'మక్కా మసీదు' పేలుడు కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయ స్థానం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
తగిన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు ఐదుగురు నిందితులు - అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్, రాజేందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.
పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పు నేడు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొనగా, వారిలో ఒకరు హత్యకు గురయ్యారు.
మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంకో ఇద్దరిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
2007 మే 18న హైదరాబాద్‌లోని మక్కా మసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.
ఈ దాడికి పాల్పడింది హిందూ అతివాదుల బృందమని దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.
దేశంలో హిందూ అతివాదులు పాల్పడినట్లు ఆరోపణలున్న దాడుల్లో మక్కా మసీదు పేలుడు ఘటన ప్రధానమైనది.
పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తీర్పు కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది.

'బోగస్ కేసు'
తీర్పు వెలువడిన తర్వాత అసీమానంద్ తరఫు న్యాయవాది జేపీ శర్మ విలేఖరులతో మాట్లాడుతూ, ఇది "బోగస్ కేసు" అని అన్నారు.
యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏను ఒక పనిముట్టుగా వాడుకుందనీ, ఈ కేసులో తగిన ఆధారాలే లేవని ఆయన విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పేలుడు ఎప్పుడు జరిగింది?
2007 మే 18వ తేదీన బాంబు దాడి జరిగింది. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో ఒక ఈఐడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేలింది.
అది శుక్రవారం కావటంతో.. ఆ సమయంలో మసీదు లోపల దాదాపు 10,000 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఎందరు చనిపోయారు?
ఈ పేలుడులో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిలో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 58 మంది గాయపడ్డారు.
ఈ పేలుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చిన గుంపుపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, AFP
దర్యాప్తు ఎలా సాగింది?
మొదట ఈ దాడి చేసింది పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతున్న ఛాందసవాద బృందమని భావించారు.
ఈ కోణంలోనే తొలుత దర్యాప్తును కొనసాగించారు. హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజీ) కమాండర్, హైదరాబాద్ నివాసి మొహమ్మద్ షాహిద్ బిలాల్ ఈ దాడికి బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచే కుట్ర పన్నాడని కథనాలు ప్రచారమయ్యాయి.
ఈ దాడితో సంబంధముందన్న అనుమానంతో హైదరాబాద్ పోలీసులు పలువురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు.
అయితే.. ఈ కేసులో అమాయకులను ఇరికిస్తున్నారని తీవ్రంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి.
దీంతో.. మక్కా మసీదు కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు.
ఆధారాలు ఎలా లభించాయి?
మసీదు ఆవరణలో పేలకుండా ఉండిపోయిన ఒక ఈఐడీ ద్వారా సీబీఐకి క్లూలు దొరికాయి.
పేలిన ఈఐడీ, ఈ పేలని ఈఐడీ.. రెండింటినీ పేల్చటం కోసం టైమర్లుగా సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు గుర్తించారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర జరిగిన బాంబు దాడికి కూడా ఇదే పద్ధతిని (మోడస్ అపరాండి) అనుసరించారు.
ఆ ఆధారాలతో.. హిందూ అతివాద బృందం ఒకటి ఈ పేలుళ్లకు పాల్పడ్డట్లు సీబీఐ కనుగొంది.
నిందితుల అరెస్టులు ఎలా జరిగాయి?
ఆ ఆధారాలతో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు 2010లో దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్ట్ చేశారు.
2011లో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి బదిలీ చేసింది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ తరహా దాడుల నుంచి ఆధారాలను క్రోడీకరించటం ద్వారా.. ఎన్‌ఐఏ అధికారులు మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితులెవరు..?
మక్కా మసీదు బాంబు దాడి కేసులో మొత్తం 10 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఐదుగురు నిందితులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ ఐదుగురు వీరే...
నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద్: ఒక బాబా, గుజరాత్
దేవేంద్ర గుప్తా: ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, రాజస్థాన్
లోకేశ్ శర్మ: ప్రాపర్టీ డీలర్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, మధ్యప్రదేశ్
భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్: ప్రైవేటు ఉద్యోగి, గుజరాత్
రాజేందర్ చౌదరి: రైతు, మధ్యప్రదేశ్

మరో ఐదుగురి సంగతేమిటి?
నిందితుల్లో ఒకరైన సునీల్ జోషి కేసు దర్యాప్తులో ఉండగానే హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జోషి గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్‌గా పనిచేశారు.
మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులు సందీప్ వి డాంగే (మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్), రామచంద్ర కల్సంగ్రా(ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త) పోలీసులకు ఇంకా పట్టుపడలేదు.
మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
చార్జ్‌షీట్ సారాంశమేమిటి?
ముస్లిం మతస్థులు సమావేశమయ్యే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నిందితులు దాడులు చేయటానికి 2004-2007 మధ్య కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
1998 నుంచి దేశంలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నింది ముస్లిం గ్రూపులని ఈ నిందితులు భావించారని, వాటికి ప్రతీకారంగా ప్రతిదాడులు చేయాలనుకున్నారని ఆ చార్జ్‌షీట్‌లో ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








