కశ్మీర్‌: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

46 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన గురువారం జరిగిన దారుణ మిలిటెంట్ దాడిని ముందుగానే నివారించి ఉండి ఉండవచ్చని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర నిఘా విభాగం అభిప్రాయపడింది.

భద్రతా బలగాలే లక్ష్యంగా జైషేమొహమ్మద్ వంటి సంస్థలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని ఫిబ్రవరి 12నే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భద్రతా విభాగాలను అప్రమత్తం చేశామని ఓ ఉన్నతాధికారి బీబీసీకి చెప్పారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ దిల్బగ్ సింగ్ దిల్లీలోని జాతీయ భద్రతా సలహాదారుకు ఇదే విషయాన్ని తెలియచేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా బీబీసీకి తెలిసింది.

అఫ్ఘానిస్థాన్‌లో ఇటీవల జరిగిన దాడులకు సంబంధించి జైషే మొహమ్మద్ ఒక వీడియోను విడుదల చేసింది. కశ్మీర్‌లో కూడా ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా రాష్ట్ర నిఘా విభాగం దిల్లీకి తెలియజేసింది.

రాష్ట్ర నిఘా విభాగం ఈ సమాచారాన్ని తగినంత ముందస్తుగానే దిల్లీ వర్గాలకు అందించింది. అయినా ఫిబ్రవరి 14న జరిగిన మిలిటెంట్ దాడి కచ్చితంగా భద్రతాలోపమే అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భద్రతా విభాగం అధికారి స్పష్టం చేశారు.

1998లో కార్గిల్ యుద్ధం అనంతరం జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు కశ్మీర్లో అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాయి. కానీ ఆ దాడుల్లో ఆత్మాహుతి బాంబర్లుగా ఉన్నది పాకిస్తానీ పౌరులే. కానీ జైషే మొహమ్మద్ తొలిసారిగా పుల్వామాలోని అదిల్ అలియాస్ వకాస్ కమాండో అనే ఓ స్థానిక బాలుడిని ఈ ఆపరేషన్ కోసం ఉపయోగించింది.

మిలిటెంట్ల దాడి తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే... పేలుడు ధాటికి ఒక బస్సు ఇనుము, రబ్బరు కుప్పలా మారిపోయింది.

అదే బస్సులో ఆ సమయంలో సుమారు 44 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో మోహరించాల్సిన జవాన్లతో వస్తున్న కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఈ దాడిలో చనిపోయిన జవాన్లలో ఎక్కువ మంది బీహార్‌కు చెందిన వారే.

కశ్మీర్‌లో పరిస్థితిని, ముఖ్యంగా ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం (15 ఫిబ్రవరి 2019) ఇక్కడ పర్యటించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాజ్‌నాథ్ పర్యటనకు ముందు ఇలాంటి దాడి జరగవచ్చని రాష్ట్ర నిఘా వర్గాల నుంచి తమకు హెచ్చరికలు అందాయని రాష్ట్ర పోలీసులు కేంద్రానికి తెలిపారు.

ఇది రాజ్‌నాథ్ పర్యటనను మరింత కీలకంగా మార్చింది.

శ్రీనగర్-లేత్‌పొరా జాతీయ రహదారిపై ఇంతకు ముందు భారీ మిలిటెంట్ దాడులు జరిగాయి. కానీ ఇంతటి తీవ్రమైన ఆత్మాహుతి దాడి చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారి జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)