ పోటీలో గెలిపించారు. దాని మీద అమెరికాలో కొందరు మనుషుల ప్రతిస్పందన ఏమిటి?
''గెలుపు సరే. కానీ ఆమె నడవడిక సరిగా ఉండొద్దా? ఎప్పుడూ అంతగా గొంతెత్తి మాట్లాడటం ఎందుకు? చాంపియన్ అయినంత మాత్రన అంత అహంకారం ఎందుకు? కాస్త వినయంగా ఉండాలి'' - ఇదీ వారి మాట.

ఫొటో సోర్స్, Reuters
సారాంశాం ఇదే. ''వాళ్లను (జననాంగంతో) పట్టుకోవాలి'' అని మహిళల గురించి మాట్లాడిన అధ్యక్షుడితో అమెరికాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ.. గులాబీ రంగు జుట్టుతో మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే దుడుకు స్వభావంగల లెస్బియన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణిని వాళ్లు అంగీకరించలేరు.
నిజానికిది చాలా సహజం. ఒకవేళ ఆమెను ఆదర్శంగా తీసుకుని 12 - 15 ఏళ్ల బాలికలు విముక్తి గురించి, హక్కుల గురించి, వీటిన్నిటి గురించి కలలు కనటం మొదలుపెడితే ఏంకావాలి?
మేగన్ తన ప్రసంగంలో తన జట్టు సహచరుల గురించి మాట్లాడతారు: ''మేమందరం కలసికట్టుగా ఉన్నాం.. మాలో కొందరికి పింక్ జుట్టు ఉంది. కొందరి శరీరాలకు నలుపు లేదా తెలుపు రంగులు ఉన్నాయి. కొందరికి టాటూలు ఉన్నాయి. కొందరిది పొడుగు జట్టు. కొందరు స్వలింగ సంపర్కులు. కొందరు కాదు... మా అందరి పట్ల నేను గర్విస్తున్నా. మేం గెలిచాం. చాలా ప్రశాంతంగా ఉన్నాం.''
''ప్రపంచంలో అతి పెద్ద, అత్యుత్తమ నగరం.. మా ఆహ్వాన ప్రదర్శన వల్ల స్తంభించిపోయింది. ప్రపంచంలో అతి పెద్ద అత్యుత్తమ జట్టు మాది'' అని ఆమె సగర్వంగా చెప్తారు. అది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక మహిళ సరిగా నడచుకోవాలి. కానీ.. ఈ జనానికి వచ్చే చికాకు గురించి ఈమె.. అపరాధభావం లేని ఈ మహిళ.. అసలు పట్టించుకునేదే లేదు.
ఎటువంటి కారణం లేకపోయినా క్షమాపణ కోరే మహిళలను మనం చూస్తాం. సాయంత్రం ఏడు గంటల లోపు ఇంటికి తిరిగి రాలేకపోయినందుకే.. వాళ్లు క్షమాపణ కోరుతారు. జ్వరం వల్ల కుటుంబ సభ్యులకు భోజనం పెట్టలేకపోతే క్షమాపణ కోరుతారు.
ఉదయం అలారం మోగగానే లేవలేకపోతే క్షమాపణ చెప్తారు. కొడుకు స్కూలుకు వెళ్లటం లేటైతే క్షమాపణ చెప్తారు. పెళ్లయిన తర్వాత గర్భం దాల్చలేకపోతే క్షమాపణ చెప్తారు. సెలవు రోజున ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే క్షమాపణ చెప్తారు. కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఎవరైనా అంటే క్షమాపణ చెప్తారు.
ఇంటి నుంచే పనిచేసి ఎంతోకొంత సంపాదిస్తే క్షమాపణ చెప్తారు. వీళ్లు సంపాదిస్తూ.. భర్త సంపాదించకపోతే.. వీళ్లే క్షమాపణ చెప్తారు. కట్నం కోసం డబ్బులు వసూలు చేయాల్సి వచ్చినపుడు క్షమాపణ చెప్తారు. వారసత్వ ఆస్తిలో వాటాదారు అయినందుకు క్షమాపణ చెప్తారు. నిజానికి.. అసలు తామంటూ మనుగడ సాగిస్తున్నందుకే క్షమాపణ చెప్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక వింత అపరాధభావంతో బతుకుతున్న మహిళలు మనకు కనిపిస్తారు. ఇలాంటి మహిళలు మనకు తారసపడటం అలవాటుగా మారిపోయింది. అసలు ఇది.. మహిళలు ఎప్పుడూ ఇలాగే ఉండటం ఒక మామూలు విషయం.
