విశ్వభూషణ్ హరిచందన్: "ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా"

ఫొటో సోర్స్, BiswabhushanHarichandan/Facebook
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఒడిశాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి విశ్వభూషణ్ హరించదన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఇఎస్ఎల్ నరసింహన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా అనసూయ ఉయికేను రాష్ట్రపతి నియమించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న విశ్వభూషణ్ హరిచందన్‌తో బీబీసీ మాట్లాడింది. "నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. 1971 నుంచీ నేను బీజేపీలో ఉన్నాను. ఒడిశాలో పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. నిన్న రాత్రి ప్రధాని మోదీ 9.30 ప్రాంతంలో నాకు ఫోన్ చేశారు. మీరు ఒడిశా వదిలి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. త్వరలోనే కీలకమైన బాధ్యతలు ఇవ్వబోతున్నామని చెప్పారు. నాకు గవర్నర్ పదవి లభించినందుకు చాలా ఆనందంగా ఉంది" అని ఆయన బీబీసీతో అన్నారు.
అంతేకాకుండా, "నేను చాలాకాలం ఒడిశా రెవెన్యూ మంత్రిగా చేశాను. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల మధ్య సమస్యలు నాకు తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు సామరస్యంగా పరిష్కారమయ్యేలా నా వంతు చేస్తాను" అని కూడా విశ్వభూషణ్ చెప్పారు.

విశ్వభూషణ్ హరిచందన్ 2002 - 09 వరకూ బీజేపీ - బీజేడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఒడిశా అసెంబ్లీకి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి జనతా పార్టీ నుంచి, మరోసారి జనతాదళ్ నుంచి, మూడుసార్లు బీజేపీ నుంచీ గెలిచారు. 1971 నుంచి జన సంఘ్ లో ఉన్నారు. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1975లో మీసా కింద అరెస్టయ్యారు. 1980-88 బీజేపీ ఒడిశా అధ్యక్షుడిగా ఉన్నారు. 1988లో జనతా పార్టీకి వెళ్లి, 96లో బీజేపీకి వచ్చారు.
ఆయన లా చదివారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. రచయిత కూడా అయిన విశ్వభూషణ్, రాణాప్రతాప్, మానసి, అష్టశిఖ వంటి రచనలు చేశారు.
రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్ళు పూర్తయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్ నియామకం జరగడంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, "ఎట్టకేలకు ఇది జరిగింది. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లయింది. పక్క రాష్ట్ర రాజధానిలో ఉన్న గవర్నర్ను కలవడం ఇబ్బందిగా ఉంటోంది. ఈ కొత్త నియామకాన్ని మేం స్వాగతిస్తున్నాం. మేం ప్రస్తుతం గవర్నవర్ ఉండటానికి మంచి వసతి కోసం వెతుకుతున్నాం. ఈలోపు, ఆయనకు విజయవాడలో క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- లింగమనేని గెస్ట్ హౌజ్ గురించి చంద్రబాబు, లింగమనేని రమేశ్ 2016లో ఏమన్నారు....
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- కేరళ: ఈ వానా కాలాన్ని దాటేది ఎలా? గతేడాది వరదల నుంచి పాఠాలు నేర్చుకుందా?
- యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు?
- ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టు ఇదే, టీమిండియా నుంచి ఇద్దరికి చోటు
- లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ‘బిగ్ బాస్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




