అభిప్రాయం: 'ధర్మరాజుకూ మంచిచెడ్డలు ఉంటాయి'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కల్లూరి భాస్కరం
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
మిగల మగ్గిన 93 ఏళ్ల పండు రాలిపోయింది. గురువారం రోజు రోజంతా వార్తాచానెళ్లు వాజ్‌పేయి గురించిన వార్తలకు, విశేషాలకు అంకితమయ్యాయి. మాజీ ప్రధాని మృతి కలిగించిన విషాదానికి అదనంగా చానెళ్లలో ఈ రోజున మరొక విశేషం కూడా కనిపించింది. అది ఇటీవలి కాలంలో ఎరగనిది.
పార్టీ భేదాలు, సైద్ధాంతిక విభేదాలు పరస్పర విద్వేషం స్థాయికి విషమించడాన్నే మనం కొంతకాలంగా చూస్తున్నాం. దేశంలోని, సమాజంలోని అన్ని వర్గాలనూ, అన్ని కార్యక్షేత్రాలనూ నిట్టనిలువుగా చీల్చి ఒకరితో ఒకరు ఘర్షించుకునే పరిస్థితిని కల్పించడం గమనిస్తున్నాం. ప్రభుత్వాలు తమ పాలనలో ఉన్న తమ ప్రజలలోనే కొన్ని వర్గాలను తమ శత్రువులుగా మార్చుకుని వారితో బాహాబాహీకి దిగే దిగ్భ్రాంతకర పరిణామాన్ని తిలకిస్తున్నాం.
మనుషుల ప్రాణాలు తీయడాన్ని, గుంపు హత్యల్ని, ఆ హత్యలను ఖండిస్తూనే, ఏదో విధంగా సమర్థించే వైఖరిని; ఆ హత్యలకు పాల్పడినట్టు నింద ఎదుర్కొంటున్నవారిని సాక్షాత్తు మంత్రులే పూలదండలతో సత్కరించడాన్ని, అధికార పక్షంలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్న పెద్దలు వాటిపై వహిస్తున్న దీర్ఘమౌనాన్ని చూడడమే కాదు; క్రమంగా వాటికి అలవాటుపడుతున్నాం.
హింసను, హింసాత్మక వాతావరణాన్ని న్యాయమైనదిగా, సహజమైనదిగా భావించడాన్ని దేశప్రజలకు ఒక పద్ధతిగా అలవరిచే ప్రయత్నాన్నీ దర్శిస్తున్నాం. తిమ్మిని బమ్మి చేయడం; వాదం వీగిపోతున్నాసరే, అడ్డగోలు, అసందర్భ తర్కాలతో, బుకాయింపుతో నోరుమూయడం, బెదిరించడం నిరాఘాటంగా జరిగిపోతున్నాయి.
గురువారం మాత్రం వాజ్‌పేయి విశేషాలతో నిండిపోయిన చానెళ్లు ఇందుకు భిన్నమైన సన్నివేశాలను ఆవిష్కరించాయి. రోజూ విద్వేషపు చూపుల చురకత్తులు దూసుకుంటూ, మాటల ఈటెలు విసురుకుంటూ ఏ చర్చనైనా రచ్చగా మార్చే అధికారపక్ష, విపక్షనేతలు ఈ రోజుమాత్రం పరమశాంతియుతంగా వాజ్‌పేయి గురించిన ఊసుల్ని కలబోసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన మణిశంకర్ అయ్యర్ ఎంతో ప్రసన్నంగా కనిపించడమే కాదు; వాజ్‌పేయి భావజాలంతో తను ఎంత విభేదించినప్పటికీ, యూపీయే మంత్రివర్గ సభ్యుడిగా తను ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆయనకు పాదాభివందనం చేశానని చెప్పుకున్నారు.
పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, తన గురించిన ముచ్చట్ల నిండా పరచుకుని ప్రజల ముందుకు వచ్చిన సామరస్య పూరితమైన వాజ్‌పేయి వ్యక్తిత్వం తాలూకు సమ్మోహనశక్తి అలాంటిది.
ఈ సందర్భంలో మహాభారతంలోని ఒక ఘట్టం గుర్తొచ్చింది. ధర్మరాజు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళేముందు కొద్దిసేపు నరకంలో ఆగాడట. వేడిగాలులూ, దుర్గంధమూ, చిత్రహింసలూ నిండిన ఆ నరక వాతావరణంలో ఆ కాసేపూ హింసలు ఆగి; హాయిగొలిపే మలయ మారుతం వీచిందట. దాంతో నరకబాధలు పడుతున్న అక్కడి జనం మరి కాసేపు ఆగమని ధర్మరాజును బతిమాలారట. వారిని చూసి ధర్మరాజు మనసూ కరిగిపోయిందట.
