ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, Sunnam rajaiah/fb
ఎన్నికల వేళ టికెట్ల కోసం నేతలు పార్టీలు మారుతుండటం సహజమే కానీ, ఒక నేత మాత్రం ఏకంగా రాష్ట్రమే మారాల్సివచ్చింది. ఆయనే తెలంగాణ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య.
సీపీఐ(ఎం) సీనియర్ నేత రాజయ్య గతంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇప్పుడు ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

ఫొటో సోర్స్, Nitiaayog
ఏపీ పునర్విభజనే కారణం
ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి.
విలీన మండలాల ఓటర్లు తెలంగాణ ఎన్నికల్లో పాల్గొంటారా? లేదంటే ఏపీలోని నియోజకవర్గాల పరిధిలోకి వస్తారా అన్నది కొన్నాళ్లు ఎటూ తేలలేదు. అయితే, తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం దీనిపై స్పష్టత ఇచ్చింది.
విలీన మండలాలను ఏపీలోని రెండు నియోజకవర్గాల్లో కలిపామని, ఇకపై వారు ఏపీలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపింది.
ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉండేవి.
భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి.
వీటిలో భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరయిన నాలుగు మండలాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో.. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు.
ఈ ఏడు మండలాల్లోని 211 గ్రామాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం చట్టం కూడా చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఆ ఏడు మండలాలను ఏపీలోని రంపచోడవరం(ఎస్టీ), పోలవరం(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపారు. ఆ మండలాల్లోని ఓటర్ల వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం నుంచి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో కలిపారు.

‘మంపు గ్రామాలకు అండగా ఉండేందుకే’
విలీనానికి ముందు 2014 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆయన ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరు చేసిన నాలుగు మండలాలను ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలో కలిపారు. అంతేకాదు ఆయన స్వగ్రామం కూడా ఇదే నియోజకవర్గం కిందకు వెళ్లిపోయింది.
దీంతో భద్రాచలం నుంచే పోటీ చేయాలా లేక ఏపీకి వెళ్లిపోవాలా అనేదానిపై సున్నం రాజయ్య ఎటూ తేల్చుకోలేకపోయారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో తాను మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీకి దూరంగా ఉన్నారు.
ఇప్పుడు ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి జనసేన, సీపీఐ, బీఎస్పీ, సీపీఎంల ఉమ్మడిగా అభ్యర్థిగా బరిలోకి దిగారు.
దీనిపై ఆయన ‘బీబీసీ’తో మాట్లాడుతూ, పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉండేందుకే రాష్ట్రం మారాల్సి వచ్చిందని అన్నారు.
''నా నియోజకవర్గం ఎక్కువ శాతం ఏపీ కిందకు వెళ్లిపోయింది. పోలవరం ముంపు గ్రామాలు కూడా నా నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నాయి. వారికి అండగా ఉండేందుకే ఏపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఇక్కడి ప్రజాసమస్యలను లేవనెత్తేందకు 2014లోనే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు వెళ్లాలనుకున్నా. కానీ, అందుకు అనుమతి లభించలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే మా పార్టీ సూచన మేరకు ఏపీ నుంచి పోటీ చేస్తున్నా'' అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








