‘బంగాళాదుంపలు’ పండించారని రైతులపై వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్న పెప్సీకో

ఫొటో సోర్స్, facebook/Lay'sIndia
- రచయిత, హరితా కాండ్పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళాదుంపల వెరైటీని పండించారంటూ గుజరాత్ రైతులపై వేసిన కేసును పెప్సీకో ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది.
ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళా దుంపలను భారత్‌లో కంపెనీ అనుమతి లేకుండా పండిస్తున్నారంటూ ఏప్రిల్‌లో కొందరు రైతులపై పెప్సీకో ఇండియా కేసు పెట్టింది. ఇది కాపీరైట్ ఉల్లంఘన అని పేర్కొంది.
అయితే, కేసు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇంకా తమకు చేరలేదని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యజ్ఞిక్ బీబీసీకి చెప్పారు.
దీనిపై పెప్సీకో ఓ ప్రకటన విడుదల చేసింది.
"పెప్సీకో 30 ఏళ్లుగా భారత్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కాలంలో ఉత్తమమైన బంగాళాదుంపల సాగు కార్యక్రమంలో భాగంగా కొత్త రకాలను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతుల అభ్యున్నతికి తోడ్పడింది. దీంతో రైతులు అత్యధిక దిగుబడులు సాధించారు, నాణ్యత పెరిగింది. పంటకు మంచి ధర పలికింది. వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆ రైతుల విస్తృత ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడిన పెప్సీకో, తమ రిజిస్టర్డ్ వెరైటీని రక్షించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రైతులతో ఎదురైన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికే పెప్సీకో ప్రయత్నించింది. ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతంరం రైతులపై వేసిన కేసును వెనక్కితీసుకోవాలని పెప్సీకో నిర్ణయించుకుంది. విత్తన పరిరక్షణకు దీర్ఘకాలిక పరిష్కారం వైపే మేం మొగ్గుచూపుతున్నాం. మాతో పాటు కలసి పనిచేసే వేలాది రైతులకు ఉత్తమ సాగు విధానాలను అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది" అని పెప్సీకో ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images/reuters
అసలు వివాదం ఏంటి?
అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ గుజరాత్‌లో బంగాళాదుంపలు సాగు చేసే రైతులపై కేసు పెట్టింది.
లేస్(LAYS) చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళాదుంపల వెరైటీని తాము భారత్‌లో రిజిస్టర్ చేశామని ఈ కంపెనీ చెప్పింది.
రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలు సాగు చేయకూడదని కంపెనీ చెబుతోంది. భారత్‌లో కంపెనీ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలను పండించిన రైతులపై గుజరాత్‌లో దావా వేసింది.
కంపెనీ రైతులపై కేసులు పెట్టడం గురించి వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
రైతులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న వ్యవసాయ సంఘాలు పెప్సీకో ఈ కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
దీనిపై 190 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. కేసు వాపసు తీసుకోవాలని పెప్సీకోకు చెప్పాలని ప్రభుత్వాలను కోరారు.
"పెప్సీకో కంపెనీ సాబర్‌కాంఠాలో రైతులపై కేసులు పెట్టింది. ఒక్కొక్కరిపైనా కోటి రూపాయల దావా వేసింది" అని జతిన్ ట్రస్ట్ కార్యకర్త కపిల్ షా చెప్పారు.
అంతకు ముందు 2018లో కూడా గుజరాత్ అరవల్లీ జిల్లాలోని రైతులపై ఇలాంటి కేసులే నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీ ఏం చెప్పింది?
భారత్‌లోని పెప్సీకో కంపెనీ బీబీసీ ప్రశ్నలకు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది.
కంపెనీ తన హక్కులు కాపాడుకోడానికే ఈ చర్యలు తీసుకుందని తెలిపింది.
పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ 2031 జనవరి 31 వరకూ ఉంది.

ఫొటో సోర్స్, AFP/GETTY
దీనిపై రైతులేమన్నారు
అరవల్లీ జిల్లాలోని ఐదుగురు రైతులు ఎఫ్ఎల్ 2027 రకం బంగాళాదుంపలు నాటారని ఆరోపిస్తూ పెప్సీకో 2018లో కోర్టులో కేసు వేసింది. వారిలో జిగర్ పటేల్ ఒకరు.
