సిత్రాలు సూడరో: టీడీపీలోకి హర్షకుమార్, వైసీపీ బాటలో పండుల రవీంద్ర

హర్ష కుమార్, రవీంద్ర బాబు, జగన్

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official/Ysrcp

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో నాయకులు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు.

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ తాజాగా తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అమలాపురం ఎంపీగా గెలిచారు.

2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన పండుల రవీంద్రబాబు గెలుపొందారు. అయితే, ఈ ఇద్దరూ ఇప్పుడు పార్టీలు మారారు.

పండుల రవీంద్ర బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరగా, హర్ష కుమార్ టీడీపీ కండువా కప్పుకున్నారు.

ఈ ఇద్దరు నేతలూ గతంలో ఏమన్నారు? ఇప్పుడు పార్టీల మారిన తర్వాత ఏమన్నారో చూద్దాం.

హర్షకుమార్

2017 జూన్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గరగపర్రు గ్రామంలో ఒక సామాజిక వర్గం ప్రజలను సాంఘిక బహిష్కరణ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణలోనూ పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.

ఆ సందర్భంగా ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, ఆయన అసహనం వ్యక్తం చేశారు.

"దోషులను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నన్ను ముందస్తు అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, డీజీపీ కలిసే ఈ పనులు చేస్తున్నారు. మీరు కమ్మ రాజ్యాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు. చాలా పొరపాట్లు చేస్తున్నారు. మీరు దారుణంగా పరిపాలిస్తున్నారు. ప్రభుత్వమన్నదే లేకుండా రాజుల పాలనలా ఉంది. రాజ్యాంగ విలువలు పాటించకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలుగు దేశం పార్టీకి బంట్రోతుల్లా పని చేస్తున్నారు" అని హర్ష కుమార్ ఆరోపించారు.

చంద్రబాబు, హర్ష కుమార్

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన హర్ష కుమార్

2019 మార్చి 17న

హర్ష కుమార్ ఈ నెల 17న టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకినాడలో టీడీపీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. "నా ఆత్మగౌరవాన్ని రక్షించిన మనిషి చంద్రబాబు నాయుడు" అని అన్నారు.

"నేను టీడీపీలో చేరుతానని అనుకోలేదు. కానీ, ఇన్నాళ్లు చంద్రబాబును నాణేనికి ఒకవైపు మాత్రమే చూశాను. రెండో వైపు చూసినప్పుడు ఆయన గొప్పతనం ఏంటో నాకు అవగతమైంది. ప్రజలకు సంక్షేమం అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయకత్వం తప్పనిసరి. ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. నా ఆత్మగౌరవాన్ని రక్షించిన మనిషి చంద్రబాబు నాయుడు. అది నేనెప్పుడూ మరచిపోను" అని హర్ష కుమార్ చెప్పారు.

రవీంద్ర బాబు, చంద్రబాబు

ఫొటో సోర్స్, pandularavindrababu/fb

ఫొటో క్యాప్షన్, రవీంద్ర బాబు, చంద్రబాబు

ఎంపీ పి. రవీంద్రబాబు

2018 జూన్‌లో

కాకినాడలో జరిగిన ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ..

"భారత దేశానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్‌కు ఉక్కు మనిషి చంద్రబాబు అలా ఉన్నారు. ఆయన్ను చూసి దిల్లీలో అందరూ జడుస్తున్నారు. 2019లో రాష్ట్రంలో టీడీపీకి 25 సీట్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వన్నీ తీసుకొస్తాం." అని రవీంద్ర బాబు అన్నారు.

రవీంద్ర బాబు, జగన్

ఫొటో సోర్స్, fb/pandularavindrababu

2019లో ఏమన్నారంటే..

ఇటీవల రవీంద్ర బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ...

"ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాదు. హోదా విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారు. గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు వైఖరి వల్ల బాధపడి టీడీపీ నుంచి బయటకు వచ్చాను. ప్రత్యేక హోదా కావాలని మేమంతా అంటే అవసరం లేదని, ప్యాకేజీ చాలని చంద్రబాబు మమ్మల్ని బలవంతంగా ఒప్పించారు" అని రవీంద్ర బాబు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)