FACT CHECK: పశ్చిమ బంగలో 'ముస్లిం తీవ్రవాదం' వీడియో వెనుక అసలు నిజం

- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
పశ్చిమ బంగలో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఇది ఒక ఉదాహరణ అంటూ ఒక హింసాత్మక వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
సుమారు రెండు నిమిషాల 20 సెకన్లున్న వీడియోలో ఉద్రిక్తతలను మనం స్పష్టంగా చూడవచ్చు.
వీడియోలో కనిపిస్తున్న వారిలో ఎక్కువ మంది కుర్తా-పైజామా, టోపీ ధరించి ఉన్నారు. వాళ్లంతా ఒక వీధిలో విధ్వంసం సృష్టిస్తున్నారు.
దీన్ని షేర్ చేసిన ఫేస్‌బుక్ పేజీలు, గ్రూప్స్‌లో చాలామంది ఇది వాట్సాప్ ద్వారా తమకు వచ్చిందని తెలిపారు.
కానీ ఈ వీడియోను పబ్లిక్‌గా షేర్ చేసిన వారందరూ ఇది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనగా చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter
వీడియోలో కనిపిస్తోంది ముస్లింలే
దీన్నే పోస్ట్ చేసిన ఒక ట్విటర్ యూజర్ "2019లో బీజేపీని ఎన్నుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే, వారంతా ఇలాంటి భవిష్యత్తు ఎంచుకోడానికి సిద్ధంగా ఉండండి. పశ్చిమ బంగలో ఇస్లామిక్ టెర్రర్ కు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ అందిస్తున్నాం. మిగతావారికి కూడా చూపించండి. అప్రమత్తం చేయండి" అని రాశారు.
ఇదే వీడియోను రిసర్జెంట్ ధర్మ అనే పేరుతో ఉన్న ఒక మతపరమైన గ్రూపులో కూడా పోస్ట్ చేశారు. అందులో ఈ వీడియోను 46 వేల మందికి పైగా చూశారు. 1800 మందికి పైగా షేర్ చేశారు.
శుక్రవారం కూడా కొన్ని కొత్త ఫేస్‌బుక్ పేజీల్లో మొబైల్‌తో తీసిన ఈ వీడియోను పోస్ట్ చేశారు.
కానీ ఈ వీడియో గురించి వీరందరూ చెబుతున్న వాదనలు అవాస్తవం.
ఈ వీడియోలో కనిపిస్తోంది ముస్లింలే, ఇది ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అనేది కూడా వాస్తవమే. కానీ దీని వెనక వేరే కథ ఉంది.

ఫొటో సోర్స్, FB/Resurgent Dharma
వీడియోలో ఘటన ఎక్కడ జరిగింది?
ఈ వీడియోను 2018 డిసెంబర్ నుంచి ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నట్లు రివర్స్ సెర్చ్ ద్వారా తెలిసింది. కానీ ఈ వీడియోను మొదట పోస్ట్ చేసినపుడు అందులో వేరే కథ చెప్పారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఒక వ్యక్తి 2018 డిసెంబర్ 1న ఈ వీడియో షేర్ చేశారు.
ఆయన దీని గురించి చెబుతూ "తబ్లీగీ జమాత్‌లోని రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మౌలానా సాద్ మద్దతుదారులు ఒకవైపు, ఆయన్ను వ్యతిరేకించేవారు మరో వైపు నిలిచారు. ఈ హింసలో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడడం విషాదం" అని రాశారు.
బంగ్లాదేశ్ స్థానిక మీడియాలో ప్రచురించిన వార్తలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఆ రిపోర్టుల ప్రకారం ఈ ఘటన తురాగ్ నది తీరం పక్కనే టోంగీ ప్రాంతంలో బిస్వ ఇజ్తెమా గ్రౌండ్ దగ్గర జరిగింది.
బంగ్లాదేశ్ మీడియా వివరాల ప్రకారం ఈ హింసలో 55 ఏళ్ల బిలాల్ హుస్సేన్ మృతి చెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
నిపుణుల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న 'బిశ్వ ఇజ్తెమా'ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింల రెండో అతిపెద్ద కలయికగా చెబుతారు. దీనిని తబ్లీగీ జమాత్ నిర్వహిస్తుంది.
టోంగీలో జరిగిన హింసకు సంబంధించిన కొన్ని వీడియోలను యూ-ట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశారు. వీటిలో పశ్చిమ బంగాల్ వీడియో అంటూ భారత్‌లో షేర్ చేస్తున్న వీడియో కూడా ఉంది.
బీబీసీ పరిశోధనలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటన అంటూ షేర్ చేసిన బంగ్లాదేశ్ వీడియో ఇదొక్కటే కాదని తేలింది.
భాషతోపాటు, ప్రజల రూపం ఒకేలా ఉండడంతో బంగ్లాదేశ్ ముస్లింల ఈ ఘర్షణ వీడియోను పశ్చిమ బంగ ముస్లింల వీడియో అని చెబుతూ షేర్ చేస్తూ వస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- సన్న జీవుల శ్రద్ధాంజలి
- సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ తొలగింపు: ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








