ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: శ్రీసిటీ సెజ్- గ్రామీణ జీవితాల్లో వెలుగులు.. మహిళల సాధికారతకు పట్టం

- రచయిత, రిపోర్ట్: బళ్ల సతీశ్
- హోదా, షూట్-ఎడిట్: నవీన్ కుమార్ కందేరి, బీబీసీ ప్రతినిధులు
సెజ్.. 2006 ప్రాంతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన మాట. గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పెద్దయెత్తున భూసేకరణలు జరిగాయి. ఎన్నో వివాదాలు, ఆందోళనలు. పారిశ్రామిక అభివృద్ధి, పునరావాసం, ఉపాధి అంశాలపై ఎన్నో చర్చలు. పుష్కర కాలం తర్వాత నాటి సెజ్‌ల పరిస్థితి ఏంటి? పారిశ్రామిక అభివృద్ధి సాధించి ఉపాధి కల్పించాయా? లేకపోతే ఆందోళనకారులు ఆరోపించినట్టు భూసేకరణ వెనుక కుట్రలు జరిగాయా? ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు), పారిశ్రామిక నగరాలు, ప్రభుత్వ మద్దతుతో వచ్చిన భారీ పరిశ్రమలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది బీబీసీ న్యూస్ తెలుగు.
శ్రీసిటీ పారిశ్రామిక నగరం ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణాన, తమిళనాడు సరిహద్దుల్లో, నెల్లూరు జిల్లా తడ, చిత్తూరు జిల్లా సత్యవేడు మధ్య ఏర్పాటైంది. 2006లో ఇక్కడ భూసేకరణ చేశారు. అప్పటి మార్కెట్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి 14 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామని మాటిచ్చారు.

శ్రీసిటీ తమిళనాడు రాజధాని చెన్నైకు 55 కిలోమీటర్ల దూరంలో 7500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది 2008లో ప్రారంభం అయింది. జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, ఓడరేవు అన్నీ దగ్గరగా ఉండడం ఈ పారిశ్రామిక నగరానికి బాగా కలిసొచ్చింది.
సాంకేతికంగా శ్రీసిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్), దేశీయ ఉత్పత్తుల వాణిజ్య కేంద్రం(టీడీజెడ్), స్వేచ్ఛా వాణిజ్యం, గిడ్డంగి ప్రాంతం(ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్ హౌజింగ్ జోన్) ఉంటాయి. ఇందులో ఇప్పటివరకు 27 దేశాలకు చెందిన 180 కంపెనీలు 28 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని శ్రీసిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఉపాధి: ఇంటికొకరు
శ్రీసిటీ ఉపాధి విషయంలో స్థానికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందనే చెప్పాలి. సొంత సిబ్బంది అవసరాలతోపాటు ఇతర పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా వీలైనంత కృషి చేసింది శ్రీసిటీ యాజమాన్యం. ఫలితంగా ఈ 14 గ్రామాల్లో దాదాపు ఇంటికొకరు శ్రీసిటీ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరికి అవసరమైన శిక్షణను స్వయంగా శ్రీసిటీయే అందిస్తోంది.

చదువురాని వారు నాన్ స్కిల్డ్ ఉద్యోగాలు, కాస్త చదువుకున్నవారు దానికి తగిన ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కోసం శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
స్థానికులు సరిపోకపోవడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తమిళనాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఇక్కడ సుమారు 40 వేల మంది ఉపాధి పొందుతున్నట్టు అంచనా.

శ్రీసిటీ లెక్కల ప్రకారం ఉపాధి పొందుతున్న వారిలో 45.62 శాతం మంది చిత్తూరు జిల్లా వారు. 27.72 శాతం మంది నెల్లూరు జిల్లా వారు, 15.49 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాల వారు, 11.17 శాతం మంది ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు.
ఈ ప్రాంతంలో నీటివసతి సరిగా లేకపోవడంతో వ్యవసాయం లాభసాటిగా ఉండేది కాదు. ఎక్కువ మంది వలస వెళ్లే వారు. కూలీ ధరలు చాలా తక్కువ. వ్యవసాయ మిగులు అంతకంటే తక్కువ. ఈ పరిస్థితుల్లో శ్రీసిటీ ఇక్కడ వారికి నికరమైన ఆదాయ వనరుగా మారింది.
''అప్పుడంటే పొలం పని చేసేవారు. కష్టపడి చేసినా ఫలితం ఉండేది కాదు. ఎకరాకి పది వేలు, ఐదు వేలు రూపాయలే మిగిలేవి. అప్పట్లోకష్టపడి చేసినా మిగిల్తే మిగలొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కంపెనీల్లో పనిచేస్తున్నారు. కనీసం రూ.10 వేలు తీసుకుంటున్నారు'' అంటూ తమ గ్రామాల పరిస్థితిని వివరించారు మునిప్రసాద్ రెడ్డి అనే స్థానికుడు.