బీబీసీతో మాట్లాడిన జిగర్ పటేల్ పూర్వీకుల నుంచి వచ్చిన రెండెకరాల భూమిలో తన కుటుంబం బంగాళాదుంపలు పండిస్తోందని చెప్పారు. ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపలు పండించినందుకు గత ఏడాది పెప్సీకో తనపై 25 లక్షల రూపాయలకు దావా వేసిందన్నారు. ఇప్పటివరకూ ఆయన 11 సార్లు కోర్టుకు హాజరయ్యారు. మేలో ఈ కేసు తదుపరి విచారణ ఉంది.
అరవల్లీ జిల్లాలో మరో రైతు జీతూ పటేల్ కూడా ఇదే కేసులో కోర్టుకు వెళ్తున్నారు.
"ఈ ప్రాంతంలోని బంగాళాదుంపల రైతులు వెండర్ల ద్వారా పెప్సీకో కంపెనీతో కలుస్తారు. మా అన్న పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్నారు. కంపెనీ వారు చెకింగ్ కోసం వచ్చినపుడు, నేను అక్కడ పొలంలో ఉన్నా. కంపెనీ నాపైన కేసు వేసిందని కొంతకాలం తర్వాత నాకు తెలిసింది" అని జీతూ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAILESH CHOUHAN
నాలుగెకరాల భూమిలో పెప్సీకో కంపెనీ కార్యక్రమం ప్రకారం మా కుటుంబం బంగాళాదుంపలు పండించేదని జీతూ చెప్పారు.
2019లో పెప్సీకో కంపెనీ నుంచి కేసును ఎదుర్కుంటున్న సాబర్కాంఠాలోని వాడాలీ తాలూకా రైతులను బీబీసీ కలిసింది. కానీ వారు ఈ అంశంపై మాట్లాడ్డానికి నిరాకరించారు.
రైతుల దగ్గర బంగాళాదుంపలను తనిఖీ చేయడానికి ఎలాంటి పరికరాలు ఉండవని జిగర్ చెబుతున్నారు. తాము వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి వాటిని సాగు చేస్తుంటామని అన్నారు.
"చాలా రకాల బంగాళాదుంపలు ఒకేలా కనిపిస్తాయి. ఏది ఏ రకమో రైతులకెలా తెలుస్తుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కంపెనీలు రైతులపై కేసులు వేయవచ్చా
దీనిపై బీబీసీతో మాట్లాడిన భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అంబూ భాయ్ పటేల్ "ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపలపై ప్రత్యేక హక్కులున్నాయంటున్న పెప్సీకో ఇండియా లిమిటెడ్ వాదన నిలబడదు. రైతులు చాలా ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొస్తారు. అలాంటప్పుడు కంపెనీ వాళ్లపై కోట్ల రూపాయలకు కేసులెలా వేస్తుంది. చిన్న చిన్న రైతుల వల్ల మాకు ముప్పు వస్తుందని ఎలా వాదిస్తుంది" అన్నారు.
ఇటు జతిన్ ట్రస్ట్‌కు సంబంధించిన కపిల్ షా "భారత్‌లో 'ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్(PPV & FRA)' కింద రైతులు విత్తనాలు నాటుకోవడానికి భద్రత కల్పించారు" ఉన్నారు అన్నారు.
"పెప్సీకో ఇండియా కంపెనీ రైతులను భయపెట్టడం, బెదిరించడం కోసమే ఇవన్నీ చేస్తోంది అని గుజరాత్ రైతు సంఘం ఖేడూత్ ఏకతా మంచ్‌కు సంబంధించిన సాగర్ రబారీ ఆరోపించారు.
190 మందికి పైగా కార్యకర్తలు ప్రభుత్వానికి రాసిన లేఖలో "పెప్సీకో పీపీవీ అండ్ ఎఫ్ఆర్ఎలోని సెక్షన్ 64ని తమకు అనుకూలంగా చెప్పుకుంటోందని" తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం రిజిస్టర్ చేసిన విత్తనాలను రకాలను ఏ అనుమతులు లేకుండా అమ్మడం, ఎగుమతులు, దిగుమతులు చేయడం, ఉత్పత్తి చేయడాన్ని కాపీరైట్ ఉల్లంఘనగా భావిస్తారు.
