సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
- రచయిత, తుషార్ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హిందుత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు వైభవ్ రావుత్, శరత్ కాలస్కర్, సుధన్వా జోగ్లేకర్‌ను అరెస్ట్ చేసింది.
అరెస్టయిన ముగ్గురూ ముంబయి, పుణే, సతారా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టు ఏటీఎస్ తెలిపింది.
వైభవ్ రావుత్‌కు సనాతన్ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురి అరెస్టుతో సనాతన్ సంస్థ, హిందూ జన జాగృతి సమితి మరోసారి వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి.
రెండు సంస్థలు ఒకటేనా, లేక రెండూ వేరు వేరా? ఈ సంస్థలు ఏం చేస్తాయి? ఇవి శిక్షణ ఇస్తున్నాయా? ఈ సంస్థలను నడిపిస్తున్నవారు ఎవరు? వారిపై ఏదైనా విచారణ జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
మేం ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు ప్రయత్నిస్తున్నాం.
విచారణ బృందాలు వైభవ్ రావుత్ ఇంటి నుంచి బాంబులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అది సనాతన్ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని నిరూపిస్తోందని తెలిపింది.
ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సనాతన్ సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్ర హోం మంత్రి దీపక్ కేసర్కర్ కూడా సనాతన్ సంస్థను నిషేధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపినట్టు తెలిపారు.
ఈ ఆరోపణలు, వివాదాల మధ్య సనాతన్ సంస్థ ప్రతినిధి రాజహంస్ "వైభవ్ రావుత్ సనాతన్ సంస్థ సాధక్ ( సనాతన సంస్థ కార్యకర్తలను సాధక్ అంటారు) కాడు. కానీ అతడు హిందుత్వ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటాడు. హిందుత్వ కోసం, మతం కోసం పనిచేసే ఎవరినైనా మేం సనాతన్ సంస్థ కార్యకర్తగానే భావిస్తాం" అన్నారు.
సనాతన్ సంస్థపై నిషేధం విధించాలనే డిమాండ్‌ను రాజహంస్ కుట్రగా వర్ణించారు. తమ సంస్థను బాంబు పేలుళ్ల కేసుల్లో ఇరికించడం, సనాతన్ సంస్థపై నిషేధం విధించాలనే డిమాండు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదన్నారు.

ఫొటో సోర్స్, SANATAN SANSTHA
సనాతన సంస్థ, బాంబు పేలుళ్ల కేసులు
అంతకు ముందు గడ్కరీ రంగాయతన్, మడ్గావ్ బాంబు పేలుళ్ల కేసులు, గోవింద్ పంసారే, నరేంద్ర డాభోల్కర్, గౌరీ లంకేశ్ హత్య కేసుల్లో సనాతన్ సంస్థకు సంబంధించిన కార్యకర్తల పేర్లు వెలుగుచూశాయి.
1. గడ్కరీ రంగాయతన్ బాంబు పేలుళ్లు
2008 జూన్ 4న ఠాణేలోని గడ్కరీ రంగాయతన్ థియేటర్ పార్కింగ్ ప్రాంతంలో ఒక బాంబు పేలింది. ఈ పేలుడులో ఏడుగురు గాయపడ్డారు. దీని వెనుక విక్రమ్ భావే, రమేష్ గడ్కరీ హస్తం ఉన్నట్టు విచారణలో తేలింది.
ఇద్దరికీ సనాతన్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. బాంబు పేలుడు జరగక ముందు, ఇద్దరూ రంగాయతన్‌లో 'అమ్హీ పచ్‌పూతే' అనే మరాఠీ నాటక ప్రదర్శన చూశారు. ఇది హిందూ మతానికి వ్యతిరేకం అని సనాతన సంస్థ ఆరోపించింది.
ఈ నాటకానికి వ్యతిరేకంగా బాంబు పేలుళ్లు జరిపారని విచారణ బృందాలు తెలిపాయి. అయితే, సనాతన సంస్థ మాత్రం తమ కార్యకర్తలను ఈ కేసులో ఇరికించారని చెబుతోంది.