''సెజ్‌లో మాది పదెకరాల భూమి తీసుకున్నారు. నాకు సెక్యూరిటీ ఉద్యోగం ఇచ్చారు. పొలం ఒకేడు పండి, ఒకయేడు ఎండి, వానలు పడకుండా మేం అప్పులతోనే బాధలు పడతా ఉన్నాం. పదెకరాల వ్యవసాయం కన్నా ఇప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాం'' అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు శ్రీ సిటీలో పనిచేస్తున్న భారతి అనే మహిళ.
చిన్న రైతులే కాదు, పదెకరాల రైతు కూడా తమకు సెక్యూరిటీ ఉద్యోగమే బావుందని చెప్పడం ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఉన్న వ్యవసాయ సంక్షోభ ప్రభావానికి నిదర్శనం. ఈ ప్రాంతం నుంచి ఉపాధి కోసం ఒకప్పుడు వలసలు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడికే ఎందరో వచ్చి ఉద్యోగాలు చేస్తుండటంతో స్థానికులకు పరోక్ష ఉపాధి పెరిగింది.
''గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్లకు మేము శిక్షణ ఇస్తున్నాం. వాళ్ల ఆలోచనా తీరు బావుంది. వారికి సాఫ్ట్ స్కిల్స్, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. వారితో ఏ ఇబ్బందీ లేదు'' అని స్థానికుల పనితనం గురించి వైటల్ పేపర్స్ ఎండీ శశి వివరించారు.

ఆ యూనిట్లలో 90 శాతం మంది మహిళలే
శ్రీసిటీ స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించింది. నైపుణ్యం అవసరం లేని, లేదా తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో గ్రామీణ మహిళలు పెద్దయెత్తున కుదురుకున్నారు. దీంతో ఆ ప్రాంత సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
మహిళల పొదుపు ఫలితం గ్రామాల్లో కనిపిస్తోంది. పక్కా ఇళ్ల సంఖ్య పెరిగింది.

శ్రీసిటీ పరిధిలోని కొ న్ని సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లలో పనిచేసేవారిలో 90 శాతం మంది అమ్మాయిలే. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు.
''మొదట్లో మాకు పూరిల్లుండేది. ఎంతో కాలం మట్టిలోనే పడుకున్నాం. నేనేదో చిన్న చిన్న పనులకు పోయేదాన్ని. 100 రోజుల పనికీ, ఎవరు ఏ పనికి పిలిస్తే ఆ పనికి పోయేదాన్ని. డబ్బులు వారానికి ఒకసారి ఇచ్చేవారు. ఆ వారం దాకా పూట గడవడం కష్టంగా ఉండేది. అన్నానికి కూడా కష్టంగా ఉండేది. స్కూల్ అన్నం తీసి పెట్టే వాళ్లం పిల్లలకు. అదెప్పటికీ మరవలేము. శ్రీసిటీలో పని దొరికాక ఒక్కొక్క వస్తువూ తీసుకుంటున్నా. పిల్లలకు కోరింది తీసిస్తున్నా. పక్కా ఇల్లు కట్టుకున్నా. శ్రీసిటీ పడినాక అంగళ్లు పెరిగాయి. రోడ్లు వచ్చాయి. బయటి నుంచి వచ్చి శ్రీ సిటీలో బతుకుతున్నారు. నేను కూడా శ్రీసిటీలోనే బతుకుతున్నాను'' అంటూ తన అనుభవాన్ని వివరించారు ఎవర్టన్ టీ కంపెనీలో పనిచేసే మెల్టిడా.

సామాజిక ప్రభావం
ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు సహజంగానే ఈ ప్రాంత రూపురేఖల్ని మార్చేశాయి. సాధారణంగా ఎక్కడ పారిశ్రామిక నగరాలు, వాడలూ ఉన్నా, స్థానికులకూ, యాజమాన్యానికీ మధ్య వివాదాలు ఉంటాయి. శ్రీసిటీకి సంబంధించినంత వరకు ఉపాధి, భూసేకరణ లాంటి విషయాల్లో వివాదాలు రాలేదు.
ఈ సెజ్ కోసం వ్యవసాయ భూములు తీసుకున్నా, గ్రామాలను మాత్రం సెజ్ కాంపౌండ్ లోనే కొనసాగిస్తుండటం మరో ప్రత్యేకత. ఎవరూ తమ ఇళ్లను ఖాళీ చేయలేదు. ఆ పరిశ్రమల మధ్యే గ్రామాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పడు భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. కొత్తగా సంపద వచ్చి చేరుతోంది. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పట్టణ తరహా వాతావరణం వచ్చేసింది ఇక్కడి పల్లెల్లో.

