ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: ఆళ్లగడ్డలో నోట్లు వెదజల్లిన వైసీపీ నాయకుడు... హైదరాబాద్‌లో మురళీమోహన్ 'జయభేరి' నగదు రూ.2 కోట్లు స్వాధీనం

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నేత ఒకరు డబ్బు వెదజల్లుతున్నట్లు చూపిస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు టీడీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఆధ్వర్యంలోని జయభేరి ప్రాపర్టీస్‌కు చెందిన రూ.2 కోట్ల నగదును ఇద్దరు వ్యక్తులు రాజమండ్రికి తరలిస్తుండగా హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మురళీమోహన్‌తోపాటు మరో 5మందిపై కేసు నమోదు చేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని శిరివెళ్లలో స్థానిక వైసీపీ నేతలు ప్రచారంలో జనంపై డబ్బులు వెదజల్లినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆళ్లగడ్డ స్థానంలో వైసీపీ తరపున గంగుల బ్రిజేందర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పోటీచేస్తున్నారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియోపై శిరివెళ్లకు చెందిన జి.గౌస్‌మియ అనే వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ముల్లాసలాం, అన్వర్ బాషలపై కేసును నమోదు చేశామని శిరివెళ్ల ఎస్.ఐ.తిమ్మారెడ్డి బీబీసీకి తెలిపారు.
పోలీసుల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘ఈ కేసు క్రైమ్.నం. 79/90. ఐపీసీ సెక్షన్ 171 -ఇ, 188, 123 క్లాజ్-1 ఆర్.టి.యాక్ట్, అండర్ రెడ్ విత్ 34 ఐ.పి.సి. సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు చెబుతున్నారు.
వీడియోలోని సంఘటన ఏప్రిల్ 1న జరిగినట్లు ఫిర్యాదిదారులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్టు చేయాలేదు. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశాం.
ఎన్నికల ప్రక్రియను వైసీపీ అభ్యర్థి బ్రిజేంద్రరెడ్డి అపహాస్యం చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బ్రిజేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరతామని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/GETYIMAGES
మురళీమోహన్‌తోపాటు మరో 5మందిపై కేసు నమోదు
ఏప్రిల్ 3 బుధవారం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు జయభేరి ప్రాపర్టీస్ సంస్థకు చెందినవారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
రెండు కోట్ల రూపాయలను రెండు సంచుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తరలిస్తుండగా వీరిని తమ పోలీసు బృందం అదుపులోకి తీసుకుందని చెప్పారు. వీరిని నిమ్మలూరి శ్రీహరి, పండరిలుగా గుర్తించామని, వీరు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జయభేరి సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు.
రూ.500 నోట్లు 19,200 దొరికాయని, వీటి విలువ 96 లక్షల రూపాయలని ఆయన చెప్పారు. రూ. 2 వేల నోట్లు 5,200 దొరికాయని, వీటి విలువ కోటి రూపాయల నాలుగు లక్షలని తెలిపారు.
జయభేరి ప్రాపర్టీస్ సంస్థ కార్యాలయంలో పనిచేసే జగన్మోహన్, ధర్మరాజు అనే వ్యక్తులు ఈ డబ్బు ఇచ్చారని శ్రీహరి, పండరి వెల్లడించారని సజ్జనార్ చెప్పారు.
''మీరిద్దరూ కలసి రైల్లో రాజమండ్రికి వెళ్లండి. అక్కడ మీ కోసం యలమంచిలి మురళీమోహన్ అనే వ్యక్తి కారులో ఎదురుచూస్తుంటారు. ఆయన కారులో ఎక్కి ఈ డబ్బు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు అందజేయండి'' అని జగన్మోహన్, ధర్మరాజు వీరిద్దరికి చెప్పారని తెలిపారు.
ఈ కేసులో పోలీసులు 6మందిని నిందితులుగా పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌తోపాటు మరో 5మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వెల్లడించిన నిందితుల వివరాలు..
- నిమ్మలూరి శ్రీహరి జయభేరి ప్రాపర్టీస్‌లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కంకిపాడుకు చెందిన శ్రీహరి హైదరాబాద్ నిజాంపేట్‌లో నివాసం ఉంటున్నారు.
- అవుటి పండరి కూడా జయభేరి ప్రాపర్టీస్‌లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె మెదక్ జిల్లాకు చెందినవారు.
- ధర్మరాజు
- జగన్మోహన్ రావు
- ఎమ్. మురళీమోహన రావు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం.పి.
- యలమంచి మురళీక్రిష్ణ
పోలీసులు ఏం చెబుతున్నారంటే...
‘‘మేం అరెస్టు చేసిన నిమ్మలూరి శ్రీహరి, అవుటి పండరి ఇద్దరూ జయభేరి ప్రాపర్టీస్‌లో కార్యాలయంలో పనిచేస్తారు. వీరిద్దరూ ధర్మరాజు, జగన్మోహన్ రావు ఆదేశాల ప్రకారం, రాజమండ్రి ఎంపి ఎం.మురళీమోహన్, టీడీపీకి చెందిన మరోవ్యక్తి యలమంచి మురళికి 2 కోట్ల రూపాయలు అందచేయడానికి రెండు బ్యాగుల్లో డబ్బు తీసుకువెళుతున్నారు.’’
‘‘రానున్న ఎన్నికల్లో ఈ డబ్బును రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని ఓటర్లకు పంచడానికి ఉద్దేశించబడినది. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో మాదాపూర్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ సిబ్బంది.. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. 6:30గంటల సమయంలో నిమ్మలూరి శ్రీహరి, అవుటి పండరి ఇద్దరూ ప్యాసెంజర్ ఆటో దిగి, 2 బ్యాగులతో నడుచుకుంటూ హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వైపుకు నడవసాగారు. వారిని అడ్డగించి తనిఖీ చేస్తే, బ్యాగుల్లో 2 కోట్లరూపాయలు విలువచేసే రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లు లభించాయి’’ అని పోలీసులు తెలిపారు.
‘‘వారిని విచారించగా, జయభేరి ప్రాపర్టీస్‌కు చెందిన ధర్మరాజు, జగన్మోహన్ రావు అనే వ్యక్తులు.. గచ్చిబౌలిలోని జయభేరి ఎన్‌క్లేవ్ వద్ద తమకు డబ్బిచ్చారన్నారు. ఈ డబ్బు తీసుకుని రైలులో రాజమండ్రి వెళ్లాలని, రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో వీరిని రిసీవ్ చేసుకోవడానికి మురళీమోహన్ అనుచరుడు యలమంచి మురళి సిద్ధంగా ఉంటాడని ధర్మరాజు, జగన్మోహన్ చెప్పారు. వారి సూచనల మేరకు ఇద్దరూ డబ్బుల బ్యాగులతో ఆటోలో వచ్చి, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వైపు వెళుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసును మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు
- జనసేన అభ్యర్థుల తుది జాబితా: పులివెందులలో పోటీకి దిగుతున్నది ఎవరో తెలుసా
- ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్యే
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- సిత్రాలు సూడరో: మట్టి పాత్రలో జొన్న అన్నం.. పచ్చిమిరపకాయ పచ్చడి
- లోక్‌సభ ఎన్నికలు 2019: టీఆర్ఎస్, వైసీపీలు ఈసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాయా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









