ఈ కామన్వెల్త్ విజయాలతో భారత క్రీడా భవిష్యత్తు మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్నడూ లేని విధంగా 66 పతకాలను గెలుచుకుంది. భారత క్రీడా చరిత్రలో ఇదొక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్, తన మ్యాచ్‌కు గంట ముందు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు జరుగుతున్న మైదానం దగ్గర కనిపించారు.
జావెలిన్ త్రోలో పాల్గొంటున్న తన స్నేహితుడు నీరజ్ చోప్రాను ప్రోత్సహించేందుకే తాను అక్కడికి వచ్చినట్లు వినేష్ చెప్పారు.
ఆ సమయంలో అతడిని ప్రోత్సహించడమే తనకు ప్రధానమని వినేష్ భావించారు. నీరజ్ కూడా ఆమెను నిరుత్సాహపరచలేదు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
మొత్తంగా కామన్వెల్త్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత్ సాధించిన నాలుగో స్వర్ణ పతకం అది.
‘నీరజ్‌కు పతకాన్ని ప్రదానం చేసేప్పుడు ఎగిరిన జాతీయ జెండా, వినిపించిన జాతీయ గీతం నన్ను ఆనందంలో ముంచేశాయి’ అని వినేష్ అన్నారు.
ఆ క్షణమే తాను కూడా స్వర్ణం గెలుస్తానని నీరజ్‌కు మాటిచ్చినట్లు ఆమె చెప్పారు.
అనుకున్నట్టుగానే ఆమె కూడా రెజ్లింగ్‌లో స్వర్ణం గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
2010లో భారత్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 101, 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 పతకాలను భారత్ గెలుచుకుంది. గత కామన్వెల్త్ గేమ్స్(64)తో పోలిస్తే ఈసారి 2 పతకాలే ఎక్కువొచ్చాయి.
మరి ఈ గేమ్స్ ఎందుకు భారత్‌కు అంత ప్రత్యేకం?
ఈసారి రజతం(20), కాంస్యం(20)తో పోలిస్తే భారత్ స్వర్ణాలనే(26) ఎక్కువగా కైవసం చేసుకుంది. అది కూడా ఎక్కువగా అంచనాలు, స్వదేశీ అభిమానుల ప్రోత్సాహం లేని విదేశీ గడ్డపై.
ఈసారి భారత్ పాల్గొన్న 16క్రీడా విభాగాలకుగానూ 9 విభాగాల్లో పతకాలు గెలుచుకుంది. అందులో ఏడు విభాగాల్లో స్వర్ణం దక్కింది.
నీరజ్ చోప్రా, వినేష్ ఫోగట్‌లు స్వర్ణం గెలిచిన కాసేపటికే మనికా బ్రతా కూడా టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఆ గెలుపును చాలామంది భారతీయులు అస్సలు ఊహించలేదు. మెడలో పతకం పడే సమయంలో చెమర్చిన మనికా కళ్లు క్రీడాభిమానులకు చాలా కాలం గుర్తుండిపోతాయి.
మొత్తంగా వారం రోజుల వ్యవధిలో టేబుల్ టెన్నిస్‌లో మనికా నాలుగు పతకాలను గెలుచుకుంది. అందులో రెండు స్వర్ణాలున్నాయి. అప్పటివరకూ అంతగా ప్రాధాన్యం దక్కని టేబుల్ టెన్నిస్‌కు మనికా విజయం కొత్త గుర్తింపు తీసుకొచ్చింది.
కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం సాధించిన రెండో సింగపూరేతర క్రీడాకారిణి మనికానే.

ఫొటో సోర్స్, AFP
షూటింగ్‌లోనూ భారత్ ఈసారి సంచలనాలు నమోదు చేసింది. 15ఏళ్ల అనీష్ భన్వాలా నుంచి 37ఏళ్ల తేజస్వినీ సావంత్ వరకు షూటింగ్‌లో రికార్డులు తిరగరాసి మరీ భారత షూటర్లు పతకాలు సాధించారు.
పతకాల సంఖ్య పరంగా గత కామన్వెల్త్ గేమ్స్‌తో పోలిస్తే ఇది గొప్ప విజయం కాకపోయినా, ఆ పతకాలను సాధించిన తీరు, విభాగాలు మాత్రం భారత క్రీడా ప్రస్థానాన్ని ఓ కొత్త మలుపు తిప్పాయనే చెప్పొచ్చు.
సీనియర్లు సుశీల్ కుమార్, మేరీ కోమ్ లాంటి వాళ్ల బాటలో ఈసారి కొత్త తరం క్రీడాకారులు కూడా అడుగుపెట్టి భవిష్యత్తుపై ఆశలు పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోపక్క భారత్ తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అందులో అందులో ఒకటి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈసారి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. పోటీ ఎక్కువగా ఉండే ఆసియన్ గేమ్స్‌కి ముందు ఇది కాస్త కలవరపెట్టే అంశమే.
మరోపక్క డ్రగ్స్, డోపింగ్ ఆరోపణలు కూడా భారత్‌ను ఇబ్బందిపెట్టేవే. క్రీడా గ్రామంలో సిరంజుల వినియోగంపై నిషేధం ఉన్నా, భారతీయ అథ్లెట్లు వాటిని తీసుకెళ్లడం, తరవాత పోటీలనుంచి వైదొలగడం లాంటి సంఘటనలపై దృష్టిపెట్టాలి.
వీటిని నివారించలేని పక్షంలో క్రీడాకారుల అద్వితీయ ప్రదర్శనను ఆ చేదు జ్ఞాపకాలు మసక బారుస్తాయి.
(రచయిత సుప్రితా దాస్ దిల్లీకి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








