ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: తెలుగునాట కుల రాజకీయాలు... ఆ రెండు కులాల మధ్యే ప్రధాన పోటీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కులాల ప్రస్తావన లేకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను చర్చించే పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాల్లో చాలా కులాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా రాజకీయాలను శాసిస్తున్నాయి. బ్రిటిష్ పాలన కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల వరకూ ఓ రకంగా, ఆ తర్వాత 80ల వరకూ మరో రకంగా, అప్పటి నుంచి రాష్ట్ర విభజన వరకూ ఇంకో విధంగా తెలుగు నేలపై కుల రాజకీయాలు ప్రభావం సాగింది.
స్వాతంత్ర్యానికి ముందు
తెలుగునాట కులాలవారీగా రాజకీయ బలాన్ని విశ్లేషించాలంటే నిజానికి 11వ శతాబ్దం కాకతీయుల పతనం నుంచీ మొదలుపెట్టాలి. అంత గతాన్ని తవ్వకుండా, బ్రిటిష్ హయాంలో జరిగిన ఎన్నికలను గమనించినా ఆంధ్రాలో కుల రాజకీయాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో కులాల ప్రత్యక్ష పెత్తనాలు లేవు. పరోక్షంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాల ఆధిపత్యం ఉండేది. కానీ వారి ఆధిపత్యం ముస్లిం నవాబులకు లోబడి ఉండేది. ఆంధ్రలో పరిస్థితి విభిన్నం. ఎన్నికల రాజకీయాలు బలంగా ఉండేవి.
ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. బ్రాహ్మణులు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆ రోజుల్లో.. వారికి వ్యతిరేకంగా మిగిలిన అగ్ర కులాలు (వెలమ, కమ్మ, రెడ్డి, కాపు) జస్టిస్ పార్టీ వైపు మొగ్గాయి. వాటి మధ్య తేడా ఎంతగా ఉండేదంటే, జస్టిస్ పార్టీలో బ్రాహ్మణులను చేర్చుకోవడంపై కూడా పరిమితులు ఉండేవి. అయితే, ఈ జస్టిస్ పార్టీ మొత్తం జమీందార్లతో నిండి ఉండేది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ప్రీమియర్లుగా పనిచేసిన తెలుగువారిలో టంగుటూరి ప్రకాశం పంతులు (బ్రాహ్మణ), బొబ్బిలి రాజా (వెలమ), పానగల్లు రాజా (వెలమ), మునిస్వామి నాయుడు (కమ్మ), రామస్వామి రెడ్డియార్, సుబ్బరాయలు రెడ్డియార్ (తమిళ రెడ్లు), కూర్మా వెంకట రెడ్డి నాయుడు (కాపు-తెలగ), పీఎస్ కుమారస్వామి రాజా (రాజు) ఉన్నారు. వీరిలో కొందరు తమిళనాడు వారైనా కులాల రీత్యా ఆంధ్రాతో వారికి సంబంధం ఉంది. వారి మాతృభాష తెలుగు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ, కమ్మ, కాపులు ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రులయ్యారు. ఇక నిజాం రాజ్యం భారత్‌లో విలీనం అయిన తరువాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణా రావు బ్రాహ్మణులు.