పేరు ధర్మరాజు అయినా రాజకీయాల్లో ఎవరూ ధర్మరాజులు కారు, కాలేరు. ధర్మరాజును వెన్నంటి కొంత మంచి ఉన్నట్టే, కొంత చెడూ ఉంది. వాజ్‌పేయీ అందుకు అతీతులు కారు. అదలా ఉంచి, ఆయన వ్యక్తిత్వంలోని కొన్ని మెరుపుల గురించి చెప్పుకోవలసివస్తే; రాజకీయాలలో ఉంటూనే రాజకీయాలకు, ఒక పార్టీలో ఉంటూనే పార్టీలకు, ఒక భావజాలానికి చెందుతూనే ఆ భావజాలానికి అతీతంగా ఆయన ఉండగలిగారనిపిస్తుంది.
ప్రజల్లో, పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉంటూనే తనలో తను, తన ఆసక్తుల్లో తను, తన ఇష్టాలలో తను ఉండగల తత్వం ఆయనదనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆయనలో మౌలికంగా ఒక కవి ఉన్నాడు. ఆయన చేయి ఊపుతూ పంక్తుల మధ్యలో తన్మయంగా తలదూర్చేసి కవిత్వం చదివే ఆ ఫక్కీని గమనించండి. మనమెరిగిన కవి సమ్మేళనాల్లో కవులు అచ్చంగా అలాగే చదువుతారు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడూ, ప్రధానిగా ఉన్నప్పుడూ కూడా కవిత్వం ఆయనను వెంబడిస్తూనే ఉంది. జనతా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు తను రాసిన ఒక కవితను ఒక ప్రసిద్ధ హిందీ పత్రికకు పంపిస్తే, ఆ పత్రిక దానిని ప్రచురించలేదట. దాని గురించి ఆయన సంపాదకునికి వాకబు చేశారట. అప్పుడు వారిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయట. విదేశాంగ మంత్రిగా తీరిక లేని వ్యాపకాలలో తను ఉన్నప్పటికీ పత్రికలో తన కవిత వచ్చినదీ లేనిదీ చూసుకుంటూనే ఉన్నారన్నమాట. అచ్చం, అనేక మంది కవుల్లానే.
రాజకీయాలతోపాటు సాహిత్యానికీ తమ జీవితాల్లో పెద్ద జాగా ఇచ్చుకోవడం మరో మాజీ ప్రధాని పి. వి. నరసింహారావులోనూ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, పీ.వీ. గారు రాజకీయాల్లో మాజీ అయిన తర్వాత కేవలం సాహిత్యమే శ్వాసగా జీవించారు. ఈ సాహిత్య సంబంధమే వాజ్‌పేయి, పీవీల మధ్య స్నేహబంధాన్ని అల్లిందేమో అనిపిస్తుంది. వాజ్‌పేయి తన కవితాసంపుటి నొకదానిని పీవీ చేత ఆవిష్కరింపజేశారు.
వాజ్‌పేయి రాజకీయరంగంలో ఎంత ఉన్నతుడైనా సంసారపక్షం మనిషే. అందుకు సంబంధించిన ఒక ముచ్చటను మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఎంతో అందంగా చెప్పుకుంటూవచ్చారు. 1994లో జెనీవాలో జరుగుతున్న మానవహక్కుల కమిషన్ సమావేశంలో కశ్మీర్ గురించి మాట్లాడే భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించే బాధ్యతను ప్రధాని పీవీ, వాజ్‌పేయికి అప్పగించారు. అప్పుడు విదేశాంగ శాఖలో జూనియర్ మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ ఆ ప్రతినిధివర్గంలో ఉన్నారు. జెనీవా చేరిన తర్వాత, 'మనం షాపింగ్ చేద్దా'మని ఖుర్షీద్‌తో వాజ్‌పేయి అన్నారట. విస్తుపోయిన ఖుర్షీద్, 'మీరేమిటి? షాపింగ్ చేయడమేమిటి? అన్నారట. ఇంట్లో వాళ్ళు పెద్ద బొమ్మ ఒకటి కొనుక్కురమ్మన్నారని వాజ్‌పేయి చెప్పారట. అప్పుడు ఇద్దరూ కలిసివెళ్లి బొమ్మ కొనుక్కొని వచ్చారట. ఆ సరళత్వం, సంసారపక్ష లక్షణం తనను ఎంతో ముగ్ధుల్ని చేశాయని ఖుర్షీద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి వ్యక్తిత్వం ఏదో ఒక మూసలో ఇమిడేది కాదనీ, పాదరసంలా అన్ని వైపులకూ విస్తరిస్తుందనీ; ఆయన ఒక భావజాలంలోనూ, పార్టీలోనూ ఉండడం; ఆ పార్టీలోనూ, ఆ పార్టీ ప్రభుత్వంలోనూ ఉన్నత స్థానం వహించడంలో ఆయన స్వప్రయత్నం పాలుకన్నా యాదృచ్ఛికత పాలు ఎక్కువేమోననీ అనిపిస్తుంది.
