ముంబయి దాడులు: తొమ్మిదేళ్ల తర్వాత భారత రక్షణ ఎంత పటిష్టం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అజయ్ సాహ్నీ
- హోదా, రక్షణ వ్యవహారాల నిపుణుడు
26/11 ముంబయి దాడుల తర్వాత రక్షణ ఏర్పాట్లను పటిష్టం చేయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి. తీరప్రాంత రక్షణ ఏర్పాట్లు, పోలీసు బలగాల సామర్థ్యం పెరిగాయి.
నూతన ఆయుధాల కొనుగోలుతో పాటు ప్రత్యేక భద్రతా బలగాల ఏర్పాటు జరిగింది. చాలా డబ్బు ఖర్చు చేశారు కానీ వాటిలో కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల కోసం ఆర్మర్డ్ వాహనాలను ఖరీదు చేశారు. అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎందుకంటే వాటి అవసరం చాలా అరుదుగానే ఉంటుంది.
రక్షణ నిఘా కోసం చాలా వరకు నిరుపయోగమైన పరికరాలనే కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే వీటి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది రక్షణ వ్యవహారాల నిపుణులు కాదు. ఈ పరికరాల పనితనం గురించి చెప్పి కంపెనీలు వీటిని అమ్ముకుంటాయి. మరోవైపు భద్రతా బలగాలకు వీటిపై సరైన అవగాహనే ఉండదు.
సాధారణంగా కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలను మంచివే అయి ఉంటాయని భావిస్తారు. దీనికే మరో పార్శ్వం కోట్ల రూపాయల కొనుగోలు వ్యవహారాల్లో అక్రమాలకు కూడా అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మనం ఒక మొత్తం బిల్డింగ్‌కు ఇనుప తలుపులు ఏర్పాటు చేసి తాళం వేశాం. కానీ మిగిలిన కిటికీలు, తలుపులు తెరచుకునే ఉన్నాయి. వాటి గుండా ఎవరైనా చొరబడే వీలుంది.

ఫొటో సోర్స్, Getty Images
రక్షణ విషయంలో ఒక వ్యవస్థ లేదు
ప్రస్తుతం దేశంలో రక్షణకు సంబంధించి ఒక ఏకీకృతమైన వ్యవస్థ ఉనికిలో లేదు. ముంబయి దాడుల కోసం తీవ్రవాదులు సముద్ర మార్గాన్ని ఉపయోగించుకున్నారు. ఈ దాడి తర్వాత తీరప్రాంత రక్షణ ప్రాముఖ్యతేమిటో తెలిసివచ్చింది. ఆ తర్వాత కొన్ని తీరప్రాంత పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేశారు. గస్తీ నావలను కొనుగోలు చేశారు. అయితే వాటి నిర్వహణ కోసం సిబ్బందిని రిక్రూట్ చేసుకోకపోవడంతో అవి అలాగే ఉండిపోయి చివరకు చెడిపోయాయి.
గస్తీ నావలతో ఏం లాభం లేదు. అక్కడ తిరిగే నావలన్నింటినీ లెక్కించనంత వరకు తీరప్రాంతం సురక్షితంగా ఉందని చెప్పలేం. తీరప్రాంత రక్షణ వ్యవస్థ ఏకీకృత పద్ధతిలో లేదు. అక్రమంగా తిరిగే నావలను గుర్తించడం చాలా అవసరం.
రేడియో సిగ్నల్స్‌ను పట్టుకోవడం కోసం నావలో ట్రాన్స్‌పోండర్ తప్పనిసరి. 20 మీటర్లకన్నా పొడవుండే నావలలో ట్రాన్స్‌పోండర్ ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించింది. కానీ ఇది పాక్షికంగానే అమలవుతోంది. అట్లాగే, దాడి కోసం కుట్ర పన్నే తీవ్రవాదులు కేవలం 20 మీటర్ల నావలోనే బయలుదేరుతారా అన్నది మరో ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యత భద్రతా బలగాలదే?
దేశ పటిష్ట రక్షణకు కేవలం రక్షణ/భద్రతా బలగాలనే బాధ్యులుగా చూడడం సరైంది కాదు. ఎందుకంటే బడ్జెట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వాలే. రక్షణ బలగాలు ప్రతిపాదనలు పంపిస్తాయన్నది నిజమే కానీ విధానాలను నిర్ణయించే అధికారం వాటి చేతుల్లో ఉండదు. అట్లాగే విధానాలను నిర్ణయించేటప్పుడు బడ్జెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
బడ్జెట్‌కు అనుగుణంగా తప్పనిసరి అయిన వాటికే ప్రాధాన్యం ఇస్తారు. అట్లాగే ప్రత్యేక భద్రతా బలగాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. వీరు కూడా ప్రత్యేకమైన విషయాలపైనే దృష్టి పెడతారు. దీనికి బదులు పోలీసు, ఇంటలిజెన్స్ శాఖలనే ఎక్కువ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఎలా విజయవంతమవుతున్నాయనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భారత ఇంటెలిజెన్స్ సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) మొత్తం సామర్థ్యం 8-9 వేలే. అయితే ఏజెంట్ల సంఖ్య విడిగా ఉంటుంది. ఇంత పెద్ద దేశానికి ఈ సంఖ్య ఎటూ సరిపోదు.