ఫొటో సోర్స్, Getty Images
స్వాతంత్ర్యం తరువాత
స్వాతంత్ర్యం తరువాత కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పదవిని ఒక కొలమానంగా భావించవచ్చు. ఆ పదవి కోసమే ప్రధాన పోటీ జరుగుతుంది కాబట్టి ఈ పోలిక సరైనదే అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన, చేస్తున్న వ్యక్తుల కులాలు, ముఖ్యమంత్రి పదవి కోసం తపన పడుతున్న కులాలు, ఇప్పట్లో ఆ పదవి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేని కులాలు - ఇష్టమైనా, కష్టమైనా కులాల పరిస్థితులను ఇలానే విశ్లేషించి చూడాలి. కుల రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రధానంగా కొన్ని కులాల గురించి కూడా తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
వెలమ
తెలుగు రాజకీయాల్లో వెలమలు ప్రత్యేకం. జనాభా పరంగా చాలా చిన్న కులం అయినా సామాజికంగా, ఆర్థికంగా చాలా శక్తిమంతులు. ఆంధ్రా, తెలంగాణల్లో ఒకప్పుడు చాలా సంస్థానాలు వెలమల చేతుల్లో ఉండేవి. ఉత్తర తెలంగాణతో పాటు, ఉత్తరాంధ్రలో ఎక్కువ బలం కలిగిన ఈ కులం కోస్తా, రాయలసీమల్లో కూడా ఉనికిలో ఉంది.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ఇద్దరు వెలమలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1973-78 మధ్య జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చేశారు. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయకుండా ఈ వర్గం వారు వివిధ పార్టీల్లో ఉంటూ వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో వెలమల ప్రాతినిధ్యం పెరిగింది. అటు టీఆర్ఎస్ అధినాయకత్వం వెలమ వర్గమే కావడంతో ఇక్కడ ముఖ్యమంత్రి పదవి వెలమల చేతిలోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రెడ్డి
ఆంధ్రా, తెలంగాణ రెండు చోట్లా రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రెడ్లు. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో వీరి ప్రభావం ఎక్కువ. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ తక్కువ. 1956 నుంచి 1983 మధ్య ముగ్గురు మినహా ముఖ్యమంత్రులంతా రెడ్లే.
'బ్రాహ్మణుల తరువాత హిందువుల్లో అత్యంత బలమైన వర్గం' అని సర్ అడ్వర్డ్ థ్రస్టన్ తన క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా పుస్తకంలో రెడ్ల గురించి వర్ణించారు.
దశాబ్దాల పాటు దక్షిణ తెలంగాణ, రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేవారో చెప్పడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి (గుంటూరు), నీలం సంజీవ రెడ్డి (అనంతపురం), బాగా రెడ్డి (మెదక్), వైఎస్ రాజశేఖర రెడ్డి (కడప) ఉదాహరణలు. కాంగ్రెస్ చరిత్రలో నెహ్రూ కుటుంబంతో కయ్యానికి దిగిన నలుగురు తెలుగు ప్రముఖుల్లో (బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, పీవీ నరసింహా రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి) ముగ్గురు రెడ్లే.
ఉమ్మడి రాష్ట్ర శాసన సభలో మూడింట ఒక వంతు రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులున్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో అయితే రిజర్వుడు సీట్లు తప్ప అన్ని చోట్లా రెడ్లే ఎమ్మెల్యేలైన పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణ, రాయలసీమ వేరు కావడంతో రెడ్ల సంఖ్యా బలం పడిపోయింది. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలూ రెడ్లే అయ్యారు. కడప, నెల్లూరు వంటి చోట్ల కూడా అతి తక్కువ సంఖ్యలోనే అయినా బీసీలు, ముస్లింలు, బలిజలకూ రెడ్లు సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, FB/TDP
కమ్మ (చౌదరి)
కోస్తా ప్రాంతపు వ్యవసాయ కులం కమ్మ. ఆ వర్గానికి చెందినవారు దశాబ్దాల క్రితమే కర్నాటక, రాయలసీమ, తెలంగాణలకూ వ్యవసాయం కోసం వలస వెళ్లారు.
తెలుగు ప్రాంతంలో కీలకమైన సినిమా, మీడియా సహా అనేక రంగాల్లో ఈ కులానికి ఆధిపత్యం ఉంది.
1983 తరువాత కమ్మ వర్గానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర రావు అత్యల్పంగా నెల రోజులు, చంద్రబాబు నాయుడు అత్యధికంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వాతంత్ర్యానికి ముందే సామాజికంగా ఈ వర్గం చురుగ్గా ఉంది. పెరియార్ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు త్రిపురనేని రామస్వామి చౌదరి. కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే కాపు పురోహితులు, కమ్మ పురోహితులకు ఇదే నాంది. కానీ ఆ ఉద్యమం సంస్కృతీకరణవైపు వెళ్లి, చివరకు కులాల సంకెళ్లను దాటలేకపోయింది.