ఫొటో సోర్స్, AFP
2.మడ్గావ్ పేలుళ్లు
2009 అక్టోబర్ 16న సనాతన్ సంస్థకు చెందిన ఒక కార్యకర్త మల్గోండా పాటిల్, గోవాలోని మడ్గావ్‌లో బాంబు తయారు చేస్తూ మృతి చెందాడు. గోవా హోంశాఖ ఈ విషయాన్ని బయటపెట్టింది. గడ్కరీ రంగాయతన్‌లో జరిగిన పేలుళ్లు, ఆ తర్వాత సాంగ్లీలో జరిగిన అల్లర్ల కేసులో మల్గోండా పాటిల్ మహారాష్ట్ర ఏటీఎస్ విచారణ ఎదుర్కుంటున్నాడు.
మల్గోండా పాటిల్ తమ కార్యకర్త అని సనాతన సంస్థ ఒప్పుకుంది. ఆ సంస్థ ప్రతినిధి చేతన్ రాజహంస్ "ఈ కేసులో కూడా సనాతన్ సంస్థను బలవంతంగా ఇరికించారు. మేం ఈ ఘటనలో మా సాధక్ మల్గొండా పాటిల్‌ను కోల్పోయాం. కానీ ఈ కేసులో మిగతా నిందితులను సాక్ష్యాలు లేకపోవడంతో వదిలేశారు. వారంతా ఇప్పుడు జైలు బయట ఉన్నారు. కానీ అబద్ధపు కేసు వల్ల నల్గోండా జీవితం నాశనమైంది" అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/NARENDRA DABHOLKAR
3.నరేంద్ర డాభోల్కర్ హత్య కేసు
మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి స్థాపకుడు, తార్కికుడు, రచయిత డాక్టర్ నరంద్ర డాభోల్కర్ హత్య 2013, ఆగస్టు 20న పుణెలో జరిగింది. ఈ కేసులో అనుమానితుడు వీరేంద్ర తావ్డే హిందూ జనజాగరణ సమితి సభ్యుడు. వీరేంద్ర తావ్డేకు సనాతన సంస్థతో కూడా సంబంధాలున్నాయి.
తావ్డేను 2016లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో సనాతన సంస్థకు చెందిన మరో కార్యకర్త సారంగ్ అకోల్కర్ కూడా అనుమానితుడని సీబీఐ తెలిపింది. అతడు ప్రస్తుతం పరారీలో ఉందని చెప్పింది. ఇటీవల అరెస్ట్ అయిన వైభవ్ రావుత్, హిందూ గోవంశ్ రక్ష సమితి సభ్యుడు. అతడు సనాతన సంస్థ కార్యకలాపాలలో పాల్గొంటున్నాడు.
4.గోవింద్ పంసారే హత్య కేసు
కొల్హాపూర్‌లో వామపక్ష నేత గోవింద్ పంసారే, ఆయన భార్య ఉమపై 2015 ఫిబ్రవరి 15న కాల్పులు జరిగాయి. వారు ఉదయం వాకింగ్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. పంసారే కాల్పులు జరిగిన ఐదు రోజుల తర్వాత కొల్హాపూర్‌లోని ఒక ఆస్పత్రిలో మరణించారు.
ఈ కేసులో పోలీసులు 2015 సెప్టెంబర్ 15న సమీర్ గైక్వాడ్‌ను సాంగ్లీలో అరెస్ట్ చేశారు. సమీర్ గైక్వాడ్‌కు సనాతన్ సంస్థతో సంబంధాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సనాతన్, హిందూ జనజాగృతి సమితి వేరు వేరు సంస్థలా?