అయితే ఈ చట్టంలో ఇన్ని నిబంధనలు ఉన్నా, ఇందులోనే ఉన్న సెక్షన్ 39(4) ప్రకారం రైతులు విత్తనాలను పొదుపు చేయడం, వాటిని ఉపయోగించడం, మళ్లీ నాటడం, మార్పిడి చేసుకోవడం, పంచుకోవడం, ఆ విత్తనాల ద్వారా వచ్చిన పంటను అమ్ముకోవడం చేయచ్చు.
వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ కూడా దానిని ధ్రువీకరించారు. విత్తనాలను బ్రాండింగ్ చేసి అమ్ముకోకూడదని చెప్పారు.
కంపెనీ ఏం కోరుకుంటోంది
ఏప్రిల్ 26న సాబర్కాంఠా రైతులపై పెప్సీకో వేసిన కేసులపై అహ్మదాబాద్‌లోని కమర్షియల్ కోర్టులో విచారణలు జరిగాయి.
ఈ అంశాన్ని పరిష్కరించుకుందామని పెప్సీకో సూచించింది. రైతులు ఈ విత్తనాలు ఉపయోగించకూడదని, ఒకవేళ వీటిని ఉపయోగించాలంటే వారు కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకోవాలని షరతులు పెట్టింది.
రైతుల తరఫు వకీలు ఆనందవర్ధన్ యాజ్ఞానిత్ కంపెనీ షరతులపై రైతులు ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
లేస్ చిప్స్ తయారయ్యే ఈ బంగాళాదుంప ఎక్కడిది
"ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపను 2003లో అమెరికాలో అభివృద్ధి చేశారు. భారత్‌లో దానిని ఎఫ్‌సీ5 పేరుతో పిలుస్తారు. దీనిలోని లక్షణాలు ప్రాసెసింగ్ కోసం ఉపయోగించే బంగాళాదుంపలకు తగినట్లు ఉంటాయి" అని డీసా ఆలూ రీసెర్చ్ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎన్ పటేల్ తెలిపారు.
పెప్సీకో కంపెనీ రైతులతో కాంట్రాక్ట్ పద్ధతిలో బంగాళాదుంపలు పండిస్తుంది. దీని ప్రకారం అది రైతులకు తమ ప్రత్యేక విత్తనాలు అందిస్తుంది.
వాటి ద్వారా పండిన బంగాళాదుంపల్లో 40 నుంచి 45 మిల్లీమీటర్ వ్యాసం ఉన్న వాటినే తీసుకుంటుంది. అంతకంటే చిన్నవి తీసుకోదు.

ఫొటో సోర్స్, PARESH PADHIYAR
గూగుల్ పేటెంట్స్ ప్రకారం ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపను మొదట అమెరికాలోని రాబర్ట్ హూప్స్ పండించారు.
2003లో నార్త్ అమెరికాలోని ఇంక్ అనే ఒక కంపెనీలో ఫ్రీటోలె దీనిని పేటెంట్ చేయించారు. ఈ పేటెంట్ 2023 వరకూ ఉంది.
"ఏదైనా ఒక విత్తనాన్ని రిజిస్టర్ చేసినపుడు, దానిపై 20 ఏళ్ల వరకు ప్రత్యేక హక్కులు ఉంటాయి.
ఆ కాలపరిమితి తర్వాత ఎవరైనా ఏ అనుమతి లేదా రాయల్టీ లేకుండా ఆ విత్తనాలను ఉపయోగించుకోవచ్చు" అని డాక్టర్ ఆర్ఎన్ పటేల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గంగా ప్రక్షాళన ప్రాజెక్టు తర్వాత నది మరింత కలుషితమైపోయిందంటున్న కాంగ్రెస్, ఇది నిజమేనా
- ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి
- మోదీపై ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయట్లేదు?
- ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ఇరాన్: నెతన్యాహు
- లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