ప్రజాస్వామ్య వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలలో కూడా కమ్మలు చురుగ్గా ఉన్నారు. ఎన్‌టీఆర్ ముందు వరకూ కాంగ్రెస్‌లో ఎన్జీ రంగా కమ్మ వర్గం నుంచి కీలకమైన నాయకుడిగా ఉండేవారు. 83లో ఎన్‌టీఆర్ రాజకీయ ప్రవేశంతో మొట్టమొదటిసారి ఆ కులం సీఎం పదవి పొందింది. అంతకుముందు దాదాపు ఒక శతాబ్ద కాలం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా పూర్తి అధికారాన్ని కమ్మ కులం సొంతం చేసుకుంది మాత్రం ఎన్‌టీఆర్ హయాంలో తెలుగుదేశం ద్వారానే. తెలుగుదేశం అధినాయకత్వం ఈ కులం చేతిలోనే ఉంది.

కాపు
తెలగ, బలిజ (రాయలసీమ), ఒంటరి కులాలను కలపి ఇప్పడు కాపుగా పిలుస్తున్నారు. రెడ్లు, కమ్మ తరహాలో ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న కులం ఇది. జనాభా పరంగా కమ్మ, రెడ్లకంటే వీరు ఎక్కువ.
స్వాతంత్ర్యానికి ముందు కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఈ వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత ఈ కులస్థులు కాంగ్రెస్ హయాంలో మెజార్టీ మంత్రి పదవులు దక్కించుకుంటూ వచ్చారు. 70, 80లలో వంగవీటి రంగా ఆ కులం నుంచి బలమైన శక్తిగా ఎదిగారు. ఆయన హత్యకు గురైన తరువాత కృష్ణా డెల్టాలో కాపు, కమ్మల మధ్య విద్వేషాలు పెరిగాయి. చివరకు 2019లో వంగవీటి రంగా కుమారుడు రాధా తెలుగుదేశంలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెడ్ల తరువాత కాపులకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఉండేది. 2014 నుంచీ కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం, వైసీపీ విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అధినాయకత్వం ఈ కులం చేతుల్లోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బీసీ
తెలుగునాట బీసీల్లో వంద వరకూ కులాలున్నాయి. వాటిలో చాలా చిన్న కులాల నుంచి మొదలుకొని జనాభాపరంగానూ, ఆర్థికంగానూ అత్యంత బలమైన కులాలూ ఉన్నాయి.
యాదవ, గౌడ (యాత, శ్రీశయన, ఈడిగ, శెట్టిబలిజ), మత్స్యకార, ముదిరాజ్, మున్నూరుకాపు, తూర్పుకాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ వంటి కులాలు డబ్బు లేదా జనాభా పరంగా ముందు వరుసలో ఉన్నాయి. తెలంగాణలో యాదవ, గౌడ్, మున్నూరు కాపులు.. ఆంధ్రలో తూర్పుకాపు, కొప్పుల వెలమ, గౌడ, యాదవ, మత్స్యకారులు.. రెండు చోట్లా పద్మశాలీలు రాజకీయంగా చురుగ్గా కనిపిస్తారు.
ఇప్పటి వరకూ బీసీలు ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. తెలుగుదేశం ప్రారంభానికి ముందు చెల్లాచెదురుగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఏకం చేసి తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆ పార్టీ సఫలం అయింది. తెలంగాణలో ఆ ఓటు బ్యాంకును గంపగుత్తగా టీఆర్ఎస్ తన్నుకుపోగా ఏపీలో బీసీలు ఎటు అనేది ఈ ఎన్నికల తరువాతే తేలనుంది.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం కాపులకూ, బీసీలకూ చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, గెలిచాక నెరవేర్చుకుంది. జనాభాలో బీసీల వాటా అత్యధికంగా ఉన్నా వారికి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో పార్టీలు స్థానిక బలాబలాలు, సమీకరణాల ఆధారంగానే వారికి సీట్లు ఇస్తున్నాయి. అయితే కేబినెట్‌లోనూ, చట్టసభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్సీ
భారతదేశపు తొలి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. దామోదరం సంజీవయ్య ఈ ఘనత సాధించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగానూ పనిచేశారు. కానీ ఆ వారసత్వం నిలబడలేదు. ఆయన సీఎం పదవి రెండేళ్లే కొనసాగింది.
