రథయాత్ర కోసం అస్సాం నుంచి గుజరాత్‌కు 3,100 కి.మీ. రైల్లో ఏనుగుల తరలింపు: ఇది క్రూరమంటున్న జంతు సంరక్షకులు

ఏనుగు

ఫొటో సోర్స్, Getty Images

ఒక ఆలయంలో జరిగే రథయాత్రలో పాల్గొనేందుకు నాలుగు ఏనుగులను ఈశాన్య భారత రాష్ట్రం అస్సాం నుంచి పశ్చిమాన ఉన్న గుజరాత్‌కు రైల్లో తరలించాలని నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 3,100 కిలోమీటర్లు పైబడిన ఈ సుదూర ప్రయాణం ఏనుగులకు ప్రమాదకరమని, వాటికి ప్రాణహాని కూడా కలగొచ్చని జంతుహక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏనుగులను అస్సాంలోని తీన్సుకియా పట్టణం నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తరలించేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

రైల్వే అధికారులు వీటిని తీసుకెళ్లేందుకు రైలుకు ప్రత్యేకంగా ఒక కోచ్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

ఏనుగు

ఫొటో సోర్స్, AFP

జగన్నాథ ఆలయంలో ఏటా జరిగే రథయాత్రలో పాల్గొనేందుకు జులై నాలుగో తేదీలోపు వీటిని అహ్మదాబాద్‌ తరలించాలని నిర్ణయించారు. తరలింపు తేదీ ఇంకా ఖరారు కాలేదు.

ఈ రైలు ప్రయాణం మూడు నుంచి నాలుగు రోజులు సాగుతుంది.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో, ఏనుగుల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈసారి ఆయన రాకపోవచ్చని ఆలయ అధికారులు చెప్పారు.

తమ ఆలయం వద్ద ఉండే ఏనుగుల్లో మూడు ఏనుగులు గత సంవత్సరం వృద్ధాప్యం కారణంగా చనిపోయాయని, అందుకే రెండు నెలల అవసరం కోసం వీటిని అస్సాం నుంచి తెప్పించుకోవాలని నిర్ణయించామని ఆలయ ట్రస్టీ మహేంద్ర ఝా బీబీసీతో చెప్పారు.

ఏనుగు

ఫొటో సోర్స్, Getty Images

ఏనుగుల తరలింపు ప్రణాళిక క్రూరంగా, అమానవీయంగా ఉందని జంతుహక్కుల కార్యకర్తలు, వన్యప్రాణి సంరక్షకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తర భారతంలో ఈ ఏనుగులు ప్రయాణించే మార్గంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన ఉన్నాయని వారు ప్రస్తావిస్తున్నారు.

దేశంలోని వాయువ్య ప్రాంతంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని, వేడిని భరించలేక రైలు ప్రయాణాల్లో కొందరు చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయని అస్సాంలోని గువాహటికి చెందిన వన్యప్రాణి సంరక్షకుడు కౌశిక్ బారువా చెప్పారు.

ఏనుగులను సమశీతోష్ణ వాతారణం లేని కోచ్‌లో ప్యాసింజర్ రైల్లో తీసుకెళ్లనున్నారని, రైలు గరిష్ఠంగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని, అలాంటి పరిస్థితులు ఈ మూగజీవాలకు ఎంత కష్టంగా ఉంటాయో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, మనుగడకై మనుషులతో గజరాజుల పోరు

ప్రకాశ్ జావడేకర్‌కు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లేఖ

"ఈ ప్రయాణంలో ఏనుగులకు వడదెబ్బ తగలొచ్చు. అవి షాక్‌కు గురి కావొచ్చు. చనిపోవచ్చు కూడా" అని కౌశిక్ ఆందోళన వ్యక్తంచేశారు.

అవసరమైన లాంఛనాలు పూర్తిచేసినందున ఏనుగుల తరలింపునకు చట్టపరంగా సమస్య లేకపోవచ్చని, కానీ ఈ జీవాల సంక్షేమం సంగతేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను అస్సాంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ కోరారు. ఈ విషయమై గురువారం ఆయనకు లేఖ రాశారు.

దేశంలో దాదాపు సగభాగం ఆరు దశాబ్దాల్లోనే తీవ్రమైన కరవును ఎదుర్కొంటోందని, ప్రస్తుత పరిస్థితులు ఏనుగుల తరలింపునకు ఏ మాత్రం అనుకూలమైనవి కావని, అవి తీవ్రమైన చర్మ ఇన్‌ఫెక్షన్ బారిన పడొచ్చని, డీహైడ్రేషన్‌కు గురికావొచ్చని గౌరవ్ తన లేఖలో ఆందోళన వెలిబుచ్చారు.

ఏనుగుల తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేలా అస్సాం ప్రభుత్వానికి సూచించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

తరలింపుపై కఠినమైన నిబంధనలు

భారత్‌లో ఏనుగులు రక్షిత జీవజాతుల కిందకు వస్తాయని, వీటి తరలింపుపై కఠినమైన నిబంధనలు ఉన్నాయని జీవశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ విభూతి ప్రసాద్ లహ్‌కర్ చెప్పారు.

ఏనుగు

ఫొటో సోర్స్, STRDEL

నిబంధనల ప్రకారం ఏనుగును ఏకబిగిన 30 కిలోమీటర్లకు మించి నడిపించకూడదు. ఆరు గంటలకు మించి ప్రయాణం చేయించకూడదు.

ఏనుగుల తరలింపునకు అనుమతి ఇచ్చిన అస్సాం వన్యప్రాణి విభాగ అధికారులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరిస్తూ వచ్చారు.

జంతుహక్కుల కార్యకర్తలు, వన్యప్రాణి సంరక్షకుల నుంచి నిరసనలు వచ్చాక, వాళ్లు ప్రత్యామ్నాయ ప్రణాళికపై చర్చిస్తున్నారని ఓ వన్యప్రాణుల నిపుణుడు తెలిపారు. అవసరమైనప్పుడు ఆగుతూ ప్రయాణం కొనసాగించేందుకు వీలుగా ఈ ఏనుగులను ట్రక్కుల్లో తరలించాలని, వెంట అటవీశాఖ జంతువైద్యుడిని ఉంచాలని చెబుతూ ఒక సూచన వచ్చిందని వివరించారు.

ఈ సూచనను కౌశిక్ బారువా కొట్టిపారేశారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌కు ఈ ఏనుగులు అవసరమేలేదని ఆయన చెప్పారు.

"వన్యప్రాణి చట్టాల ప్రకారం ఏనుగులను ప్రదర్శించకూడదు. సర్కస్‌లలో వీటితో ప్రదర్శనలు ఇవ్వకూడదు. జంతు ప్రదర్శనశాలల్లోనూ వీటిని ప్రదర్శనకు ఉంచకూడదు. ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో ఏనుగులను వాడేందుకు మాత్రం ఎందుకు అనుమతించాలి? జంతువులకు హక్కులు లేవా" అని కౌశిక్ ప్రశ్నించారు.

"దేశంలో గణపతిని పూజిస్తాం. మరి దేవుళ్ల(ఏనుగుల)పై ఆలయం ఎందుకు అంత క్రూరత్వం ప్రదర్శిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, మనుషులకూ, ఏనుగులకు మధ్య సంఘర్షణకు డ్రోన్లతో పరిష్కారం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)