సనాతన్ సంస్థ, హిందూ జన జాగృతి సమితి రెండూ వేరు వేరు సంస్థలని రెండు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. సనాతన్ సంస్థ ప్రతినిధి చేతన్ రాజసింహ్ "అనుచరులు భగవంతుడి ధ్యానం చేసేందుకు వారికి ఆధ్యాత్మిక బోధన చేసేందుకు సనాతన సంస్థను స్థాపించాం. హిందూ జనజాగృతి సమితికి చాలా హిందూ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. సనాతన సంస్థ వాటిలో ఒకటి" అన్నారు.
కానీ నిజానికి ఈ రెండు సంస్థలు ఒకే నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివని విశ్లేషకులు చెబుతున్నారు. సాకాల్ మీడియా గ్రూప్ సింపుల్ టైమ్స్ పత్రిక సంపాదకురాలు అల్కా ధూప్‌కర్, "దీనికి రెండు పేర్లున్నాయి, కానీ ఈ రెండు పేర్లు ఒకే సంస్థకు చెందినవి" అన్నారు. ఆమె సనాతన్ సంస్థపై ఒక ప్రత్యేక కథనం కూడా చేశారు.
"ఒకప్పుడు సనాతన్ సంస్థ గురించి ఎక్కువ మందికి తెలీని సమయంలో, ఈ సంస్థ కార్యకర్తలు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి అక్కడి విద్యార్థులను తమ సంస్థలో చేరేలా ప్రేరేపించేవారు. దీనిపై వారి తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ వారి రిపోర్టులను పట్టించుకోలేదు" అని ఆమె చెప్పారు.
కానీ సనాతన సంస్థకు సంబంధించిన హిందూ వకీల్ అసోసియేషన్ చీఫ్ సంజీవ్ పునాలేకర్ ఈ ఆరోపణలను ఖండించారు. "యువకుల కోసం సనాతన్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. మేం ఏ కార్యక్రమాలూ దొంగచాటుగా నిర్వహించలేదు. ఇందులో యువకులందరూ పాల్గొనేవారు. తల్లిదండ్రులు వాటిని వ్యతిరేకించేవారు. మాపై ఆరోపణలు చేసేవారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SANATAN SANSTHA
'2023లో హిందూ దేశ స్థాపన'
సమాజం అండతో దేశ భద్రతను, ప్రజల్లో మత విశ్వాసాలను పెంచి, అన్ని రకాలుగా ఆదర్శంగా నిలిచే, హిందూ మత ఆధారిత దేశాన్ని స్థాపించడమే తమ లక్ష్యంగా సనాతన సంస్థ తమ వెబ్‌సైట్‌లో తెలిపింది.
పరాత్పర గురు డాక్టర్ అఠ్వాలే యాంచే ఆలోచనలు: ద్వితీయ ఖండం పేరుతో రాసిన ఒక పుస్తకంలో "2023లోపు భారత్‌లో రామరాజ్యం లేదా హిందూ దేశ స్థాపన" అని డాక్టర్ అథవాలే 1998లో మొదటిసారి రాశారు. సావర్కర్ లాంటి ప్రముఖులు హిందూ దేశ స్థాపన గురించి చెప్పినా, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం లౌకిక దేశంగా మారిందని అన్నారు.
అంధశ్రద్ధ నిర్మూలన సమితి సభ్యుడు సంజయ్ సావ్కర్ "మొదట్లో సనాతన్ సంస్థ దగ్గర ఎక్కువ పని ఉండేది కాదు. వాళ్లు కేవలం ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. 1999 వరకూ వాళ్లు క్రైస్తవాన్ని, ఇస్లాంను నిందించేవారు. బహుశా ప్రారంభంలో వ్యతిరేకతను తప్పించుకోడానికే వారు ఇలాంటి విధానం ఎంచుకున్నారు. కానీ, ఆ తరువాత హిందుత్వ భావజాలాన్ని జోరుగా ప్రచారం చేశారని తెలిపారు.
అయితే, హిందూ దేశ స్థాపన ఎలా ఉంటుంది అనేది అనేది సనాతన సంస్థ స్పష్టంగా ఏదీ చెప్పలేదు.
