అరవింద్ కేజ్రీవాల్ పోర్న్ వీడియో చూశారా, అసలు నిజమేంటి?- రియాలిటీ చెక్

- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో ఒక అశ్లీల వీడియోను లైక్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రా గురువారం ఉదయం "దిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ట్విటర్‌లో పోర్న్ వీడియో చూస్తూ పట్టుబడ్డారు. నిన్న రాత్రి ఆయన ట్విటర్‌లో పోర్న్ వీడియోను లైక్ చేశారు" అని ట్వీట్ చేశారు.
ఆ ఆరోపణలతో పాటు "సంపూర్ణ స్వతంత్రం తెస్తానన్న ఆయన పోర్న్ స్వతంత్రం తెస్తున్నారు" అని కపిల్ మిశ్రా కేజ్రీవాల్‌పై సెటైర్ వేశారు.

ఫొటో సోర్స్, kapil mishra/twitter
మిశ్రా ఒక వీడియోను కూడా షేర్ చేశారు. దానిని 60 వేల మందికి పైగా చూశారు. వేల మంది షేర్ చేశారు.
కపిల్ మిశ్రాతోపాటు బీజేపీ (దిల్లీ) ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఐటీ సెల్ చీఫ్ పునీత్ అగ్రవాల్, అకాలీదళ్ జాతీయ ప్రతినిధి మన్‌జిందర్ సింగ్ సిర్సా కూడా ఇలాంటి వీడియోనే షేర్ చేశారు. వీరి ద్వారా చాలా మందికి ఈ వీడియో చేరింది.
వీరిలో ఎక్కువమంది నేతలు అరవింద్ కేజ్రీవాల్ పోర్న్ వీడియోలు చూస్తున్నారని ఆరోపించారు.
కానీ మా పరిశీలనలో ఈ వీడియోలో వ్యక్తి నగ్నంగా ఉన్నది నిజమే అయినా, దాన్ని పోర్న్ వీడియో అనడం మాత్రం వాస్తవం కాదని తేలింది.

ఫొటో సోర్స్, kejriwal/twitter
ప్రమాదకరమైన స్టంట్
ట్రోల్ చేస్తున్న వారు పోర్న్ అని చెబుతున్న ఆ వీడియోను బుధవారం రాత్రి అరవింద్ కేజ్రీవాల్ లైక్ చేసిన మాట వాస్తవమే.
ఆ వీడియోను యూకేలో ప్రస్తుతం వకీలుగా పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ డేల్ అనే రచయిత్రి బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లోని వీడియోకు 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 32 వేల మంది లైక్ చేశారు.

ఫొటో సోర్స్, Helen Dale/Twitter
ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసిన హెలెన్ డేల్ "దీన్ని ఇంటర్నెట్‌లో చాలా మంది ఇష్టపడుతున్నారని" అన్నారు.
ఈ వీడియోలో జపాన్ కమెడియన్ కోజుహాయే జుయెకుసా ఉన్నారు. ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర ఉపయోగించే బట్టలతో ఒక ప్రమాదకరమైన స్టంట్ చేసినవారుగా పాపులర్ అయ్యారు.
జుయెకుసా గత 10 ఏళ్ల నుంచీ స్టేజ్ కామెడీ చేస్తున్నారు. ఆయన అత్యంత పాపులర్ జపాన్ టీవీ కార్యక్రమాల్లో కూడా ఉన్నారు.
ఆ టాలెంట్‌తోనే ఆయన 'బ్రిటన్ గాట్ టాలెంట్' లాంటి రియాలిటీ షోలో సెమీ ఫైనల్ వరకూ చేరుకోగలిగారు.
యూట్యూబ్‌లో ఆయనకు దాదాపు 5 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ట్విటర్‌లో 34 వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షా 25 వేల మంది ఫాలో అవుతున్నారు.
కమెడియన్ కొజుహాఎ జుయెకుసా వీడియోలను ఒక రకమైన కళగా భావించిన యూట్యూబ్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు తమ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాటిని పోర్న్ కేటగిరీ నుంచి తప్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉదాహరణకు యూట్యూబ్ 'Nudity and sexual content policy' ప్రకారం యూట్యూబ్‌లో పోర్నోగ్రఫీ వీడియోలు నిషిధ్దం. ఎవరైనా పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసినా వెంటనే తొలగిస్తారు.
కానీ నగ్నత్వం ఉన్న ఎడ్యుకేషనల్, డాక్యుమెంటరీ, సైన్స్ లేదా ఆర్ట్‌కు సంబంధించిన వీడియోలను మాత్రం అనుమతిస్తుంది.
కమెడియన్ కొజుహాయె జుయెకుసాను బట్టల్లేకుండా చేసే ఈ స్టంట్స్‌ను కూడా సోషల్ మీడియాలో చాలా మంది అశ్లీలంగా భావించి కామెంట్ చేస్తుంటారు.
ట్విటర్‌లో ట్రోల్ కావడంతో సీఎం కేజ్రీవాల్ తర్వాత ఆ ట్వీట్‌ను అన్‌లైక్ చేశారు. కానీ "దిల్లీ ముఖ్యమంత్రి పోర్న్ వీడియో చూస్తూ పట్టుబడ్డారు అనే ఆరోపణ మాత్రం వాస్తవం కాదు".
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








