కశ్మీర్ దాడి: 46 మంది జవాన్లు మృతి... 19 ఏళ్ల జైష్-ఎ-మొహమ్మద్ రక్తచరిత్ర

ఫొటో సోర్స్, EPA
కశ్మీర్‌లో పారామిలటరీ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృతుల సంఖ్య 46కి పెరిగింది.
బలగాలను శ్రీనగర్‌కు తీసుకెళ్తున్న బస్సును తీవ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఢీకొట్టి దాడికి పాల్పడ్డారని పోలీసులు బీబీసీకి తెలిపారు.
ఈ దాడి వెనుక ఉన్నది తామేనని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ ప్రకటించుకుంది.
మరోవైపు భారత్ పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశ హోదా(మోస్ట్ ఫేవర్డ్ నేషన్)ను ఉపసంహరించుకుంది.
దాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్‌లో వ్యాపారులు దుకాణాలు మూసేది బంద్ పాటించారు, న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చిన కొందరు పెద్ద సంఖ్యలో కార్లను ధ్వంసం చేశారు. గుజ్జర్ నగర్, పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
1989 నుంచి కశ్మీర్‌లో తీవ్రవాదులు జరుపుతున్న తిరుగుబాటులో భాగంగా భారత బలగాలపై జరిగిన దాడుల్లో ఇది అత్యంత భయానకమైనది.
జైష్ ఎ మొహమ్మద్ నేత మసూద్ అజర్‌పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించాలని భారత్ పిలుపునిచ్చింది.
మరోవైపు తాజా దాడిని ఖండించిన పాకిస్తాన్ అందుకు తమను బాధ్యులుగా చూపడం మాత్రం సరికాదని పేర్కొంది.
''భారత్ అధీనంలోని జమ్ముకశ్మీర్‌లో జరిగిన దాడి తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్‌లో లోయలో జరిగిన హింసను మేం ఎప్పుడూ ఖండిస్తూవస్తున్నాం.
భారత ప్రభుత్వం కానీ అక్కడి మీడియా సర్కిళ్లు కానీ ఎలాంటి దర్యాప్తు లేకుండా ఈ దాడికి, పాకిస్తాన్ దేశానికి సంబంధాలు అంటగడుతూ చేసే నిందారోపణలను మేం తిరస్కరిస్తున్నాం'' అని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌కు కలిగిన కష్టాన్ని మా కష్టంగా భావిస్తున్నాం: రష్యా అధ్యక్షుడు పుతిన్
మరోవైపు పుల్వామాలో మిలిటెంట్ల దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలుపుతూ భారత రాష్ట్రపతి, ప్రధానులనుద్దేశించి ఆయన ప్రకటన చేశారు.
''జమ్ముకశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో భారత సైనికాధికారుల మృతికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఈ పాశవిక దాడిని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడికి పురిగొల్సినవారు, పాల్పడినవారు ఎవరైనా సరే నిర్ద్వంద్వంగా వారిని శిక్షించాల్సిందే.
కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు బలోపేతం చేసుకోవడానికి భారత్‌కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాను.
భారత్‌కు చెందిన మా స్నేహితులకు కలిగిన బాధను రష్యాలో ఉన్న మేం అనుభవిస్తున్నాం. దాడిలో గాడపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను'' అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా జరిగింది..
నిత్యం జవాన్ల పహారాలో ఉండే 'శ్రీనగర్-జమ్ము' జాతీయ రహదారిపై శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే గురువారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
''2,500 మంది బలగాలను తీసుకెళ్తున్న 70 వాహనాల కాన్వాయ్‌లోకి సుమారు 350 కేజీల పేలుడు పదార్థాలు నింపిన కారు చొరబడింది. కాన్వాయ్‌లో 44 మంది భద్రతాబలగాలకు చెందిన సిబ్బంది ఉన్న బస్సును ఈ కారు ఢీకొట్టింది'' అని ఓ సీనియర్ పోలీస్ అధికారి 'బీబీసీ ఉర్దూ' ప్రతినిధి రియాజ్ మస్రూర్‌కు తెలిపారు.
30 ఏళ్లలో 10 ఆత్మాహుతి దాడులు
1989 నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో సుమారు 10 ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇలా కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడడం ఇది రెండోసారి.
ఇంతకుముందు 2002లో జమ్ము సమీపంలోని కాలూచక్ సైనిక శిబిరంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది చనిపోయారు. వీరిలో అత్యధికులు సాధారణ పౌరులు, సైనికుల కుటుంబీకులే.
2016లో ఉరీలోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలోనూ 19 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు 2016లో 22 ఏళ్ల తీవ్రవాది బుర్హాన్ వనీని భారత బలగాలు కాల్చిచంపిన తరువాత కశ్మీర్‌లో హింస ప్రజ్వరిల్లింది. ఈ హింస కారణంగా 2018 ఒక్క ఏడాదిలోనే సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సాధారణ పౌరులు, భద్రతా బలగాలు, తీవ్రవాదులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జైష్-ఎ-మొహమ్మద్
జైష్ ఎ మొహమ్మద్ తీవ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో మసూద్ అజర్ అనే మతబోధకుడు ప్రారంభించారు. 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి సహా దేశంలో అనేక దాడుల వెనుక ఉన్నది ఈ సంస్థేనన్న అభియోగాలున్నాయి.
భారత్, బ్రిటన్, అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
పాకిస్తాన్‌లో కూడా దీనిపై 2002 నుంచి నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పూర్ ప్రాంతం కేంద్రంగా మసూద్ అజర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెబుతారు.
మరోవైపు మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరినప్పటికీ ఆధారాలు లేవంటూ తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి:
- కాందహార్ హైజాక్: కాళ్ల పారాణి ఆరకముందే ఆమె భర్తను హైజాకర్లు చంపేశారు
- భారత నోట్లను నేపాల్ ఎందుకు నిషేధించింది?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: 13 ఏళ్లు గడిచినా ఇంకా కేసు చిక్కు ముడి వీడలేదు
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