ఇక్కడి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాను: సన్నారెడ్డి రవీంద్ర
''ఈ ప్రాంతానికి చెందిన వాడిగా నేను, దశాబ్దాలుగా ఇక్కడి వెనుకబాటుతనాన్ని, ఆర్ధికంగా ఇక్కడి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాను. నైసర్గిక కారణాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని ఈ ప్రాంతంలో, మౌలిక వసతులు ఏర్పరిస్తే, పారిశ్రామికంగా మంచి అభివృద్ధి జరుగుతుందనీ, ప్రజలు లాభపడతారని ఆలోచించాం'' అని శ్రీసిటీ వ్యవస్థాపకుడు సన్నారెడ్డి రవీంద్ర చెప్పారు.
''నష్టాలతో వ్యవసాయం చేస్తూ, అప్పుల పాలౌతున్న రైతులకు, ఉపాధి కరువైన వ్యవసాయ కార్మికులకు, ఈ భూముల్లో పరిశ్రమలు వస్తే పెరిగే ఉపాధి అవకాశాలు, వచ్చే ఆర్థిక ప్రయోజనాలు వంటి విషయాలపై సరైన అవగాహన కల్పించాం. ప్రజలు వారి గ్రామాలను ఖాళీ చేసి వేరెక్కడికో వలస వెళ్ళాల్సిన అవసరం రాదనీ హామీ ఇచ్చాం. రైతులు స్వచ్ఛందంగా భూములను అమ్మడానికి సిద్ధపడ్డారంటే, అందుకు కారణం మా చిత్తశుద్ధిపై వారికి కలిగిన అపార నమ్మకమే'' అని ఆయన తెలిపారు.

ఇక్కడి గ్రామీణ యువతీ యువకులకు వివిధ వృత్తివిద్యల్లో ఉచిత శిక్షణనిప్పించి, వారంతా ఇక్కడే ఉపాధి పొందగల అవకాశలను కల్పించగలిగామని, ఉపాధి దొరుకుతున్నందున ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా తగ్గుతున్నాయని రవీంద్ర చెప్పారు.
''సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విద్య, వైద్య సదుపాయాలు, రహదారులు, వీధిదీపాలు లాంటి అనేక వసతులను పరిసర గ్రామాల్లో ఏర్పరచాం. త్రాగునీటి సరఫరాకై అవసరమైన మౌళిక వసతులను గ్రామాలన్నిటిలో ఏర్పరచి నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తూ, వారి సుస్థిరాభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నాం" అని ఆయన వివరించారు.
‘ఉన్నత ఉద్యోగాలన్నీ తమిళులకే’ - వామపక్షాలు
ఇక శ్రీసిటీలో అభివృద్ధికి బహు ముఖాలున్నాయన్నది విశ్లేషకుల మాట. ఎకరా లక్షలోపే ఉన్నప్పుడు మూడున్నర లక్షల దక్కడం కొందరికి ఆనందం, ఇప్పుడు అదే ఎకరా కోటి దాటినప్పుడు నాకు భూమి లేదే అనే ఆవేదన కొందరిలో ఉంది. తన పొలంలో తానే పనిచేసే పరిస్థితి కొందరిలో నిర్వేదం నింపి ఉండొచ్చు. ఇంకొందరిలో వ్యవసాయంలో దక్కని ఆర్థిక సుస్థిరత ఇప్పుడు దక్కినందుకు సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. భూమి లేని కులాలకు స్థిరమైన ఉపాధి దొరికి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి మెరుగైంది అనేది వాస్తవం. ఇప్పుడు పెద్ద సంఖ్యలో భూములు ఉన్న కులాల వారూ, అసలు భూములు లేని కులాల వారి మధ్య ఆర్థిక అంతరం పెద్దగా లేదు అక్కడ. అంతకుముందున్న దానితో పోల్చినప్పుడు చాలా మెరుగుపడిందనే చెబుతున్నారు వారు.
అనేక సెజ్ లలో బీబీసీ బృందం పర్యటించినప్పుడు, మిగతా వాటితో పోలిస్తే స్థానికులతో అతి తక్కువ లేదా దాదాపుగా వివాదాల్లేకుండా నిర్వహించడంలో ఈ సెజ్ సఫలం అయింది.
అయితే శ్రీ సిటీలో స్థానికులకు దక్కిన ఉద్యోగాల విషయంలో మాత్రం వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిగ్యూటివ్ లెవెల్ ఉన్నత ఉద్యోగాలన్నీ తమిళులకే దక్కాయనీ, స్థానికులకు స్వీపర్, సెక్యూరిటీ వంటి చిన్న ఉద్యోగాలు మాత్రమే దక్కాయనీ వారు ఆరోపించారు. అర్హతలను బట్టి స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్నామంటోంది శ్రీ సిటీ యాజమాన్యం.
ఇవి కూడా చదవండి:
- ఆళ్లగడ్డలో నోట్లు వెదజల్లిన వైసీపీ నాయకుడు... హైదరాబాద్‌లో మురళీమోహన్ 'జయభేరి' నగదు రూ.2 కోట్లు స్వాధీనం
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరోవైపు
- మోదీ 'మేక్ ఇన్ ఇండియా' హామీలు ఏమయ్యాయి...
- 'కట్టుబట్టలతో వస్తే మోదీ మట్టికొట్టారు’
- దక్షిణ తెలంగాణలో ఆగని వలసలు.. ముంబైలోని కుర్లాలోనూ ప్రచారం
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏదన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









