అఫ్గానిస్తాన్: ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్లే

మిసైల్ గ్రామం

అఫ్గానిస్థాన్‌లోని కెజెలాబాద్‌ గ్రామంలో ఓ అద్భుతమైన రహస్యం దాగి ఉంది.

పేలకుండా మిగిలిపోయిన అత్యంత ప్రమాదకరమైన 400 క్షిపణులతో ఈ ఊరంతా నిర్మితమైంది. ఈ ఊళ్లో ప్రజలు ఈ క్షిపణులను ఇంట్లో దూలాలుగా, డోర్ స్టాపర్లుగా, గ్రామంలో చిన్న చిన్న కాలువలను దాటేందుకు బ్రిడ్జిలుగా ఉపయోగిస్తున్నారు.

ఒక్కో ఇంట్లోనూ ఒకటి, రెండూ కాదు... కనీసం 5కు పైనే క్షిపణులున్నాయి.

ఇన్నాళ్లకు ఇప్పుడు వీటిని తొలగించేందుకు నిపుణులు ఇక్కడికి వచ్చారు. ప్రతి ఇంటినీ పరిశీలించి, మొత్తం క్షిపణులపై ఓ అవగాహనకు వచ్చారు.

"ఒక్క ఇంట్లోనే 26 రాకెట్లున్నాయి. మొత్తం 1200 కేజీల పేలుడు పదార్థాలివి. ఇవి గనక పేలి ఉంటే ఈ గ్రామం మొత్తం నిమిషాల్లో నేలమట్టమైపోయి ఉండేది" అని డానిష్ డీ-మైనింగ్ గ్రూప్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే నిపుణుడు తెలిపారు.

వీడియో క్యాప్షన్, మిసైళ్లతో నిర్మితమైన అఫ్ఘానిస్థాన్ గ్రామం

ఇవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని వారు ఆరాతీశారు.

1980ల్లో యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ వీటిని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షిపణులు ఇక్కడే ఉన్నప్పటికీ అవి ప్రమాదకరమైనవనే విషయం ఈ గ్రామస్థులకు ఇప్పటివరకూ తెలియదు.

డీ-మైనింగ్ బృందం సభ్యులు ఇక్కడికి రావడం, వాటి గురించి వివరించడంతో ఈ పేలని క్షిపణుల గురించి గ్రామ ప్రజలకు కొంత అవగాహన కలిగింది.

ఇంటింటికీ వెళ్లి ఇవి ఎంత ప్రమాదకరమైనవో మహిళలకు కూడా వివరించాఖరు.

"మా వంటగదుల పక్కనే ఇవి ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా తీసేయండి" అని మహిళలు కోరుతున్నారు.

"ఈ క్షిపణులను తొలగించడం కూడా చాలా ప్రమాదకరమైన ప్రక్రియే. ఏమాత్రం ఒత్తిడికి, రాపిడికి గురైనా అవి పేలే ప్రమాదముంది" అని నిర్వీర్య బృందం నిపుణులు చెబుతున్నారు.

వీటన్నింటినీ సరిహద్దుల్లోకి తీసుకెళ్లి... వీలైనంత జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)