ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల నుంచి నెత్తుటి క్రీడల వీడియోల తొలగింపు - బీబీసీ కథనానికి స్పందన

నిషేధిత నెత్తుటి క్రీడల వీడియోలు

ఫొటో సోర్స్, youtube

నిషేధిత నెత్తుటి క్రీడలను ప్రోత్సహించేలా ఉన్న వీడియోలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు తొలగించాయి.

'బీబీసీ' కంట్రీఫైల్ కార్యక్రమంలో ప్రసారమైన ఓ పరిశోధనాత్మక కథనం తరువాత ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ఈ చర్య తీసుకున్నాయి.

అయితే, బ్రిటన్‌లో నిషేధించిన కోడి పందేలు, కుందేళ్ల వేటకు సంబంధించి యూజర్లు పోస్ట్ చేస్తున్న గ్రాఫిక్ వీడియోలు, ఫొటోలకు మాత్రం ఈ రెండు వేదికల్లోనూ ఇంకా స్థానం కల్పిస్తున్నారు.

పోస్ట్ చేసే కంటెంట్ స్థానిక చట్టాలకు లోబడి ఉండాటని పేర్కొంటూ ఫేస్‌బుక్ ఒక యూజర్‌ను తొలగించింది.

యూట్యూబ్ కూడా విధానపరమైన మార్గదర్శకాలను ఉటంకిస్తూ 'బీబీసీ' అభ్యంతరాలు వ్యక్తంచేసిన కంటెంట్‌ను తాము తొలగించినట్లు తెలిపింది.

కానీ, ఫేస్‌బుక్, యూట్యూబ్ రెండిట్లోనూ ప్రైవేట్, పబ్లిక్ యూజర్ గ్రూపుల్లో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి.

యార్క్‌షైర్ పోలీసులు
ఫొటో క్యాప్షన్, నిషేధిత నెత్తుటి క్రీడలు నిర్వాహకులకు లాభసాటి వ్యాపారంగా మారాయని యార్క్‌షైర్ పోలీసులు చెబుతున్నారు.

2004 నాటి వేట చట్టం ప్రకారం బ్రిటన్‌లో కుక్కలతో కుందేళ్లను వేటాడించే పోటీలపై నిషేధం ఉంది. ఇక 19వ శతాబ్దంలోనే అక్కడ కోడిపందేలను నిషేధించారు.

బీబీసీ కంట్రీఫైల్‌ ఇలాంటి వీడియోల వ్యవహారాన్ని బయటపెట్టగా ఆ ప్రోగ్రాం చూసిన వైల్డ్‌లైఫ్ కోఆర్డినేటర్ జీఫ్ ఎడ్మండ్ ''ఆన్‌లైన్లో ఇలాంటి కంటెంట్‌ను తొలగించాల్సిందే'' అని డిమాండ్ చేశారు. ఇందుకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు.

కాగా, కంట్రీఫైల్‌లో ప్రసారం చేసిన ఈ కథనం కోసం బీబీసీ పరిశోధన బృందం కొన్ని నెలల పాటు వేలాది యూట్యూబ్, ఫేస్‌బుక్ అకౌంట్లను క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా సుమారు 31 వేల మంది సభ్యులున్న రెండు ప్రైవేట్ సోషల్ గ్రూపులను పరిశీలించారు.

నిషేధిత నెత్తుటి క్రీడల వీడియోలు

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, వీరి పరిశీలనలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో నెత్తుటి ఆటల వీడియోలు, ఫొటోలు లెక్కలేనన్ని కనిపించాయి.

వీరి పరిశీలనలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో నెత్తుటి ఆటల వీడియోలు, ఫొటోలు లెక్కలేనన్ని కనిపించాయి. కుక్కలు కుందేళ్లను వెంటాడి వేటాడి చీల్చేస్తున్న వీడియోలు... కోడిపుంజులు కాళ్లతో రక్కుకుంటూ ముక్కుతో పొడుచుకుంటూ రక్తాలు కారి, ఒకదాన్నొకటి చంపుకొనేవరకు పోరాడే వీడియోలు, ఫొటోలు గుర్తించారు.

ఇలాంటి వీడియోలు, ఫొటోలలో యువత, చిన్నారులు కూడా కనిపించడాన్ని బీబీసీ కథనంలో ప్రస్తావించారు.

‘‘కోడిపందేలు, కుందేళ్ల వేట వంటివి అక్రమంగా నిర్వహించేవారు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించుకుంటూ ఏకంగా ఇలాంటి నెత్తుటిక్రీడలను లైవ్‌లో చూపిస్తున్నారు. భారీ ఎత్తున పందేలు కాస్తుండడంతో దీన్ని అక్రమ సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నారు’’ అని యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు.

ప్రతి రెండువారాలకోసారి ఇలాంటివి నిర్వహిస్తున్నారని.. కానీ, ఆ ఫుటేజ్ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారని వారు చెబుతున్నారు.

ఇదంతా ఒక లాభదాయకమైన వ్యాపారంగా సాగుతోందన్నది యార్క్‌షైర్ పోలీసుల మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)