ఇదో 'టైపు' కళ: ఈయన చిత్రాలను ఎలా టైప్ చేస్తున్నారో చూడండి

టైప్‌రైటర్ మెషీన్‌తో పేపర్ మీద అక్షరాలు టైప్ చేయడం గురించి అందరికీ తెలుసు. మరి చిత్రాలను టైప్ చేయగలరా? చాలామంది అసాధ్యమని అంటారు. కానీ.. ఈయన మాత్రం చిత్రాలను చకచకా టైప్ చేసేస్తారు.
ముంబయికి చెందిన చంద్రకాంత్ భిడే టైప్‌రైటర్ చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
"టైప్‌రైటరే నాకు జీవనాధారమైంది. మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటారు చంద్రకాంత్.
చిన్నప్పటి నుంచే ఈయనకు చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. అప్పుడే చాలా చక్కగా బొమ్మలు వేసేవారు. పదో తరగతి తర్వాత చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుందామని అనుకున్నారు. కానీ.. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది సాధ్యం కాలేదు.
"నేను 1963లో పదో తరగతి పూర్తి చేశాను. అప్పటికే పెయింటింగ్ చాలా బాగా వేసేవాడిని. ఆర్ట్ స్కూల్‌లో చేరాలని అనుకున్నాను. కానీ.. మా తల్లిదండ్రులు చేర్పించలేదు. దానికి బదులుగా టైపింగ్, స్టెనోగ్రఫీ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందని మా నాన్న చెప్పారు" అని భిడే చెప్పుకొచ్చారు.
తండ్రి చెప్పినట్టుగానే భిడే టైపింగ్ నేర్చుకున్నారు. యూనియన్ బ్యాంకులో కొలువు దొరికింది. ఆ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయనలో చిత్రకళపై ఆసక్తి తగ్గలేదు.
తనలోని కళా నైపుణ్యాన్ని చూపించుకునేందుకు ఆ బ్యాంకులోనే ఓ చిన్న అవకాశం వచ్చింది. అదే తనకు ఇంత గుర్తింపు రావడానికి ఆరంభం అని ఆయన గుర్తుచేసుకుంటారు.
"ఓరోజు మా ఆఫీసులో ఫోన్ నంబర్ల జాబితా తయారు చేయాలని మా బాస్ నాకు చెప్పారు. ఆ జాబితాను టెలిఫోన్ ఆకారంలో టైప్ చేసి ఇచ్చాను. దాంతో మా సహచర ఉద్యోగులందరూ ఆశ్చర్యపోయారు. టైప్‌రైటర్‌తో చిత్రకారుడిగా మారొచ్చని అప్పుడే గ్రహించాను" అని చెప్పారు చంద్రకాంత్ భిడే.

ఇప్పటికీ ప్రయాణం కొనసాగుతోంది
ఆ తర్వాత ప్రముఖ కళాకారులు, క్రీడాకారుల చిత్రాలను టైప్ చేయడం ప్రారంభించారు చంద్రకాంత్.
నా చిత్రాలను ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌కు చూపించాలని అనుకున్నాను. ఓ రోజు అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే ఆయన దగ్గరికి వెళ్లి చూపించాను. వాటిని చూసి ఆయన చాలా ఆశ్యర్యపోయారు. పెన్ను, బ్రష్‌తో వేసినా ఆ చిత్రాలు అంత అద్భుతంగా వచ్చి ఉండేవి కాదని అన్నారు. నీవు మంచి చిత్రకారుడివి అవుతావన్నారు." అని ఆయన గుర్తు చేశారు.
అమితాబ్ బచ్చన్, సచిన్ తెందుల్కర్, సునీల్ గావస్కర్, డాక్టర్. బీఆర్ అంబేడ్కర్, లతా మంగేష్కర్.. ఇలా దేశ విదేశాలకు చెందిన 120 మంది సెలబ్రెటీల చిత్రాలను చక్కగా టైప్ చేశారు చంద్రకాంత్. వాటికి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
"అత్యంత క్లిష్టమైన చిత్రాల్లో సచిన్ తెందుల్కర్‌ది ఒకటి. మొదట్లో ఆయన ఉంగరాల జుట్టును ఎలా టైప్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత '@' గుర్తుతో ప్రయత్నించాను. దాంతో ఆ సమస్య పరిష్కారమైంది" అని గుర్తు చేసుకుంటారు భిడే.

ఇప్పటికి 51 ఏళ్ల నుంచి ఇలా టైప్‌రైటర్‌తో చిత్రాలు వేస్తున్నానని ఆయన చెబుతున్నారు.
ప్రముఖ కార్టూనిస్టు మారియో డే మిరండా సలహా మేరకు చంద్రకాంత్ తాను వేసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టడం ప్రారంభించారు. ఐఐటీ ముంబయి, ఐఐటీ ఖరగ్‌పూర్ లాంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు 12 చోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ చిత్రాలను కూడా టైప్ చేయాలని ఉందని చంద్రకాంత్ భిడే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- #లబ్‌డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- డీడీ కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
- టెలిగ్రాం యాప్ భారత్‌దేనా?
- ‘రేపిస్టులకు మరణశిక్ష’ చట్టంతో అత్యాచారాలు ఆగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