ఆయన ఒక దశలో మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యారన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే; దానికి పూర్తిగా భిన్నమైన ఒక మితవాద, మతవాదపక్షంలో పాలు-నీళ్లలా ఆయన పూర్తిగా కలసిపోగలిగారా అన్న అనుమానం కలిగితీరుతుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వ పక్షంగా మారి తను ప్రధాని అయిన తర్వాత పార్టీ, పరివార్ లోపలి వాతావరణం ఆయనకు ఒక్కోసారి ఉక్కపోత కలిగిస్తూవచ్చిందనీ విన్నాము. తను 23 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ, హిందుత్వ అజెండాను అమలుచేయవలసిందిగా ఆర్.ఎస్.ఎస్. నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చేదనీ, ఆ ఒత్తిడికి ఆయన చికాకుపడేవారనీ అప్పటి వార్తలు సూచిస్తాయి.
గ్రాహం స్టెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీని, ఆయన ఇద్దరు కుమారులను ఒడిశాలో సజీవదహనం చేసిన ఉద్రిక్త సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి, మతపరివర్తనలపై చర్చ జరగాలని పిలుపునివ్వడం, ఒక్కోసారి ఒత్తిడికి తలొగ్గక తప్పలేదనీ సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ విజయాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీని దుర్గగా అభివర్ణిస్తూ ప్రశంసించడంలో కానీ, పీవీతో స్నేహం నెరపి ఆయన కోరిన దౌత్యబాధ్యతను నిర్వహించడంలో కానీ వాజ్‌పేయి పార్టీ పరిమితులను పాటించలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ ఆయనలో భావి భారత ప్రధానిని చూసి, ఆ సంగతిని ప్రకటించడమే కాక; ఆయనను యూ. ఎన్.కు పంపిస్తూ అప్పట్లో విదేశాంగశాఖలో అధికారిగా ఉన్న రసగోత్రతో వాజ్‌పేయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంలోనూ పార్టీలకు అతీతమైన దృష్టినే చాటుకున్నారు.
వాజ్‌పేయి తను విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు సౌత్‌బ్లాక్‌లో ఎప్పుడూ కనిపించే నెహ్రూ ఫోటో లేకపోవడం గమనించి వెంటనే దానిని తెప్పించి పెట్టించారు. అలాగే, ఓసారి సిమ్లా ఒప్పందపత్రాన్ని ప్రధాని ఇందిరాగాంధి వాజ్‌పేయికి చూపిస్తున్నప్పుడు, సన్నగా తుంపర మొదలైందట. అప్పుడామె వాజ్‌పేయికి గొడుగు పట్టారట.
పీవీ మరణానంతరం ఆయనకు వాజ్‌పేయి ఉద్వేగపూరితంగా నివాళి అర్పిస్తూ, అణుపాటవ పరీక్ష ఘనత దక్కవలసింది తనకు కాదనీ, పీవీకేననీ, ఆయన ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచారనీ ప్రకటించడంలోనూ పార్టీలకు అతీతమైన సౌజన్యం, స్నేహశీలం కనిపిస్తాయి.
బామియన్ బుద్ధవిగ్రహాల విధ్వంసంలా నెహ్రూ విగ్రహ విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతున్న నేటి పరిస్థితికి వాజ్‌పేయి వార్తలలో ఉండి ఉంటే ఎలా స్పందించేవారో! పార్టీ వేరైనా నెహ్రూ శకానికి చెందిన చివరి నేతగా ఆయనను చిత్రించడంలో వాస్తవం లేదని అనలేము.