ఆ తరువాత తెలంగాణ నుంచి జి వెంకటస్వామి ఆ స్థాయిలో ఎదిగారు. ఆయన కుమారులు రాజకీయాల్లో ఉన్నారు కానీ, దళిత వర్గం నుంచి వీరిద్దరి తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేత తెలుగు రాష్ట్రాల్లో రాలేదు.
ప్రస్తుతం ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ వివాదం బలంగా ఉంది. ఆ కులాలు ఒక్కటవ్వడంలో ఇది పెద్ద అడ్డంకిగా ఉంది. మెజార్టీ దళితులు ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటర్లుగా మారారు. దాదాపు 4 దశాబ్దాల తరువాత, 2011 నుంచీ ఆంధ్రలో వైసీపీ ఆ ఓటు బ్యాంకును చీల్చగలుగుతోంది. ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా రెండు ప్రధాన ఉప కులాలైన మాల, మాదిగ వర్గాలు రాజకీయంగా తగిన ప్రాధాన్యం సంపాదించుకున్నాయి.
ఇక తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ ఎంతో చర్చకు దారి తీసింది. మాల, మాదిగ వర్గాలకు కాకుండా మరో దళిత కులానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేశారు కేసీఆర్. ప్రభుత్వంలో అఖిల భారత సర్వీసుల అధికారులుగా పనిచేసిన దళితులు రిటైర్ అయ్యాక లేదా వాలంటరీ రిటైర్మెంటు తీసుకుని రాజకీయాల్లోకి రావడం గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్టీ
తెలంగాణలో ఎస్టీ కోటాలో ఎక్కువ రాజకీయ నాయకులు లంబాడీ వర్గానికి చెందిన వారున్నారు. ఇతర ఆదివాసీలకు ఈ విషయంలో చాలా అభ్యంతరాలున్నాయి. అవి ఎన్నో సార్లు గొడవలకూ దారి తీశాయి. ఈ మధ్య కాలంలో గోండు, ఇతర ఆదివాసీల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది.
లంబాడీలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు లేకపోవడం, తెలంగాణలో ఉండడంతో అక్కడి నుంచి వలస వచ్చిన వారితో ఆ వర్గం జనాభా 1970ల తరువాత విపరీతంగా పెరిగింది. దీంతో రాజకీయంగా లంబాడీలకు ఎదురు వెళ్లే ధైర్యం తెలంగాణలో ఏ పార్టీ చేయబోదు.
ఆంధ్రలో మాత్రం ఉత్తరాంధ్రలోనే గిరిజనుల ప్రభావం ఉంది. ఎరుక, యానాది కులాలు మిగిలిన రాష్ట్రమంతా ఉన్నా, రాజకీయంగా వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఉత్తరాంధ్ర మినహా ఇంకెక్కడా గిరిజనులకు రిజర్వు సీట్లు లేవు. అక్కడ కూడా బలమైన బగత, వాల్మీకి, కొండదొర వంటి కులాల మధ్య అంతర్గత సఖ్యత లేదు. ఆంధ్రలో గిరిజన నాయకత్వం మీద మావోయిస్టుల ప్రభావం ప్రత్యక్షంగా ఉంది. ఎందరో కీలకమైన గిరిజన నేతలు, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదుగుతున్నవారు మావోయిస్టుల చేతుల్లో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య
సంప్రదాయ అగ్రకులాలుగా చలామణీ అయిన ఈ మూడు కులాలకూ రాజకీయాల్లో పరిమిత స్థానమే ఉంది. 1960లతోనే తెలుగు రాజకీయాల్లో బ్రాహ్మణుల శకం ముగిసిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి నుంచి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు లేదా మూడు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం అయ్యారు.