సింపుల్ టైమ్స్ అల్కా ధూప్‌కర్ సనాతన్ సంస్థ భావజాలం మతవాదమని, వారు హింసకు అనుకూలమని చెప్పారు. హిందూ దేశ స్థాపనే వారి లక్ష్యమని అన్నారు. తమ దారిలో వచ్చేవారిని అడ్డుతొలగించడం, గమ్యం వరకూ చేరడం వారి విధానం అన్నారు.
అల్కా ధూప్కర్ 2015 గోవాలో ఉన్న రామనాథీ ఆశ్రమానికి కూడా వెళ్లారు. ఆమె సనాతన సంస్థ కార్యకలాపాలపై రిపోర్టింగ్ చేస్తున్నారు.
ఇటు సనాతన్ సంస్థ మాత్రం తమ ప్రధాన లక్ష్యం సమాజం, మతాన్ని జాగృతం చేయడం అని చెబుతోంది. మేం ఈ పనులు చట్టబద్ధంగా, శాంతియుతంగా చేస్తున్నాం. గౌరీ లంకేష్, నరేంద్ర డాభోల్కర్, గోవింద్ పంసారే హంతకులను ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు. అందుకే సనాతన్ సంస్థను లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. కొందరు హిందుత్వకు వ్యతిరేకంగా రాస్తున్నారని ఆరోపించారు. సనాతన్ సంస్థ చట్టబద్ధంగా వారిని వ్యతిరేకిస్తోందని తెలిపారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
డాక్టర్ జయంత్ బాలాజీ అథవాలే ఎవరు?
డాక్టర్ జయంత్ బాలాజీ అథవాలే సనాతన్ సంస్థ స్థాపకుడు. ఆయన ఒక సైకాలజిస్ట్. సనాతన సంస్థ వెబ్ సైట్ ప్రకారం భారతదేశం రాక ముందు డాక్టర్ బాలాజీ బ్రిటన్ లో ఏడేళ్లు మెడికల్ ప్రాక్టీస్ చేశారు. ఇండోర్‌లోని భక్త మహరాజ్ ఆయన గురువు.
వెబ్ సైట్ ప్రకారం డాక్టర్ అథవాలే 1991, ఆగస్టు 1న సనాతన భారతీయ సంస్కృతి స్థాపించారు. 1999 మార్చి 23న ఆయన సనాతన్ సంస్థను స్థాపించాడు. ఇటీవల ఆయన తన 75వ జన్మదినం గోవాలోని రామ్ నాథీ ఆశ్రమంలో వైభవంగా జరిగింది.
ఆ వేడుకల్లో డాక్టర్ జయంత్ బాలాజీ అథవాలే శ్రీకృష్ణుడి వేషం ధరించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన సింహాసనంలో కూర్చున్నారు. ఆ తర్వాత డాక్టర్ అథవాలే బహిరంగ కార్యక్రమాలు చాలా తగ్గిపోయాయి.
కానీ సనాతన సంస్థ ప్రతినిధులు మాత్రం వయసు పైబడడంతో అథవాలే శక్తి తగ్గిందని, అందుకే ఆయన వేరే కార్యక్రమాల్లో కనిపించడంలేదని చెబుతున్నారు. 2009 తర్వాత అథవాలే ఆశ్రమం నుంచి బయటికి రాలేదు. గత కొన్నేళ్లుగా ఆయన గోవాలోని రామ్‌నాథీ ఆశ్రమంలోనే ఉంటున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SANATAN SANSTHA
రామ్‌నాథ్ అనుచరులు మాత్రం ఆయన దగ్గర ఒక శక్తి ఉందని, ఆయనకు దగ్గరగా వెళ్తే ఒక సువాసన వస్తుందని చెబుతున్నారు. ఆయన్ను సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా అభివర్ణిస్తున్నారు.