కాబట్టి.. మేగన్‌ను, ఆమె జట్టు సహచరులను చూసినపుడు మనకు కోపం వస్తుంది. వాళ్లు జీవించే విధానాన్ని మనం జీర్ణించుకోలేం.
అలాగని.. మేగన్ చేసేదంతా సరైనదని కాదు. పోరాటంలో చెప్పకూడని విషయాలు చెప్తానని స్వయంగా అంగీకరిస్తారు.
ఆమె దుందుడుకుతనం సరైనదని నేను అనటం లేదు. కానీ.. ఆమె ఒక మహిళ అయినంత మాత్రాన ఆమె విజయంలోనూ వినయంగా ఉండాలని, పద్ధతిగా నడచుకోవాలని, అందరి పట్లా గౌరవప్రపత్తులతో ఉండాలనేటువంటి భావనలను బలంగా వ్యతిరేకించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరైనా ఏదైనా సాధించినందుకు ఆకాశాన్ని అందుకున్నట్లు భావించకూడదు.. విచారంలో దుందుడుకుగా ప్రవర్తించకూడదు అనేది తాత్వికంగా, నైతికంగా సరైనదే.
క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో.. ఓడిపోయినా కూడా సంయమనం పాటించే కెన్ విలయమ్సన్ ఉన్నారు.. విస్పష్టంగా ఔటైనా కూడా అంపైర్‌తో పోట్లాడే జేసన్ రాయ్ కూడా ఉన్నారు.
ఈ రెండు రకాల ప్రవర్తనలనీ.. ఐదు వేళ్లూ ఎప్పుడూ సమంగా ఉండవంటూ మనం సమర్థిస్తాం. మేగన్‌కు కూడా అదే సమర్థన ఎందుకు ఉండదు?
మన యువతరం ఎదుగుతున్నపుడు వారిమీద వీటన్నిటి ప్రభావం ఉంటుంది. ఎటువంటి కారణమూ లేకుండానే అపరాధభావంతో జీవించటం వాళ్లు కూడా నేర్చుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మారాలి. మేగన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇలా చెప్తారు: ''మనం ప్రేమించటం పెరగాలి.. ద్వేషించటం తగ్గాలి. తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వినాలి. ఈ ప్రపంచాన్ని అందంగా మలచే బాధ్యత మన మీద ఉంది. మీరు చేయగలిగింది చేయండి. మీకన్నా మరింత ఉత్తమ వ్యక్తిగా ఉండండి.''
ఆ మాట అన్న తర్వాత రెండు చేతులూ చాచి తనదైన ఫోజుతో నిలుచున్నారామె. ఆమె టీమ్ సహచరులు కేరింతలు కొట్టారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమె ప్రపంచాన్ని చాలెంజ్ చేస్తున్నట్లు కనిపించారు. కానీ.. నిజానికి ఆమె ప్రపంచాన్ని తన రెండు చేతులూ చాచి ఆలింగనం చేసుకున్నట్లుంది.
ఈ రెండు భావనలూ తప్పు కాదని నేను అనుకుంటున్నా. ప్రపంచాన్ని సవాల్ చేసే స్వేచ్ఛ.. ఆలింగనం చేసుకునే స్వాతంత్ర్యం మన బాలికలకు ఉండాలి. రెండు చేతులూ చాచి ఆత్మవిశ్వాసంతో నిలుచోవాలి. ఎటువంటి అపరాధభావనలూ లేకుండా.
ఇవి కూడా చదవండి:
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- రిచా భారతి: ఖురాన్ ప్రతులు పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమేనంటున్న ఝార్ఖండ్ యువతి
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏమిటి? దీని మీద వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








