తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏమిటి? దీని మీద వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, APCM/Facebook
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమలలో వీఐపి బ్రేక్ దర్శనాన్ని రెండు మూడు రోజులలోనే రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
''ప్రజలు కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. భక్తులకు దర్శనం కోసం కావలసిన ఏర్పాట్లు చేసేందుకే మేం ఇక్కడ ఉన్నది. ప్రజలు కోరుకుంటునట్టే బ్రేక్ దర్శనాలు.. ఎల్1, ఎల్2, ఎల్3 వ్యవస్థ రద్దు చేయాలని ఈఓని ఆదేశించాం. రెండు మూడు రోజులలోనే రద్దు చేసి, ప్రత్యామ్నాయ ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలపై నిర్ణయం తెలియజేస్తాం'' అని ఆయన చెప్పారు.
తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతించటం సాధారణ భక్తుల హక్కులను హరించటమేనంటూ దాఖలైన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరుపుతోంది.
దీనిపై గురువారానికి వివరణ ఇవ్వాలని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌కు నిర్దేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, President of India/Facebook
పిటిషర్ సుబ్బారావు తరఫు న్యాయవాది బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ''బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ప్రకటన చేశారని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రకటనను పరిగణనలో తీసుకోలేమన్న హైకోర్టు.. రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఉంటే కోర్టు ముందు పెట్టాలని చెప్పింది'' అని పేర్కొన్నారు.
అయితే.. ''టీటీడీ బోర్డు ఇంకా ఏర్పాటు కాలేదు. చైర్మన్ నిర్ణయం ఒక్కటే సరిపోదు. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు చేసి, అందులో ఉన్న నిబంధనలనే ప్రోటోకాల్ దర్శనాలుగా పేరు మార్చి టీటీడీ తీసుకొస్తుంది అని హైకోర్టుకు తెలిపాం. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను కంటి తుడుపు చర్యగా కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని కోరాం'' అని వివరించారు.
పిటిషన్‌లో పొందు పరచిన అంశాల ప్రకారం.. దైవ ఆరాధన హక్కు అందరికి సమానమే అంటూ సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. భక్తులను వేరుచేసి చూడటం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషన్‌దారు చెప్పారు.

ఫొటో సోర్స్, KCR/Facebook
రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం మతం, కులం, పుట్టిన చోటు, లింగ వివక్ష లేకుండా చట్టం ముందు, ప్రభుత్వం ముందు అందరూ సమానమే. అలాగే ఆర్టికల్ 25 ప్రకారం పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా ఎవరి మతం వారు పాటించే హక్కు ఉంది.
తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలంటూ భక్తులని విభజించటం వల్ల సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నారంటూ పిటిషనర్ వాదిస్తున్నారు.
ఎల్1 కింద వీఐపీలు, పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు దర్శనం కలుగుతుంది. దీని కింద ఆలయంలో దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేక పూజలు, హారతి కూడా చేయించుకోవచ్చు.
ఎల్2 కింద సాధారణంగా టీటీడీ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అధికారులు ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనానికి ప్రత్యేక పూజలు కానీ హారతి కానీ ఉండదు.

ఫొటో సోర్స్, TTD
ఎల్3 కింద మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఉన్నత అధికారులు ఇచ్చే రికమండేషన్ లెటర్ ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు. ఇందులో కాస్త దూరం నుంచి ఆలయంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా దర్శనం కేటగిరీలలో భక్తులను విభజించటం వల్ల అవినీతి కూడా పెరిగిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర. ఈ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని కోరారు.
ఇదివరకే ఇదే అంశం మీద మంగంటి గోపాల్‌రెడ్డి అనే సామాజిక ఉద్యమకారుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.

ఫొటో సోర్స్, TTD
ఇప్పుడు టీటీడీ చైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. కానీ అసలు వీఐపీ దర్శనం అనేదానిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన అంటున్నారు.
''దేవుడు ముందు అందరూ సమానమే. కానీ ఇదివరకే తిరుమల దైవ దర్శనానికి సంవత్సరంలో ఒక్కసారే రావాలని తెలిపారు చైర్మన్. ఆ రూల్ కూడా గట్టిగా అమలు చేయాలి. బ్రేక్ దర్శనాలు అమ్ముకుంటున్నారు. అది వాస్తవం. దీని గుర్తించి టీటీడీ నిర్ణయం తీసుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు.
భక్తులు కూడా ఇదే సరైన పద్ధతి అంటున్నారు. ''దేవుడిని దర్శించుకోవటానికి అందరూ ఒకటే కదా. ఎంతటి వారైనా కాస్త సమయం వెచ్చించి రావాల్సిందే. కాకపోతే అక్కడ వెయిటింగ్ లైన్ త్వరగా కదిలేలా చూడాలి'' అని చరణ్ అనే వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- "ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" ఏపీ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








