మక్కా మసీదు పేలుడు కేసు: "అందరూ నిర్దోషులైతే మరి మా వాళ్లను చంపిందెవరు?"

ఫొటో సోర్స్, BBC/Deepthi
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఈరోజు వచ్చిన తీర్పు మేం ఊహించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పటి పేలుడులో నా మేనల్లుడు చనిపోయాడు. మాకు ఎలాంటి న్యాయం జరగలేదని అనిపిస్తోంది" - ఇదీ మక్కా పేలుడు కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత 58 ఏళ్ల మహ్మద్ సలీం స్పందన.
2007లో హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదులో జరిగిన భారీ పేలుడు కారణంగా చనిపోయిన 9 మందిలో సలీం మేనల్లుడు షేక్ నయీమ్ ఒకరు. మరో 50 మందికి పైగా ఆ ఘటనలో గాయపడ్డారు.
పదకొండేళ్ల తర్వాత నాంపల్లిలోని నాలుగో అదనవు మెట్రోపాలిటన్ సెషన్స్(ఇది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కూడా) ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఐదుగురు నిందితులనూ నిర్దోషులుగా ప్రకటించింది.
నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద్, దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, భరత్ మోహన్‌లాల్ రత్నేశ్వర్, రాజేందర్ చౌధరి - వీళ్లందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఉదయం నుంచీ సలీం టీవీలో వార్తల్ని చూస్తూ ఉన్నారు. తీర్పు కోసం ఆశగా ఎదురు చూశారు. ఒక హోటల్‌లో చెఫ్‌గా పని చేసే సలీం హైదరాబాద్‌లోని తలాబ్ కట్టా ప్రాంతంలో ఒక చిన్న గల్లీలో నివాసముంటారు.
నయీమ్ అకాల మరణం పాలైనప్పటి నుంచి మంచం పట్టిన అతడి తల్లిని ప్రస్తుతం ఆమె సోదరుడు సలీం చూసుకుంటున్నారు. "నా చెల్లెలు కనీసం లేచి నడవలేదు. ప్రస్తుతం ఊపిరి మాత్రమే తీసుకుంటోంది. కుమారుడి మరణం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. ఆమె బాగోగులు నేనే పట్టించుకుంటున్నా" అని సలీం తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/Naveen
మక్కా పేలుడు ఘటనపై తీర్పు వెలువరించే సందర్భంగా సోమవారం నాడు కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ రోజుకు షెడ్యూల్ అయి ఉన్న కేసులతో సంబంధం ఉన్న వారిని తప్ప మరెవ్వరినీ కోర్టు లోపలికి అనుమతించలేదు.
మీడియాను కూడా కోర్టు పరిసరాల్లోకి అనుమతించలేదు. "ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవు" అని అక్కడ డ్యూటీలో ఉన్న ఒక అధికారి బీబీసీకి తెలిపారు.
మధ్యాహ్నం సమయానికి తీర్పు వెలువడింది. కొద్ది నిమిషాల్లోనే నిందితులంతా కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, BBC/Naveen
అసీమానంద్ తరఫు న్యాయవాది జేపీ శర్మ మీడియాతో మాట్లాడుతూ, "మునుపటి ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా ఎన్ఐఏను ఒక పనిముట్టులా దిగజార్చింది" అని ఆరోపించారు.
"ఇదంతా యూపీఏ ప్రభుత్వం అల్లిన కట్టుకథ. నిందితులపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. జనాలను తప్పుడు పద్ధతుల్లో కేసుల్లో ఇరికించాలని చూసే ఏ ప్రభుత్వానికైనా ఇదొక కనువిప్పు కావాలి" అని జేపీ శర్మ అన్నారు.
అయితే ఈ తీర్పు చాలా మందికి అసంతృప్తిని మిగిల్చింది. కోర్టు పరిసరాల్లో ఒక వ్యక్తి "అందరూ నిర్దోషులైతే మరి మా వాళ్లను చంపిందెవరు?" అని వ్యాఖ్యానించారు.
2007 మేలో పేలుడు ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో అనేక మందిని ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి పేలుడు ఘటనతో సంబంధం ఉందని ఆరోపించారు. అయితే వారిలో దాదాపు అందరినీ 2008లో కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, BBC/Imran
వారిలో ఒకరు బోయిన్‌పల్లి నివాసి సయ్యద్ ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు 33 ఏళ్ల వయసున్న ఇమ్రాన్‌ను 2007లో పోలీసులు నడిరాత్రి ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి. ఇప్పుడు ఇమ్రాన్ ఒక ప్రైవేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ "జైలులో 18 నెలల 24 రోజులు ఉండి విడుదలైన తర్వాత నేను నా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. అయితే నా ఈ నేపథ్యం కారణంగా నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు వాళ్లను (హిందూ అతివాద సంస్థ సభ్యులను) కూడా నిర్దోషులుగా ప్రకటించారు. మరైతే ఆ పేలుడు ఘటనకు ఎవరు బాధ్యులు? ఈ ప్రశ్నకు సమాధానం దర్యాప్తు సంస్థలే చెప్పాలి. ఏ తప్పూ చేయకుండానే ఈ కేసు మూలంగా నా జీవితమే పట్టాలు తప్పినట్టయ్యింది. దీనికి ఎవరు బాధ్యులు?" అని ప్రశ్నించారు.
ఓ వైపు ఈ తీర్పు పట్ల పలువురి స్పందనలు వస్తుండగానే, సోమవారం సాయంత్రం జరిగిన ఓ అనూహ్య పరిణామంలో ఈ కేసు జడ్జి రవిందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు.
ఈ రాజీనామాకు కచ్చితమైన కారణాలేంటో ఇప్పటికీ తెలియరాలేదు గానీ, అనేక అంతర్గత గొడవల ఫలితంగానే ఆయన రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








