#కర్నాటక ఎన్నికలు: దళితుల ఓటు ఎవరికి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బెంగళూరు నుంచి, బీబీసీ కోసం
కర్నాటకలో తిరిగి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా.. దళిత వర్గాన్ని కౌగిలించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారత రాజ్యాంగ నిర్మాత పేరు.. డా.బాబాసాహెబ్ రామ్‌జీ అంబేడ్కర్ అని పేర్కొన్న బీజేపీకి, కర్నాటకలో ఆయన పేరులోని 'రామ్ జీ' అవసరం లేకుండా పోయింది!
అంబేడ్కర్ 127వ జయంతి రోజున కర్నాటక వార్తా పత్రికల్లో ఆయన గురించిన ప్రకటనలు చాలా కనిపించాయి. బీజేపీ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో.. రాజ్యాంగ నిర్మాతను కేవలం భారతరత్న డా. బాబాసాహబ్ అంబేడ్కర్ అని మాత్రమే రాశారు.
ఆ ప్రకటనల్లో.. ప్రజాస్వామ్యం గురించిన అంబేడ్కర్ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. జయంతిని పురస్కరించుకుని, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప దళితులతో కలిసి భోంచేస్తారని పేర్కొన్నారు.
గతంలో యడ్యూరప్ప.. దళితుల ఇంటికి వెళ్లి, ఆ దళితుల వంట తినకుండా, తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భోజనం తిన్నారన్న మచ్చను తొలగించుకోవడానికి ఇలా బహిరంగ ప్రకటన చేసుండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
హెగ్డే వ్యాఖ్యల దుమారం..
కర్నాటకలో చాలా మంది దళితులు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. 'రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ అధికారంలోకి వచ్చింది' అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రధాన కారణం.
ఈ వ్యాఖ్యలు.. దళితుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అనుమానాలు రేకెత్తించాయని చెప్పవచ్చు!
అంబేడ్కర్ జయంతి సందర్భంగా యడ్యూరప్ప దళితులను కలిసినపుడు.. హెగ్డే వ్యాఖ్యల పట్ల తమ బాధను, కోపాన్ని బాహాటంగానే వ్యక్తపరచారు.
అయితే, తన వ్యాఖ్యల పట్ల హెగ్డే క్షమాపణలు కోరినట్లు యడ్యూరప్ప సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.
గత నెలలో అమిత్ షా మైసూరులో దళిత సంఘాలతో సమావేశమయ్యారు.
ఆ సందర్భంలో.. హెగ్డే వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. హెగ్డే క్షమాపణల గురించి అమిత్ షా ప్రస్తావించినా, వారి ఆగ్రహం చల్లారలేదు.
హెగ్డేను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. గట్టిగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. కేవలం హెగ్డే వ్యాఖ్యలు మాత్రమే దళితుల ఆగ్రహానికి కారణం కాదు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు, భీమ్ కోరేగావ్ దాడులు, ఉనా దాడి ఘటనలు దళితుల ఆగ్రహాన్ని చల్లారనివ్వడం లేదు.
''దళిత వర్గానికి రాజకీయంగా పదవులు రావడం లేదు. దీంతో.. బీజేపీ తమ వర్గానికి వ్యతిరేకం అన్న భావన వారిలో నాటుకుపోయింది'' అని భారిపా (భారతీయ రిపబ్లికన్ పక్ష్) బహుజన్ మహాసంఘ్‌కి చెందిన అంకుశ్ గోఖలే బీబీసీతో అన్నారు.
2008 ఎన్నికల వ్యూహం మళ్లీ ఫలిస్తుందా?
కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గడ్డుకాలం పొంచివుందన్న అనుమానాలు లేకపోలేదు. కానీ 2008 ఎన్నికల్లో దళితుల ఓట్లు సంపాదించడంలో యడ్యూరప్ప వ్యూహం అద్భుతంగా పని చేసింది.
