కేసీఆర్: ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు సంపూర్ణ మద్దతు

కేసీఆర్

ఫొటో సోర్స్, trspartyonline/facebook

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అడ్డు పడలేదని అన్నారు.

వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు లాంటి రాజకీయ నేతలతో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకెలాంటి గొడవా లేదన్నారు.

"చంద్రబాబు నాయుడు నన్ను రోజూ తిడుతున్నారు. నిన్న, మొన్న ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు శాపాలు పెడుతున్నారు. అసలు సంగతి ఏంటంటే, ఆయన ఈసారి డిపాజిట్లు రాకుండా ఓడిపోబోతున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన కహానీ ఖతమైపోయింది.

వీడియో క్యాప్షన్, వీడియో: 'ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తారు' - కేసీఆర్

నా దగ్గర సర్వే రిపోర్టు ఉంది. టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు మా మేలు మేము కోరుకుంటూనే, ఇతరుల మేలు కూడా కోరుకుంటాం. చంద్రబాబు లాగా చీకటి పనులు మేం చేయం. చంద్రబాబు లాంటి కుట్రలు మాకు రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కుండబద్ధలు కొట్టి చెబుతున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు మా ఎంపీలు లోక్‌సభలో చెప్పారు. నేను కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం.

మాకున్న సమాచారం ప్రకారం, తెలంగాణలో మేము 16 ఎంపీ స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తారు. టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి 35, 36 ఎంపీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా ఎంపీలు మద్దతు ఇస్తారు." అని కేసీఆర్ అన్నారు.

పోలవరానికి సంపూర్ణ సహకారం

"మేము పోలవరం ప్రాజెక్టుకు ఎన్నడూ అడ్డుకోలేదు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం అందిస్తాం. ఎందుకంటే, గోదావరిలో నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది కూడా 2,600 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. అలా వృథాగా పోయే నీటిని మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. నదీ జలాల్లో మా వాటా మాకు రావాలి. మా పొలాలు పారాలి. మాతో పాటు, మీరు కూడా బతకాలని కోరుతున్నాం. మీలాగా రాజకీయాల కోసం అబద్ధాలు ఆడేవాళ్లం కాదు" అని కేసీఆర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)