అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?

ఫొటో సోర్స్, dd news
- రచయిత, నవీన్ నేగీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దిల్లీలోని స్మృతి స్థల్‌లో జరిగాయి. ఆయన అంతిమయాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు. దేశంలోని వీఐపీల నుంచి సామాన్యుల వరకూ తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు.
వాజ్‌పేయి చితికి ఒక మహిళ నిప్పంటించారు. ఆమె పేరు నమితా భట్టాచార్య.
నిజానికి, నమిత అటల్ బిహారీ వాజ్‌పేయి దత్త పుత్రిక. ఆమె రాజ్‌కుమారీ కౌల్, ప్రొఫెసర్ బీఎన్ కౌల్‌ల కుమార్తె. నమితను వాజ్‌పేయి దత్తత తీసుకున్నారు.
నమిత కౌల్ భర్త, రంజన్ భట్టాచార్య వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఉన్నారు. ఆయనకు హోటల్ వ్యాపారం కూడా ఉంది.
"వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పీఎం ఆఫీసులో జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా, ప్రధానమంత్రి కార్యదర్శి ఎన్‌కే సింగ్ తర్వాత రంజన్ భట్టాచార్య మూడో ప్రధానమైన వ్యక్తిగా నిలిచారు" అని సీనియర్ విలేఖరి వినోద్ మెహతా తను రాసిన ఒక ఆర్టికల్‌లో చెప్పారు.
అటల్ తన కుమార్తె, అల్లుడుపై చాలా విశ్వాసం ఉంచేవారని, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంతవరకూ 7, రేస్‌కోర్స్‌పై నమిత, రంజన్‌కు బలమైన పట్టు ఉండేదని వినోద్ మెహతా రాశారు.
జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయికి నమిత తల్లి రాజ్‌కుమారీ కౌల్‌తో ఉన్న బంధం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుండేది. అయితే దీనిపై వాజ్‌పేయి ఎప్పుడూ, ఏదీ చెప్పలేదు.
వినోద్ మెహతా ఆర్టికల్ ప్రకారం... వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్‌కుమారి కౌల్ తన కూతురు నమిత, భర్త రంజన్‌తో కలసి పీఎం నివాసంలోనే ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
'నేను అవివాహితుడిని, కానీ బ్రహ్మచారిని కాను'
అటల్ తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అనేవారు. అందుకే ప్రత్యర్థులు కూడా ఆయనతో ఆప్యాయంగా, గౌరవంగా వ్యవహరించేవారు.
కానీ అటల్ వ్యక్తిగత జీవితం, లేదా ఆయన ఆప్యాయత, సంతోషం కూడా వారికి అంతే అస్పష్టంగా అనిపించేవి.
అటల్ బిహారీ వాజ్‌పేయి వివాహం చేసుకోలేదు. తనను పెళ్లి గురించి ప్రశ్నించినపుడు మాత్రం ఆయన ఒక మాట చెప్పారు... 'నేను అవివాహితుడినే, కానీ బ్రహ్మచారిని కాదు'.
ఒక అద్భుత వక్త, కవి, భారతదేశ అగ్రనేతల్లో ఒకరు, మూడు సార్లు ప్రధాన మంత్రి అయిన వాజ్‌పేయి.. తన జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయారా?

ఫొటో సోర్స్, PTI
అటల్ కుటుంబం
అటల్ బిహారీ వాజ్‌పేయి కుటుంబం గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరిగేది. అయితే ఆ ప్రభావం ఆయన రాజకీయ జీవితంపై ఎప్పుడూ కనిపించలేదు.
వాజ్‌పేయికి కాలేజీలో చదివే నాటి నుంచే స్నేహితురాలైన రాజ్‌కుమారితో సంబంధాలు ఉండేవని ఎప్పుడూ చెప్పుకునేవారు. గ్వాలియర్‌లోని ప్రముఖ విక్టోరియా కాలేజ్ (రాణీ లక్ష్మీబాయి కాలేజ్)లో ఇద్దరూ కలిసి చదివేవారు.
రాజ్‌కుమారి దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన బీఎన్ కౌల్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీమతి కౌల్‌తో పాటు ఆమె భర్త కూడా అటల్‌కు మంచి స్నేహితుడు.
"50 ఏళ్ల క్రితం నేను దిల్లీలోని రామ్జాస్ కాలేజ్‌లో చేరాను. అప్పుడు ప్రొఫెసర్ కౌల్ హాస్టల్ వార్డెన్‌గా ఉండేవారు. ఆయన నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. నాకు మార్గదర్శిగా నిలిచారు. ఆయనన్నా, శ్రీమతి కౌల్ అన్నా విద్యార్థులకు చాలా గౌరవం ఉండేది" అని అంతర్జాతీయ అంశాల నిపుణులు, ప్రొఫెసర్ పుష్పేష్ పంత్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
"కౌల్ దంపతులకు వాజ్‌పేయి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన అక్కడకు వచ్చినపుడు ఒక పెద్ద నేతలా ఉండేవారే కాదు. అక్కడ ఏవైనా వంటలు చేస్తే వాటిని విద్యార్థులతో పంచుకునేవారు, వారితో కలిసి మాట్లాడుతూ తినేవారు. ఎప్పుడూ సరదాగా ఉండేవారు".

