స్తంభించిన ఫేస్‌బుక్... ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సేవల్లోనూ అంతరాయం

ఫొటో సోర్స్, Reuters
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో స్తంభించిపోయింది. అంతర్జాతీయంగా చాలా చోట్ల బుధవారం/గురువారం చాలా సమయం ఇది సరిగా పనిచేయలేదు. కొందరు యూజర్లకు ఇప్పుడు కూడా పనిచేయడం లేదు.
ఫేస్‌బుక్ ప్రధాన సర్వీసు, రెండు మెసేజింగ్ యాప్‌లు, ఫొటోలు పెట్టుకొనే వేదిక ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోయాయి.
ఈ పరిస్థితికి కారణం ఏమిటనేది ఫేస్‌బుక్ ఇంకా చెప్పలేదు.
ఫేస్‌బుక్‌కు చెందిన యాప్‌ల వినియోగంలో కొందరు వాడకందార్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్ ఈ స్థాయిలో చివరిసారిగా 2008లో స్తంభించిపోయింది. అప్పట్లో 15 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. ఇప్పుడు సుమారు 230 కోట్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు.
ఫేస్‌బుక్ ప్రస్తుత సమస్యకు కారణాలపై ట్విటర్ లాంటి ఇతర సోషట్ నెట్‌వర్కుల్లో వదంతులు వస్తున్నాయి. 'డిస్ట్రిబ్యూటెడ్ డీనైయల్ ఆఫ్ సర్వీస్ (డీడీవోఎస్)' దాడి ఈ సమస్యకు కారణమనే ప్రచారం కూడా సాగుతోంది.
వదంతులపై ఫేస్‌బుక్ స్పందిస్తూ- సమస్యకు డీడీవోఎస్ కారణం కాదని స్పష్టం చేసింది. డీడీవోఎస్ అనేది ఒక రకం సైబర్ దాడి. ఈ దాడిలో- మితిమీరిన ట్రాఫిక్ వల్ల సర్వీసు స్తంభించిపోతుంది.
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9:30 గంటలప్పుడు ఈ సమస్య మొదలైందని అంచనా వేస్తున్నారు.
ఫేస్‌బుక్ లోడ్ అవుతున్నట్లు కనిపించిందని, కానీ ఏదైనా పోస్ట్ చేయాలంటే వీలు కావడం లేదని యూజర్లు చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫీడ్‌ను రిఫ్రెష్ చేయడం, కొత్త కంటెంట్ పోస్ట్ చేయడం సాధ్యం కాలేదు.
ఫేస్‌బుక్ మెసెంజెర్ డెస్క్‌టాప్ వర్షన్ లోడ్ కాలేదు. మొబైల్ యాప్‌లో మాత్రం కొన్ని సందేశాలు పంపుకొనేందుకు ఇబ్బంది తలెత్తలేదు. ఫొటోలు లాంటి కంటెంట్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నట్లు యూజర్లు చెప్పారు.
ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోనూ ఇలాంటి అవాంతరాలే వచ్చాయి.
ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల స్తంభించిపోయిందని థర్డ్‌పార్టీ వెబ్‌సైట్ 'డౌన్‌డిటెక్టర్' వెల్లడించింది.

ఫేస్‌బుక్ వర్క్‌ప్లేస్‌పైనా ప్రభావం
అంతర్గత సమాచార వినిమయం కోసం వ్యాపార సంస్థలు ఉపయోగించే 'ఫేస్‌బుక్ వర్క్‌ప్లేస్'పైనా తాజా సమస్య ప్రభావం చూపింది.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌కు చెందిన డిజైనర్ రెబెకా బ్రూకర్ బీబీసీతో మాట్లాడుతూ- ఫేస్‌బుక్ నిలిచిపోవడం తన పనిపై చాలా ప్రభావం చూపిస్తోందని విచారం వ్యక్తంచేశారు.
''ఫేస్‌బుక్‌ను వ్యక్తిగత అవసరాలకే వాడుతుంటే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ వ్యాపార సేవలు అందించడానికి ఇలాంటి నెట్‌వర్కులపై ఆధారపడితే పరిస్థితి ఏంటి? అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న మా బృందాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈమెయిల్ కాకుండా, కమ్యూనికేషన్‌కు ఫేస్‌బుక్ వర్క్‌ప్లేసే ఏకైక సాధనం'' అని ఆమె వివరించారు.
''దేనిపైనైనా ఒకే కంపెనీకి నియంత్రణ కల్పిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూశాం'' అని బ్రూకర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి రావొచ్చని తాను ఊహించానని, ఒక యూజర్‌గా ఈ గుత్తాధిపత్యంలో తానూ భాగస్వామిని అయిపోయినందుకు బాధగా ఉందని చెప్పారు.
భారీ టెక్ కంపెనీలు వాటి రాజకీయ శక్తితో నిబంధనలను వాటికి అనుకూలంగా మలచుకోకుండా అడ్డుకోవాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఎలిజబెత్ వారెన్ 'ద న్యూయార్క్ టైమ్స్'తో చెప్పారు. ఆ కంపెనీలు వాటి అర్థబలంతో ప్రతి పోటీదారును కొనుగోలు చేయడాన్ని కూడా అడ్డుకోవాల్సి ఉందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌లో జోకులు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోవడంపై మరో సోషల్ నెట్‌వర్క్ 'ట్విటర్'లో యూజర్లు పెద్దయెత్తున జోకులు వేశారు. #FacebookDown #InstagramDown హ్యాష్‌ట్యాగ్‌లను ఇప్పటివరకు లక్షన్నర సార్లకు పైగా వాడారు.
ఫేస్‌బుక్ సంబంధ ఉద్యాగాల్లో ఉండే కొందరు ట్విటర్ యూజర్లు- ఫేస్‌బుక్ స్తంభించిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు.
సోషల్ మీడియా స్తంభించిపోతే సమాజం స్తంభించిపోతుందని, లోకం అంతమైపోతుందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ పెట్టకుండా తమకు ఇష్టమైనవారిని ఎలా కలుసుకోవాలి, తిండి ఎలా తినాలి అనేది ఎవరికీ గుర్తులేదని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోవడంతో జనం ట్విటర్‌కు మళ్లుతున్నారనే వాదనకు మద్దతుగా కొందరు ఆసక్తికరమైన 'మీమ్‌లు' పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోషల్ మీడియాపై తామెంతగా ఆధారపడుతున్నామో తాజా పరిణామంతో తెలిసొచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
- ఉత్తర భారతదేశ మహిళలను రాహుల్‌గాంధీ అవమానించారా
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- మీ కంప్యూటర్‌పై కేంద్రం కన్నేస్తోందా? ఇందులో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








