వాజ్‌పేయి : మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశ రాజకీయాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిది చెరగని ముద్ర. పధ్నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల మనసుల్లో ఆయన స్థానం ఇప్పటికీ చెదరలేదు.

పాతతరానికి చెందినవారిలో ఇప్పటికీ ప్రభావవంతమైన నేతగా ఉన్నది ఆయనే అని చెప్పాలి.

ఆయన రాజకీయ జీవితంలోని ఎన్నో కీలక ఘట్టాలలో కొన్ని మీకోసం...

వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

నెహ్రూతో ‘భవిష్యత్ ప్రధాని’ అనిపించుకున్న వాజ్‌పేయి

నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేయిలో ఆయనలో భవిష్యత్ ప్రధానిని చూశారు. లోక్‌సభలో వాజ్‌పేయి మాట్లాడితే నెహ్రూ అత్యంత శ్రద్ధగా వినేవారు.

ఓసారి భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రికి వాజ్‌పేయిని పరిచయం చేస్తూ నెహ్రూ.. "ఈయన ఎదుగుతున్న విపక్ష నాయకుడు. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటారు, నా దృష్టిలో ఆయన మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు" అని అన్నారు.

మరో సందర్భంలోనూ విదేశీ అతిథి ఒకరికి వాజ్‌పేయిని పరిచయం చేసిన నెహ్రూ.. 'భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి' అంటూ చెప్పారు.

అలాగే వాజ్‌పేయి కూడా నెహ్రూను గౌరవించేవారు. 1977లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా పదవీ స్వీకారం చేశాక, సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవడాన్ని గమనించారు.

వెంటనే ఆయన నెహ్రూ చిత్రపటం ఎక్కడ ఉండేదో దానిని అక్కడే ఉంచాలని ఆయన ఆదేశించారు.

ఈ విషయాలన్నీ కింగ్షుక్ నాగ్ తన 'అటల్ బిహారీ వాజ్‌పేయి - ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్' పుస్తకంలో ప్రస్తావించారు.

ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఇందిరాగాంధీని దుర్గాదేవితో పోల్చిన నేత

బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఉత్తర భారతదేశంపై పాకిస్తాన్ తొలుత వైమానిక దాడులు చేయడంతో భారత్ యుద్ధ క్షేత్రంలోకి దిగింది.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు ఐరోపా దేశాలతో పాటు రష్యా మద్దతు సంపాదించడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది.

రష్యా సహకారం భారత్‌కు ఉండడంతో చైనా నేరుగా పాకిస్తాన్‌కు మద్దతివ్వలేకపోయింది. దీంతో పాకిస్తాన్ తోక ముడవక తప్పలేదు.

ఈ యుద్ధం దక్షిణాసియా రాజకీయ చిత్రంలో భారత్‌ను బలీయ శక్తిగా మార్చింది.

ఈ యుద్ధం తరువాత రాజ్యసభలో వాజ్‌పేయి ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.

అప్పటికి జన్‌సంఘ్ నేతగా ఉన్న వాజ్‌పేయి ఇప్పటి నేతల్లా కాకుండా తాను విపక్షంలో ఉన్నప్పటికీ ప్రధాని స్థానంలో ఉన్న ఇందిర తెగువను ప్రశంసించడానికి ఏమాత్రం సందేహించలేదు.

రెండేళ్ల కిందట సీపీఎం నేత సీతారాం ఏచూరి పార్లమెంటులో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా పలువురు నేతలు, రచయితలు దీన్ని ప్రస్తావించిన సందర్భాలున్నాయి.

మోదీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

'మోదీ రాజీనామా చేయాలని ఆయన భావించారు'

మంచి పాలకుడిగా పేరున్న వాజ్‌పేయి తన పాలన గురించి విశ్లేషించుకున్నప్పుడు ఒక ఘటనను వైఫల్యంగా భావిస్తుంటారట.

గుజరాత్ అల్లర్లను ఆయన తన పాలనా సమయంలో జరిగిన అతి పెద్ద వైఫల్యంగా పరిగణిస్తారని 'రా' మాజీ చీఫ్ ఎఎస్ దులత్ 'ద వాజ్‌పేయి ఇయర్స్' అనే పుస్తకంలో రాశారు.

'అటల్ బిహారీ వాజ్‌పేయి - ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్' పుస్తక రచయిత కింగ్షుక్ నాగ్ కూడా గుజరాత్ అల్లర్ల విషయంలో వాజ్‌పేయి అభిప్రాయాలను తన పుస్తకంలో వివరించారు.

గుజరాత్ అల్లర్ల విషయంలో వాజ్‌పేయి చాలా అసహనంతో ఉండేవారని... అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామా చేసుంటే బాగుండేదని ఆయన భావించేవారని కింగ్షుక్ నాగ్ పేర్కొన్నారు.

వాజ్‌పేయి అసంతృప్తిగా ఉండడంతో ఒక దశలో మోదీ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారని.. అయితే, పార్టీలో సీనియర్లు కొందరు గోవాలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సు నాటికి వాజ్‌పేయి మనసు మార్చగలిగారని.. ఈ విషయాలన్నీ అప్పటి గవర్నరు సుందర్ సింగ్ భండారి సన్నిహితుడొకరు తనకు తెలిపారంటూ కింగ్షుక్ నాగ్ 'బీబీసీ'కి గతంలో తెలిపారు.