కర్నాటక దళితులను రెండు వర్గాలుగా విభజిస్తే.. అందులో రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గం 2008 ఎన్నికల్లో యడ్యూరప్పకు సానుకూలంగా పని చేసింది. విద్యారంగంలో, రాజకీయంగా, సామాజికంగా ముందంజలో ఉన్న మరో దళిత వర్గానికి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చెందుతారు.
2008 ఎన్నికల్లో నిలబడిన 'వెనుకబడిన దళిత వర్గం' అభ్యర్థులకు లింగాయత్‌లు మద్దతు ఉంటుందని, బీజేపీ తరఫున ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే లింగాయత్ అభ్యర్థులకు ఈ వర్గం దళితులు మద్దతు ఇవ్వాలని యడ్యూరప్ప, సదరు వర్గం దళితులు ఒప్పందం చేసుకున్నారు.
కానీ.. 2008లో యడ్యూరప్పకు సానుకూలంగా ఉన్న ఈ దళిత వర్గం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.

''హెగ్డే ఆ వ్యాఖ్యలు చేసి నెలలు గడుస్తోంది. కానీ.. దళితుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. రాజ్యాంగంలోని రిజర్వేషన్లను మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదని నచ్చజెప్పినా వారు నమ్మడం లేదు'' అని తన పేరు ప్రస్తావించడానికి అనుమతించని ఓ బీజేపీ సీనియర్ నేత చెప్పారు.
''ఎన్నికల్లో పోటీ చేయడానికి రెండు దళిత కులాలకు బీజేపీ ప్రాతినిధ్యం కల్పించింది. కానీ ఈ వర్గంలో కూడా ప్రస్తుతం బీజేపీ పట్ల వ్యతిరేకత కన్పిస్తోంది.
గతంలో యడ్యూరప్పకు అనుకూలంగా ఉన్న వెనుకబడిన దళిత వర్గం జనాభా.. రెండో వర్గం కంటే ఎక్కువ. ఈ వెనుకబడిన వర్గంలోని దాదాపు 60-80 శాతం బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు సానుకూలంగా పని చేసే వాతావరణం కనిపిస్తోంది'' అని దళిత రచయిత గురుప్రసాద్ కెరేగౌడ అన్నారు.
దళితుల్లో రిజర్వేషన్‌పై సదాశివ కమిషన్ ఏం చెబుతుంది?
దళితుల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం.. సదాశివ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదికను ఇంకా విడుదల చేయలేదు. కానీ.. దళితుల్లో వెనుకబడిన వర్గాలకు 6 శాతం రిజర్వేషన్, మరో వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు ఉండాలని కమిషన్ నివేదికలో ప్రధానాంశంగా కనిపిస్తోంది.
కమిషన్ నివేదిక సారాంశంపై కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఎన్నికల సందర్భంలో ఈ నివేదిక గురించి మాట్లాడితే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉన్న అభివృద్ధి చెందిన దళితులకు తక్కువ శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సివస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండి పడే అవకాశాలు ఎక్కువ. అందుకే.. తెలివిగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ కమిషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
''కాంగ్రెస్ పట్ల కూడా దళితుల్లో అసంతృప్తి లేకపోలేదు. కానీ దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల, రాజ్యాంగంలో మార్పులు చేస్తారన్న అనుమానాల పట్ల దళిత యువకులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణాలతో.. బీజేపీ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది'' అని దళిత సంఘర్షణ సమితికి చెందిన మావల్లి శంకర్ అన్నారు.
అయితే.. రాష్ట్రంలోని 36 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నదే ఎన్నికల్లో కీలకాంశం అవుతుంది.

ఫొటో సోర్స్, Manjunath kiran/AFP/GETTY
''కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలపైనా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ ఎన్నికల్లో.. వెనుకబడిన దళితులకు ఏ పార్టీ ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తుందో అన్నదే ప్రధానం'' అని మాదిగ ఆరక్షన్ పోరాట సమితికి చెందిన మాపన్న అద్నూర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