రాజులుగా ప్రాచుర్యంలో ఉన్న క్షత్రియుల ప్రభావం తెలంగాణలో అసలు లేదు. చిత్తూరు జిల్లా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో వీరి ప్రభావం ఎక్కువ. వెలమల తరహాలోనే రాజులు కూడా జనాభా పరంగా అతి చిన్న కులమైనా సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలవంతులు. చాలా నియోజకవర్గాల్లో తమ ప్రభావాన్ని చూపించగలరు. ఒకప్పుడు గోదావరి జిల్లాల నుంచి వీరి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేది. అది క్రమంగా తగ్గింది.
కోమట్లుగా ప్రాచుర్యంలో ఉన్న వైశ్యులు రెండు రాష్ట్రాల్లోనూ అనేక పట్టణాల్లో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ మూడు కులాలు ఒక్కో శాసనసభలో ఒక్కోలా ప్రాతినిధ్యం దక్కించుకుంటూ వస్తున్నాయి. పక్కాగా ఏదో ఒక పార్టీకే పరిమితమై లేరు. కోమటి వర్గానికి చెందిన కె రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగుదేశం ప్రభావంతో కమ్మ, రెడ్ల మధ్యన అధికార పోటీ
రాజకీయాల్లో కుల ప్రభావంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్ కె శ్రీనివాసులు విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 80ల వరకూ రెడ్ల ఆధిపత్యం కొనసాగినా, ఎన్టీఆర్ ప్రవేశం తరువాత అధికారం మొత్తం కమ్మ, రెడ్డి కులాల మధ్యే తిరిగింది. మిగిలిన కులాలు ద్వితీయ స్థాయి పాత్ర పోషించాయి. కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచీ రెడ్లే బలం. తరువాత ఆ వర్గం వైసీపీ వైపు మళ్లింది. కమ్మలు తెలుగుదేశంతో రంగప్రవేశం చేశాక, అధికారంలో రెడ్లతో పోటీ పడ్డారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు కులాలదే ఆధిపత్యం అయింది. వెలమలు జనాభా పరంగా చాలా చిన్న కులం. వాస్తవానికి మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ఆ కులానికి లేదు. కానీ కాలం కలిసివచ్చింది. బలమైన నాయకత్వం ఏర్పడింది. కాపుల పరిస్థితి పూర్తిగా వేరు. అధికారాన్ని పొందే కులాలకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఉండడం, సొంత మీడియా సంస్థలు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. కాపుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గానికి ఆ లక్షణాలు లేవు. సొంత మీడియా కానీ, పెద్ద సంఖ్యలో డబ్బు పెట్టే వారు కానీ లేరు. క్షత్రియుల సంగతి కూడా అలాంటిదే. వాళ్లు చాలా సంపన్నులు. కానీ జనాభా చాలా తక్కువ. అందుకే అధికారం కోసం పోరాటం రెండు కులాల మధ్య జరిగితే, మిగిలిన ప్రభావవంతమైన కులాలు ఎటో ఒకవైపు ఉండి తమదైన పాత్రను పోషిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- శ్రీసిటీ సెజ్: పల్లె జీవితాల్లో వెలుగులు.. మహిళల సాధికారతకు పట్టం
- జనసేన, వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు ఏ వర్గాలకు ఏ హామీలిచ్చాయి...
- పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ: 'మేం ఎవరికీ మద్దతు ఇవ్వం... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది?- బీబీసీ క్విజ్
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- Fact Check: వయనాడ్లో రాహుల్ గాంధీ నిజంగానే పాక్ జెండాను ఎగరేశారా....
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- ‘ఈ పని చేయడం నాకిష్టం లేదు... కానీ, మరో దారి లేదు’
- జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి?
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