ఇకపోతే, అంతర్గత ఇంటెలిజన్స్ వ్యవహారాలు చూసే ఐబీలో సంఖ్య 5-7 వేల మధ్య ఉంది. ఇక రాష్ట్రాల ఇంటెలిజెన్స్ బ్యూరోలను గమనిస్తే ఇవి చిన్న చిన్న విభాగాలుగానే ఉన్నాయి. అట్లాగే ఇంటెలిజెన్స్ డాటా బేస్ కూడా తయారు కాలేదు.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలనే చర్చ 1996 నుంచీ ఉంది. ఇందులో ఆధార్ కార్డుతో కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎవరైనా చేయగలరు.
క్రిమినల్ డేటాబేస్ సిస్టమ్ మొట్టమొదట అమెరికాలో 1968లో ప్రారంభమైంది. ఇప్పటికీ ఇది భారత్‌లో అమలు కాలేదు. పాశ్యాత్య దేశాలలో ట్రాఫిక్ నియమాలను మొదటిసారి ఉల్లంఘించగానే ఆన్‌లైన్ డేటా తయారవుతుంది. ఆ వ్యక్తి మరే నేరానికి పాల్పడినా దాన్ని డేటాతో పోల్చి చూస్తారు.
భారత్‌లో ఎవరైనా తీవ్రవాది మొదటిసారి పట్టుబడి ఆ తర్వాత నిర్దోషిగా విడుదలైనా ఆ విషయం ఎక్కడా తెలియదు. ఎందుకంటే డేటాబేస్ లేకపోవడమే దానికి కారణం.

ఫొటో సోర్స్, Getty Images
భయాన్ని వ్యాప్తి చేయడంలో మార్పు
ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ కూడా ఇందులో ప్రత్యేక పాత్ర పోషించింది. తీవ్రవాద సంస్థలు పనిచేసే విధానంలో కూడా మార్పు వచ్చింది. నేడు లష్కర్‌కు చెందిన వ్యక్తులు తమ తోటి వారినే గుర్తించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఎవరినైనా అదుపులోకి తీసుకొని విచారిస్తే వారు ఇతరుల గురించి చెప్పడం లేదు. అంటే ఆ వ్యక్తి వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది.
తీవ్రవాదాన్ని అణచివేయడంలో ఎన్నో దేశాలు సఫలీకృతమయ్యాయి. సైన్యాన్ని ముందుంచడం కూడా దానికి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం జరిగిన సందర్భంలో సైన్యాన్ని ముందు వరుసలో ఉంచలేదు. పోలీసులే అప్పుడు ముందు వరుసలో ఉన్నారు.
రెండు సార్లు పంజాబ్ డీజీపీగా పనిచేసిన కేపీఎస్ గిల్ 'టార్గెటెడ్ ఆపరేషన్' నిర్వహించారు. కింది స్థాయి తీవ్రవాదులకు బదులు ఆయన పెద్ద పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకొని 'టార్గెటెడ్ ఆపరేషన్' నిర్వహించారు.
పాకిస్తాన్‌లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఊళ్లను లేకుండా చేసేవారు. సైన్యం ముందుండి గ్రామీణ ప్రాంతాలపై ఇలాంటి ఆపరేషన్ నిర్వహించేవారు. కానీ భారత్‌లో ఇది కనిపించదు.
భారత్ వ్యూహం మానవతావాదానికి దగ్గరగా ఉంది అందుకే ఇక్కడ ఊళ్లను లేకుండా చేసే చర్యలు కనిపించవు. అయితే ఇలాంటి ఆపరేషన్‌లతో జనాలపై బలప్రయోగం జరుగుతూ వచ్చింది. దీంతో ఒక సెక్షన్ బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణహాని కలిగించే అణ్వాయుధాలు
ప్రస్తుతం తీవ్రవాద సంస్థల వద్ద అణ్వాయుధాలు లేవు కానీ ఇందుకోసం వారి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన దేశాల వద్ద ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి. ఇలాంటి ఆయుధాలను మరే ఇతర సంస్థకూ ఇవ్వలేదు.
తీవ్రవాద సంస్థలకు ఇలాంటి ఆయుధాలు ఏ దేశం అందిస్తుందనే ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ అనే వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆలోచనా ధోరణి తీవ్రవాద సంస్థలకు దగ్గరగా ఉంది. ఇలాంటి ఆలోచనా ధోరణి కలిగిన వారు పాకిస్తాన్ ఆర్మీలో కూడా చాలా మందే ఉన్నారు.
తీవ్రవాద సంస్థల వద్ద అణ్వాయుధాలుంటే జరిగే విధ్వంసం కన్నా రసాయన ఆయుధాలతో జరిగే విధ్వంసమే ఎక్కువ.
రసాయన ఆయుధాలతో ఎంత నష్టం?
26/11 లాంటి ఉగ్ర దాడిలో రసాయన ఆయుధాల వాడకం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలకు నష్టం వాటిల్లి ఉండేది. రసాయన ఆయుధాల వైరస్ త్వరగా వ్యాప్తి చెంది లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకునే ప్రమాదం ఉంటుంది.
దీనితో తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది విస్ఫోటక పదార్థంకన్నా చాలా ప్రమాదకరమైంది. దీనికోసం సన్నాహాలు చేయడంతో పాటు ఈ విషయంలో తగిన చైతన్యం పెంపొందించాల్సిన అవసరం కూడా ఉంది.
ఎంఎస్‌సీ విద్యార్థులు కూడా ఈ ఆయుధాలను తయారు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రయోగించడం కూడా సులువే. మరోవైపు అణ్వస్త్రాల కోసం చాలా సన్నాహాలు చేయాల్సి ఉంటుంది. అణ్వాయుధాలు లభించడమూ కష్టం. వాటిని ప్రయోగించడం అంతకన్నా కష్టం.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