ఫొటో సోర్స్, NG HAN GUAN/AFP/GETTY IMAGES
ప్రధాని నివాసంలో శ్రీమతి కౌల్
ప్రొఫెసర్ కౌల్ అమెరికా వెళ్లినపుడు శ్రీమతి కౌల్ అటల్‌తోపాటు ఉండడానికి ఆయన నివాసానికి వచ్చేశారు.
వాజ్‌పేయి ప్రధానమంత్రి అయినప్పుడు శ్రీమతి కౌల్ కుటుంబం 7, రేస్‌కోర్స్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్న కూతురు నమితను అటల్ దత్తత తీసుకున్నారు.
అటల్, కౌల్ ఎప్పుడూ తమ బంధానికి ఎలాంటి పేరూ ఇవ్వలేదు.
"ఈ బంధం గురించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను, అటల్ బిహారీ వాజ్‌పేయి ఎప్పుడూ అనుకోలేదు" అని శావీ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీమతి కౌల్ అన్నారు.
అటల్ బిహారీ జీవితంలో శ్రీమతి కౌల్ ప్రభావం ఏ మేరకు ఉంది, అనే ప్రస్తావన ఇటీవల ప్రచురితమైన కరణ్ థాపర్ పుస్తకం 'డెవిల్స్ అడ్వొకేట్: ద అన్‌టోల్డ్ స్టోరీ'లో కూడా ఉంది.
"మిస్టర్ వాజ్‌పేయి ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సివస్తే, నేను ప్రతిసారీ శ్రీమతి కౌల్‌తో మాట్లాడాల్సి వచ్చేది. కౌల్ ఒకసారి ఇంటర్వ్యూకు కమిట్‌మెంట్ ఇచ్చారంటే, తర్వాత అటల్ కూడా దాన్ని కాదనలేకపోయేవారు" అని కరణ్ తన పుస్తకంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు లేని బంధం
2014లో శ్రీమతి కౌల్ చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు లాల్ కృష్ణ్ అడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ లాంటి బీజేపీ సీనియర్ నేతలందరూ లోధీ రోడ్ వచ్చారు.
శ్రీమతి కౌల్ మరణం తర్వాత కొన్ని రోజులకు ఆమె స్నేహితురాలు తలత్ జమీర్ బీబీసీతో మాట్లాడారు.
ఆ సమయంలో కౌల్, అటల్ బంధం గురించి వివరించిన తలత్ "ఆమె చాలా అందమైన కశ్మీరీ మహిళ. ఆమె స్వరం తీయగా ఉండేది. ఉర్దూ చాలా చక్కగా మాట్లాడేవారు. నేను ఆమెను కలవడానికి ప్రధానమంత్రి నివాసానికి వెళ్లినప్పుడు, అక్కడ అందరూ కౌల్‌ను మాతాజీ అనడం కనిపించేది" అన్నారు.
"అటల్‌జీ ఆహార అవసరాలను ఆమె దగ్గరుండి చూసుకునేవారు. వంటవాళ్లు వచ్చి ఈరోజు ఏం చేయమంటారు అని ఆమెను అడిగేవారు. ఆమెకు టీవీ చూడ్డం చాలా ఇష్టం. అన్ని సీరియల్స్ గురించి చర్చించేవారు. ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ పుట్టినపుడు, ఆయన్ను చూడడానికి తను ఆస్పత్రికి వెళ్లినట్టు కూడా ఆమె నాతో అన్నారు. ఎందుకంటే గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో ఆయన తండ్రి జానిసార్ అఖ్తర్ దగ్గర ఆమె చదువుకున్నారు. కౌల్ అప్పుడప్పుడూ జావేద్‌ను కూడా కలుస్తూ ఉండేవారు" అన్నారు తలత్.
అటల్, శ్రీమతి కౌల్ మధ్య ఒక పేరు లేని బంధం ఉండేది. రాజకీయ నేతల మనసుల్లో, జర్నలిస్టుల పుస్తకాల్లో వారి కథకు చోటు లభించింది. కౌల్ రెండో కుమార్తె నమితను వాజ్‌పేయి దత్తపుత్రికగా స్వీకరించారు. కానీ శ్రీమతి కౌల్‌తో తన బంధం గురించి ఆయన చివరి వరకూ మౌనంగానే ఉండిపోయారు. బంధాల గురించి ఆయన బహుశా తన ఈ కవితలోనే అన్నీ చెప్పుకున్నారు.
జననం-మరణం నిరంతర ప్రదక్షిణం
జీవితం దేశదిమ్మరుల గుడారం
ఈరోజు ఇక్కడ, రేపు అనేది ఉందా
ఉదయం ఎక్కడో ఎవరికి తెలుసు
అంధకార ఆకాశం అనంతం, ప్రాణాల రెక్కలు భారం
మన మనసుతోనే ఏదైనా చెప్పుకుందాం.
ఇవి కూడా చదవండి:
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- ఈయన ప్రపంచంలోనే అత్యంత పేద మాజీ అధ్యక్షుడు
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- వాజ్-పేయి- ‘వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం..’ అరుదైన ఆడియో ఇంటర్వ్యూ
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- వాజ్‌పేయి: 'బీజేపీ పాత తరం నాయకుల్లో అత్యంత శక్తిమంతమైన నేత'
- వాజ్‌పేయి : మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