వీడియో క్యాప్షన్, 'శక్తి' చాటిన ధీశాలి

'శక్తి' చాటిన నేత

అంతర్జాతీయ ఒత్తిళ్లకు భయపడి అణు పరీక్షల గురించి బయట ప్రపంచానికి తెలియజేయని నాయకులకు భిన్నంగా అణుబాంబును పరీక్షించడమే కాకుండా బాహాటంగా ప్రకటించిన నేత వాజ్‌పేయి.

అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకతలకు వెరవకుండా అణు పరీక్షలకు పచ్చజెండా ఊపారు వాజ్‌పేయి.

ఆయుధ సామర్థ్యంలోనూ ప్రపంచ దేశాలకు దీటుగా నిలవడంలో వాజ్‌పేయీ తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైంది.

''ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పోఖ్రాన్‌లో భారత్ మూడు భూగర్భ అణు పరీక్షలు జరిపింది'' అని 1998 మే 11న వాజ్‌పేయి ప్రకటించారు.

మే 11న మూడు, మే 13న రెండు మొత్తం ఐదు అణు పరీక్షలు జరిపింది భారత్. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్న అబ్దుల్ కలామ్, అణుశక్తి సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.చిదంబరం 'ఆపరేషన్ శక్తి' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తలుగా పనిచేశారు.

మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకొంటున్నాం.

ముషారఫ్, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ సమస్య పరిష్కారం వరకు వచ్చినా..

భారత్, పాక్ మధ్య నిత్య ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలూ రక్షణ రంగంపై ఎంత భారీ మొత్తం ఖర్చు చేస్తాయో ఇరు దేశాల బడ్జెట్లు చూస్తే అర్థమవుతుంది.

సరిహద్దు వెంబడి తరచూ జరిగే కాల్పులు, చొరబాట్లు.. కశ్మీర్‌లో ఉద్రిక్తతలు భారత్‌కు వీడని సమస్య.

రావణ కాష్టం లాంటి కశ్మీర్ సమస్యే రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రధాన అవరోధంగా నిలుస్తోందన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

అయితే, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ సమస్యకు దాదాపుగా ఒక పరిష్కారం లభించిందని రాజకీయవేత్తలు చెబుతుంటారు.

అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్‌తో వాజ్‌పేయి 2001లో ఆగ్రాలో రెండు రోజుల పాటు చర్చలు జరిపారు.

ఈ చారిత్రక భేటీలో ఇద్దరు నేతలూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొన్నారని.. కానీ, బయటపడని ఇతర కారణాల వల్ల చివరి నిమిషంలో అంగీకారం కుదరక చర్చలు విఫలమయ్యాయని చెబుతారు.

రా మాజీ చీఫ్ ఏఎస్ ధులాత్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ సహా పలువురు రాసిన పుస్తకాల్లో అప్పటి పరిణామాలను ప్రస్తావించారు.

ఆ చర్చలే ఫలిస్తే రెండు దేశాల సంబంధాల్లో కొత్త శకం మొదలయ్యేదని.. ఇంతటి ఉద్రిక్తతలు ఉండేవి కావని వీరు అభిప్రాయపడ్డారు.

వాజ్‌పేయి, అబ్దుల్ కలాం

ఫొటో సోర్స్, Getty Images

షేర్ షా తర్వాత దేశంలో ఎక్కువ రహదారులు నిర్మించింది ఆయనే

వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు చేపట్టి దేశవ్యాప్తంగా విస్తృత రహదారి వ్యవస్థను విస్తరించారు.

''కమ్యూనికేషన్, రవాణా రంగంలో వాజ్‌పేయి పాత్రను విస్మరించలేం. ప్రస్తుత హైవేల వ్యవస్థ వెనుక ఉంది ఆయన ఆలోచనలే. షేర్ షా సూరి తర్వాత మన దేశంలో ఎక్కువ రహదారులు నిర్మించింది ఆయన కాలంలోనే'' అంటారు 'అటల్ బిహారీ వాజ్‌పేయి - ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్' రచయిత కింగ్షుక్.

వీడియో క్యాప్షన్, ఆయన కవిత్వం ఒక యుద్ధభేరి

ఆయన కవిత్వం ఒక యుద్ధభేరి

''నా కవిత్వం ఒక యుద్ధభేరి..

అపజయానికి ఇది నాందీప్రస్తావన కాదు

పరాజిత యోధుడి భేరీ నాదం అసలే కాదు

రణక్షేత్రంలోని యోధుడి విజయకాంక్ష ఇది

విచారం వెంటాడుతున్న నిరుత్సాహ స్వరం కాదిది

కదనోత్సాహం నిండిన గెలుపు కేక ఇది''

- తన కవిత్వం గురించి వాజ్‌పేయి స్వయంగా చెప్పిన కవితాత్మక నిర్వచనం ఇది.

ప్రసంగాలలోనూ కవితలను వినిపించే అలవాటున్న వాజ్‌పేయి 'క్యా ఖోయా క్యా పాయా: అటల్ బిహారీ వాజ్‌పేయి', వ్యక్తిత్వ్ ఔర్ కవితాయే, మేరీ ఇక్యావన్ కవితాయే వంటి పలు కవితా పుస్తకాలను వెలువరించారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)