ఇంత చెప్పుకున్న తర్వాత కూడా వాజ్‌పేయిది ఒక అంతుబట్టని వ్యక్తిత్వమనే అనిపిస్తుంది. ఉదాహరణకు, భిన్నభావజాలాలు కలిగిన పార్టీలను కలుపుని, ఆ పార్టీల నేతల గౌరవాభిమానాలను అందుకుని సంకీర్ణ ప్రభుత్వ సారథ్యం వహించగలిగిన ఒక సామరస్యవాది, ఒక శాంతి ప్రేమికుడు, ఒక విశాలహృదయుడు, ఒక కవి- భిన్న మతస్తుల గుండెలపై గునపపు పోట్ల వంటి బాబ్రీ మసీదు పతనాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా స్పందించారు, ఎలా సహించారు? ఈ ప్రశ్నలకు బహుశా మనకు ఎప్పటికీ సమాధానం దొరకదు. వాస్తవానికి మసీదు కూల్చివేతకు ముందురోజున, నాటి ఉద్రిక్త వాతావరణంలో ఆయన కరసేవను సమర్థిస్తూ, ఉద్రేకపూరిత ప్రసంగం చేశారంటే వింతగానే అనిపిస్తుంది. మరోవైపు, మసీదు కూల్చివేతను వ్యక్తిగతంగా ఆయన హర్షించలేదని వార్తలు వచ్చాయి. అంతకు మించి ఆయనవైపు నుంచి మరేమీ జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో గోద్రా, దాని అనంతర మారణకాండపై ఆయన బాహాటంగానే తీవ్రవ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆయన పక్కన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు అందుబాటులోనే ఉన్నాయి. గోద్రా ఊచకోత ఎంత దారుణమో, దాని అనంతర మారణకాండ కూడా అంతే దారుణమని అనడంలో ఆయన నీళ్ళు నమలలేదు. అంతేకాదు, కులమతవర్గ పార్టీ భేదాలకు అతీతంగా ప్రజలందరికీ రక్షణ కల్పించాలంటూ అప్పటినుంచీ సుప్రసిద్ధంగా వినిపిస్తున్న రాజధర్మమనే మాట ఉపయోగించారు. అయినా రాజధర్మాన్ని నిలబెట్టడంలో తన రాజధర్మాన్ని ఆయన పాటించకపోవడం ఒక అంతుబట్టని విషయంగానే చరిత్రలో ఉండిపోతుంది.
బాబ్రీ మసీదు పతనంలో తన పాత్రను వివరించుకుంటూ, లేదా సమర్థించుకుంటూ పీవీ కనీసం పుస్తకం రాయగలిగారు. వాజ్‌పేయి అలాంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఆయన ఆరోగ్యపరిస్థితి కూడా అందుకు అవకాశం ఇచ్చి ఉండదు. అలాగే, ఆయన ప్రభుత్వంపై కానీ, ఇప్పటి ప్రభుత్వంపై కానీ ఆర్.ఎస్.ఎస్.నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తూ ఉంటుందో, ప్రభుత్వ వ్యవహారాలలో ఆర్.ఎస్.ఎస్. పాత్ర ఉంటే ఏ మేరకు ఉంటుందో ఎప్పటికైనా తెలుస్తుందా అన్నది సందేహమే. ప్రజాస్వామ్యంలో ఇదొక పెద్ద వైరుధ్యం.
స్వర్ణ చతుర్భుజి రహదారులు, ఇతర అభివృద్ధి చర్యల రూపంలో వాజ్‌పేయి సాఫల్యాలు కళ్ళముందు ఉన్నాయి. దృష్టిభేదాన్ని బట్టి వైఫల్యాలూ అంత కంటె పెద్దవిగానే కనిపిస్తాయి. కానీ ఎక్కడికక్కడ సమాజంలో చీలికలే పొటమరిస్తున్న నేటి వాతావరణంలో అందరినీ కలపుకుని పోగలిగిన వాజ్‌పేయి వ్యక్తిత్వం ఇప్పటికీ ఒక దారిదీపంలా తోవ చూపుతూనే ఉంటుంది.
ఆయన మరణించినా ఆయన ప్రాతినిధ్యం వహించిన సామరస్యపూర్వక వ్యవహారశైలిని పునర్జీవింపజేయగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