అఖిల భారతీయ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి ప్రతినిధులు మాత్రం డాక్టర్ అథవాలే హిప్నాటిజం ద్వారా యువకులను సమావేశాలకు రప్పిస్తున్నారని, ఆయన ఎరిక్సోనియన్ హిప్నాటిజం ద్వారా అనుచరుల మెదడు నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
సనాతన సంస్థ తమ వెబ్ సైట్ లో సభ్యులకు చాలా బోధిస్తుంది. పళ్లు తోముకోవడం నుంచి రాత్రి నిద్రపోయేవరకూ రకరకాల విధానాలను అనుసరించాలని చెబుతోంది.
ఆధునిక వస్తువులు ఉపయోగించడాన్ని కూడా సనాతన్ సంస్థ వ్యతిరేకిస్తుంది. దాని వెనకాల తర్కం చెబుతుంది.
హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించడం వల్ల ఆ శబ్దం చెడు శక్తులను ఆకర్షిస్తుందని, దాని వల్ల శరీరం శక్తి నశిస్తుందని, వాషింగ్ మెషిన్ ఉపయోగించడం వల్ల వాతావరణంలో శరీరానికి నష్టం కలిగించే రేడియేషన్ విడుదలవుతుందని చెబుతుంది.
ఈ సంస్థలో పురుషులకు, మహిళలకు కూడా వేరు వేరు నియమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నమ్మడానికి అసాధ్యం అనిపిస్తాయి.
ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం
సనాతన సంస్థ తరచూ లవ్ జీహాద్, మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందువులు ఒక్కటి కావాలని చెబుతుంది. డాక్టర్ అథవాలే తన ఒక పుస్తకంలో ముస్లింలు లవ్ జీహాద్‌తో దేశవ్యాప్తంగా నష్టం చేస్తున్నారని, క్రైస్తవులు మత మార్పిడులతో హిందూ మతాన్ని డొల్ల చేస్తున్నారని ఆరోపించారు.
హిందూ జనజాగృతి సమితి వెబ్ సైట్ తరచూ మైనారిటీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తూ వస్తోంది. విలేఖరి ధీరేంద్ర ఝా తన పుస్తకం 'షాడో ఆర్మ్స్' లో సనాతన సంస్థ ఆత్మరక్షణ కోసం తన సభ్యులకు తుపాకీ ఉపయోగించడం నేర్పిస్తోందని, తుపాకీ పేల్చేటపుడు గురి దుష్టులపై ఉండాలని చెప్పిందని రాశారు.
సనాతన సంస్థ సాహిత్యం, చిత్రాలను చూస్తే ఆ దుష్టులు ఎవరన్నది స్పష్టంగా తెలుస్తుంది. సంస్థ దృష్టిలో తార్కికులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందూ మతాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ వారికి దుష్టులే.
డాక్టర్ అథవాలే తమ 'క్షత్రధర్మ సాధన' పత్రికలో "అనుచరుల్లో ఐదు శాతం మందికి ఆయుధాలు ఉపయోగించే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవుడు సరైన సమయంలో ఆయుధాలు అందుబాటులో ఉండేలా చూస్తాడు" అని అందులో చెప్పారు.
ఎవరికైనా తుపాకీ పేల్చడం వచ్చా రాదా అనేది పెద్ద విషయం కాదని ఈ పత్రికలో రాశారు. దేవుడిని తలుచుకుని ఎప్పుడు తుపాకీ పేలిస్తే, దేవుడి శక్తితో ఆ తూటా కచ్చితంగా సరైన లక్ష్యానికి తగులుతుందని చెప్పారు.
ఇవికూడా చదవండి:
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- ఆస్ట్రేలియాలో నాయకత్వ సంక్షోభం.. ప్రధాని టర్న్‌బుల్ పదవికి గండం
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- ఆసియా క్రీడల్లో అమ్మమ్మలు: భారత బ్రిడ్జి జట్టులో అత్యధికులు 60 దాటినవారే
- అనధికారిక ఖాతాల ఏరివేతలో ఫేస్‌బుక్, ట్విటర్
- డిజైనర్ మీసాలు... వెరైటీ గడ్డాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








