వెనజ్వేలా: అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అక్కడ తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి సంక్షోభంలో శ్మశానం గురించి ఆలోచించేదెవ్వరు? అందుకే సమాధులను ధ్వంసం చేసి, అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.

అది వెనజ్వేలా. దేశంలో సంక్షోభం తీవ్రంగా ఉంది. రాజధాని కరాకస్‌లో కొందరు నేరగాళ్లు.. సమాధులు పగులగొట్టి అస్థిపంజరాలపై ఉండే ఆభరణాలు, బంగారు దంతాలతోపాటు.. ఎముకలను కూడా వదలడం లేదు.

చనిపోయిన ఆప్తుల సమాధులను చూడటానికి వచ్చినపుడు, అవి ధ్వంసమై కనిపిస్తే ఎలావుంటుంది? వెనజ్వేలాలో ఈ సంఘటనలు వేలాది కుంటుంబాలను కలచివేస్తున్నాయి.

ఆఫ్రో అమెరికన్ సంటీరియా మతంలో ఆరాధనకు ఎముకలు, పుర్రెలు అవసరం. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అస్థిపంజరాలను దొంగలిస్తున్నారు.

''ఈ శ్మశానంలో ఎక్కడ చూసినా తవ్విన సమాధులే కనిపిస్తున్నాయి. చివరకు వెనజ్వేలా మాజీ అధ్యక్షుడు రొజూలో గలెగాస్‌ సమాధిని కూడా తవ్వేశారు'' అని ఫాదర్ విల్‌ఫ్రెడో అన్నారు. ఆయన ఇక్కడ బోధకుడుగా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు

''ఈ పనికి పాల్పడ్డవారి మనసు కూడా ఈ పని తప్పు అనే చెప్పే ఉంటుంది. కానీ వారికి కనీస విజ్ఞత కూడా లేనట్లుంది. 'నా దగ్గర పైసా కూడా లేదు కనుక నేను ఇలా చేస్తున్నా' అని సర్దిచెప్పుకోవడం సరైనది కాదు. ఇది తప్పు అని మీకూ తెలుసు. దీనికి ఏదో ఒకరోజు చట్టం లేదా దేవుడు శిక్షిస్తాడు'' అని విల్‌ఫ్రెడో అన్నారు.

ఆప్తుల సమాధులను ధ్వంసం చేయడం వారి కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. ఫాదర్ విల్‌ఫ్రెడో తన ప్రార్థనలతో వారి మనసులు కుదుటపడేలా చేస్తున్నారు.

శ్మశానం వద్ద గస్తీ పెంచినట్లు వెనజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మడూరో చెబుతున్నప్పటికీ ఇక్కడ భద్రతా దళాల జాడ కనిపించడం లేదు. మళ్లీ నాశనం చేస్తారేమో అన్న ఉద్దేశంతో, 'ఇప్పటికే ఈ సమాధిని దోచుకున్నారు!' అని.. వాటిపై రాసి ఉంచుతున్నారు.

ఎలాడియో బాస్తిదా భార్య 18 నెలల కిందట రొమ్ము కాన్సర్‌తో మరణించారు. భార్యను పోగొట్టుకొని శోకంలో ఉన్న ఎలాడియో, ఇప్పుడు ఆమె భౌతికకాయాన్ని కూడా ఎవరైనా దోచుకుంటారేమోనని భయపడుతున్నారు.

ఎలాడియో బాస్తిదా
ఫొటో క్యాప్షన్, భార్యను పోగొట్టుకొని శోకంలో ఉన్న ఎలాడియో, ఇప్పుడు ఆమె భౌతికకాయాన్ని కూడా ఎవరైనా దోచుకుంటారేమోనని భయపడుతున్నారు.

''ఈ నేరాలకు పాల్పడ్డ వారిని అరెస్టు చేసి, తగిన శిక్ష విధించాలి. గౌరవించాల్సిన వాటిని తప్పకుండా గౌరవించాలి. కానీ వీరికి మర్యాదలు తెలియవు. సమాధులను దోచుకునే వారు ఎవరినీ గౌరవించరు'' అని ఎలాడియో బాస్తిదా అన్నారు.

ఒకనాడు ఎంతో గౌరవమర్యాదలతో పూడ్చిన మృతదేహాలను... నేడు నేరగాళ్లు, మంత్రగాళ్లు పెకిలిస్తున్నారు.

వెనజ్వేలాలోని దిగజారిన పరిస్థితులు, సంక్షోభం... చనిపోయిన వారికి కూడా శాంతి లేకుండా చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)