సర్జికల్ స్ట్రైక్స్ అబద్ధం, అవన్నీ ఊహాజనితం: పాకిస్తాన్

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

‘నేను మోదీని, నాకు వాళ్ల భాషలో జవాబివ్వడమే తెలుసు’.. బుధవారంనాడు లండన్‌లోని భారతీయ సముదాయంతో మాట్లాడుతూ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ గురించి అడిగిన ప్రశ్నకు భారత ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం ఇది.

ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ చేసే బెదిరింపులను అంతర్జాతీయ సమాజం గమనించాలనీ, కశ్మీర్‌లో భారత సైనికుల చర్యలను ఆపాలనీ కోరింది.

అసలు పాకిస్తాన్‌పై భారత్ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదనీ, భారత ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేననీ, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమనీ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.

‘భారత్‌వన్నీ అసత్య ప్రచారాలు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి భారత్ ఊహల్లోంచి పుట్టినవే. పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన, అబద్దాలు నిజమైపోవు. కశ్మీర్‌లో భారత ఆగడాలపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురైన ప్రతిసారీ భారత్ ఇలాంటి ఆరోపణలు చేసి దృష్టి మరలిస్తుంది’ అని పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి ముహమ్మద్ ఫైసల్ పేర్కొన్నారు.

2016 సెప్టెంబర్‌లో పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు భారత్ ప్రకటించింది. కానీ కేవలం నియంత్రణ రేఖ దగ్గర భారత్ ఫైరింగ్ మాత్రమే జరిపిందనీ, ఎలాంటి మెరుపు దాడులూ జరపలేదనీ పాకిస్తాన్ చెబుతూ వస్తోంది.

మోదీ - నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ విషయంపై లండన్‌లో మోదీ మాట్లాడుతూ ‘భారత చరిత్రలో అన్నీ విజయాలే ఉంటాయి. ఎప్పుడూ భారత్ అజేయ దేశమే. ఇతరుల హక్కుల్ని లాక్కోవడం భారత చరిత్రలో లేదు. అలాగని దేశంలోని అమాయకుల ప్రాణాల్ని బలిగొంటే ఊరుకునేది లేదు. ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. నేను మోదీని, నాక్కూడా వాళ్ల భాషలో జవాబు చెప్పడం తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో భారత్‌లోనూ ప్రశ్నలు ఎదురయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆ దాడులకు సాక్ష్యాలు చూపాలని కోరాయి. కానీ సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతామని ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా పేర్కొంది. సాక్ష్యాలు అడిగి సైన్యాన్ని అనుమానిస్తున్నారని మోదీ ప్రభుత్వం ప్రత్యర్థులకు బదులిచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)